సంక్షేమ ప‌థ‌కాల‌ను ఎత్తేయ‌డం ఎలా?

కూట‌మి ప్ర‌భుత్వానికి సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు భారంగా మారుతోంది. అందుకే రూ.4 వేల పింఛ‌న్ మిన‌హాయిస్తే ఏ ఒక్క సంక్షేమ ప‌థ‌కం గురించి ఇంత వ‌ర‌కూ కూట‌మి పెద్ద‌లు నోరు తెర‌వ‌లేదు. పైగా సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌భుత్వాల‌కు బారంగా మారుతున్నాయ‌ని, ఈ విష‌య‌మై దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌ర‌గాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు స‌న్నాయి నొక్కులు నొక్కడాన్ని గ‌మ‌నించాలి.

జ‌గ‌న్ స‌ర్కార్ ఆర్థిక అరాచ‌కం వ‌ల్ల సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు మోయ‌లేని భారంగా మారింద‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు త‌ర‌చూ మాట్లాడుతున్నారు. ప్ర‌భుత్వంలో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న నాయ‌కులు, అలాగే అనుకూల మీడియా ప్ర‌చారం చూస్తుంటే, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ విచ్చ‌ల‌విడిగా అప్పులు చేశార‌ని, దీంతో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌లేని దుస్థితి దాపురించింద‌ని చెప్ప‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

జ‌గ‌న్‌పై నెపాన్ని నెట్టి, సంక్షేమ ప‌థ‌కాల్లో కోత విధించ‌డానికే తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు కూట‌మి ప్ర‌భుత్వం సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌ను ఎప్ప‌టి నుంచి అమ‌లు చేస్తుందా? అని ప్ర‌జానీకం ఎదురు చూస్తోంది. జ‌గ‌న్ అధికారంలో ఉండి వుంటే అమ్మ ఒడి, రైతు భ‌రోసా నిధులు ప‌డేవ‌ని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చ‌ర్చించుంటున్నారు. సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌కు ఆక‌ర్షితులై కూట‌మికి ప‌ట్టం క‌ట్టామ‌ని, ఇప్పుడు ఏమ‌వుతుందో అనే ఆందోళ‌న సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల్లో నెల‌కుంది.

విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం కావ‌డం, అలాగే వ‌ర్షాలు కురిసి రైతాంగం పంట‌ల సాగులో నిమ‌గ్న‌మైంది. ఇప్పుడు అమ్మ ఒడి, రైతు భ‌రోసా నిధుల కోసం మ‌హిళ‌లు, రైతులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గ‌త ఐదేళ్ల‌లో జ‌గ‌న్ హ‌యాంలో సీజ‌న్‌కు త‌గ్గ‌ట్టు బ‌ట‌న్ నొక్కి ల‌బ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధుల్ని జ‌మ చేస్తూ వ‌చ్చారు. దానికి జ‌నం అల‌వాటు ప‌డ్డారు. జ‌గ‌న్‌కు మించి ఆర్థిక ల‌బ్ధి క‌లిగిస్తామ‌ని చెప్ప‌డంతో, వాళ్లంతా కూట‌మికి జై కొట్టారు. Readmore!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఐదు సంత‌కాలు చేసిన‌ప్ప‌టికీ, అందులో పింఛ‌న్ పెంపు మాత్ర‌మే కొన్ని వ‌ర్గాల్లో సంతోషాన్ని మిగిల్చింది. మెగా డీఎస్సీకి సంబంధించి ప్ర‌క‌ట‌న‌... నిరుద్యోగ ఉపాధ్యాయ వ‌ర్గాల్లో ఆనందాన్ని ఇచ్చింది. మిగిలిన‌వి ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించిన‌వి కావు. అందుకే ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ల కోసం జ‌నం ఎదురు చూస్తున్నారు.

మ‌రోవైపు ఒరిస్సాలో పింఛ‌న్ కేవ‌లం వెయ్యి రూపాయ‌లు మాత్ర‌మే అని, ఏపీలో రూ.4 వేలు ఎందుకు ఇవ్వాల‌ని కూట‌మి అనుకూల నాయ‌కులు వారి మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఇలా సంక్షేమ ప‌థ‌కాల‌ను ఏ విధంగా అట‌కెక్కించాల‌నే ఆలోచ‌న త‌ప్ప‌, అమ‌లు చేయాల‌నే చిత్త‌శుద్ధి క‌నిపించ‌డం లేద‌నే టాక్ మొద‌లైంది. దీనంత‌టికి జ‌గ‌నే కార‌ణ‌మ‌ని చెప్ప‌డానికి రెడీ అయ్యారు.ఎవ‌రెన్ని మాట్లాడినా, అంతిమంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి మాటే ఫైన‌ల్‌. ఆయ‌న మాట కోసం జ‌నం ఎదురు చూస్తున్నారు.

Show comments

Related Stories :