Love Me Review: మూవీ రివ్యూ: లవ్ మీ ఇఫ్ యు డేర్

చిత్రం: లవ్ మీ ఇఫ్ యు డేర్
రేటింగ్: 1.75/5
తారాగణం: ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య, రవి కృష్ణ, తదితరులు
కెమెరా: పీసీ శ్రీరాం
సంగీతం: కీరవాణి 
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్సితా రెడ్డి
దర్శకత్వం: అరుణ్ భీమవరపు
విడుదల: 25 మే, 2024

దిల్ రాజు కుటుంబానికి చెందిన ఆశిష్ హీరోగా నిలదొక్కుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. 'బేబీ' ఫేం వైష్ణవికి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో దిల్ రాజు బ్యానర్ మీద సినిమా ఎలా ఉందో చూద్దాం. 

కథలోకి వెళ్తే, అర్జున్ (ఆశిష్) ఒక యూట్యూబర్. దెయ్యాలు, భూతాలు అనేవి లేవని.. అవి కేవలం మన భ్రమలని తెలియజేస్తూ, మూఢనమ్మకాలని పారద్రోలే విధంగా వీడియోలు చేసి ఫాలోయింగ్ ని పెంచుకుంటాడు. 

ఆ క్రమంలో దివ్యవతి అనే ఒక దెయ్యం ఒక మారుమూల పాడుబడ్డ బిల్డింగులో ఉంటోందని, అటుగా వెళ్లిన వారిని ఎవరినైనా చంపేస్తోందని తెలిసి, ఆ మిస్టరీని ఛేదించడానికి బయలుదేరతాడు. అనుకోకుండా ఆ దెయ్యాన్ని చూడకుండానే ప్రేమలో పడతాడు. ఇంతకీ ఎవరా దివ్యవతి? ఆమె ఆచూకీని, నేపథ్యాన్ని కనుగొనేందుకు అర్జున్ కి అతని మిత్రుడు ప్రతాప్ (రవి కృష్ణ), ప్రియ (వైష్ణవి చైతన్య) ఎలా సహాయపడతారనేది తక్కిన కథ. 

Readmore!

దెయ్యంతో ప్రేమలో పడడం అనేది నిజానికి రెండు నెలల క్రితం వరకు కొత్త కాన్సెప్టే. కానీ తాజాగా "ఓం భీం బుష్" చూసేయడం వల్ల అది పాత కాన్సెప్ట్ అయిపోయింది. పోనీ కథనం భయం గొలిపేలా ఉందా అంటే బిల్డప్పులు, కాస్తంత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గిమ్మిక్కులు తప్ప కథగా కనెక్ట్ అవడానికి డెప్త్ లేదిందులో. 

పైగా దెయ్యం అని చెప్పిన తర్వాత ఆ రూపాన్ని అందంగా బొడ్డు కిందకి చీర కట్టి కవ్విస్తూ పాట పెడితే ఇక భయమెందుకుంటుంది? దానికి తోడు అస్సలు కన్విన్సింగ్ గా లేని ఎపిసోడ్స్ ఈ కథని కనెక్ట్ అవకుండా చేస్తాయి. సమాధిలోంచి పుర్రెల్ని తవ్వుకురావడం, రీకన్స్ట్రక్షన్ పేరుతో ఆ కపాలాలకి రూపాన్నిచ్చి దివ్యవతి ఆచూకి కనుక్కోవడం వంటివి ఓవర్ గా ఉన్నాయి. 

హీరోతో గానీ, హీరోయిన్ తో గానీ ఎమోషనల్ గా కనెక్టయ్యి జర్నీ చేసే విధంగా లేదు ప్రేక్షకుడికి. అదే కథనపరంగా పెద్ద మైనస్. ఇక అక్కర్లేని పాత్రలన్నీ పెట్టి కథని మరీ కాంప్లికేట్ చేసి కథనాన్ని పట్టాలు తప్పించేసాడు దర్శకుడు. ఒక్క చోట కూడా థ్రిల్ ఫీలవడానికి గానీ, ఉత్కంఠకు గురికావడానికి కానీ అవకాశం లేదు. 

ఒక పాత్ర తన ఐడెంటిటీని మార్చుకోవడానికి అప్పటికప్పుడు ఫ్రెష్ శవాలు ఎలా దొరుకుతాయో అర్ధం కాదు. ఇలాంటి లూజ్ ఎండ్స్ అనేకమున్నాయి ఇందులో. 

పేరున్న నిర్మాత కుటుంబానికి చెందిన హీరో అని, తాజా సూపర్ హిట్ సినిమాకి చెందిన హీరోయిన్ తో కాంబినేషన్ అని, దానికి తోడు హారర్ కథాంశమని ఆసక్తిని, అంచనాల్ని పెంచుకుని వెళ్లినవాళ్లని షాక్ కి గురి చేసే చిత్రమిది. దిల్ రాజు బ్యానర్ మీద సొంత ఫ్యామిలీ హీరోతో సినిమా తీయడానికి ఇంతకంటే మంచి కథ దొరకలేదా? 

చూసేటప్పుడే ఇంత గందరగోళంగా ఉంటే కథగా చెప్పేటప్పుడు ఏం చెప్పి ఒప్పించి ఉండొచ్చు దర్శకుడు? ఈ ప్రశ్న ఆల్మోస్ట్ ప్రతి క్రిటిక్ మైండుని కుదిపేసి ఉండాలి. 

ఎందుకంటే ఇది పూర్తి స్థాయి హారర్ చిత్రమూ కాదు, అలాగని హారర్ కామెడీ అంతకన్నా కాదు. నవ్వుకోవడానికి, భయపడడానికి అసలు విషయమే లేకుందా ఉంది. పైగా ఇది చాలదన్నట్టు సినిమా చివర్లో "కిల్ మీ ఇఫ్ యు లవ్" అంటూ సీక్వెల్ కి ప్రకటన కూడా జరిగిపోయింది. ఎంత నమ్మకముంటే దర్శకనిర్మాతలు సీక్వెల్ కి ఒడిగడతారు! 

టైటిల్ కింద "ఇఫ్ యు డేర్" అనే దాంట్లోని అర్ధం సినిమా చూసాక కానీ అర్ధం కాదు. కాస్తంత భయపడదామని ధైర్యం చేసి వెళ్లినందుకు మెదడుకి మేత టైపులో నాలుగైదు స్త్రీ పాత్రలతో సెకండాఫంతా అయోమయానికి గురికావడం తప్ప ఏమీ మిగల్లేదు. 

ఆశిష్ రెడ్డి తనకొచ్చింది చేసుకుపోయాడు తప్ప తనలోని నటనా ప్రతిభని వెలికితీసే అవకాశమేమీ దర్శకుడు కలిపించలేదు. ఇప్పుడున్న కాంపిటీషన్లో చొచ్చుకెళ్లి తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటే తన ట్యాలెంట్ ని నిరూపించుకునే స్కోప్ ఉన్న చిత్రాలు ఎంచుకోవాలి. 

వైష్ణవి చైతన్య చూడడానికి బాగుంది. ఏ వయసు పాత్రలోనైనా ఒదిగిపోయే ఆంగికం ఆమెది. కానీ ఈ చిత్రం ఆమె కెరీర్ కి ఉపయోగపడేలా లేదు. 

రవి కృష్ణ ఓకే. రాజీవ్ కనకాలది అతిథి పాత్ర. ఇతర నటీనటులు పర్వాలేదు. 

కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ పాటల విషయంలో నిరాశపరిచారు. పీసీ శ్రీరాం కెమెరా వర్క్ బాగుంది. ఆర్ట్ డైరెక్షన్ కూడా బాగుంది. ఎన్ని బాగున్నా సినిమాకి ఆత్మ అయిన కథా కథనాలే బలంగా లేవు. అందుకే మొదటికే మోసమొచ్చినట్టయ్యింది. 

"బాధ ఏం నేర్పించడానికి వచ్చిందో అది నేర్పించకుండా పోదు" అనే డైలాగొకటుంది. కథలో ఎవరి బాధ ఏమిటో, ఎవరు ఏం నేర్చుకున్నారో ప్రేక్షకుడి మనసుకి అందదు. 

ప్రేక్షకుల్ని మాత్రం బాధపెట్టి "బ్యానర్ పేరు, హీరోయిన్ ఫేం చూసి అంచనాలు పెంచుకోకూడదు" అనే సూత్రాన్ని నేర్పించింది ఈ సినిమా.

దర్శక నిర్మాతలకి ఏం నేర్పించిందో వారికే తెలియాలి. 

బాటం లైన్: అంత డేర్ వద్దు

Show comments

Related Stories :