ఎమ్బీయస్‍: వాటే ఫాల్, జగన్!

ఆంధ్ర ఫలితాలు దిగ్భ్రాంతి కలిగించాయి. జగన్ ఓడిపోతాడని చాలాకాలంగా అంటూ వచ్చినవారు కూడా యింత ఘోరంగా ఓడిపోతాడని ఊహించలేదు. సర్వేలు, విశ్లేషకులు, ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ ఏవీ కూడా జనం జగన్ని యింత చితక్కొట్టేస్తారని చెప్పలేదు. చివర్లో వచ్చిన కెకె ఒక్కటే చెప్పింది కానీ, దాన్ని కూటమి వాళ్లు కూడా నవ్వుతూనే రిసీవ్ చేసుకున్నారు. నవ్విన నాప చేను పండింది. ప్రశాంత కిశోర్ చెప్పాడు కానీ మీరు నమ్మలేదు అనవచ్చు కొందరు. ప్రశాంత కిశోర్ ఎన్డీఏ విషయంలో చెప్పినది ఎంత బాగా అఘోరించిందో చూశాం. అయినా ఆయనా వైసిపికి 58 అన్నాడు. ఎన్డీఏ ఏక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా జోస్యం కూడా చూశాం. చార్ సౌ పార్ మాట నిజం చేయడానికో ఏమో 401 చెప్తే 300 కూడా దాటలేదు. ఆయన పొరపాటై పోయింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు కూడా. బిజెపి పట్ల అంత ఉదారంగా ఉన్న ఆయన యిక్కడ మాత్రం 99-128 అన్నాడు. అందువలన వాళ్లవి మిడతం భొట్ల జోస్యాలనే అంటాను.

నూటికి 90 సర్వేలన్నీ ‘పరిస్థితి టైట్‌గా ఉంది, గెలిచేవారికి 90-100 మహా అయితే 110’ అన్నట్లే చెప్పారు. వేవ్ వస్తే 130 దాకా పోవచ్చు అన్నారు. వేవ్ ఉన్న సూచనలేమీ కనబడలేదు. కానీ వచ్చినది వేవ్ కాదు, సునామీ. జగన్ కాళ్ల కింద కాసింత యిసుక కూడా మిగల్చనంత సునామీ. 1984 పార్లమెంటు ఎన్నికలలో 414 సీట్లతో రికార్డు సృష్టించిన రాజీవ్ గాంధీ ఐదేళ్ల తర్వాత దానిలో 48% మాత్రమే సీట్లు తెచ్చుకుంటే ఎగసి, కిందకు పడిన కెరటం అన్నారు. 1989 ఎన్నికలలో ఎన్టీయార్ హయాంలో తెలుగుదేశం 37% మాత్రమే గెలిస్తే ఘోరపరాజయం, అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. 2019లో 125 సీట్ల టిడిపి 18% సీట్లు మాత్రమే తెచ్చుకుంటే పతనంలో రికార్డు స్థాయి అన్నారు. మరి జగన్‌ది ఏమనాలి? 151 నుంచి 11కి అంటే 7%కి  సీట్లు  పడిపోతే ఉవ్వెత్తున లేచి ఐదేళ్లలో దాదాపు కనుమరుగైన కెరటం అనాలా?

తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 86% సీట్లు గెలిచిన వ్యక్తికి యిప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కలేదు. 4 లోకసభ స్థానాలు వచ్చాయి కాబట్టి ఆ నిష్పత్తిలో చూసినా 28 రావాలి. వాటిలో సగమైనా రాలేదు. ఆ పార్టీకి మిగిలిన ఆశ ఒక్కటే – రాజ్యసభలో సీట్లు! అవి చూపించే పరువు నిలబెట్టుకోవాలి. అసెంబ్లీలో తుడిచి పెట్టుకుని పోయినా పార్లమెంటు స్థానాలు మరో నాలుగు గెలుచుకుని ఉంటే దిల్లీలో క్లిష్ట పరిస్థితి నెలకొన్న యీ నాటి రోజుల్లో బేరాలాడడానికి అక్కరకు వచ్చేవి. బిజెపికి పూర్తి మెజారిటీ రాని రోజులు రావాలని, అప్పుడు బెల్లించి ప్రత్యేక హోదా రాబట్టాలని జగన్ అంటూ వచ్చాడు. ఇప్పుడా రోజులు వచ్చాయి. కానీ అడగడానికి జగన్ లేడు. ఆ స్థానంలో అతని ఆగర్భశత్రువు బాబు ఉన్నారు. ఇప్పుడాయన మళ్లీ చక్రధారి అయ్యారు.

అది జగన్‌కు యింకా దుస్సహం. మోదీని దబాయించి బాబు ఆంధ్రకు ప్రత్యేక హోదా తెప్పిస్తే మాత్రం, ఆయన ఫోటో అనేక మంది యిళ్లల్లో వెలుస్తుంది. జగన్ దహించుకుని పోతాడు. కానీ బాబు ప్రయారిటీస్ ఏమిటో ప్రస్తుతానికి తెలియదు. మద్దతివ్వడానికి నీతీశ్ బిహార్‌కు ప్రత్యేక హోదా అడుగుతున్నాడని జాతీయ మీడియాలో వస్తోంది కానీ బాబు మాత్రం కాబినెట్ పోస్టులు, స్పీకరు పోస్టు యిలాటివే అడుగుతున్నారని వస్తోంది. ఈయన మళ్లీ ప్రత్యేక ప్యాకేజీ అంటే మాత్రం ఆంధ్రుడు హతోస్మి అనుకోవాలి. ఇప్పుడు ఒడిశాలో బిజెపి ప్రభుత్వం వస్తోంది కాబట్టి వైజాగ్ రైల్వే జోన్‌పై ఆశలు వదులుకోవాలి. Readmore!

ఇంత సునామీని బాబు, పవనే కాదు మోదీ, అమిత్‌లు కూడా ఊహించి ఉండరు. ఉంటే కూటమిలో చేరడానికి అంత తాత్సారం చేసి ఉండేవారు కాదు, ఓ పట్టానే ఏమీ చెప్పకుండా, జాప్యం చేసి, పోజులు కొట్టి, కూటమి ఏర్పరచినపుడు పవన్‌ను పిలవకుండా, మానిఫెస్టో మీద వేలేయకుండా.. యిన్ని వేషాలు వేసే వారు కాదు. అసలు దేశవ్యాప్తంగానే వాళ్ల సంగతి వాళ్లకు తెలియకుండా పోయింది. ఆడ్వాణీ ‘ఇండియా షైనింగ్’ అనే నినాదం యిచ్చి 2004 ఎన్నికలకు వెళితే ‘ఎన్డీఏ గోయింగ్’ అని జనం అర్థం చేసుకుని కాంగ్రెసుకు అధికారం అప్పగించారు. అలా, యీ సారి మోదీ ఎన్డీయే 400 ప్లస్ అని నినాదం యిస్తే 300 మైనస్ దగ్గర ఆపేశారు. పదేళ్ల పాలన తర్వాత బిజెపికి సొంతంగా మెజారిటీ రాకుండా చేసి, భాగస్వాముల మీద ఆధార పడేట్లు చేసి, మోదీ ఔద్ధత్యానికి కళ్లెం వేశారు.

రాజకీయాల్లో కాకలు తీరిన మోదీ, అమిత్‌ల లెక్కే తప్పినప్పుడు వారితో పోలిస్తే పిల్ల కాకి ఐన జగన్ సంగతి చెప్పేదేముంది? 30 ఏళ్ల పాటు నిరాఘంటంగా పాలించాలి అనుకుని విద్య, వైద్యం విషయంలో దీర్ఘకాలిక ప్రణాళికలు వేయడం తప్పు కాదు కానీ అలా అప్రతిపహతంగా ప్రతిపక్షాలు తనని పాలించ నిస్తాయని అనుకోవడం పొరపాటు. తను ఊహించిన అమరావతి మహాద్భుత నగరం వంటి నిర్మాణానికి రెండు దశాబ్దాలు పడుతుందని అనేక కట్టడాలు కట్టించిన బాబుకి తెలియకుండా ఉంటుందా? తనకు అవకాశం యిచ్చిన ఐదేళ్లలో చాలా భాగాన్ని డిజైన్ల మీదే సమయం వృథా చేశారెందుకు? అని అడిగితేఅక్కడ పెట్టుబడి పెట్టినవారు ‘ఇంకో 15 ఏళ్ల దాకా జగన్ అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదు’ అని ఆయన అనుకుని, తన చేష్టలతో మా అందర్నీ నమ్మించాడండి’ అన్నారు. 2014 ఎన్నికలలో 67 సీట్లు, తనకంటె 2% కంటె తక్కువ ఓట్లు తెచ్చుకున్న జగన్ని బాబు అలా ఎలా అండర్ ఎస్టిమేట్ చేయగలుగుతారు? అని అడిగాను ఆశ్చర్యపడుతూ.

అదే పొరపాటు జగనూ చేశాడు. 2019లో తన కంటె 10% తక్కువ కావచ్చు కానీ దాదాపు 40% ఓట్లు తెచ్చుకున్న టిడిపి, జనసేనతో చేతులు కలిపి యుద్ధానికి వస్తూ ఉంటే తను 30 ఏళ్లు పాలిస్తానని అనుకున్నాడు. భగవంతుడు, ప్రజలు నాతో ఉంటే చాలు, ఎందరు మూకుమ్మడిగా వచ్చినా ఫర్వాలేదు అని పైకి చెప్పడమే కాదు, తను కూడా అనుకున్నాడు. భగవంతుడు ఎప్పుడు, ఎందుకు చేస్తాడో అర్థం కాదు కాబట్టే దైవలీల అన్నారు. ఇక ప్రజల మాటకు వస్తే ‘వాళ్లు నాతోనే ఉన్నారు’ అని ప్రతీ పార్టీ నాయకుడూ అనుకుంటాడు. లేకపోతే కోట్లు ఖర్చు పెట్టి గోదాలోకి దిగే దిగడు. దేవుడు నోరు విప్పి చెప్పనట్లే, ప్రజలూ చెప్పరు. ఆ మాట కొస్తే సినిమా ప్రేక్షకులూ చెప్పరు. మొదటి మూడు రోజులు స్టార్ హీరో అభిమానులను సందడి చేయనిచ్చి సోమవారానికి నిర్మాతలకే సినిమా చూపిస్తారు. ట్రైలర్‌ను మెచ్చి కోట్లాది వ్యూస్ యిచ్చారు కదా అని అడిగితే ‘అది వేరే, యిది వేరే’ అంటారు.

ఓటర్లూ అలాటి వాళ్లే. స్థానిక ఎన్నికల్లో, ఉప యెన్నికల్లో వైసిపికి ఎక్కడా అనుమానం రానీయకుండా గెలిపించారు. ఈ ఫార్ములాయే దివ్యంగా ఉంది అనుకుంటూ జగన్ జనరల్ ఎన్నికలకు వెళితే అక్కడ తడాఖా చూపించారు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు తప్ప అంటారు కానీ హత్యలూ ఉంటాయి, ఆత్మహత్యలూ ఉంటాయి. ఆత్మహత్యల పాలెక్కువ. అయితే తమాషా ఏమిటంటే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చేసుకునే వాడికి కూడా తెలియదు. అవతలివాణ్ని హత్య చేస్తున్నాననుకుంటూ ఆత్మహత్యకు పాల్పడతాడు. పోయేవాడు అవతలివాడే అని అతన్ని భ్రమింప చేసే అనుచరగణం, వందిమాగధ బృందం చుట్టూ ఉండి దడి కట్టేస్తారు. దశాబ్దాలుగా నేను యిదే మాట వింటూ వచ్చాను.  

ఎమర్జన్సీ దివ్యంగా నడిచిందని, ప్రజలంతా ఆనందతాండవం చేస్తున్నారని ఇందిరా భజన మండలి చెప్పడం చేతనే ఆమె ఎమర్జన్సీ ఎత్తేసి, వెంటనే ఎన్నికలు పెట్టేసింది. ఆర్నెల్లు గ్యాప్ యిచ్చి పెట్టి ఉంటే ఆగ్రహాన్ని గుర్తించి, దిద్దుబాటు చర్యలు చేపట్టి, కొంతలో కొంతైనా గెలిచి ఉండేది. 2003 అలిపిరి సంఘటన తర్వాత ప్రజలు తనపై సానుభూతిని కుండలతో కురిపించేస్తున్నారని బాబును నమ్మించారు చుట్టూ జనం. ముందస్తు ఎన్నికలకు వెళ్లి అధికారం పోగొట్టుకున్నాడు. ఈయన్ని చూసి వాజపేయి కూడా వాత పెట్టుకుని, ‘ఇండియా షైనింగ్, యిదే తరుణం’ అన్న ఆడ్వాణీ హామీ నమ్మి ఆయనా అధికారం పోగొట్టుకున్నాడు. 2019 ఎన్నికలలో కూడా బాబు ఓటమిని కానుకోలేక పోయారు. 110-130 సీట్లు వస్తాయని నమ్మి ఆ మాట పైకి చెప్పారు. అది అచ్చి రాలేదని కాబోలు, యీసారి మౌనం పాటించారు. జోస్యం లోటు భర్తీ చేయాలని జగన్ 151 దాటుతాయని చెప్పారు. మధ్యలో 5 బయటకు దాటేసి, కిటికీలోంచి దూకేసింది.

వైనాట్175? వైనాట్ పులివెందుల? అనే నినాదాల వరకు ఓకే, కార్యకర్తలను హుషారు చేయడానికి పనికి వస్తాయి. కానీ ఎన్నికలు అయిపోయాక యిలా చెప్పడం జోక్ ఆఫ్ ద డికేడ్‌గా మిగిలింది. తన గెలుపు గురించి జగన్‌కు యిసుమంతైనా సందేహం లేదు. ప్రణయ్ రాయ్ చెప్పారు – మీరు పవన్‌తో టై అప్ కావచ్చు కదా అని ఆయన అడిగితే, ‘నాకు అవసరమేముంది? మూడింట రెండు వంతుల సీట్లు నాకు వస్తాయి కదా!’ అన్నాడట జగన్. ‘అంత అహంకారం వద్దు నాయనా’ అని జనాలు కళ్లు కిందకు దింపేశారు. నిజానికి తన పాలనలో, యీ ఎన్నికలలో జగన్ చాలా ప్రయోగాలు చేశాడు. ఎన్నికలలో గెలిచి ఉంటే అబ్బ, యిది కదా గెలిచే పద్ధతి అంటూ దేశంలో అందరూ అనుకరించే వారు. ఇప్పుడు దణ్ణం పెట్టి దూరంగా పారిపోతారు. అన్నేసి ప్రయోగాలూ ఒకేసారి చేయడంతో మొదటికి మోసం వచ్చింది. అవన్నీ తర్వాతి వ్యాసాల్లో!

జగన్ ఓటమి ఒక కేస్ స్టడీ. ఇంత నెగటివ్ ఓటు ఎందుకు పడింది అనేది అనేక కోణాలుంచి పరామర్శించాలి. చంద్రబాబు 2014-19 మధ్య సాగించిన పాలనతోనే జగన్‌ను అధికారంలోకి తెచ్చాడు. జగన్‌కు పాలనానుభవం లేదు. మంత్రిగా చేయలేదు. నెత్తి మీద కేసులున్నాయి. లక్ష కోట్ల అవినీతి ముద్ర కొట్టి ఉంచారు, జైలుపక్షి, ఫ్యాక్షనిస్టు, అహంకారి, అపరిచితుడు, హంతకుడు.. యిలా అనేక రంగుల్లో మీడియా చిత్రీకరించి ఉంది. అయినా ప్రజలు బాబును దింపాలంటే యితనికి ఓటేయక తప్పదనుకున్నారు. ఒక్క ఛాన్స్ అని అడిగాడు కాబట్టి ఓటేశారు అనే వాదన హాస్యాస్పదం. అలా ప్రతీ అభ్యర్థీ అడుగుతాడు. ఓటేస్తారా? బాబు పాలనే జగన్‌కు అధికారాన్ని కట్టబెట్టింది. అదే విధంగా జగన్ పాలనే బాబుకి మళ్లీ సింహాసనంపై కూర్చోబెట్టింది.

ఉమ్మడి రాష్ట్రంలో యింత చేటుగా ఏకపక్షంగా గెలిపించడా లుండేవి కావు. 1994లో టిడిపికి 73% సీట్లు వచ్చాయి. 2019లో వైసిపికి 86% వస్తే 2024లో కూటమికి 94% వచ్చాయి. ఇంత ఉపద్రవంగా రావడంతో పాలకులకు మతి పోతోంది. అవతలివాళ్లు సమాధి అయిపోయారనే భ్రమ కలుగుతోంది. 2014లో అధికారంలోకి వచ్చినపుడు బాబు జగన్ని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించలేదు, జగన్ బాబుని ముఖ్యమంత్రిగా గుర్తించలేదు. రైతు ఋణమాఫీ అనే అబద్ధపు హామీ యిచ్చి, దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయ్యాడని ఫీలయ్యాడు. 2019 వచ్చేసరికి ‘ఒక్క ఛాన్స్’ అని దేబిరించి జగన్ ముఖ్యమంత్రి అయ్యాడని బాబు ఫీలయ్యాడు. సేమ్ టు సేమ్, నేమ్ మాత్రమే ఛేంజ్ అన్నట్టు జగన్ బాబును ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించలేదు. ఇద్దరూ కూడా అఖిలపక్ష సమావేశానికి పిలిచినది లేదు. ఎదుటివాళ్లకు మర్యాద యిచ్చినది లేదు. వాళ్లు ‘ఇక ఫినిష్‌డ్’ అన్నట్లే ప్రవర్తించారు.

రాజకీయాల్లో ఎవరినీ రైటాఫ్ చేయలేము. రాహుల్ గాంధీ  నాయకుడు అనగానే ఫక్కున నవ్వు వస్తుంది. ఈ ఫలితాల తర్వాత గబుక్కున నవ్వలేము. మోదీ కంటె రెట్టింపు మెజారిటీతో, అదీ రెండు చోట్ల నుంచి నెగ్గాడు. ఇండియా కూటమి అంటే బైరాగుల ముఠా అనుకున్నది అధికారపు రింగులోకి టోపీ విసిరే స్థాయికి వచ్చింది. ఇవాళ కాకపోతే ఆర్నెల్ల తర్వాతైనా, కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల తర్వాతనైనా ప్రయత్నం చేస్తుందని అనిపించే స్థితిలో ఉంది. ఈ ఎన్నికలలో ఓడిపోతే చంద్రబాబు డీలా పడిపోతారు, టిడిపి విచ్ఛిన్నమై పోతుంది, బిజెపి కబళించేస్తుంది అనుకున్నది హఠాత్తుగా ఆయన ఐరావతంపై అధిష్టించి, అధికారాన్ని అందుకోబోతున్నారు. అంతే కాదు, దిల్లీలో చక్రం తిప్పబోతున్నారు.

ఈనాడు అధఃపాతాళంలో పడిన జగన్ అక్కడే ఉంటాడని లేడు. ఈనాడు సొంతంగా మెజారిటీ తెచ్చుకోలేని బిజెపి అలాగే ఉండిపోతుందని అనుకోవడానికీ లేదు. అంతా ప్రత్యర్థుల నిర్వాకంపై ఉంటుంది. వేచి ఉంటే చాలా వేడుకలే చూడవచ్చు. ఇంతకీ ఆంధ్రలో యీ విధంగా ఫలితాలు ఎందుకు వచ్చాయి? దేశంలో అలా ఎందుకు వచ్చాయి? ఇవన్నీ చాలా ఆసక్తికరమైన సంగతులు. అన్ని రకాల విశ్లేషణలు వింటున్నాను, చదువుతున్నాను. ‘విత్ ద బెనిఫిట్ ఆఫ్ హైండ్‌సైట్’ చాలా మంది విమర్శకులు చాలా చెప్తున్నారు. ఒక్కో వ్యాసంలో కొన్నేసి చొప్పున చెప్తాను. ప్రస్తుతానికి మాత్రం ఒకటి రెండు విషయాలు ప్రస్తావించి ఊరుకుంటాను. ఓ ఆర్టికల్‌లో నేను ‘జగన్ సిలబస్‌లో సగం పోర్షన్‌కి మాత్రమే ప్రిపేరవుతున్నాడు. దిగువ వర్గాలను తప్ప మధ్యతరగతి, ఎగువ తరగతులను గాలికి వదిలేశాడు.’ అని రాస్తే చాలా మందికి నచ్చింది.

ఫలితాలు చూస్తే అదే తేలింది. సమాజంలో కొన్ని వర్గాల కోసమే తను ఉన్నానని, తక్కినవాళ్లు ఏమై పోయినా పట్టించుకోననే యిమేజిని కల్పించుకున్నాడు. అందువలన తక్కిన వర్గాలన్నీ ఏకమయ్యాయి. జగన్ నమ్ముకున్న వర్గాల్లో 75% మంది ఓట్లేసేరు కాబట్టే 39% ఓట్లు వచ్చాయి. పాస్ మార్కులు రాలేదు. నిజానికి జగన్ పాలనలో విద్య, వైద్యం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యిలాటి విషయాల్లో మంచి కూడా జరిగింది. కానీ అతని ఫోకస్ దాని మీద లేదు. ఎంతసేపూ బటన్ నొక్కా అనే చెప్పుకున్నాడు. ఓటమి తర్వాత విషణ్ణ వదనంతో (దీన్ని తెలుగులో చెప్తే బాగుండదు) చెప్పినప్పుడు కూడా అవ్వాతాతలకు అదిచ్చా, ఆటోవాళ్లకు యిదిచ్చా.. అనే చెప్పుకున్నాడు తప్ప, జిడిపి యింత పెంచా, స్కూళ్లు బాగు చేశా, ఫ్యామిలీ డాక్టర్ని పెట్టా, మెడికల్ కాలేజీలు కట్టా, ఫిషింగ్ హార్బర్లు కట్టా, కరోనాను చాలా బాగా హేండిల్ చేశా.. అనే పాయింట్లు చెప్పనే లేదు. దాన్ని బట్టే అతని పాక్షిక దృష్టి తెలుస్తోంది.

బాబూ అంతే! ‘అమరావతి, అమరావతి’ అనే పలవరించారు. మధ్యలో గ్యాప్ వస్తే హైదరాబాదు పాటలోకి వెళ్లిపోయారు. దానిలోకి వెళితే ఓ పట్టాన బయటకు రారు. 9 ఏళ్ల ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, 5ఏళ్ల విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన హయాంలో ఆంధ్రకు ఏం చేశారో మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పలేదు. ఎంతో కొంత జరిగిన మంచి కూడా చెప్పాలిగా! సామాజిక వర్గీకరణలో ఒక వర్గాన్నే ఆదరించి తక్కిన వాళ్లను నిరాదరించడమే కాదు, జగన్ కుల వర్గీకరణ కూడా అతన్ని దెబ్బ తీసిందని నా అభిప్రాయం. నోరు విప్పితే ‘నా బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ’ అంటూ వచ్చాడు. ఏదోలే వాళ్లని బుట్టలో వేసే అదో రెటరిక్ అనుకుంటే, 50% మంది బిసిలకే టిక్కెట్టిచ్చానని కూడా గొప్పగా చెప్పుకున్నాడు. కమ్మ, కాపు, రాజుల కంచుకోటల్లో కూడా బిసిలకే సీటిచ్చి కాలరెగరేశాడు.

దాంతో అగ్రవర్ణాలన్నీ ఏకమయ్యాయి. యుపిలో బిజెపి ఓటమికి కారణం కూడా యిదేనని ఆర్టికల్ చదివాను. ఫలితాలకు ముందే ఆ వ్యాసకర్త రాశాడు – బిజెపి బిసి మంత్రం పఠించడంతో, ఎన్నికల తర్వాత యోగిని తీసేసి అతని స్థానంలో బిసిని పెడతారనే పుకార్లు రావడంతో, రాజపుత్రులు బిజెపికి వ్యతిరేకమయ్యారు. దానికి తగ్గట్టు వారికి పెద్దగా టిక్కెట్లు కూడా యివ్వలేదు. బ్రాహ్మణులు, వైశ్యులు రాజపుత్రులతో చేతులు కలిపారు అని. అవతల అఖిలేశ్ తనకున్న ఎంవై (ముస్లిం, యాదవ్) యిమేజి తుడిచేసుకోవడానికి 5 గురు యాదవులకు మాత్రమే (అంతా అతని కుటుంబీకులే అనుకోండి) యిచ్చి తక్కిన కులాలకు టిక్కెట్లిచ్చాడు. దాంతో బిజెపికి ట్రెడిషనల్‌గా ఓటేసే అగ్రకులస్తులు దూరమవుతున్నారు అని రాశాడు. ఫలితాలు చూస్తే అదే నిజమైంది.

ఆంధ్రలో కూటమి కారణంగా కమ్మ, కాపు దగ్గరకు రావడంతో పాటు రెడ్లు కూడా వచ్చి చేరడానికి యిదే కారణం కావచ్చు. సర్వేలు, స్టడీలు వచ్చాక స్పష్టమైన చిత్రం తెలుస్తుంది. ‘బాబు కమ్మలకు చేసినట్లు, జగన్ రెడ్లకు ఏమీ చేయలేదు, మేమంతా ధనం, సమయం, శ్రమ ఖర్చు పెట్టి అతని గెలుపుకై శ్రమించినా మాకేమీ ఒరగలేదు’ అనే ఫీలింగు రెడ్లలో గమనించాను. కానీ ఎలాగూ తనే గెలుస్తాడు, కూటమి వైపుకి వెళ్లలేము కదా అని యిన్నాళ్లూ ఆగారు. కానీ చివరకు వచ్చేసరికి కూటమి గెలుస్తోంది అనే ప్రచారం ఉధృతంగా సాగడంతో ఎలాగూ ఓడిపోతున్నాడు కదా, మన కసీ తీరుతుంది, అతనికీ బుద్ధి వస్తుంది అనుకుని కూటమికి ఓట్లేసేసేరు. బ్రాహ్మణ, వైశ్యులు ఎప్పుడూ కూటమి వైపే ఉన్నారు. 2019లో వైసిపి వైపు వెళ్లిన క్షత్రియులు యిప్పుడు కూటమి వైపు మళ్లారు. వాళ్ల కంచుకోటల్లో కూడా ప్రత్యర్థులుగా బిసిలను నిలబెట్టడంతో!  2019లో కమ్మ-కమ్మేతర ఎన్నికలుగా పేరు బడితే 2024 ఎన్నికలు బిసి-బిసియేతర ఎన్నికలుగా పేరు తెచ్చుకుంటాయని నా ఊహ. గణాంకాలు వెలువడ్డాక యీ మాట గట్టిగా చెప్పవచ్చు. అప్పటిదాకా ఊహ మాత్రమే!

– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2024)

mbsprasad@gmail.com

Show comments

Related Stories :