కాలం గాయాన్ని మాన్పుతుంది. కాలం కంటే ముందు ఓ మంచి మాట హృదయాన్ని తాకుతుంది. మనసును మారుస్తుంది. మనసుకు తగిలిన గాయాల నుంచి మనిషిని వేరు చేస్తుంది. అలాంటి ఎన్నో మాటల్ని, పాటల రూపంలో మనకు అందిస్తున్న వ్యక్తి-శక్తి ''పద్మశ్రీ'' సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఇలాంటి వ్యక్తులతో సాంగత్యం మనసుకు ఆహ్లాదం.
కొత్త ప్రపంచానికి సోపానం. మంచి విషయాలకు, జ్ఞానానికి దోహదం. అలాంటి వ్యక్తి మనందరికీ అందుబాటులోకి వచ్చారు. అడిగిన ప్రతి ప్రశ్నకు ఓపిగ్గా సమాధానం చెప్పారు. అందులోంచి కొన్ని ఆణిముత్యాలు.
- అప్పట్లో ఉన్న లాంటి పాటలు, సినిమాలు ఇప్పుడు ఎందుకు రావడం లేదు?
ప్రతీ కాలంలోనూ పాటలూ, సినిమాలూ అన్నీ అన్ని రకాలుగానూ, ఉన్నాయి. ఏ రకం అభిరుచి ఉన్నవాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు, భిన్నంగా ఉన్నదాని గురించి విసుక్కుంటారు. మన అభిరుచికి అనుగుణంగా ఉన్న పాటలు ఎంచుకునే అవకాశం మనకు ఉంది. విసుక్కునే చేదు మాని, మన అభిరుచిని ఆస్వాదించే తీపిని చవిచూద్దాం.
- త్రివిక్రమ్ మిమ్మల్ని రాత్రి ఉదయించే సూర్యుడు అని సంబోధించడానికి కారణం ఏంటి?
మనకు ఇష్టమైన విషయాన్ని, మనకు తోచిన విధంగా వ్యక్తీకరిస్తాం. నేను సాధారణంగా రాత్రిపూట పనిచేస్తాను కాబట్టి దానిని ఆయన భాషలో ఆయన వ్యక్తీకరించారు.
- మీరు రాసిన పాటల్లో మిమ్మల్ని అత్యధికంగా శ్రమ పెట్టిన పాట ఏది?
పాట వచ్చే క్రమంలో శ్రమ అనే మాటకు చోటు లేదు.
- మీకు నచ్చిన సినిమా, మీ దృష్టిలో సినిమా అంటే?
లిస్టు చాలా పెద్దది, "పిట్టభాష" సరిపోదు. ఇక - కథని చెప్పడం, చూపడం - రెండు ప్రక్రియలు. చెప్పడం సులభం, చూపడం కష్టం. సినిమా ఆ పని చేస్తుంది. కావ్యేషు నాటకం రమ్యం అని అందుకే అన్నారు. రక్తమాంసాలున్న పాత్రలతో కథని చూపడం అనే పనిచేసే సినిమా అన్నది నాకు ఇష్టం.
- కీశే. వేటూరి సుందరమూర్తి గారికి మీరు రాసిన పాటల్లో ఏ పాట అంటే ఇష్టం?
చాలా ఉన్నాయని వాళ్ళూ వీళ్ళూ అన్నారు. "నీలాల కన్నుల్లొ సంద్రమే, నింగి నీలమంతా సంద్రమే" అన్న పాటను ఆయన అత్యంత ఆత్మీయంగా విశ్లేషించి మెచ్చుకున్నారని బాలు అన్నయ్య నాకు చెప్పారు.
- మెలుకవలో ఉన్నప్పుడు మీరు ఎక్కువ సమయం ఏమి చేస్తూ ఉంటారు?
ఇప్పుడైతే ఎక్కువగా ఐపాడ్‌తో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నాను
- ఫిలాసఫీ చూపులో ప్రపంచమో భూటకమా?
మనని జీవితం అనే ప్రశ్న వెంటాడి వేధించకపోతే, ఊరికే తెలివితేటలతో మాటాడాల్సి వస్తే, ఆ వాచాలతలో బూటకమే!
- మీరు ప్రజలకు చదవమని చెప్పే ఐదు పుస్తకాలు ఏమిటి?
నేను ప్రజలకు ఫలానా పుస్తకం చదవమని ఎప్పుడూ చెప్పలేదు. అది జీవితాన్ని తీవ్రమైన అక్కరతో బ్రతకడం అలవాటు చేసుకుంటే ఎప్పుడు ఏది చదవాలో, ఎప్పుడు ఏది కావాలో జీవితమే తెచ్చి ఇస్తుంది. "ఊరికే పేజీలు తిరగేసే బ్రెయిన్ లైబ్రరీలో బీరువాలాంటిది."
- ఇన్నేళ్ళుగా వ్రాస్తూ వచ్చారు, రాయడానికి ఎన్నో కారణాలుండుంటాయి. ఇప్పటిదాకా నిరంతరాయంగా మిమ్మల్ని, మీ కలాన్ని నడిపిస్తున్న స్పూర్థి ఏంటి?
అత్యంత తీవ్రతతో ప్రతీ క్షణాన్నీ గమనించడం, ప్రతీ నిమిషంతో స్పర్ధించడం - అదే నా ప్రేరణ.
- ఏకాగ్రతకు మీ నిర్వచనం?
నేను తప్ప ఇంకేం కనిపించకపోవడం, నేను తప్ప ఇంకేం అనిపించకపోవడం.
- మీకు నచ్చిన సంగీత దర్శకుడు?
ఒక వ్యక్తి ఉండరు, వ్యక్తీకరణ ఉంటుంది. ప్రతీ ఒక్కరూ ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి గొప్పగానే చేస్తారు. ఒక్క మ్యూజిక్ విషయంలోనే కాదు, ఏ ప్రతిభా వ్యక్తీకరణకైనా ఇదే వర్తిస్తుంది.
- రచయిత కి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి?
తానేం చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో తనకి స్పష్టంగా తెలియడం
- రాను రాను కాస్త పద ప్రయోగాలు తగ్గిపోతూ వచ్చి ఇప్పుడు రమారమి ఇంగ్లీషు లేదా యాస పాటలు వచ్చేశాయి.. మీ ప్రయోగాలను మరియు సప్తపది లాంటి అద్భుత కావ్యాలను ఎప్పుడు చూడగలం?
సాహిత్యానికి ముందు తెలుగు అనో, మరోటనో చేర్చకూడదు. భాషతో సంబంధం లేనిది భావం. భావాలు అనేవి అన్ని విధాలుగానూ ఉంటాయి. ధాన్యం పొట్టుతో పాటే ఉంటుంది. దూగర దులిపి, గింజను ఏరుకోవడం ఎప్పుడూ జరగాల్సిన పనే. ఎప్పుడూ మనకు కావాల్సింది ఉంటుంది. మనం చేయాల్సింది ఏరుకోవడమే.
- మీరు హేతువాది అయినప్పటికీ దేవుడు ఉన్నాడని మీరు ఎలా నమ్ముతారు?
నేనున్నాను గనుక!
- మీరు రాసిన పాటల్లో మీకు వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చిన రెండు పాటలు చెప్పండి?
"నా పాట పంచామృతం నా గానాన గీర్వాణి స్నానాలు శాయంగష. "సృష్టి కావ్యమునకిది భాష్యముగా విరించినై విరచించితిని"
- తెలుగు భాష మీద పట్టు లేని కొంతమంది గాయకులు మీ కలం నుండి జారిన అద్భుత పాటలను ఖూనీ చేసినట్టు గానీ, సంగీత దర్శకులు ఆ విషయాన్ని విస్మరించిరించినట్టు గానీ మీకెప్పుడైనా అనిపించిందా?
బియ్యంలో రాళ్ళు ఏరుకుని వండుకుంటాం, అన్నంలో తగిలిన రాళ్ళను పక్కన తీసిపెట్టి తింటాం. "చూపులను అలా తొక్కుకు వెళ్ళకు" అని మీకూ తెలుసు, ఎవరినో ఎందుకు నిందించడం!
- ప్రేమ పాటలు అద్భుతంగా రాసే మీకు, కావలసిన ప్రేరణ, స్ఫూర్తి ఎవరి నుండి కలుగుతుంది?
బ్రతుకంతా ప్రేమే! ప్రేమ నుండే ప్రేమ వస్తుంది!
- పాటలో ' నిరాశ / నిస్పృహ లు ' వ్యక్తపరిచే సందర్భంలో కూడా, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ను దాటి ఓ ఆశావాద కోణం కూడా ఇనుమడింపజేస్తూ వచ్చారు. ఆ తూకం పాటించడానికి గల ప్రత్యేకమైన కారణంఏదైనా ఉందా?
కాలం గాయాన్ని మాన్పుతుంది అన్న సత్యాన్ని గుర్తిస్తే ఏడుపైనా, నవ్వైనా, మరేదైనా మనం చెయ్యాలనుకున్నంత సేపు చెయ్యలేం. ఇది ముందే తెలుసుకుంటే, భావాల ఉధృతిని మోతాదు మించనివ్వం. "నిన్న రాత్రి పీడకలను నేడు తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండ ఉండగలమా"
- తెలుగు భాష గొప్ప తనం ఏంటి?
ఏ భాష ప్రత్యేకత ఆ భాషదే! అసలు సమస్య ఏమిటంటే మనుషులందరినీ కలపాల్సినటువంటి భాష... "లు" తగిలించుకుని ఇన్నిగా ఎందుకుండాలి?
- మీకు బాగా నచ్చిన పుస్తకం?
నా స్వల్ప అనుభవానికి సంబంధించి ఇష్టమైనవి రెండు పుస్తకాలు. ఒకటి భగవద్గీత, రెండు - ఖలీల్ జిబ్రాన్ రాసిన "ద ప్రాఫెట్"