నారాయణ్ దాస్ నారంగ్...ఇలా అంటే చాలా మందికి తెలియదు. ఆసియన్ సునీల్ తండ్రి అంటే అవునా..అంటారు. పన్నెండేళ్ల వయసులో హైదరాబాద్ లో ఇత్తడి వ్యాపారం ప్రారంభించి, అక్కడి నుంచి 21 ఏళ్ల వయసులో ఫైనాన్స్ వ్యాపారం చేపట్టి, ఆపై సినిమా ఫైనాన్సర్ గా మారి, డిస్ట్రిబ్యూషన్, థియేటర్ వ్యాపారాల్లో అడుగుపెట్టి, ఏ ఎమ్ బి మల్టీఫ్లెక్స్ నిర్మించి, 75 వయసులో ఇప్పటికీ రోజుకు నాలుగు గంటలు ఆఫీసులో పని చేసే పెద్దాయిన..నారాయణ్ దాస్ నారంగ్.
తను పుట్టిన ఏడాదికే కుటుంబం సింధ్ నుంచి ముంబాయికి రావాల్సి వచ్చింది. దేశ విభజన కారణంగా. అక్కడి నుంచి సికిందరాబాద్ కు వచ్చారు. అలా ప్రారంభమైన నారాయణ్ దాస్ ప్రస్థానం ఇవ్వాళ నైజాం ఏరియాలో 60 థియేటర్లు, మహేష్ బాబు భాగస్వామిగా ఎ ఎమ్ బి మాల్, అల్లు అర్జున్ భాగస్వామిగా మరో మాల్, విశాఖ, బెంగళూరుల్లో మల్టీ ఫ్లెక్స్ లు ఇలా సాగిపోతోంది. అలాంటి సీనియర్ మోస్ట్ లెజండరీ పర్సనాలిటీని 'గ్రేట్ ఆంధ్ర' ఇంటర్వ్యూ చేసింది. ఆ విశేషాలు
-నేను క్రమశిక్షణను నమ్ముకున్నాను. ఎవరినీ మోసం చేయలేదు. ఎవరికీ ద్రోహం చేయలేదు. అందుకే ఇప్పటి వరకు నాకు ఈ ఫైనాన్స్ వ్యాపారంలో రూపాయి కూడా పోలేదు.
-బడా బడా ఇండస్ట్రియలిస్ట్ లు, సినిమా నిర్మాతలు, హీరోలు, వ్యాపారులు ఎంతో మందికి ఫైనాన్స్ చేసాను.
-నా దగ్గర అప్పు తీసుకోవడం అదృష్టం అని భావించేవాళ్లు కూడా వున్నారు.
-మన తెలుగు వాళ్లు పద్దతిగా వుంటారు. బాలీవుడ్ లో అలా కాదు. అందుకే అక్కడ వ్యాపారం చేయలేదు.
-ఆ రోజుల్లో అయిదువేల ఆదాయం దాటితే 65 నుంచి 70 శాతం ఇన్ కమ్ టాక్స్ వుండేది. ఇప్పుడు బెటర్ 20 నుంచి 30 శాతమే.
-ఎన్టీఆర్ పార్టీ పెడతా అన్నపుడు బెంగుళూరు నుంచి బేగంపేట వస్తే రిసీవ్ చేసుకోవడానికి సినిమా వాళ్లు ఎవ్వరూ రాలేదు. పట్టు మని పది సీట్లు రావు అని జోస్యాలు చెప్పారు.
-నన్ను అప్పుడే పార్టీలో చేరమన్నారు. అది నాకు సరిపడదని చెప్పాను. గెలిచిన తరువాత ఇప్పుడయినా పార్టీలో చేరమన్నారు. అలా ఎవ్వరూ అడగరు నిజానికి. కానీ నేను చేరలేదు.
-నాకు చెన్నారెడ్డి, జనార్ధనరెడ్డి, కేసిఆర్, వైఎస్ఆర్ ఇలా అందరితో సాన్నిహిత్యం వుంది. కానీ ఏనాడూ ఎవ్వరినీ ఏదీ అడగలేదు. వాళ్లూ నన్నేమీ అడగలేదు.
-మోడీ పాలన కొంత వరకు బాగుంది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్, స్టేబుల్ గవర్నమెంట్ బాగుంది. కొన్ని నిర్ణయాలు మాత్రం సరిగ్గా లేవు.
విఎస్ఎన్ మూర్తి.