ఎమ్బీయస్‍: వాలంటీరు వ్యవస్థ నిలిచేనా?

చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఇవాళ ఐదు ఫైళ్లపై సంతకాలు పెట్టారు. వాటిలో వాలంటీర్ల జీతం పెంపుది లేదు. ఆ మాట కొస్తే యిచ్చిన హామీలన్నిటిపై తొలి రోజే సంతకాలు చేయడమంటే ఎవరికీ సాధ్యపడదు. అన్నీ ఆలోచించే ఎన్నికలలో హామీలిచ్చాం అని చెప్పుకున్నా, ప్రతీ హామీ యొక్క ఫైనాన్షియల్ యింప్లికేషన్స్ వర్కవుట్ చేసుకుంటూ రావాలి. ఆర్థికపరమైన పరిమితులతో పాటు, రాజకీయపరమైన లబ్ధి కూడా లెక్కలోకి తీసుకుని అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. ఈలోగా వాలంటీర్ల గుండెలు పీచుపీచుమంటూ ఉంటాయి. వాళ్ల సంఖ్య తక్కువేమీ కాదు, రెండున్నర లక్షలు!

కొత్తగా 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడానికి ప్రభుత్వానికి టైము పడుతుందని తెలుసు కానీ తమ చిరుద్యోగం (అసలది ఉద్యోగమే కాదనుకోండి) పోనీ భృతి తెచ్చే వ్యాపకం ఉంటుందా ఊడుతుందా అని వాళ్లకు బెంగ కలగవచ్చు. 5 వేల ఆదాయం పోయినా 3 వేల నిరుద్యోగ భృతి వస్తుంది కాబట్టి, వారు మరీ బెంగటిల్ల వలసిన పని లేదు. 50 యిళ్లకు సేవలందించి 5 వేలు తెచ్చుకోవడం కంటె ఏ పనీ చేయకుండా 3 వేలు తెచ్చుకోవడం మెరుగు కాదూ!? ఈ రెండున్నర లక్షల మందిలో దాదాపు 60 వేల మంది రాజీనామాలు చేసేశారు కాబట్టి ‘టు బీ ఆర్ నాట్ టు బీ’ సంశయం వాళ్లకుండదు.

వాళ్లంతా వైసిపికి వీర విధేయులు కాబట్టే రాజీనామా చేసి ఫుల్‌టైమ్ వైసిపి కార్యకర్తలుగా పని చేశారంటున్నారు కాబట్టి వాళ్లని బొట్టెట్టి పిలవరు. తక్కినవాళ్లలో కూడా వైసిపి కార్యకర్తల లేదా అభిమానుల ఏరివేతే ఓ పెద్ద పని. ఆ వడపోత శ్రమను వీళ్లు 25% తగ్గించేశారు. ‘వాలంటీర్లందరూ మా వాళ్లే’ అని ధర్మాన నొక్కి వక్కాణించినా, వాలంటీర్లు అలా అనుకోరు. రాజకీయ అభిమానాలు శాశ్వతం కాదు. తెలంగాణలో చూస్తున్నాం, దశాబ్దాలుగా పార్టీలో నాయకులుగా ఉన్నవారు కూడా తెల్లారేసరికి కండువా మార్చేస్తున్నారు. బక్క ప్రాణులు వాలంటీర్లదేముంది? హామీ యిచ్చినట్లుగా బాబు వాళ్ల జీతం పదివేలు చేస్తే అందరూ జై బాబు అనగలరు.

కానీ నాకు వచ్చే ప్రాథమిక అనుమానం ఏమిటంటే, పదివేల మాట అటుంచి, అసలు బాబు వాలంటీరు వ్యవస్థను కొనసాగిస్తారా? లేదా అని. వాలంటీరు వ్యవస్థపై కూటమిలో ముఖ్య భాగస్వామి ఐన జనసేనకు చాలా అభ్యంతరాలున్నాయి. బాబు కూడా మొదట్లో వాలంటీర్ల గురించి వ్యాఖ్యలు చేసినా, వాళ్లను రాజకీయంగా వాడుకోకూడదంటూ సవరణలు చేశారు. తాము అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతామన్నారు. బిజెపి వాళ్లు తమ వైఖరిని తేటతెల్లం చేయలేదు. పవన్ ఒక్కరే బహిరంగంగా వాలంటీర్లకు ప్రతికూలం. కానీ పవన్ గతకాలపు పవన్ కాదు. పవనపుత్రుడంత పెద్ద సైజుకి ఎదిగారు. కూటమి నిర్మాత ఆయనేననీ, ఆయన చొరవ లేకపోతే బిజెపి కూటమిలోకి వచ్చేది కాదనీ పలువురు ప్రశంసిస్తున్నారు. పోటీ చేసిన స్థానాలన్నిటిలో గెలుపొందడం మామూలు విషయం కాదు. Readmore!

ఏదో 5 లోపల స్థానాల్లో పోటీ చేసి, అన్నీ గెలిచాం అని చెప్పుకోవడం కాదు. 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి అన్నీ గెలవడం అద్భుతం. అందుకే ఆయన్ని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటున్నారు. ఏకైక ఉప ముఖ్యమంత్రి కూడా అంటున్నారు. అలాటాయన తన ఆరోపణను లాజికల్ ఎండ్‌కు తీసుకురాకుండా ఉంటారా? వాలంటీర్లు అమ్మాయిలను అక్రమ రవాణా చేశారని తనకు సెంట్రల్ యింటెలిజెన్స్ వర్గాలు స్వయంగా చెప్పినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి విచారించి, ఆ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తేవాలి. మొదట్లో ..వాలంటీర్లు అన్నారు, ఆ తర్వాత కొందరు.. అని సవరించారు. ఆ కొందరెవరో కనిపెట్టే అధికారం పవన్‌కు ప్రజలకు కట్టబెట్టి ఆంధ్రయువతులను కాపాడమన్నారు.

అంతేకాదు, ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్లు సేకరించి ప్రభుత్వానికి యిచ్చారని తను గతంలో చేసిన ఆరోపణ నిగ్గు తేల్చడానికి కూడా పవన్‌కు అధికారం సిద్ధించింది. ఆయనకు హోం శాఖ యిస్తారంటున్నారు కానీ యివ్వకపోవచ్చు. కేంద్రంలో మిశ్రమ ప్రభుత్వం నడుపుతున్న బిజెపి కూడా హోం శాఖను తన వద్దే అట్టేపెట్టుకుంది. రాష్ట్రంలో టిడిపి కూడా అదే చేయవచ్చు. కానీ పవన్ ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మాటకు, కనీసం కొంతకాలమైనా, బాబు విలువ నిస్తారని భావించవచ్చు. వాలంటీర్లపై వచ్చిన ఆరోపణలపై ఒక కమిషన్ వేసి, ఆ నివేదిక వచ్చేవరకు వాలంటీరు వ్యవస్థను సస్పెన్షన్‌లో పెట్టవచ్చు. మొత్తం వ్యవస్థ ఎందుకు, ఆ మచ్చ పడిన వాలంటీర్లనే పెడితే సరిపోతుందిగా, అంటే పవన్ వాళ్లెవరో స్పెసిఫిక్‌గా చెప్పలేదు. ఒక స్వీపింగ్ రిమార్క్ చేశారు.

వాలంటీరు వ్యవస్థను సస్పెన్షన్‌లో పెడితే ఒకటో తారీకు పెన్షన్లు ఎవరు అందిస్తారనే ప్రశ్న అనవసరం. టిడిపి వారు దానికి ఎప్పుడో సమాధానం చెప్పారు. మొదట సచివాలయ ఉద్యోగులు ఖాళీగా గోళ్లు గిల్లుకుంటూ ఉన్నారుగా, వాళ్లని యిమ్మనమంటే సరి అన్నారు. ఆ తర్వాత ఎలాగోలా యింటి దగ్గర పెన్షన్లు యిప్పించే బాధ్యత చీఫ్ సెక్రటరీదే. తలచుకుంటే ఎవరో ఒకర్ని పంపి యింటి దగ్గర యిప్పించడం అసాధ్యమేమీ కాదు అని బాబు ప్రకటించారు. అప్పటి చీఫ్ సెక్రటరీ తలచుకోలేదు. ఇప్పుడు బాబు తలచుకోవచ్చు. వాలంటీర్లకు ప్రత్యామ్నాయాలను కనిపెట్టవచ్చు. వాలంటీరు వ్యవస్థను నెలకొల్పడం వలన సివిల్స్‌కు వెళ్లగల సత్తా ఉన్న యువత నిర్వీర్యం అయిపోతోందని తెగ బాధ పడిన టిడిపి మేధావులకు యిప్పుడు ఊరట. ఈ మాజీ వాలంటీర్లందరూ సివిల్స్‌కు ప్రిపేర్ కావచ్చు.

అసలు వాలంటీరు వ్యవస్థను ఎత్తి వేస్తారని లేదా సస్పెండ్ చేస్తారని అనుమానం మీకెందుకు? అని అడగవచ్చు. నిజానికి ఫలితాలు వచ్చేవరకూ నాకు ఆ అనుమానం రాలేదు. వాలంటీరు వ్యవస్థ చాలా బాగా పని చేస్తోందని అనేక మంది నాకు చెప్పారు. ముఖ్యంగా కరోనా టైములో వారందించిన సేవలు అమోఘం అని ఒకాయన ప్రత్యేకంగా చెప్పారు. ‘భార్యను ముట్టుకోవడానికి భర్త, భర్తను తాకడానికి భార్య భయపడే రోజుల్లో వాళ్లు వచ్చి మందులివ్వడమే కాదు, అవసరమైతే ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. మా యింట్లో ఆ అవసరం పడకపోయినా వాళ్ల సేవాభావాన్ని ప్రశంసిస్తూ మా వాలంటీరుకు రెండు సంవత్సరాలు బట్టలు పెట్టాను.’ అన్నారాయన.

తక్కిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా యీ వ్యవస్థను అనుసరిద్దామా అని ఆలోచిస్తున్నారనే వార్తలు వస్తూండగానే  రేవంత్ రెడ్డి తెలంగాణలో పెడతానన్నారు. హమ్మయ్య అనుకున్నాను. నాకు ప్రభుత్వం తరఫు నుంచి వచ్చేవేమీ లేకపోయినా, బయటకు వెళ్లి పనులు చేసి పెట్టే అలాటి కుర్రవాడెవరైనా అందుబాటులో ఉంటే డబ్బిచ్చి చేయించుకోవచ్చు కదా అనుకున్నాను. ఎన్నికల వేళ డబ్బు పంపిణీతో సహా అనేక రకాలుగా వాళ్లు ఉపయోగ పడ్డారనే వార్తలు వచ్చాయి. నార్త్‌లో ఓటింగు శాతం తగ్గింది, బిజెపికి నష్టదాయకం అనే వార్తలు వచ్చినప్పుడు ‘అబ్బే, అది సరి కాదు, ఆరెస్సెస్ క్యాడర్, బిజెపి పన్నా ప్రముఖ్‌లు తమ ఓటర్లను దగ్గరుండి తీసుకెళ్లి ఓటు చేయించారు. బిజెపికి వ్యతిరేకంగా ఓటేద్దామనుకున్న వారు బద్ధకించి బూత్‌లకు వెళ్లలేదు.’ అని కొందరు వాదించారు.

ఓటింగు శాతం తగ్గిందంటే క్యాడర్ ఉన్న పార్టీకి లాభం అని తీర్మానించారు. వైసిపికి పన్నా ప్రముఖ్‌లు లేకపోయినా, వాలంటీర్లు ఉన్నారు కదా, వాళ్లు దగ్గరుండి ఓటేయించారు అని అర్థం తీశారు. వాలంటీర్ల వలన రాజకీయ పరంగా యింత మేలు కలుగుతూంటే ఏ పార్టీ ఐనా వాళ్ల నెందుకు తీసేస్తుంది? అనే అందరం అనుకున్నాం. కానీ ఫలితాలు చూశాక వారి వలన జరిగిన నష్టమేమిటో బోధపడుతోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, పంచాయితీ సభ్యులు వీరెవ్వరి ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు డైరక్టుగా పథకాల అందడంతో వీళ్లందరికీ తాము ఎందుకూ కొరగానివారమనే అభిప్రాయం కలిగింది.

రాజేశ్ ఖన్నా సూపర్ స్టార్‌గా వెలిగే రోజుల్లో ఓ మాట అంటూండేవారు – ‘ఊపర్ హాకా (దేవుడు), నీచే కాకా (రాజేశ్ ముద్దుపేరు), బీచ్‌మే సబ్ బేకార్ (పనికిమాలిన వాళ్లు)’ అని. వైసిపి హయాంలో ‘ఇచ్చేవాడు వాలంటీరు, యిప్పించేవాడు జగన్, మధ్యలో మాకేం పని?’ అని యీ ప్రజా ప్రతినిథులందరూ ఫీలయ్యారు. ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినపుడే, ఏ పథకమైనా రాకపోతేనే మన ఎమ్మెల్యే ఎవరు? జిల్లా చైర్మన్ ఎవరు? పంచాయితీ ప్రెసిడెంటు ఎవరు? అని అటూయిటూ చూస్తారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల వద్దకు వెళ్లేవారు. అవి తృణం (గడ్డిపరక) కాకుండా పణమే (డబ్బు) తీసుకుంటున్నాయని పేరు బడడంతో జగన్ వాటిని రద్దు చేశాడు. చంటిపిల్లాణ్ని స్నానం చేయించిన నీళ్లతో పాటు పిల్లాణ్ని కూడా బయట పారబోసినట్లు, ప్రజా ప్రతినిథుల వ్యవస్థ కూడా రద్దు చేసినంత పని చేశాడు.

ఈ వాలంటీర్లు వచ్చి అవసరమైనవాళ్లకు, అర్హులకు పథకాలు అందించడంతో బాటు, మీకు ఫలానా పథకాలు వస్తాయి తెలుసా? అంటూ ఫారాలు పట్టుకొచ్చి యిచ్చి సేవలు చేసేస్తూంటే యిక ఎమ్మెల్యే చుట్టూ తిరిగేవాడెవడు? ‘రాజకీయాలు వ్యాపారం వంటివి. ఎన్నికలలో పెట్టే ఖర్చు రాబట్టడానికై నాయకులు లంచగొండులుగా మారతారు’ అంటారు కానీ చాలామంది సంపాదన గురించి పట్టించుకోరు. ఒకవేళ సంపాదించినా, పెట్టిన పెట్టుబడికి తగినంత రాబడి ఉండదు. రాజకీయాల్లో చేరేది హంగు, ఆర్భాటం కోసమే! రియల్ ఎస్టేటులో సంపాదించినది సినిమాల్లో పెట్టి పోగొట్టుకునేది ఎందుకు? కొన్నాళ్ల పాటు లైమ్‌లైట్‌లో ఉండడానికి! అందుకే సినిమా ఆడకపోయినా వాళ్లు చింతించరు. నాయకులు కూడా ‘పదవిలో ఉంటే గొప్పగా ఉంటుంది, పదిమందీ మన చుట్టూ అయ్యా, అయ్యా అంటూ తిరుగుతూంటే అదో మజా’ అనుకునే రాజకీయాల్లోకి దిగుతారు, ఆస్తులు హరించుకుపోతున్నా రాజకీయాల్లో కొనసాగుతారు. ఓడిపోతుందని తెలిసిన పార్టీ టిక్కెట్టు కోసం కూడా అడుగుతారు.

జగన్ పాలనలో ఎమ్మెల్యేలకు ఆ మజా లేకుండా చేశాడు. ఎంత సేపూ జగన్ పేరనే అంతా నడిచింది. పేరు లేకపోతే పోయింది, పోనీ డబ్బయినా వచ్చిందా? నియోజకవర్గాల్లో చిన్నా, చితకా కాంట్రాక్టులు యిస్తే వాటిలో ఏవైనా కతికేవారేమో! అవి జరగలేదు. ‘నిధులన్నీ సంక్షేమ పథకాలకే పోతూ ఉంటే ప్రాజెక్టులకు డబ్బేం మిగులుతుంది? అభివృద్ధి జరగనే లేదు’ అనగలమా? మరి పోర్టులు, మెడికల్ కాలేజీలు, స్కూళ్ల రిపేర్లు, ప్రాథమిక వైద్య కేంద్రాలు.. అవీ కట్టారుగా! పాత బిల్డింగులన్నిటికీ రంగులు గోకించేసి, తమ పార్టీ రంగులు పులిమించేరుగా! ఇవొకటే కాదు, కొన్ని నియోజకవర్గాల్లో అనేక పనులు జరిగాయని నాకు తోచింది. టివి9లో ‘‘బుల్లెట్ రిపోర్టర్’’ అనే కార్యక్రమంలో యాంకర్ ఒకామె నియోజకవర్గాల్లో తిరుగుతూ చాలా బాగా కవర్ చేసింది. అలాటివి 4 ఎపిసోడ్స్ చూశాను. ఉద్దానం కిడ్నీ బాధితులకు చేసినది, బుగ్గన నియోజకవర్గంలో పనులు, కురుపాంలో గిరిజన ఇంజనీరింగు కాలేజీ.. యిలాటివన్నీ చూపించారు.

అంటే యివన్నీ జరిగినప్పుడు హైలెవెల్లోనే మాట్లాడేసుకున్నారేమో! స్థానికంగా ఉన్నవాళ్లకి వాటాల్లేవేమో! ప్రతిపక్షాలు ముఖ్యంగా చెప్పినది మద్యం అమ్మకాల్లో అవినీతి, ఇసుక విషయంలో దోపిడీ! మద్యం విషయంలో జె-టాక్స్ నడిచింది అన్నారు. అంటే జగన్‌కే డైరక్టుగా వెళ్లిందని ఆరోపణ. ఈ ఆరోపణల నిజానిజాలు తేల్చే అధికారాన్ని టిడిపికి ప్రజలు అప్పగించారు. వాళ్లేం చేస్తారో చూడాలి. టిడిపి హయాంలో పింక్ డైమండ్ చోరీ, తిరుమల గుడిలో కిచెన్ తవ్వేసి లంకెబిందులు పట్టుకుపోయారు అంటూ వైసిపి నానా హడావుడీ చేసింది. అధికారంలోకి వచ్చాక నోరెత్తలేదు. టిడిపి కూడా అదే బాపతో కాదో కొన్నాళ్లలో తెలిసిపోతుంది.

కొన్ని చోట్ల పనులు జరిగినా ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. ఆ మాట ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఓపెన్‌గా చెప్పారు. నిధుల కొరత కారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా బిల్లులు పాస్ చేయించలేక పోయారు. దాంతో వాళ్లకి నిస్పృహ వచ్చేసింది. ఇక ఎమ్మెల్యేలకు మిగిలింది ఇసుక తవ్వకాలు, భూకబ్జాలు. అవెంత మేరకు జరిగాయో కూడా టిడిపి బయట పెడితేనే తెలియాలి. ప్రతిపక్షంలో ఉండగా కేసులు పెట్టలేదు. ఇప్పుడు ప్రభుత్వ సిఐడి ద్వారా, ఎసిబి ద్వారా కేసులు నడిపించవచ్చు.

అప్పటివరకు కొంతమంది (ఎందరో తెలియదు) ఎమ్మెల్యేలు మాత్రమే భూఆక్రమణలు, యిసుక తవ్వకాలు చేశారనుకుని ఆలోచన ముందుకు సాగిస్తే చాలామందికి సంపాదించే మార్గం కూడా లేదని అనుకోవాలి. రాబడీ లేక, హోదా లేక, పలుకుబడి లేక, పలకరించేవాడు లేక కుమిలి ఉంటారు వైసిపి ఎమ్మెల్యేలు. ఇలా వగచే వారిని గడప గడపకు వెళ్లి ఓటర్లను పలకరించి రండని జగన్ ఆదేశించాడు. వెళ్తే ‘ఓహో మీరా ఎమ్మెల్యే, మీతో మాకేం పని లేదే’ అంటారేమోనని వాలంటీర్లను వెంట బెట్టుకుని వెళ్లిన వాళ్లు వెళ్లారు, లేని వాళ్లు లేరు. వెళ్లనందుకు జగన్‌చే చివాట్లు తిన్నారు. తర్వాత పులి మీద పుట్రలా సర్వే రిపోర్టులు వచ్చాయి. ‘నీపై నియోజకవర్గ ఓటర్లకు అసంతృప్తి ఉంది అని నా సర్వేలు చెప్పాయి’ అన్నాడు జగన్.

ఆ సర్వేల నిర్వాకమెంతో ఎన్నికలు చాటి చెప్పాయి. వాలంటీర్ల ద్వారా సకల సమాచారాన్ని సేకరించి, ఐపాక్ టీము ఓటర్ల మనసుల్లో దూరి సమస్తం తెలిసేసుకుంటోంది అని ప్రతిపక్షాలు గోల పెట్టేశాయి. సమాచార సేకరణైనా అబద్ధమవ్వాలి, ఐపాక్ సామర్థ్యం అతిశయోక్తయినా కావాలి. ప్రజల నాడి వాళ్లు పట్టుకోలేదు. ఐపాక్ సర్వే ఒకటే కాకుండా జగన్ విడిగా కూడా కొన్ని సర్వేలు చేయించి, క్షేత్రస్థాయి వాస్తవాలు గ్రహించాడు కాబట్టే 151 కంటె ఎక్కువ వస్తాయని చెప్పగలిగాడు అనే మాటా విన్నాను. ఆ సర్వేకారులు కూడా సర్వాంతర్యాములు కారని తేలిపోయింది. అయినా వీటిని నమ్ముకుని జగన్ ఎమ్మెల్యేలను, ఎంపీలను పేకముక్కల్లా అటూయిటూ మార్చేసి, సగానికి సగం డ్రాప్ చేసేసి, జాకీని ఆసు చేసి, ఆసుని జోకర్ని చేసేసి నానా రకాల కంగాళీ ప్రయోగాలూ చేశాడు.

ఇలాటి సర్వారాయుళ్ల మాట పట్టుకుని మమ్మల్ని మార్చేసేవా? అని జగన్ని మనసారా తిట్టుకుని ఉంటారు ఎమ్మెల్యేలు. టిక్కెట్లు దక్కనివారు అప్పుడు పళ్లు నూరుకున్నా, యిప్పుడు ‘నెత్తిన పాలు పోశావు కదరా నాయనా’ అనుకుంటూ ఉంటారు. ‘అన్నీ జగన్ పేరనే జరుగుతున్నపుడు మా పని తీరు అనేది ఒక అంశం ఎలా అవుతుంది?’ అని మెల్లమెల్లగా అడిగారు కొందరు. ఉండవల్లి అదే అన్నారు ‘అన్ని నియోజకవర్గాల్లోనూ జగనే అభ్యర్థి’ అని. కానీ నేను ఆ వాదనతో విభేదిస్తాను. అతివృష్టి వచ్చి 151 కురిసినప్పుడు ఓడిపోయినవాళ్లూ ఉన్నారు, యిప్పుడు అనావృష్టి వచ్చి 164 మంది ఎగిరిపోతే మిగిలినవాళ్లూ ఉన్నారు. జగన్ అందర్నీ గెలిపించనూ లేడు, ఓడించనూ లేడు. ఎమ్మెల్యే సొంత ప్రతిపత్తి కొంత ఉంటుంది.

వాలంటీర్లను ప్రవేశపెట్టడం ద్వారా జగన్ పాత వ్యవస్థను చెడగొట్టి, తాను చెడిపోయాడు అనవచ్చు. నిజానికి వ్యవస్థను తప్పించడం చాలా కష్టం. ‘మీరు పుస్తకాలు అచ్చేసి, పాఠకులకు డైరక్టుగా అందిస్తే 50శాతం డిస్ట్రిబ్యూటర్లకు యివ్వనక్కరలేకుండా సగం ధరకే యివ్వవచ్చుగా’ అంటారు కొందరు. కానీ పాఠకుణ్ని మనం డైరక్టుగా చేరలేము. డిస్ట్రిబ్యూటింగు వ్యవస్థలో కూడా ఏజంట్లకు కమిషన్లు, కొనుగోలుదారుడికి డిస్కౌంట్లు, షాపు నడిపే ఖర్చులు అన్నీ ఉంటాయి. వాళ్లూ మిద్దెలు కట్టరు. ఆర్టీఏ ఆఫీసులో అన్నీ ఆన్‌లైన్ చేశామంటారు. అయినా ఆ ఆఫీసుకి వెళ్లినవాళ్లు దళారులను ఆశ్రయిస్తూనే ఉంటారు. వాళ్లను సాంతం తొలగిస్తే ఏ సర్వరో పాడు చేయగల ఘనులు వారు. ఆన్‌లైన్‌లో సమస్తం దొరుకుతున్న యీ రోజుల్లో కూడా షాపులు, మాల్స్ మనగలుగుతున్నాయి కదా. మధ్యలో ఉండే వ్యవస్థను తీసేయాలంటే క్రమేపీ తీయాలి. జగన్ ఒక్కసారిగా అనేక ప్రయోగాలు చేసి, నష్టపోయాడు.

ఇది తగదు అని ఎవరూ చెప్పలేదా? అతని కంటె ముందుగా ప్రజాక్షేత్రంలోకి వచ్చిన సీనియర్లు యింత తొందర వద్దని చెప్పలేదా? జగన్ ఎవర్నీ కలవకుండా, అధికారులు, ఆంతరంగికులు చెప్పినది మాత్రమే వినడం వలననే యింత అనర్థం జరిగిందనుకోవాలి. ఒకాయన నాతో బ్రహ్మానంద రెడ్డి గారి పని తీరు గురించి చెప్పారు. ఎవరైనా ఎమ్మెల్యే వచ్చి పనులు జరగటం లేదని చెపితే, ఆయన ఆ డిపార్టుమెంటు సెక్రటరీని పిలిచి ‘ఫలానా ప్రాజెక్టు ఏమవుతోంది?’ అని అడిగేవాడట. వాళ్ల యథావిధిగా ‘అద్భుతంగా నడుస్తోంది. ప్రజలంతా ఆహాఓహో అంటున్నారు’ అని చెప్పగానే ‘గ్రౌండ్ రిపోర్టు వేరేలా వినబడుతోందండి’ అంటూ ఎమ్మెల్యేని చెప్పమనేవారు. ఆ ఎమ్మెల్యే ‘పనులు ఆగిపోయి ఆర్నెల్లయింది. మీరు బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టరు పనులు ఆపేశాడు.’ అనగానే అధికారి తడబడి ‘నాకు వచ్చిన రిపోర్టులు యిలా ఉన్నాయి. ఐ విల్ క్రాస్‌చెక్’ అనేవాడు. ‘ఆ పని చూడండి’ అని ముఖ్యమంత్రి అనేవారట.

ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ రెండూ ఒకదానిపై మరొకటి నిఘా వేయాలని రాజ్యాంగ నిర్మాతలు అనుకున్నారు. బ్యూరాక్రసీని నమ్ముకుంటే వాళ్లెప్పుడూ రోజీ పిక్చరే చూపిస్తారు. వాళ్లకు వచ్చే ఇంటెలిజెన్సు రిపోర్టులు సరిగ్గా ఉంటే ఏ పాలకుడూ అధికారం కోల్పోడు. క్షేత్రస్థాయి పరిస్థితులివీ అని ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్తు వాళ్లు ముఖ్యమంత్రికి చెప్పుకోనివ్వాలి. వాళ్లేదో ఫేవర్లు అడుగుతారని దగ్గరకు రానీయకపోతే చీకట్లో ఉండిపోవాల్సి వస్తుంది. ఎన్టీయార్‌తోనూ యీ సమస్య ఉండేది. ఎమ్మెల్యేలకు ఆయన దగ్గరకు వెళ్లాలంటే భయం. ‘నేను నిల్చోబెట్టిన గడ్డిపరకలు వీళ్లు’ అనే చులకన భావం ఆయనది. అయితే మధ్యలో చంద్రబాబు ఉండేవారు. ఎమ్మెల్యేలు ఆయన దగ్గరకు వెళ్లి చెప్పుకునే వారు. ఆయన ఎన్టీయార్‌కు చేరవేసేవాడు. రాజకీయ లాభనష్టాలు బేరీజు వేసి, నిర్ణయాలు తీసుకునే వారు. ఎమ్మెల్యేలతో చనువు పెరగడం వలననే బాబు ఎన్టీయార్‌ను దింపగలిగాడు. వారితో ఎన్టీయార్‌కు డైరక్ట్ కాంటాక్ట్ ఉండి ఉంటే బాబు అధికారంలోకి వచ్చేవారు కారు.

జగన్‌కు చంద్రబాబు వంటి యింటర్మీడియరీ ఎవరూ లేరు. ఆ మాట కొస్తే చంద్రబాబుకీ లేరు. ఎమెల్యేలను జగన్ కలవరు, చంద్రబాబు కలిసినా మాట వినరు. ‘మనం చెప్పేది వినకుండా ఆయనే మనను కన్విన్స్ చేసి పంపేస్తారు’ అని ఆయన సన్నిహితుడొకరు యీ మధ్య పబ్లిగ్గా అన్నారు. ఇక్కడ ఒక ప్రధానమైన ప్రశ్న వస్తుంది. ఎమ్మెల్యేల పరిస్థితి యింత ఘోరంగా ఉన్నపుడు వాళ్లు పార్టీ మారకుండా అక్కడే ఎందుకున్నారు? అని. పైన చెప్పుకున్నవి క్రోడీకరించి చూస్తే పలుకుబడి లేదు, రాబడి కొద్దిమందికే ఉంది, ముఖ్యమంత్రి దగ్గరకు ప్రవేశం లేదు. ఫలితాల తర్వాత జక్కంపూడి రాజా ధనంజయ రెడ్డిని తప్పు పడుతూ బహిరంగంగా మాట్లాడారు. ధనంజయ రెడ్డిని అక్కడ ప్రతిష్ఠాపించి సర్వాధికారాలు యిచ్చిందెవరు? మంత్రి సరిగ్గా లేకపోతే వాళ్లను నియమించిన రాజుదేగా తప్పు!

ఇలాటి పరిస్థితిలో రాజా కానీ మరొకరు కానీ వైసిపిలో ఉండడమెందుకు? అయినా ఉన్నారు. ఎందుకంటే జగన్ కరిజ్మాయే తమను మళ్లీ గెలిపిస్తుందనే ఆశతో! అనుకోవాలి. ఇందిరా గాంధీ, ఎన్టీయార్ కూడా డైరక్టుగా పబ్లిక్‌తో సంపర్కం పెట్టుకుని, సంక్షేమ పథకాల ద్వారా వాళ్లని మురిపిస్తూ మధ్యలో ప్రజా ప్రతినిథులను పట్టించుకునే వారు కారు. వాళ్లు కోపగించుకుని వదిలి వెళ్లినా, పార్టీ నెగ్గగానే తిరిగి వచ్చేసేవారు. జగన్ వద్ద కూడా అలాటి మాజిక్ ఉందని నమ్మారు కాబట్టే అంటిపెట్టుకుని ఉన్నారు. అంటే వాళ్లూ ప్రజల నాడిని పట్టుకోలేక పోయారు అని యిప్పుడు తెలుస్తోంది. జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారు అని కొందరు పాఠకులు నాకు మెయిల్స్ రాసినప్పుడల్లా ‘అలా అయితే ప్రతిపక్షాలు స్థానిక ఎన్నికలలో గెలవాలి కదా, వైసిపి ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లాలి కదా. వెళ్లినవాళ్లు కొందరే కదా!’ అని నేను వాదించేవాణ్ని.

మొదటి దానికి నాకు యింకా సమాధానం దొరకలేదు. రెండో దానికి సమాధానంగా వాళ్లు ప్రజల నాడిని పట్టుకోలేక పోయారు అనుకోవాలి. ప్రజల మధ్య తిరిగే వాళ్లే నాడి పట్టుకోలేక పోతే యిక సర్వే కారులు ఏం పట్టుకుంటారు? చిన్న సవరణ.. ప్రజల మధ్య తిరిగేవాళ్లు అని గట్టిగా అనలేం. వాలంటీర్లను వేసి, అలా తిరగవలసిన అవసరం లేకుండా జగన్ చేశాడు. పైన దేవుడు ఉన్నాడు, కింద వాలంటీర్లు ఉన్నారు. వాళ్లే నా సైన్యం అన్నాడు జగన్. అలా అయితే మధ్యలో మేమెందుకు? అని వీళ్లు నీరసించారు. ‘‘నమ్మినబంటు’’ సినిమాలో వేసిన ఎడ్లకు చాలా పేరు వచ్చింది. సినిమా నాలుగు వారాలాడేక రైతులను ఆకర్షించడానికి నిర్మాతలు ‘అగ్రనటులకంటె మిన్నగా నటించిన ఎడ్లు’ అని పోస్టర్లు వేశారు. దాంతో హీరో అక్కినేని, హీరోయిన్ సావిత్రికి కోపం వచ్చింది.

కొంతకాలానికి స్పెయిన్‌లో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు పిలుపు వస్తే నిర్మాతలు వీళ్లని రమ్మనమన్నారు. ‘‘ఆ ఎడ్లను తీసుకెళ్లండి’’ అన్నారు వీళ్లు. అలా యీ ఎమ్మెల్యేలు జగన్‌తో ‘మిమ్మల్ని గెలిపించడానికి మేమెందుకు? ఆ వాలంటీర్లున్నారుగా!’ అని పైకి అనలేక పోయినా మనసులో అనుకుని ఉంటారు.  వాళ్ల పరిస్థితి చూశాక కొత్తగా ఎన్నికైన టిడిపి ఎమ్మెల్యేలు బాబుతో ‘వాలంటీరు వ్యవస్థ కొనసాగించి మమ్మల్ని నస్మరంతి గాళ్లను చేస్తారా? వద్దు. అలా అని జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తే 2019 రిపీటవుతుంది. అందుకని పాతకాలంలోలా పనులు జరగాలంటే ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేసే స్థితి తీసుకు వచ్చేయండి హాయిగా.’ అని డిమాండు చేయవచ్చు. ఇదీ నా ఊహ. అందుకే వాలంటీరు వ్యవస్థ కొనసాగింపుపై నా సందేహం.

ఎమ్మేల్యేలకు వచ్చిన సమస్యే ప్రభుత్వోద్యోగులకూ రావచ్చు. ఎన్నికలకు ముందు పెన్షన్ల పంపిణీకి యిబ్బంది వచ్చినపుడు వాలంటీర్లు లేకపోతేనేం, గ్రామ సచివాలయ వ్యవస్థ ఉందిగా అన్నారు కొందరు టిడిపి వారు. అనేక రాష్ట్రాలలో యీ రెండూ లేకపోయినా పెన్షన్లు యివ్వటం లేదా? అని అడిగారు ఆ పార్టీ వాళ్లే కొందరు. గ్రామ సచివాలయ వ్యవస్థ కూడా దండగే అన్నారు టిడిపి వారు గతంలో. అది వచ్చాక తమ పలుకుబడి, అవసరం తగ్గింది అని ప్రభుత్వోద్యోగులు ఫీలవుతున్నారు. అసలే బాబు ఫిలాసఫీ ప్రభుత్వోద్యోగుల సంఖ్య తగ్గించడం. దాని కోసమే ఆన్‌లైన్ సర్వీసులు, ఈ- సేవ అని ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభించారు. కాంట్రాక్టు ఉద్యోగి వ్యవస్థను కూడా పోషించారు.

ఇప్పుడు గ్రామ సచివాలయాల సంఖ్య పెంచి, తమ ప్రాధాన్యత తగ్గిస్తారన్న భయం కూడా ఉద్యోగులకు ఉండవచ్చు. జగన్‌ను కూలదోయడం మా ప్రజ్ఞే అని భావించే ఉద్యోగి వర్గాలు గ్రామ సచివాలయ వ్యవస్థను రద్దు చేయమని బాబును అడిగినా అడగవచ్చు. ఆయనేం చేస్తారో చూడాలి. వాటి పని తీరును సమీక్షించి, కొనసాగించాలో వద్దో సూచించమని ఓ కమిటీని వేయవచ్చు. ఇది బాబు స్టయిల్. తను అనుకున్నది కమిటీల ద్వారా చెప్పిస్తారు. ప్రజాభిప్రాయం అలా ఉంది, నిపుణులు అలా చెప్పారు అని ప్రకటించడానికి వీలుగా ఉంటుంది. మద్యనిషేధం ఎత్తేయడానికైనా, ప్రత్యేక తెలంగాణకు సై అనాలన్నా యిదే టెక్నిక్కు వాడారు.

చివరగా ఒక మాట చెప్పాలి – ‘తమకు జగన్‌తో ఏక్సిస్ లేదు కాబట్టి ఎమ్మెల్యేలు అలిగారు, ప్రజలతో డిస్కనెక్ట్ అయ్యారు, నిరాసక్తతతో ఓడారు’ అనే వాదన అంగీకరిస్తే మరి జగన్‌తో నిత్యం సన్నిహితంగా మెలగిన బుగ్గన, బొత్స వంటి మంత్రులు ఎందుకు ఓడారు? బుగ్గన నియోజకవర్గంలో చాలా పనులు జరిగినట్లుగా కూడా ‘‘బుల్లెట్ రిపోర్టరు’’ కార్యక్రమంలో చూశాను కూడా! రాజకీయాలనేవి సంక్లిష్టమైనవి, ఏ ఒక్క సిద్ధాంతానికీ లొంగనివి. కొన్ని రూల్సు ఉంటాయి, మినహాయింపులు ఉంటాయి. అనేక పెర్ముటేషన్లు, కాంబినేషన్లు ఉంటాయి. అందుకే వాటిని గమనించడం ఆసక్తికరం. నిరంతరంగా ఉద్భవించే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ పోవాలి. వెతుకుదాం. 

– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2024)

Show comments

Related Stories :