'అన్నాయ్' మూడు భాగాల సినిమా-శ్రీకాంత్ అడ్డాల

అచ్చమైన గోదావరి వెటకారం, నుడికారం, మమకారం అన్నీ చూడాలంటే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సినిమా చూడాలి. కొత్త బంగారులోకం.. ముకుంద..సీతమ్మ వాకిట్లో సిరమల్లె చెట్టు..బ్రహ్మోత్సవం..ఇలా వరుసగా సినిమాలు అందించిన శ్రీకాంత్ అడ్డాల కాస్త గ్యాప్ తరువాత అందిస్తున్న సినిమా 'నారప్ప'. వెంకటేష్ హీరోగా తయారైన ఈ సినిమా అమెజాన్ ప్రయిమ్ లో ఈ నెల 20 న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ అడ్డాలతో 'గ్రేట్ ఆంధ్ర' ముఖాముఖి.

చాన్నాళ్లయిపోయింది మిమ్మల్ని చూసి...మీ సినిమా చూసి.

అవును కానీ ఏదో సినిమాలో చెప్పినట్లు గ్యాప్ తీసుకోలేదు..వచ్చింది. 

నారప్ప...మీరు రెగ్యులర్ గా చేసే సినిమాలకు పూర్తిగా భిన్నమైన సినిమా. ప్రాజెక్టులోకి మీరు వచ్చారా? మిమ్మల్ని తీసుకువచ్చారా? Readmore!

నేనే వచ్చాను. నా అసోసియేట్ ఒకరు నారప్ప మాతృక అయిన అసురన్ చూడమని చెప్పారు. చూసాను. అన్ని రకాల ఎమోషన్లు కలిసి కమర్షియల్ ప్యాకేజ్ లా అనిపించింది. అలాంటి టైమ్ లో సురేష్ బాబు ఈ సినిమా హక్కులు తీసుకున్నారని ఇంకా డైరక్టర్ ఫిక్స్ కాలేదని తెలిసింది. వెంట‌నే వెళ్లి నాకు చేయాలని వుంది అని అడిగాను. కొంత డిస్కషన్ తరువాత ఆయన ఓకె అన్నారు. అలా ఈ ప్రాజెక్టులోకి వచ్చాను.

మా వరకు శ్రీకాంత్ అడ్డాల సినిమాలు అంటే గోదావరి మమకారం, నుడికారం, వెటకారం కళ్లముందు వుంటాయి. కానీ నారప్ప ట్రయిలర్ చూస్తుంటే కత్తులు, రక్తం, ఇలాంటి వ్యవహారాలు కనిపిస్తున్నాయి.

అవును ఇది గతంలో నేను తీసిన చిత్రాల మాదిరిగా కాదు. షూట్ అవుతుంటే ఓ లైట్ బాయ్ ఎవరో ఇదే మాట అన్నారు. దానికి ఇంకెవరో, ఇదే అసలు ఆయన ఒరిజినల్. ఇప్పుడు బయటకు వచ్చింది అంటూ జోక్ కట్ చేసారు. 

ఇంతకీ అసురన్ సినిమా నారప్ప గా మార్చడానికి ఏం చేసారు.

పెద్దగా మార్పులు ఏమీ చేయలేదు. ఇలాంటి స్క్రిప్ట్ లను పెద్దగా కెలకకూడదు. చిన్న చిన్న మార్పులు తప్ప మరేం చేయలేదు. ఆ స్క్రిప్ట్ కు వెంకటేష్ ప్రాణం పెట్టి మరీ ప్రాణం పోసేసారు. 

స్క్రిప్ట్, వెంకీ కాకుండా నారప్పకు వున్న యాడెడ్ పాయింట్లు ఏమిటి?

సినిమా మొత్తం కమర్షియల్ గా వుంటుంది. ఇదేదో ఆర్ట్ ఫిలింలా వుండదు. బ్యాక్ డ్రాప్ కాస్త రా గా డ్రయ్ గా వుంటుందంతే. 

ఈ మధ్య ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చూసాను. అనుబంధాలు, ఆప్యాయతలు అంటే గోదావరి జిల్లాలే అన్నట్లు చూపించిన శ్రీకాంత్ అడ్డాల, కులాల గొడవలు, అణచివేతలు అంటే రాయలసీమను చూపించారని, ఇది సరికాదని. దీనికి మీ సమాధానం?

అలాంటిదేం లేదు. కేవలం మాతృకలో చూపించిన లోకేషన్లు ఎక్కడ వున్నాయా అని రెక్కీ చేసాం. అనంతపురం దగ్గర సెట్ అయింది. అదే ఆంధ్ర అంటే అంతా గ్రీనరీగా వుంటుంది కదా. డ్రయ్ వాతావరణం కావాలి.

అలాంటి వాతావరణం తెలంగాణలోనూ దొరకుతుంది. మరి అదెందుకు ట్రయ్ చేయలేదు?

అన్నీ చూసే ఈ లోకేషన్ ఎంచుకున్నాం.

కానీ నాకు తెలుసున్నంత వరకు అట్రాసిటీ, అణచివేత లాంటి చరిత్రలో నిలిచిపోయే సంఘటనలు కోస్తాలో జరిగినట్లు రాయలసీమలో ఎప్పుడూ లేవు. 

మేము అంతదూరం ఆలోచించలేదు. జస్ట్ లోకేషన్ల వరకు చూసి డిసైడ్ అయ్యాం. ఈ విషయంలో ఎవరినన్నా బాధపెట్టి వుంటే క్షమించాలి. 

మీ సినిమాల్లో కనిపించే సునిశితమైన హాస్యం ఈ సినిమాలో వుండడానికి ఆస్కారం వుందా?

లేదు. ఇక్కడ అలాంటి అవకాశం లేదు. అయితే మంచి విషయం వుంటుంది. సందేశం వుంటుంది.

బ్రహ్మోత్సవం సినిమా మిమ్మల్ని చాలా కాలం పక్కన కూర్చునేలా చేసింది. ఎక్కడ ఫెయిల్ అయ్యారో అర్థం అయిందా?

దాంట్లో పెద్దగా ఆలోచించడానికి ఏముంది. స్క్రిప్ట్ బాగా లేకపోతే సినిమా ఫెయిల్ అవుతుంది. మనం ఏదో అనుకుని స్టార్ట్ చేస్తాం. కానీ ఒక్కసారి అనుకున్నది అనుకున్నట్లు రాకపోవచ్చు. ఇక్కడా జరిగింది అదే. అయిదేళ్లయిపోతోంది. మరచిపోయి ముందుకు సాగాల్సిందే. ఇక ఇప్పుడు పోస్ట్ మార్టం అనవసరం. అయితే నన్ను నమ్మి మహేష్ బాబు ఇచ్చిన ఓ అద్భుతమైన అవకాశాన్ని నేను మిస్ చేసుకున్నాను.

గీతా సంస్థలో ఓ సినిమా చేయాల్సి వుంది కదా.

అవును. నారప్ప తరువాత అదే. 'అన్నాయ్' అన్నది టైటిల్. భారీ యాక్షన్ సినిమా. అది కూడా ట్రయాలజీ..మూడు భాగాల్లో తీస్తాం.

హీరో ఎవరు?

అది ఇంకా డిసైడ్ కాలేదు. 

అది మీ మార్కు సినిమానేనా? 

కాదు, గుంటూరు ఏరియా బ్యాక్ డ్రాప్ లో జరిగే భారీ యాక్షన్ సినిమా అది. 

చాలా మంది దర్శకులు ఓటిటి కోసం లేదా చిన్న సినిమాల కోసం స్వంత బ్యానర్లు స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఏమైనా అలా?

శ్రీకాంత్ క్రియేషన్స్ అని స్టార్ట్ చేస్తున్నాను. మంచివి, చిన్న సబ్జెక్ట్ లు నా దగ్గర పనిచేసిన వారితో తీసే ఆలోచన వుంది. వాటిల్లో మీకు నచ్చే నా స్టయిల్ గోదావరి వ్యవహారాలు వుంటాయి.

సూపర్..కంగ్రాట్స్..

థాంక్యూ

విఎఎస్ఎన్ మూర్తి

Show comments

Related Stories :