ఎమ్బీయస్‍: ఝార్‌ఖండ్, ఈశాన్య రాష్ట్రాల ఫలితాలు

14 పార్లమెంటు స్థానాలున్న ఝార్‌ఖండ్‌లో ఎన్డీఏకు కొద్ది పాటి దెబ్బ తగిలింది. 2014లోను, 2019లోను 12 స్థానాలుంటే యీసారి 9కి పడిపోయింది. ఎన్డీఏలో బిజెపి భాగస్వామి అయిన ఎజెఎస్‌యు (ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్) తన ఒక స్థానాన్ని నిలుపుకోగా బిజెపి మాత్రం 13 స్థానాల్లో పోటీ చేసి 8 గెలిచి, 3 పోగొట్టుకుంది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెసు ఆ 3టిలో 1 గెలుచుకుని (7టిలో పోటీ చేసింది), మొత్తం 2 స్థానాలు సంపాదించగా, మరో భాగస్వామి జెఎంఎం 2 గెలుచుకుని, మొత్తం 3 (5టిలో పోటీ చేసింది) గెలుచుకుంది. ఇండియా కూటమిలో తక్కిన భాగస్వాములైన ఆర్జెడి, సిపిఎంఎల్‌కి చెరొకటీ పోటీ చేసి ఏదీ గెలుచుకోలేదు.

ఝార్‌ఖండ్‌ జనాభాలో గిరిజనులది 26%. వాళ్లను ఆకట్టుకోవడానికి గిరిజన నేత బిర్సా ముండా శతజయంతిని కేంద్ర బిజెపి ‘జనజాతీయ గౌరవ్ దివస్’ గా ప్రకటించింది. ఈ విషయంతో పాటు సంతాల్ తెగకి చెందిన ద్రౌపది ముర్మును దేశాధ్యక్షురాలిగా చేశామన్న మాట బిజెపి ఎన్నికల ప్రచారంలో నొక్కి చెప్పింది.  అయినా ఛత్తీస్‌గఢ్‌లో బిజెపికి బాసటగా నిలిచిన గిరిజనులు, యిక్కడ మాత్రం వ్యతిరేకంగా ఉన్నారని, ఎస్టీలకు రిజర్వే చేసిన 5 సీట్లలోనూ బిజెపి ఓడిపోయిందని విశ్లేషకులు అంటున్నారు.

హేమంత్ సొరేన్ తన మైనింగు లీజు తనే పొడిగించుకున్న కేసులో ఎన్నికల కమిషనర్ అతన్ని అనర్హుడిగా ప్రకటించ వచ్చని భావించింది. కానీ అరెస్టు చేస్తే గిరిజనులు అలుగుతారేమో, ఓట్లు పోతాయేమోనని కేంద్ర బిజెపి తటపటాయిస్తూ వచ్చింది. చివరకు ఏమైతే అది అయిందనుకుని, ఒక లాండ్ డీల్‌లో మనీ లాండరింగ్ చేసాడంటూ ఇడి ద్వారా 2024 జనవరిలో అరెస్టు చేసి జైలుకి పంపింది. కానీ ఆధారాలు సరిగ్గా లేకుండానే ఒక చిన్న కేసుపై హేమంత్‌ను జైలుకి పంపించారని గిరిజనులు భావించారని అందుకే ఫలితాలు వికటించాయని అంటున్నారు.

దీనికి తోడు యింకో రెండు విషయాలున్నాయి. ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ రద్దు చేస్తుందనే భయం కూడా కలిగింది. బిజెపి కామన్ సివిల్ కోడ్ పేరుతో హిందూ మతాన్ని తమపై రుద్దడం గిరిజనులైన సంతాల్‌లు హర్షించలేదు. ‘‘మాది సర్ణ ధర్మం. ప్రకృతిని ఆరాధిస్తాం. వనదేవతలను పూజిస్తాం. హిందూ దేవుళ్లయిన రాముడు, కృష్ణుడు మా దేవుళ్లు కాదు.’’ అంటారు వారు. గిరిజనులు హిందువులు కారు అని హేమంత్ సొరేన్ స్పష్టంగా చెప్పాడు. రాష్ట్రానికి తొలి సంతాల్ ముఖ్యమంత్రిగా పని చేసి, యిప్పుడు బిజెపిలో చేరి కేంద్ర మంత్రి ఐన అర్జున్ ముండాను యీ విషయంలో చెప్పమంటే నీళ్లు నమిలాడు. అసెంబ్లీలోని మొత్తం 81 స్థానాల్లో 28 స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ చేసినదే. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఆ 28  స్థానాలు బిజెపికి వ్యతిరేకంగా ఓటేస్తే ఆ పార్టీకి ప్రమాదమే! Readmore!

హేమంత్ జైలుకి వెళుతూ తన స్థానంలో 38 ఏళ్ల తన భార్య కల్పనను కూర్చోబెట్టి వెళదామనుకున్నాడు. కానీ కుటుంబంలో అభ్యంతరాలు వచ్చాయి. కల్పనది ఒడిశాకు చెందిన కుటుంబం. తండ్రి ఆర్మీ ఆఫీసరు కావడంతో అనేక రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేసింది. ఇంజనీరింగు, ఆ తర్వాత ఎంబిఏ చేసింది. ఇంగ్లీషు, హిందీ, ఒడియా, బెంగాలీ, సంతాలీ భాషలు ధారాళంగా మాట్లాడగలదు. తన స్నేహితురాలి అన్న ఐన హేమంత్‌ను ప్రేమించి 2006లో పెళ్లాడింది. వాళ్లకు యిద్దరు కొడుకులు. హేమంత్ తండ్రి జెఎంఎం స్థాపకుడు అయిన శిబు సొరేన్‌కు హేమంత్ రెండో కొడుకు. పెద్ద కొడుకు దుర్గా సొరేన్ చనిపోయాడు. అతని భార్య సీత, మరిది జైలుకి వెళ్లే పక్షంలో తనను ముఖ్యమంత్రిణిని చేయాలని పట్టుబట్టింది.

తను ఎప్పటికైనా జైలుకి వెళ్లక తప్పదని గ్రహించిన హేమంత్ కల్పనను వారసురాలిగా తయారు చేస్తున్నాడని ఆమె అనుమానించడానికి కారణం గండే అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన సర్ఫరాజ్ అహ్మద్ చేత రాజీనామా చేయించి, రాజ్యసభ ఎంపీగా పంపడం! హేమంత్ జైలుకి వెళ్లగానే సీత ఆ పదవి నాదే అంది. భార్య, వదినల మధ్య ఎవర్ని ఎంచుకున్నా పార్టీ సీనియర్ నాయకులకు కోపం వచ్చి ప్రమాదం కలుగుతుందని అనుకున్న హేమంత్, సీనియర్ పార్టీ నాయకుడైన చంపై సొరేన్‌కి గద్దె అప్పగించి వెళ్లాడు. ఇప్పుడు బెయిలులో బయటకు రాగానే అతని చేత రాజీనామా చేయించి, తను మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాడు. కల్పన రాజకీయాల్లోకి ప్రవేశించి, పార్లమెంటు ఎన్నికలతో పాటు జరిగిన గండే ఉపయెన్నికలో పోటీ చేసి 26 వేల మెజారిటీతో నెగ్గింది. మళ్లీ యింకోసారి హేమంత్ జైలుకి వెళితే, ఆమెను ముఖ్యమంత్రిని చేసినా ఆశ్చర్యపడనక్కర లేదు. ఎందుకంటే చంపై సీనియర్, సమర్థుడు ఐనా గ్లామర్ లేదు. కల్పనకు గ్లామర్ ఉన్నట్లు యీ ఎన్నికలు నిరూపించాయి కాబట్టి పార్టీ పెద్దలు ఒప్పుకోవచ్చు.  

ప్రస్తుతానికి తోటికోడలు ముఖ్యమంత్రి కాలేదు కదాని సీత సంతోషించి ఊరుకోలేదు. తనను చేయకపోవడంతో కినిసి, తమ ప్రత్యర్థి ఐన బిజెపిలో చేరింది. బిజెపి వెంటనే దానికి సొరేన్ కుటుంబానికి కంచుకోట ఐన దుమ్కా పార్లమెంటు స్థానంలో అభ్యర్థిగా నిలబెట్టింది. ఈమెకు తోడు గీతా కోడా అనే కాంగ్రెసు నాయకురాలిని కూడా బిజెపి తన పార్టీలో చేర్చుకుంది. మాజీ ముఖ్యమంత్రి మధు కోడా భార్య, 2019లో కాంగ్రెసు పార్టీ తరఫున బిజెపి అభ్యర్థిని ఓడించి ఎంపీ అయిన గీత యీ ఏడాది ఫిబ్రవరిలోనే బిజెపిలో చేరింది. ఈ సీతా ఔర్ గీతా ఎన్నికలలో అదరగొట్టేస్తారు అనుకున్నారు కానీ సీత గట్టి పోటీ యిచ్చి 26 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. గీత 1.70 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయింది. సీతను ఓడించిన నళిన్ సొరేన్ ఆమె మావగారికి శిష్యుడే.

వీరితో పాటు ఓడిపోయిన మరో ప్రముఖుడు కేంద్ర మంత్రి అర్జున్ ముండా. అతను యీసారి బిర్సా ముండా జన్మస్థలమైన ఖుంటిలో మళ్లీ నిలబడ్డాడు. అతనికీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బాబూలాల్ మరాండీకి పడదు. ఎన్నికలలో ఏ మేరకు సహకరిస్తాడో అనే అనుమానం మొదటి నుంచీ ఉంది. చివరకు 1.50 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. రాష్ట్రంలో షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేసిన స్థానం పలామూ ఒక్కటే ఉంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన అక్కడ బిజెపి అభ్యర్థిగా నిలబెట్టినది మాజీ డిజిపి అధికారి విష్ణు దయాల్ రామ్‌ని. ‘‘ఆపరేషన్ గంగాజల్’’ పేర భాగల్పూరులో ఖైదీల కళ్లలో పోలీసులు యాసిడ్ పోసినప్పుడు ఆ జిల్లా ఎస్పీ అతనే! చివరకు అతనే నెగ్గాడు. హజారీబాగ్‌లో యశ్వంత్ సిన్హా నెగ్గుతూ వుండేవాడు. అతను బిజెపికి దూరమై పోయిన తర్వాత తమతోనే ఉన్న అతని కొడుకు జయంత్ సిన్హాకు బిజెపి టిక్కెట్టిచ్చేది. ఈసారి అతనికి యివ్వకుండా మనీశ్ జైస్వాల్‌కు యిచ్చింది. అతనూ నెగ్గాడు.

ఝార్‌ఖండ్‌లో రాజకీయ అస్థిరత ఎంత ఎక్కువంటే ఏర్పడిన 24 ఏళ్లలో 12 మంది ముఖ్యమంత్రులు మారారు. 5 ఏళ్ల కాలం పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి రఘువర్ దాస్ (బిజెపి) ఒక్కడే. అతను గిరిజనేతరుడు కావడం చేతనే 2019 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓడిపోయిందని అన్నారు. రాష్ట్రాన్ని ఏర్పరచడం వలన బిజెపికి కలిగిన లాభమేమిటో చూడబోతే 2004లో గెలిచిన ఎంపీ సీట్లు 1, 2009లో 8, 2014లో 12, 2019లో 11, యిప్పుడు 8. అసెంబ్లీ చాలాకాలం బిజెపి ఏలుబడిలోనే ఉంది. ఎవరు అధికారంలో ఉన్నా అవినీతి ఎక్కువ, అభివృద్ధి తక్కువ. రాష్ట్ర రాజధాని రాంచీ పక్కనున్న గ్రామాల్లో కూడా తాగు నీటి కోసం వెతకాల్సిందే. వందలాది గ్రామాల్లో కుంటల్లోంచి నీళ్లు తాగుతూంటారు. రాష్ట్రంలో కుళాయి నీరు వసతి ఉన్న యిళ్లు 20% మాత్రమే. 2021లో జల్ జీవన్ మిషన్ కింద 315 వాటర్ సప్లయి స్కీములకై రూ.9544 కోట్ల రూ.లు మంజూరు చేసిన తర్వాత కూడా యిదీ పరిస్థితి!

పాలకపక్షం ఏదైనా సరే, జల్, జంగల్, జమీన్‌ల దోపిడీ నిరాఘంటంగా సాగిపోతోంది. నిరుద్యోగం ప్రబలడంతో యువత సైబర్ క్రైమ్ వైపు మొగ్గు చూపుతున్నారు. జమ్‌తారా అనే ఊరు సైబర్ క్రైమ్‌కు ఎంత ప్రసిద్ధి చెందిందంటే నెట్‌ఫ్లిక్స్‌లో ‘జమ్‌తారా- సబ్‌కా నంబర్ ఆయేగా’ అనే సీరీస్ తయారైంది. ఇలాటి పరిస్థితుల్లో అవినీతి ఆరోపణలకు ప్రజలు స్పందించడం మానేసినట్లున్నారు. ఒక కాంగ్రెసు మంత్రి నౌకరు యింట్లో రూ.35 కోట్ల క్యాష్ దొరకిందంటే అది ఎంత పెద్ద ఎన్నికల అంశం కావాలి? కానీ ప్రచారంలో ఎవరూ దాన్ని పెద్దగా ప్రస్తావించ లేదట. అందుకే కాబోలు, ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ అవినీతి ఆరోపణలతో జైలుకి వెళ్లినా అతని పార్టీకి గతంలో కంటె 2 సీట్లు ఎక్కువ వచ్చాయి!

2019 అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 81 స్థానాల్లో యుపిఏకు 47 వస్తే, జెఎంఎంకు 30 (అంటే 37%) గెలుచుకుంది. పార్లమెంటుకి వచ్చేసరికి 21% సీట్లు మాత్రమే వచ్చాయి. అసెంబ్లీలో 31% సీట్లు (అంటే 25) తెచ్చుకున్న బిజెపి పార్లమెంటులో 57% (8) తెచ్చుకుంది. ఇప్పుడు గెలిచిన స్థానాలను అసెంబ్లీ సెగ్మెంట్లగా అనువదించి చూస్తే ఎన్డీఏకు 52 (బిజెపికి 47, ఎజెఎస్‌యుకి 3) ఇండియాకు 29 (కాంగ్రెసుకి 15, జెఎంఎంకి 14) వస్తాయి.

ఈశాన్యంలో ఉన్న 8 రాష్ట్రాలలో మొత్తం 25 స్థానాలున్నాయి. అసాంలో 14, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలలో రెండేసి, నాగాలాండ్, మిజోరాం, సిక్కిమ్‌లో తలా ఒకటి. వీటిలో ఎన్డీఏకు 16 సీట్లు వచ్చాయి. 2019లో వచ్చిన 19 కంటె 3 తక్కువ. ప్రధాన భాగస్వామి బిజెపికి 14 నుంచి 1 తగ్గి 13 వచ్చాయి. 2019లో లాగానే దానికి అసాంలో 9, అరుణాచల్, త్రిపురలలో రెండేసి వచ్చాయి కానీ మణిపూర్‌లో 1 పోగొట్టుకుంది. ఎన్డీఏ భాగస్వాములైన ఎన్‌పిపి, ఎన్‌పిఎఫ్, ఎన్‌డిడి ఒక్కో సీటు కోల్పోయి బలాన్ని తగ్గించగా, ఎజిపి (అసాం గణపరిషత్), యుపిపిపిఎల్ (యునైటెడ్ పీపుల్స్ పార్టీ) చెరొకటి గెలిచి, ఎస్‌కెఎమ్ (సిక్కిం  క్రాంతికారీ మోర్చా) తన సీటు నిలుపుకుని, నష్టాన్ని కొంత మేరకు తగ్గించాయి.

అసాంలో ఎన్డీఏ భాగస్వాములైన యుపిపిఎల్, ఎజిపి చెరో ఒకటి తెచ్చుకోవడంతో ఎన్డీఏ బలం గతంలో కంటె 2 పెరిగి 11 అయింది. మణిపూరులో 2, మేఘాలయలో 1, నాగాలాండ్‌లలో 1 పోగొట్టుకుంది. కాంగ్రెసు పార్టీ మణిపూరులో బిజెపి నుంచి, ఎన్‌పిఎఫ్ (నాగా పీపుల్స్ ఫ్రంట్) నుంచి చెరొకటి, మేఘాలయలో ఎన్‌పిపి (నాగా పీపుల్స్ పార్టీ) నుంచి 1, నాగాలాండ్‌లో ఎన్‌డిపిపి (నేషనల్ డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ) నుంచి 1 గెలుచుకుని, అసాంలో 3 నిలుపుకుని తన బలాన్ని 4 నుంచి 7కి పెంచుకుంది. ఒకప్పుడు ఈశాన్యమంతా కాంగ్రెసుకు కంచుకోటలా ఉండేది. ఇప్పుడు ఇన్నాళ్లకు యీ మేరకు పుంజుకుంది. నాగాలాండ్‌లో 20 ఏళ్ల తర్వాత సీటు గెలిచింది. మిజోరాంలోని ఒక్క సీటూ గెలుచుకున్న జెడ్‌పిఎమ్ (జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్), మేఘాలయాలోని రెండిటిలో ఒకటి గెలుచుకున్న విఓటిపిపి (వాయిస్ అఫ్ ద పీపుల్స్ పార్టీ) ఏ కూటమిలోనూ లేవు.

బిజెపి పాలిస్తున్న మణిపూరులో ఎస్టీలకు రిజర్వ్ చేసిన, కుకీ-జో జాతులు మెజారిటీలో ఉన్న ఔటర్ మణిపూరులో కాంగ్రెసు అభ్యర్థి ఎన్డీఏ భాగస్వామి ఐన నాగా పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థిపై 85 వేల మెజారిటీతో నెగ్గాడు. మొయితీలు మెజారిటీలో ఉన్న ఇన్నర్ మణిపూర్‌లో కూడా బిజెపి అభ్యర్థిపై 1.09 లక్షల మెజారిటీతో మరో అభ్యర్థి నెగ్గాడు. గతంలో యీ రెండు సీట్లు ఎన్డీఏవే! ఇన్నాళ్లుగా తమ రాష్ట్రం తగలబడి పోతున్నా ప్రధాని మోదీ తమను పరామర్శించడానికి రాకపోవడం, తమ గురించి ఏమీ వ్యాఖ్యానించక పోవడంతో మణిపూరు ప్రజలు అలిగారని అర్థమౌతోంది. పరిస్థితిని కేంద్రం వెంటనే చక్కదిద్దవలసిన అవసరాన్ని యీ ఫలితం నొక్కి చెప్పింది.  

ఎన్డీఏ పాలనలో ఉన్న నాగాలాండ్‌లో ఉన్న ఏకైక నియోజకవర్గంలో కాంగ్రెసు అభ్యర్థి అధికారంలో ఉన్న ఎన్‌డిపిపి అభ్యర్థిపై గెలిచాడు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క సీటూ గెలుచుకోలేక పోయిన కాంగ్రెసుకు యిది ఊరట నిచ్చింది. ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ ఏర్పాటు చేయడంలో కేంద్రం వైఫల్యానికి నిరసనగా ఓటింగు బహిష్కరించమని ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ పిలుపు నివ్వడంతో ఆరు జిల్లాలలోని 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరూ ఓటేయలేదు.

మేఘాలయలో కాంగ్రెసు తన షిల్లాంగ్ సీటుని విఓటిపిపికి పోగొట్టుకుంది. కానీ సంగ్మా కుటుంబానికి కంచుకోట అనబడే తురా సీటును ఎన్డీఏ భాగస్వామి ఎన్‌పిపి నుంచి తీసుకోగలిగింది. తురాలో ఎన్‌పిపి అభ్యర్థి ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సోదరి అగాథా 1.55 లక్షల తేడాతో ఓడిపోయింది. మిజోరాంలో అధికారంలో ఉన్న జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ రాష్ట్రంలోని ఏకైక పార్లమెంటు స్థానాన్ని ప్రతిపక్ష మిజో నేషనల్ ఫ్రంట్ నుంచి గెలుచుకోగలిగింది. అరుణాచల్ ప్రదేశ్‌లో బిజెపి అసెంబ్లీతో పాటు లోకసభ స్థానాలు రెండిటినీ స్వీప్ చేసేసింది. కిరణ్ రిజ్జూ లక్షకు పైగా మెజారిటీతో గెలిచారు.

ఈశాన్య రాష్ట్రాల గురించి నేను పెద్దగా ఫాలో అవను. చిన్న చిన్న రాష్ట్రాలు, బోల్డు ప్రాంతీయ పార్టీలు, ఫిరాయింపులు, తీవ్రవాద గ్రూపులు.. అంతా గందరగోళంగా ఉంటుంది. అసాం ఒక్కటే వార్తల్లో ఉంటూ వస్తుంది. ఒకప్పుడు యివన్నీ దానిలో భాగంగా ఉండేవి. ఇప్పుడు వేటికి అవే అయిపోయాయి. ఇప్పటికీ 14 ఎంపీ సీట్లతో అసామే పెద్ద రాష్ట్రం. పైగా దాని మఖ్యమంత్రి హేమంత విశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలతో దాన్ని ఎప్పుడూ వార్తల్లో ఉంచుతాడు. అందుకని అసాం గురించి కొంత రాస్తాను.

అసాంలో ఎన్డీఏకు గతంలో కంటె 2 సీట్లు పెరిగి 11 వచ్చాయి. (ఈ అంకెను అసాం ముఖ్యమంత్రి హేమంత కరక్టుగా గెస్ చేశాడు) ఓట్లు 1.6% పెరిగి 46.3% వచ్చాయి. ఇండియా కూటమికి గతంలో లాగానే 3 వచ్చాయి. గతంలో కంటె 5.2% ఓట్లు పెరిగి 40.9% వచ్చాయి. ఎన్డీఏలో ప్రధాన భాగస్వామి బిజెపికి 37.4% ఓట్లు వచ్చి 9 స్థానాలను నిలుపుకుంది. కాంగ్రెసుకు 37.5% ఓట్లు వచ్చి 3 స్థానాలను నిలుపుకుంది. ఎన్డీఏ భాగస్వాములైన ఎజిపి, యుపిపిఎల్, యితర పార్టీల నుంచి రెండు స్థానాలు గెలుచుకోవడంతో ఎన్డీఏ బలం 2 పెరిగింది.

హేమంత కాంగ్రెసులోనే అసాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ శిష్యుడిగా ఎదిగి, అతని వారసుడు కావాలని కలలు కన్నాడు. కానీ తరుణ్ తన కొడుకు గౌరవ్‌ను తన వారసుడిగా తేవడానికి ప్రయత్నించడంతో యితనికి కోపం వచ్చింది. వెళ్లి రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేయబోతే అతను యితన్ని లక్ష్యపెట్టలేదు. దాంతో 2015 ఆగస్టులో బిజెపిలో చేరి ఆ పార్టీని అసాంలోనే కాదు, మొత్తం ఈశాన్యంలో లీడరుగా చేశాడు, కాంగ్రెసును దాదాపు కనుమరుగు చేశాడు. ఈ క్రమంలో హిందూత్వ వాదాన్ని విపరీతంగా నెత్తికెత్తుకుని, హిందూ ఓట్లను సమీకృతం చేసి, విజయాలు సాధిస్తున్నాడు. అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అతని పేరు చెపితే ముస్లిములు భయపడేట్లు చేసుకున్నాడు. తూర్పు బెంగాల్‌ నుంచి వచ్చిన ముస్లిములను అసామీలు ‘మియా’లని పిలుస్తారు. 2023 అక్టోబరులో హేమంత ‘‘బిజెపికి మరో పదేళ్ల దాకా మియాల ఓట్లు అక్కరలేదు.’’ అని ప్రకటించాడు.

ఈ పదేళ్ల గడువు ఏమిటంటే ‘వాళ్లు బాల్యవివాహాల దురాచారం, మతఛాందసం మానుకునేదాకా బిజెపికి ఓటేయనక్కరలేదు. వాటితో పాటు, కుటుంబ నియంత్రణ పాటించే అలవాటు చేసుకోవడానికి పదేళ్లు పడుతుంది.’ అన్నాడు. ఉత్తరాది రాష్ట్రాలలో హిందువుల్లో, ముస్లిముల్లో బాల్యవివాహాల గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. ప్రజాప్రతినిథులు హాజరైన సందర్భాలూ ఉంటాయి. అక్కడెక్కడా వీటి గురించి పెద్దగా చర్యలు తీసుకుంటున్నట్లు కనబడదు. కానీ అసాంలో మాత్రం హేమంత దీన్ని పెద్ద అంశంగా చేసి, క్రితం ఏడాది బాల్యవివాహాలు జరుపుతున్నారంటూ 5 వేల మంది ముస్లిములను అరెస్టు చేయించాడు. దురాచారాన్ని ఖండిస్తూనే అరెస్టు చేయడం టూమచ్ అన్నాయి ప్రతిపక్షాలు. కొత్తగా బాల్యవివాహం చేసుకున్న వారిని శిక్షించినా అర్థముంటుంది కానీ 5-10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని, పిల్లల్ని కన్నవారిని అరెస్టు చేయడమేమిటని ప్రశ్నించాయి. ప్రభుత్వం బహుభార్యాత్వాన్ని రూపు మాపడం ఎలా అనేదానిపై ఒక కమిటీ కూడా వేసింది. దీనితో పాటు పర్యావరణాన్ని కాపాడడానికంటూ బ్రహ్మపుత్ర నది ఒడ్డున నివాసాలేర్పరుచుకున్న వారిని (ముస్లిములే) ఖాళీ చేయించే ప్రణాళిక ప్రకటించాడు.

అసాంకు మొదట్నుంచి సెటిలర్స్ సమస్యతో పాటు శరణార్థుల తాకిడి ఎక్కువగా ఉంది. పక్కనున్న బెంగాల్ నుంచి బెంగాలీలు వచ్చి అసాంలో స్థిరపడ్డారు. వాళ్లు ఎక్కడికి వెళ్లినా డామినేట్ చేస్తారనే భయం స్థానికులకు ఉంటుంది. త్రిపురకు వెళ్లి బెంగాలీని అఫీషియల్ లాంగ్వేజి చేసుకున్నారు. అసాంలో కూడా అలాటి ప్రయత్నం చేశారని అసామీయుల ఆరోపణ. అసాంలో స్థానికులతో కలవకుండా వేర్పాటు భావాలు కలిగించారు. బెంగాలీ కాళీ మందిరం, అసామీ కాళీ మందిరం వేర్వేరుగా ఉంటాయంటే వినడానికి ఆశ్చర్యం వేస్తుంది. దీనికి తోడు 1947 విభజన తర్వాతే కాదు, 1971 బంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత, ఆ తర్వాత కూడా తూర్పు బెంగాల్ నుంచి హిందువులు, ముస్లిములు వచ్చి పడి అసాంను ముంచెత్తారు.

దాంతో అసామీయులకు అస్తిత్వ సమస్య వచ్చింది. 1951 తర్వాత శరణార్థులుగా రాష్ట్రానికి వచ్చినవారందరినీ వెనక్కి పంపించేయాలంటూ అసాం విద్యార్థులు 1967లో ఆల్ అసాం స్టూడెంట్స్ యూనియన్ ఏర్పరచి, 1979 నుంచి ఆరేళ్లపాటు తీవ్ర ఉద్యమం నడిపారు. 1985లో కేంద్రంతో ఒప్పందం సాధించి, ఒప్పందాన్ని అమలు చేయడానికి అసాం గణ పరిషత్ అనే రాజకీయ పార్టీగా ఏర్పడాలని నిశ్చయించి, అదే ఏడాది ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చారు. కానీ త్వరలోనే ఆ విద్యార్థి నాయకులు అవినీతి ఆరోపణలు ఎదుర్కున్నారు, అసమర్థ పాలకులుగా పేరుబడ్డారు, తమలో తాము కలహించుకున్నారు. కేంద్రం కానీ, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పలు పార్టీలు కానీ శరణార్థులను వెనక్కి పంపడంలో చిత్తశుద్ధి చూపలేదు. కారణం ఓటు బ్యాంకు రాజకీయాలు. తాము అధికారంలో కొనసాగాలంటే అక్రమంగా వచ్చిన వారి ఓట్లు కీలకమయ్యాయి.

2014 తర్వాత కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక అక్రమవాసులను మత ప్రాతిపదికపై విడగొట్టి, లబ్ధి పొందుతోంది. వేరే దేశం నుంచి ఎప్పుడు వచ్చినా, హిందువులకైతే పౌరసత్వం యిస్తాం అని చెప్పి వారి ఓట్లు తెచ్చుకుంటోంది. దాంతో ముస్లిములు బిజెపికి పూర్తిగా వ్యతిరేకమయ్యారు. హేమంత వచ్చాక యీ వివక్షతను మరింత పెంచుతున్నాడు. కొన్ని నియోజకవర్గాలలో ముస్లిం ఓట్లు కీలకంగా మారాయని గ్రహించిన నియోజక వర్గాల పునర్విభజన చేయించాడు. దాని కారణంగా మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు ప్రభావితం చేయగల స్థానాల సంఖ్యను 29 నుంచి 21కు తగ్గించాడు. పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా దీని ప్రభావం కనిపించిది. బారాపేటలో గతంలో 60% ముస్లిము ఓట్లు ఉంటే, యిప్పుడది 35% కు తగ్గిపోయింది.

పునర్విభజన తర్వాత కూడా కరీం గంజ్, నాగావ్ (నౌగాంగ్), దుబ్రి నియోజకవర్గాల్లో ముస్లింలు మెజారిటీలో ఉన్నారు. ముస్లింల పార్టీ ఐన ఏఐయుడిఎఫ్‌ 2021 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసు కూటమిలో ఉంది. ఇప్పుడది విడిగా పోటీ చేస్తోంది. ఇద్దరి మధ్య ఓట్లు చీలి, తమకు లాభం చేకూరుతుందని బిజెపి అంచనా వేసింది. ఓటింగు రెండో దశ వచ్చేసరికి తన ముస్లిము-వ్యతిరేక యిమేజి వలన నష్టం జరిగేట్లు ఉందని హేమంతకు తోచింది. ముస్లిములు మాకు ఓటేయనక్కరలేదు అనే మాట మార్చి ‘‘ముస్లిములు బిజెపికి ఓటేయాలి. ఓటేస్తే ముస్లిము యువతులకు బాల్యవివాహాల బెడద, సవతుల బెడద తప్పుతుంది.’’ అన్నాడు. ఇతను ముస్లిములకు అనుకూలంగా మాట్లాడడం బిజెపి సీనియరు లీడర్లకు నచ్చలేదు. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ‘బిజెపి తన మౌలిక సిద్ధాంతాలను వదిలి, సంతుష్టీకరణవైపు మళ్లితే ఎలా?’ అన్నాడు.

హేమంత మౌలికంగా బిజెపి వాడు కాదని, కాంగ్రెసు నుంచి దిగుమతి అయినవాడనే వెక్కిరింత ఉంది ఆ విమర్శలో. వెంటనే హేమంత ‘పోలింగు రోజున ఆయన పార్టీకి, మోదీకి వ్యతిరేకంగా మాట్లాడడం శోచనీయం.’ అన్నాడు. పోలింగు ఆఖరి దశలో మాజీ ఎమ్మెల్యే ‘హేమంత రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచివేశాడని అన్నాడు. ఫ్లయిఓవర్లు, రోడ్లు వేస్తే అభివృద్ధి జరిగినట్లు కాదని యువత గ్రహించాలి.’ అన్నాడు. ఇతర పార్టీలు చేపట్టే సంక్షేమ పథకాలను కేంద్ర బిజెపి ‘ఫ్రీబీ’, ఉచితాలు అని వెక్కిరిస్తుంది కానీ తను పాలించే రాష్ట్రాలలో ధారాళంగా అమలు చేస్తుంది. అసాంలో అరుణోదయ పేరుతో నెలకు 1200 చొప్పున 19.10 లక్షల మంది మహిళలకు యిస్తోంది. మరో 7 లక్షల మందికి యిస్తామని 2023 అక్టోబరులో ప్రకటించింది. ఎన్నికల వేళ సర్వే పేరుతో అరుణోదయ ఫామ్స్ యింటింటికి పంచడాన్ని ఎన్నికల కమిషనర్ తప్పు పట్టింది. ఇది కాకుండా లక్షపతి బైదేవ్ పేరుతో మహిళా స్వయంసేవా గ్రూపులకు ఒక పథకం అమలు చేస్తోంది.

ఫలితాలు వచ్చాక చూస్తే, ముస్లిం ఓట్లు చీలిపోతాయన్న బిజెపి ఆశ సఫలం కాలేదని తేలింది. ఓటర్లు ఏఐయుడిఎఫ్‌ను ఆదరించలేదు. దాని అధినేత మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ ధుబ్రిలో కాంగ్రెసు అభ్యర్థి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. అతని పార్టీ తరఫున నిలబడిన యింకో యిద్దరూ ఓడిపోయారు. నౌగాంగ్‌లో కూడా కాంగ్రెసు అభ్యర్థి గెలిచాడు. కరీంగంజ్‌లో మాత్రం ఓట్లు చీలిపోయి, బిజెపి అభ్యర్థి 18 వేల ఓట్ల మెజారిటీతో గెలిచాడు. గతంలో ఎఐయుడిఎఫ్‌కు పోగొట్టుకున్న తూర్పు బెంగాల్ ముస్లిం ఓటు, బిజెపి, ఎజిపిలకు పోగొట్టుకున్న స్థానిక అసామీ ఓటు  కాంగ్రెసుకు తిరిగి వచ్చాయి.

ఏ గౌరవ్ గొగోయ్ కారణంగా తను కాంగ్రెసు వీడవలసి వచ్చిందో అతను జోర్హట్‌లో నిలబడడంతో అతన్ని ఓడించాలని హేమంత శర్మ కాబినెట్ సహచరుల సాయంతో చాలా ప్రయత్నించాడు కానీ గౌరవ్ 1.44 లక్షల ఓట్లతో గెలిచాడు. 2026 అసెంబ్లీ ఎన్నికల నాటికి యితను కాంగ్రెసు తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి కావచ్చనే ఊహాగానాలున్నాయి. అతని గెలుపు 2026లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి గట్టి పట్టున్న మూడు జిల్లాలను ప్రభావితం చేస్తుందని బిజెపి, ఎజిపి నాయకులు అంచనా వేస్తున్నారట. ఈ పార్లమెంటు ఫలితాల ప్రకారం చూస్తే మొత్తం 126 అసెంబ్లీ సెగ్మెంట్‌లలో 94టిలో ఎన్డీఏ బలంగా ఉంది. అందువలన హేమంత ఎదురు లేకుండా సాగుతున్నాడనుకోవాలి. ఈ పరంపరలో రాబోయే వ్యాసాలు పశ్చిమ రాష్ట్రాలపై రాస్తాను. – – (ఫోటో – ఇద్దరు హేమంతలు (సొరేన్, శర్మ) 

- ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2024)

mbsprasad@gmail.com

Show comments

Related Stories :