ఎమ్బీయస్‍: ఓటింగు శాతం ఏం చెప్తోంది?

ఆంధ్రలో జరిగిన ఎన్నికలలో ఓటింగు శాతం హెచ్చుగా ఉంది. 2019లోనే భారీ ఓటింగు జరిగిందంటే యీసారి యింకో 2%పెరిగి, 81.9%జరిగింది. ఆంధ్రలో గెలుపెవరిది? అనే అంశంపై చాలాకాలంగా జరుగుతున్న చర్చలకు మరో కోణం వచ్చి చేరింది. ఈ భారీ ఓటింగు దేనికి సంకేతం? అని. చాలాకాలంగా కొందరు పరిశీలకులు చెప్పే మాట ఒకటి ఉంది – ఓటింగు శాతం తక్కువగా ఉందంటే అధికార పార్టీ మళ్లీ గెలుస్తుందని, ఎక్కువగా ఉంటే ఓడిపోతుందని! ఓటింగు పెరుగుదల ప్రభుత్వ వ్యతిరేకతకు సూచిక అని తీర్మానిస్తారు వాళ్లు. 2014 ఉమ్మడి రాష్ట్రంలో 74.7% ఓటింగు జరిగింది. 2019లో ఆంధ్రలో దాదాపు 80% జరిగింది. అధికారంలో ఉన్న టిడిపి ఓడిపోయింది. 2024లో 82% జరిగింది కాబట్టి యిప్పుడు అధికారంలో ఉన్న వైసిపి ఓడిపోతుంది. ఇదీ లాజిక్!

అదే స్వరంతో పార్లమెంటు ఎన్నికలలో దేశవ్యాప్తంగా యిప్పటిదాకా జరిగిన రౌండ్లలో ఓటింగు శాతం తక్కువగా ఉంది కాబట్టి తమకు సీట్లు తగ్గుతాయన్న బిజెపికి బెదురు పుట్టింది, అందువలన దక్షిణాదిపై ఎక్కువ ఫోకస్ పెట్టింది అనే విశ్లేషిస్తున్నారు. రెండూ ఎలా పొసుగుతాయి? ఓటింగు తగ్గిందంటే ప్రభుత్వానికి అనుకూలం అని బిజెపి సంతోషిస్తుంది అనాలి కదా! ఓటింగు శాతం పెరిగితే అధికార పార్టీ మళ్లీ అధికారంలోకి రాదు అనే వాదన తప్పని పార్లమెంటు ఎన్నికలు అనేకసార్లు రుజువు చేశాయి. 1951-52లో 45.7% ఓటింగు జరిగితే 1957 నాటికి 2% పెరిగింది. అయినా అధికార పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. 1962, 1967లలో కూడా అదే జరిగింది. 1977లో 60.5% ఓటింగు జరిగితే 1980 నాటికి అది 57% కు పడిపోయింది. అయినా అధికారపక్షం ఓడిపోయింది. 1984 నాటికి ఓటింగు 7% పెరిగి 64%కి చేరింది. అయినా అధికారపక్షం నెగ్గింది.

1989 వచ్చేసరికి 2% తగ్గింది. అయినా అధికార పక్షం ఓడింది. 1991 వచ్చేసరికి 5.1% తగ్గింది. అయినా అధికార పక్షం ఓడింది. 1999 ఎన్నికల కంటె 2004 ఎన్నికలలో 2% ఓటింగు తగ్గింది. అయినా అధికార పార్టీ ఓడింది. 2004 కంటె 2009లో 0.2% పెరిగింది. అయినా అధికార పార్టీ మళ్లీ గెలిచింది. ప్రతిపక్షంలో ఉన్న బిజెపికి 22 సీట్లు తగ్గాయి, అధికారంలో ఉన్న కాంగ్రెసుకు 61 సీట్లు పెరిగాయి. 2014లో కంటె 2019 ఎన్నికలలో 1% ఓటింగు ఎక్కువగా జరిగింది. అయినా అధికారంలో ఉన్న బిజెపికి 21 సీట్లు ఎక్కువ వచ్చి అధికారంలో కొనసాగుతోంది. వాస్తవాలు యిలా ఉండగా ఓటింగు శాతం పెరగడం అధికార పక్షానికి ముప్పు అనే కబుర్లు చెప్పేస్తూనే ఉంటారు. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో 82.3% ఓటింగు జరగగానే యింకేముందు మమతా యింటికి వెళ్లడమే అని హడావుడి చేశారు. తీరా చూస్తే తృణమూల్‌కి 4 సీట్లు ఎక్కువ వచ్చాయి.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 73.7% ఓటింగు జరిగింది. 2023లో 1.7% తగ్గింది. అధికార పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిందా? లేదుగా, 39 సీట్లు పోగొట్టుకుంది. ఇవన్నీ చూసి కూడా ఓటింగు శాతం పెరిగింది కాబట్టి వైసిపికి ముప్పు అని వాదించడం అర్థరహితం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటె పార్లమెంటు ఎన్నికలకు ఓటింగు శాతం తగ్గింది. దాని అర్థం ఓటర్లు రాష్ట్రంలోని పాలక పక్షానికి అనుకూలమనా? కేంద్రంలోని పాలక పక్షానికి అనుకూలమనా? ఇది కాంగ్రెసు వ్యతిరేక ఓటా? బిజెపి వ్యతిరేక ఓటా? తరచి చూస్తే ఓటింగు శాతానికీ, అధికార పార్టీ గెలుపోటములకు సంబంధం లేదు. వాటికి కారణాలు వేరే ఉంటాయి. అవేమిటో ఫలితాల తర్వాత తెలుస్తాయి. Readmore!

సాధారణంగా ఎన్నికలలో శ్రామిక వర్గాలు, గ్రామీణ వర్గాలు ఉత్సాహంగా పాల్గొంటారు. నగరాలలో, పట్టణాలలో నివసించే ధనికులు, మధ్యతరగతి వారు బద్ధకిస్తారు. మామూలు సమయాల్లో దేశం మారాలి, యీ నాయకులు పోవాలి అని ఆవేశంగా మాట్లాడినా అసలైన సమయం వచ్చేసరికి ‘అందరూ ఒక్కలాటి వారే, ఓటేసి ఏం ప్రయోజనం’ అని నోరు చప్పరించేసి, యిల్లు కదలరు. ఎండగా ఉందనో, పోలింగు బూతు దూరంగా ఉందనో, అక్కడ క్యూ ఉందనో సాకులు చెప్తారు. పొద్దున్న రష్‌ ఉంటుంది భోజనం అయ్యాక వెళదామని వాయిదా వేసి, భోజనం అయ్యాక, వాతావరణం చల్లబడ్డాక వెళదాంలే అనుకుని, సాయంత్రానికి యింటికి ఎవరో వచ్చారనో, టీవీలో న్యూసు యింట్రస్టింగుగా ఉందనో కూర్చుండిపోతారు. మన ఒక్కరి ఓటు వలన ప్రజాస్వామ్యం బాగుపడిపోదంటూ మెట్ట వేదాంతం చెప్తారు.

ధనికులకు యిలాటి శషభిషలు లేవు. వెళ్లి సామాన్య జనంతో పాటు క్యూలో నిల్చుని వేయడమంటే చికాకు. ఎవరు గెలిచినా, వాళ్ల చేత పనులు చేయించుకోగల యిం‘ధనం’ వారి దగ్గర ఉన్నపుడు యీ యిక్కట్లు పడడమెందుకు? అభ్యర్థి ఎవరిమీదనైనా అభిమానం ఉంటే విరాళాలిస్తారు, ఓటర్లను చేరవేయడానికి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఇంత చేసినప్పుడు నా ఒక్కడి ఓటూ వేయకపోతే ఏం? అనుకుంటారు. గతంలో పురుషుల ఓటింగే ఎక్కువగా ఉండేది. మహిళలు తక్కువగా ఓటేసేవారు. ఇంట్లో పని పూర్తి చేసుకుని, ఓటింగుకి వెళదాంలే అనుకుంటూనే యిది మగవాళ్ల వ్యవహారం అనుకునేవారు. మధ్యతరగతి, ధనిక మహిళల్లో ఓటింగు శాతం బాగా తక్కువగా ఉండేది. శ్రామిక మహిళల్లో కూడా మగవాళ్లంత ఉండేది కాదు.

క్రమేపీ మహిళల్లో మార్పు వచ్చింది. అనేక రాష్ట్రాలలో వాళ్లు బహుళంగా ఓటేయసాగారు. మగవాళ్లను మించి వేస్తున్నారు. పత్రికలు చదవ నవసరం లేకుండా, టీవీల ద్వారా రాజకీయ అవగాహన పెరగడం దీనికి దోహదపడింది. సెల్‌ఫోన్ల వాడకం వచ్చాక అవగాహన మరింత పెరిగింది. గత ఐదేళ్లగా అయితే యూట్యూబుల ద్వారా సమాచారం ఎడతెగని వానలా కురుస్తోంది. మహిళల ఓటింగు పెరగడానికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం ఒక ముఖ్య కారణం కావచ్చు. వాటికి వారి స్పందిస్తున్న తీరు చూసిన కొద్దీ మహిళా కేంద్రితంగా పథకాలు రూపొందుతున్నాయి. పథకాలు పెరిగిన కొద్దీ వీరి స్పందన పెరుగుతోంది. దానాదీనా మహిళలు ఎవరిని అభిమానిస్తే వాళ్లే గెలుస్తారు అనేదాకా వచ్చింది. బిహార్‌లో నీతీశ్ ఒక పెద్ద ఉదాహరణ.

పార్లమెంటు ఎన్నికల విషయమే గమనిస్తే 1951లో 45.7% ఉన్న ఓటింగు, 2019 వచ్చేసరికి 67.4 అయింది. 22% పెరుగుదల తక్కువ విషయమేమీ కాదు. పార్లమెంటు కంటె అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దాని శాతం కనీసం 5% ఎక్కువ ఉంటోంది. దీనికి మరొక కారణం పోలింగు సౌకర్యాలు పెరగడం. గతంలో పోలింగు బూత్ కనుక్కోవడం పెద్ద పనిగా ఉండేది. ప్రభుత్వం వారు విద్యావంతులు, మధ్యతరగతి వారు ఓటేయకుండా చూడడానికి కాబోలు, యింటికి చాలా దూరంగా బూత్‌లు పెట్టేవారు. ఓటరు స్లిప్పులు పంచేవారు కారు. రెండు మూడు చోట్లకు వెళ్లి, విసిగి, యింటికి వెళ్లిపోవాల్సి వచ్చేది. ఇప్పుడు వ్యవస్థను చాలా మెరుగు పరిచారు. ఇంటర్నెట్‌లో వెతుక్కునే సౌకర్యం కల్పించారు. పౌరహక్కుల గురించి అవగాహన బాగా పెరిగింది కూడా. గతంలో ‘మీ ఓటు ఎవరో వేసేశారండీ’ అని చెప్పి వెనక్కి పంపించేస్తూ ఉండేవారు. ఇప్పుడలా అంటే ఏం చేయాలో ఓటరుకి తెలుసు.

ఓటింగు శాతం పెరగడానికి మరో కారణం కూడా ఉంది. చెప్పడానికి బాధగా ఉన్నా, ‌డబ్బు ఒక ప్రధాన కారణమైంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వంటి కొన్ని రాష్ట్రాలలో ఓట్లు అంటే నోట్ల పండగ అయిపోయింది. మా చిన్నపుడు అయితే ఎలక్షన్ అంటే శ్రామిక వాడల్లో మందు పోయించేవారు అనేవారు. ఇప్పుడు హార్డ్ క్యాష్‌తో పనులు జరిపిస్తున్నారు. గతంలో పార్టీ అభిమానులకు యిచ్చేవారు కారు. తటస్థంగా ఉన్నవారిని ఆకట్టుకోవడానికి యిచ్చేవారు. అది కూడా గూడెంలో 100 ఓట్లుంటే ఆ నాయకుడికి ఓటుకి యింత అని యిచ్చేసేవారు. అతను తను ఉంచుకున్నంత ఉంచుకుని, పంచినంత పంచి ఓట్లేయించేవాడు. ఇప్పుడు అలాటి నాయకులతో పని లేదు. ప్రతీ ఓటరూ అడిగి పుచ్చుకుంటున్నాడు. ఒక పార్టీయే కాదు, ఎన్ని రంగంలో ఉంటే అన్నిటి వద్దా డిమాండు చేసి మరీ పుచ్చుకుంటున్నాడు - అంతిమంగా నచ్చినవాడికి ఓటేస్తూనే!

ఇంతమంది దగ్గర వడేసి పుచ్చుకున్నాక, వచ్చి ఓటేయకపోతే డబ్బిచ్చినవాడు ఊరుకుంటాడా? వేలి మీద ఓటు యింకు గుర్తు చూపించాలి కదా! అందుకనే వేరే ఊళ్లో ఉంటున్నా ఆ సమయానికి వచ్చి మరీ వేస్తున్నారు. గతంలో అయితే ఓటు కోసం వెళితే రోజు కూలీ పోతుంది అని లెక్కలు వేసేవారు. వైట్ కాలర్ వాడికైతే సెలవు యిస్తారు. కానీ శ్రామికుడికి కూలీ యిచ్చేవాడెవడు? ఊళ్లో ఉంటే పార్టీలిచ్చే వందా, రెండు వందలు చూసి ఓటేసేవారు కానీ వేరే ఊళ్లో ఉంటే రానుపోను ఖర్చులకే అది సరిపోదు కాబట్టి వెళ్లేవారు కాదు. ఇప్పుడు ఓటు రేట్లు వేలల్లోకి మారాయి. రానుపోను టిక్కెట్లు డబ్బులు పోను యింకా మిగిలే పరిస్థితి. అందుకని ఓటింగు వేళ నగరాలు ఖాళీ చేసి, గ్రామాలకు వెళ్లి ఓటేసి వస్తున్నారు. మొన్న మే 13న హైదరాబాదు దాదాపు ఖాళీ అయింది. తెలంగాణ గ్రామాలకే కాదు, ఆంధ్ర గ్రామాలకు కూడా తరలి వెళ్లారు.

ఆంధ్రలో వైజాగ్‌కి కూడా హైదరాబాదు కళ అబ్బుతోంది. అక్కడా పరాయి ప్రాంతాల నుంచి వచ్చినవారు చాలామంది ఉంటున్నారు. తెలంగాణ మాత్రమే కాదు, ఒడిశా, బెంగాల్, ఉత్తరాది రాష్ట్రాల వారు కూడా ఉంటున్నారు. వాళ్లంతా ఓట్లకై తరలి వెళ్లడంతో ఊరు బోసి పోయిందట. దానికి తోడు మధ్య తరగతి మేధావులూ లావుగా ఉన్నారు. ఈ స్థాయి ఓటింగు జరిగినా, వాళ్లలో కొంతమంది ఓటేసి ఉండరు. విశాఖ నియోజకవర్గంలో 71.1% ఓటింగు దగ్గర ఆగింది. రాష్ట్రవ్యాప్తంగా 82% ఓటింగంటే, పట్టణ వాసులు, మధ్యతరగతి వాళ్లు కూడా యీసారి బయటకు వచ్చి ఓటేశారని అనుకోవచ్చు. కానీ ఏ మేరకు అనే ప్రశ్నకు యింకా సమాధానం దొరకలేదు. లోకసభ నియోజకవర్గాల వారీ ఓటింగు శాతాలు బయటకు వచ్చాయి. కానీ వాటిలో అర్బన్, రూరల్ క్లాసిఫికేషన్‌తో ఫిగర్స్ వచ్చినట్లు లేవు. అర్బన్‌లో అంతా మధ్య, ధనిక తరగతులే ఉంటాయని అనలేము. పేద, శ్రామిక వర్గాలూ ఉంటాయి. అలాగే సెమి-అర్బన్, సెమి-రూరల్, రూరల్ ప్రాంతాలలో కూడా మధ్య తరగతి వాళ్లుంటారు.

ఫలితాలు వచ్చాక ఏ సిఎస్‌డిఎస్-లోకనీతి సర్వే లాటిదో యివన్నీ విడగొట్టి ఓటింగు సరళిని చెప్తుంది. అప్పటిదాకా ఎవరి గెస్ వారిదే! ఈలోగా జనరల్ టాక్ ఏమిటంటే – పట్టణ ప్రజలు కూటమికి, గ్రామీణులు వైసిపికి ఓటేశారని. ఓటింగు ప్రారంభమైన అరగంట నుంచీ  మహిళలు, వృద్ధులు విరగబడి వస్తున్నారని హోరెత్తించేశారు. అప్పణ్నుంచి అదే పదేపదే చెప్పారు. చివరకు పురుషుల కంటె 4.78 లక్షల మంది స్త్రీలు ఎక్కువ మంది ఓటేశారని తేలింది. మొత్తం ఓటర్లు 4.13 కోట్లు. ఈవిఎంల ద్వారా పోలైన పురుషుల ఓట్లు 1.64 కోట్లు, స్త్రీల ఓట్లు 1.69 కోట్లు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్లు 4.97 లక్షలు. వృద్ధులు ఎంతమంది? వారిలో ఎంత శాతం మంది ఓటేశారు? అనే గణాంకాలు కానరాలేదు. క్యూలో నిలబడిన వారిని చూసి చెప్పి ఉంటారు.

ఈ మహిళలు, వృద్ధులు వైసిపిని ఆదరించారా, కూటమిని ఆదరించారా? అనేదే ప్రశ్నార్థకమైంది. ‘మా పథకాల వలన, మేమందించిన వాలంటీరు సేవల వలన లబ్ధి పొంది, అవి కొనసాగాలనే కోరికతో మాకు ఓటేశారు’ అని వైసిపి చెప్పుకుంటోంది. ‘మేం అధికారంలోకి వస్తే పెన్షన్లు పెరుగుతాయి కదాని వృద్ధులు, ఉచిత బస్సు, ఉచిత సిలండర్లు, అమ్మ ఒడి పెంపు, మహిళలకు నెలనెలా భృతి యిత్యాది మా పథకాలను చూసి స్త్రీలు మాకే వేశారు’ అని కూటమి వారు చెప్పుకుంటున్నారు. ఎవరికి వేశారో, ఎందుకోసం వేశారో ఎవరికీ తెలియదు.

2019లో మహిళలు యిలాగే రాత్రి 10 దాకా క్యూలో నిలబడి ఓటేస్తే పసుపు కుంకుమ పథకాన్ని చూసి మురిసి ఓటేశారని టిడిపి వారు చెప్పుకున్నారు. తీరా చూస్తే 23 సీట్లే వచ్చాయి. టిడిపిపై కసితో మహిళలు నిలబడ్డారు అని కొందరు అర్థం తీశారు. అబ్బే అలాక్కాదు, మామూలుగా అయితే టిడిపికి 34% ఓట్లే రావాలి. ఈ పథకం, పెన్షన్ 2 వేలు చేయడం వలన 6% పెరిగి 40% వచ్చింది అని విశ్లేషకుడు కెఎస్ ప్రసాద్ అంటారు. ఇలా చెప్తూ రెండు పథకాలకే 6% పెరిగితే, జగన్ నవరత్నాలకు ఎంత పెరుగుతుందో ఊహించుకోండి అని ముక్తాయిస్తారు.

ఏదీ స్పష్టంగా తెలియని యీ పరిస్థితిని బెట్టింగురాయుళ్లు మరింత గందరగోళ పరుస్తున్నారు. నిరంతరం ఏవో వార్తలు, విశ్లేషణలు వచ్చేట్లు చేస్తూ బెటింగు వ్యాపారాన్ని కాపాడుకుంటున్నారు. దాని కోసం ప్రతి నియోజకవర్గం టఫ్‌గా ఉందనడం, ఫలితం చివరి నిమిషం దాకా చెప్పలేమనడం, పందాలు వేయించడం ఓ పెద్ద మాఫియాగా మారింది. అలాటి సందిగ్ధత సృష్టించకపోతే బెటింగు ఎవడు చేస్తాడు? ప్రతీ ఏటా కోళ్ల మీద కోట్ల కొద్దీ పందాలు వేసే తెలుగువాళ్లు ఐదేళ్లకు వచ్చే యీ సీజన్‌ను వదులుకుంటారా? ఇప్పుడు ఓటింగు జరిగిపోయింది. అయినా పెరిగిన ఓటింగు శాతం ఎవరికి లాభం అనేదానిపై కూడా పందాలు వేస్తున్నారట. హతోస్మి! ఓటింగు యీ స్థాయిలో పెరగడానికి కారణమేమిటి? నాకు అనిపించినది నేను రాస్తున్నాను.

దీన్ని టిడిపి ‘డూ ఆర్ డై బాటిల్’గా చేసిందనేది కనబడుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆంధ్ర ఎన్నికలు అత్యంత కోలాహలంగా జరగడానికి కారణం టిడిపి హైపర్ యాక్టివిటీయే!

దానికి కారణాలు ఏమిటి? ఈ సారి ఎన్నికలలో ఓడినా పార్టీ పరంగా వైసిపికి యిబ్బంది లేదు. జగన్‌కు ఏజ్  ఎడ్వాంటేజి ఉంది. ఓడి, ఎమ్మెల్యేలను పోగొట్టుకుని, మళ్లీ గెలిచిన అనుభవం ఉంది. ఇప్పుడు 60, 65 ఎమ్మెల్యేలతో మిగిలినా ఓపిక కూడదీసుకుని, 2029 నాటికి మళ్లీ పోరాడగల సత్తా ఉంది. టిడిపికి ఆ ఛాన్సు లేదు, బాబు వయసు పెరుగుతోంది. 2029 నాటికి 79 సం.ల వయసు వస్తుంది. ద్వితీయ శ్రేణి నాయకత్వం యిప్పటిదాకా ఎదగలేదు. ముందంతా పాదయాత్రలు చేసి, గుడ్‌విల్ సంపాదించుకున్న లోకేశ్ సరిగ్గా ఎన్నికల నాటికి మంగళగిరికి పరిమితమై పోయారు. టిడిపి పార్టీకి జాతీయ జనరల్ సెక్రటరీ కదా! రాష్ట్రమంతా కాకపోయినా, సగం జిల్లాలైనా తిరగవద్దా? మంగళగిరి గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, అక్కడే సమయం వెచ్చిస్తే ఎలా?

ఇక రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎక్కడ తిరిగారు? ఉత్తరాంధ్రలో అన్ని నియోజకవర్గాలైనా పర్యటించారా? సీనియర్ నాయకుడు గోరంట్ల..?  యనమల..? పయ్యావుల...? ఎవరికి వారు తమతమ నియోజకవర్గాలకే పరిమితమైతే ఎలా? ఎంతసేపు చూసినా వైసిపి తరఫున జగన్, టిడిపి తరఫున బాబు! వీళ్లే చచ్చేట్లా తిరిగారు. గత ఐదేళ్లగా కాదు, బాబు అరెస్టయినప్పుడు కాదు, ఎన్నికల సమయంలో కూడా టిడిపి నాయకులెవరూ చేయవలసినంత చేయలేదు. బాబు ఒక్కరే చెమటోడ్చారు. అలుపెరుగని పోరాటం చేశారు. ఆ చేయడంలో గతానికి భిన్నంగా హుందాతనం మరచి, వ్యాఖ్యలు చేశారని అందరూ ఒప్పుకుని తీరాలి. 40 ఏళ్లగా ఆయన నోట రాని మాటలన్నీ యీసారి వచ్చాయి. ఇవన్నీ ఫ్రస్ట్రేషన్ కారణంగానే, ఓటమి భయంతోనే అనే విమర్శకు తావిచ్చారు. ఇక పోరాటంలో హీ లెఫ్ట్ నో స్టోన్ అన్‌టర్న్‌డ్ అన్నట్లు, ఆయన వాడని ఆయుధం లేదు.

ఈనాడు, జ్యోతి, టివి5 వగైరాలే కాదు, సోషల్ మీడియా సేన మాత్రమే కాదు, యూట్యూబర్స్, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ, జయప్రకాశ్ నారాయణ్.. యిలా ఎంతోమంది ఆయనకు అండగా నిలబడ్డారు. జగన్ సంక్షేమ పథకాలను తూర్పార బట్టిన జెపి గారు టిడిపి మానిఫెస్టో విడుదల తర్వాత కిమ్మనలేదు. అదెలా సాధ్యమో వివరించలేదు. టివి9 రవిప్రకాశ్ ఎక్కణ్నుంచో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. సర్వే అంటే తంటా అని, మా అధ్యయనం (మధ్యమధ్యలో సర్వే అనేస్తూ) అంటూ కూటమి గెలుపు ఖాయం అంటూ అంకెలు యిచ్చేశారు. ఇక ప్రశాంత కిశోర్ ఐతే వండర్ ఆఫ్ ద వండర్స్. ఆంధ్ర పాలిటిక్స్‌ను పట్టించుకోవడం మానేసి ఏళ్లయిందంటాడు, సర్వేలు చేయలేదంటాడు, నేను అక్కడికి వెళ్లేదంటాడు, ఎవర్నీ అడగలేదంటాడు. అంటూనే జగన్ ఘోరంగా ఓడిపోతాడంటూ జోస్యం చెప్పి పరువు పోగొట్టుకున్నాడు.

ఫలానావారు ఓడిపోతున్నాడని గట్టి ప్రచారం చేస్తే బాండ్‌వాగన్ ఎఫెక్ట్‌తో తటస్థులు వ్యతిరేకంగా మారతారనే ప్రయోగం తెలంగాణలో సక్సెసైంది కాబట్టి దాన్నే ఆంధ్రలోనూ రిపీట్ చేయడంలో ఆశ్చర్యం లేదు. కానీ బొత్తిగా నాకేమీ తెలియదంటూ యిలా మిడతం భొట్లు జోస్యం చెపితే ఎలా? సర్వేలు చేయించలేదు, గ్రౌండ్ రియాలిటీ తెలియదు, ఊరికే గెస్ చేస్తున్నా అంటూ నేను తెలంగాణ ఫలితాలను ఊహించిన దానికి, ఆయన చెప్పిన జోస్యానికి తేడా ఏముంది? ఆయన ఒకప్పుడు వ్యూహకర్త అన్నమాట నిజమే. వ్యూహకర్తగా ఉన్నపుడు, తన క్లయింట్ల గురించి కూడా యిలాటి క్లెయిమ్స్ ఎప్పుడూ చేయలేదు. ఫలితాలు వచ్చాక కూడా వినయం చూపించాడు. ఇప్పుడు స్ట్రాటజీ వ్యాపారం వదిలేసి, బిహార్ రాజకీయాల్లో మునిగి తేలుతూ, మరో రాష్ట్రం గురించి చెప్పడానికి తయారైతే ఎలా ఉంటుంది? నేను ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థ గురించి చెప్పినట్లుంటుంది.

ఆయన జోస్యం నిజమైతే కావచ్చు, కానీ చిలక జోస్యానికి మించి దానికి విలువ లేదు. ఆ సందర్భంగా ఆయన ప్రవచించిన సిద్ధాంతాలు మాత్రం అయోమయంగా ఉన్నాయి. బటన్ నొక్కితే ఓట్లు రాలవట! రాలకపోతే 2019లో నవరత్నాలు వైసిపి మేనిఫెస్టోలో ఎందుకు పెట్టించాడట? మోదీ యిప్పటికీ ఉచిత రేషన్ పథకాన్ని కొనసాగిస్తానని ఎందుకు చెప్తున్నాట్ట? కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెసు గెలుపుకి కారణమేమిట? ఇవన్నీ యూస్‌లెస్ అనుకుంటే తను గౌరవించే బాబుకి చెప్పి సూపర్ సిక్స్‌ను మానిఫెస్టోలోంచి తీసేయించ లేకపోయాడా? ఈ అదనపు హామీల వలన ప్రజాధనం మరింత వ్యర్థమౌతుందనే భయంతో మధ్యతరగతి వారు కూటమికి ఓటేయరని చెప్పలేక పోయాడా? ఈ ప్రశాంత్ కిశోర్‌ని తేవడం వలన బాబు డెస్పరేషన్ మరింతగా తెలుస్తోంది.

అన్నిటికన్న ఎక్కువ డెస్పరేషన్ చూపించినది - లాండ్ టైట్లింగ్ చట్టం పై ఆఖరి మూడు, నాలుగు రోజుల్లో చేసిన హడావుడి. జగన్ తన బొమ్మ వేసుకున్నాడు చూశారా, మీ భూములు ఎత్తుకు పోతాడు అని ఉపన్యాసాలు యిచ్చి చట్టం గురించి అపోహలు రేకెత్తిస్తూ ఫుల్ పేజీ యాడ్స్ గుప్పించి ప్రజల్ని భీతావహుల్ని చేయడానికి చూశారు. ఆ చట్టం భేషైనది, రైతుల హక్కులను కాపాడుతుంది అని నీతి ఆయోగ్ యివాళ చెప్తోంది. ఈ ముక్క నాలుగు రోజుల క్రితం ఎందుకు చెప్పలేదు? అని ఎవరైనా అడిగితే ‘మరి ఎన్ని విధాలగానో రాజీ పడి బిజెపితో పొత్తు పెట్టుకున్నదెందుకు?’ అని జవాబొస్తుంది.

టిడిపి తరఫున సాలిడ్‌గా నిలబడిన వారిలో అమరావతి పెట్టుబడి దారులున్నారు. బాహుబలి సెట్టింగులా అమరావతిని కట్టలేమని బాబుకీ తెలుసు, వాళ్లకీ తెలుసు. కానీ అలా కడతారని చెప్పి కొందరికి ప్లాట్లు అమ్మేశారు. కొన్ని తమ వద్ద ఉంచుకున్నారు. వాటిని వదుల్చుకోవాలంటే మళ్లీ మహానగరం ఆశలు చూపించాలి. బాబు తిరిగి వస్తేనే అది సాధ్యం. బాబు అధికారంలోకి రాగానే తక్కిన హామీల మాట ఎలా ఉన్నా అమరావతి పునర్నిర్మాణం అంటూ కొంత హంగు చేయకమానరు. వెంటనే వీళ్లంతా విండో డ్రెసింగ్ చేసేసి తమ స్థలాలు అమ్మేసుకోవచ్చు. దాని కోసమైనా బాబుని అధికారంలోకి తేవడానికై ఎంతైనా వెచ్చించడానికి రెడీగా ఉన్నారు. బాబు ఎలాగూ అధికారంలోకి వస్తారని ఐదేళ్లగా తెలుగు మీడియా కోడై కూస్తోంది కాబట్టి వారు ఒకవేళ తేలిగ్గా తీసుకుని ఉన్నా, జగన్ సిద్ధం సభల తర్వాత వారికి దడ పుట్టి ఉంటుంది.

విదేశాల నుంచి చాలా మంది డబ్బు మూటలతో, సకల సన్నాహాలతో వచ్చి పడ్డారని కోమటి జయరాం వీడియో చెప్పింది. ఆయన చెప్పినట్లు నచ్చిన పార్టీకై ఖర్చు పెట్టడం ఆయన హక్కు. కానీ అది ప్రత్యర్థులను ఎలర్ట్ చేసింది. సాదాసీదాగా వదిలేస్తే లాభం లేదు. మనమూ ఏదో ఒకటి చేయాలి అనుకుని ఉంటారు వాళ్లు. ఎప్పుడైనా సరే ఒక కులం కానీ ఒక ప్రాంతం కానీ డామినేట్ చేయబోతే తక్కిన వారంతా పరస్పర భేదాలు మరిచి ఒక్కటవుతారు.  కురుక్షేత్ర సంగ్రామ సన్నాహంలో కురుపాండవులు తమతమ పక్షాన సైన్యసమీకరణ చేసినట్లు ఆంధ్రలో యిరు పక్షాలూ తమ అభిమానులను సన్నద్ధం చేశాయి. ఇద్దరూ చెరోవైపు మోహరించారు కాబట్టే యింత భారీ ఎత్తున ఓటింగు జరిగింది. హైదరాబాదు నుంచి కానీ విదేశాల నుంచి కానీ వెళ్లినవారందరూ ఏదో ఒక పార్టీ అభిమానులని ఎవరూ కచ్చితంగా చెప్పలేరు.  

చాప కింద నీరులా ప్రచారం చేస్తే ఎలా ఉండేదో కానీ టిడిపి వారు తప్పెట్లు తాళాలతో పోరాటం ప్రారంభించారు. దాంతో వైసిపి అభిమానులూ అలర్ట్ అయి తీవ్రంగా పోరాడారు. ఈ కారణంగా అందరూ బయటకు వచ్చి తమ అభిప్రాయాన్ని తెలిపారు. అదీ సంతోషకరమైన విషయం. గతంలో నాటకాల్లో ఓ డైలాగు ఉంటూ ఉండేది. ఎవరైనా ఎమ్మెల్యే ‘నేను ప్రజాప్రతినిథిని’ అని చెప్పుకుంటే వెంటనే అవతలివాడు ‘నూటికి 50 మంది ఓటేయరు, వారిలో 50% మంది నీకు వేయలేదు. 25% ఓట్లతో నువ్వు ప్రాతినిథ్యం వహిస్తున్నది ఎంతమందిని?’ అని. ఇప్పుడలా అనడానికి లేదు. నూటికి 82% మంది ఓటేశారు. ఇరుపక్షాలూ గట్టిగా పోటీ పడ్డాయి కాబట్టి, ఒకరి వైపే వేవ్ ఉందని అనలేము. రెండూ ఒకదాన్ని మరొకటి తగ్గించి, విజేతకు 100 -110 సీట్లకు మించి రాకపోవచ్చని ఐవైఆర్ అన్నారు. మరి జగన్ తమకు 151కి మించి వస్తాయన్నాడేం? అని కింద వ్యాఖ్యలు పెట్టకండి. లీడర్లంటే అలాగే ఉంటారు. 2019లో యిలాటి సమయంలో బాబు 110-130 వస్తాయన్నారు. ఎన్ని వచ్చాయో చూశాం.

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2024)

mbsprasad@gmail.com

Show comments

Related Stories :