ఎమ్బీయస్‍: గెస్ చేస్తారా?

ఓటింగు అయ్యాక ఫలితాల గురించి చెప్పడమనేది స్టికింగ్ ఔట్ ద నెక్ లాటిదే! ఎన్నికలకు ముందు అన్ని వస్తాయి, యిన్ని వస్తాయని నాయకులు చెపితే తమ క్యాడర్‌కు హుషారు కలిగించడానికో, ఓటర్లకు ధీమా కల్గించి ఫేవరబుల్ మూడ్ క్రియేట్ చేయడానికో అనుకోవచ్చు. ఫలితాలు ఇవిఎంలలో భద్రంగా ఉన్న సమయంలో అంకెలు చెప్పడం దేనికి? కానీ జగన్ ఆ పని చేశాడు. చెప్పి బావుకున్నదేమిటి? తనకు ఓటేయనివాడు ‘అరెరే, గెలిచే పార్టీకే వేద్దాం’ అనుకుని వెనక్కి వెళ్లి ఇవిఎంలో అన్‌డూ బటన్ నొక్కి మళ్లీ వేయలేడు కదా! ఎందుకలా చెప్పి ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటే ఎవరో చెప్పారు - కూటమి తరఫున కొందరు సీనియర్ ఆఫీసర్లు ‘మేమే అధికారంలోకి వస్తున్నాం, జాగ్రత్త, మేం చెప్పినట్లు యిప్పణ్నుంచి వినండి’ అంటూ శాసిస్తున్నారు. వైసిపికి వ్యతిరేకంగా, టిడిపికి ప్రయోజనకరంగా పనులు చేయించడానికి చూస్తున్నారు. దాన్ని ఆపడానికై, మేమే వస్తున్నాం జాగ్రత్త అని చెప్పడానికి జగన్ యీ స్టేటుమెంటు యిచ్చాడు – అని.

అదే నిజమైతే మాదే అధికారం అని చెప్పి ఊరుకోవచ్చు కదా. ఉత్తర కుమారుడి స్టయిల్లో అంత ఫేంటాస్టిక్ క్లెయిమ్ చేయడం దేనికి? గతంలో ప్రశాంత్ కిశోర్ ఊహకు కూడా అందనంతగా 151 వచ్చాయని జగనే చెప్పాడు. అంటే రీజనబుల్‌గా ఏ 120-130 వచ్చి ఉండాల్సింది. వెల్లువ రావడంతో పై 20-30 వచ్చాయనుకోవాలి. ఐదేళ్ల పాలన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత పోగుపడి వెల్లువ పోయిందనుకుంటే 120 రావాలి. కనీసం 50 చోట్ల స్థానిక ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉందని జగనే అభిప్రాయ పడ్డాడు కాబట్టి, 100 రావాలి. ఇంకా తక్కువ వస్తే రావచ్చు కానీ పార్టీ అధ్యక్షుడు అలా చెప్పుకోడుగా. అందుకని సేఫ్‌గా మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అనేసి ఊరుకోవచ్చు. 88 వచ్చినా చాలు, అధికారంలోకి వచ్చేసినట్లే!

కానీ జగన్ ఎందుకోగానీ గతంలో కంటె ఎక్కువ.. అన్నాడు. 2014లో కంటె ఎక్కువ అనే అర్థంలో అన్నాడేమో అనే సందేహం రాకుండా 151-22 అంకెలు కూడా చెప్పాడు. 2019 ఫలితాలకు ముందు బాబు 110-130 అంకెలు చెప్పి భంగపడిన ఉదాహరణ కళ్ల ఎదురుగా ఉండగా తనూ ఆ రిస్కు తీసుకోవడం దేనికి? దీనికి జవాబుగా వెంటనే బాబు ఆ అంకెలు మావి, మీవి కాదు అంటూ స్టేటుమెంటు యిస్తారేమో అనుకున్నా. కానీ ఆయన హుందాగా ఊరుకున్నారు. దేవినేని ఉమా 40 మంది వైసిపి మంత్రులు ఓడిపోతారని క్లెయిమ్ చేశారు తప్ప మాకు యిన్ని సీట్లు అనలేదు. ఆత్మసాక్షి స్టడీ (సర్వే అంటే ప్రమాదమని కాబోలు) అంటూ ఒకటి వైసిపికి అనుకూలంగా వచ్చింది. ఇంకా కొంతమంది వీడియోలు చేశారు. టిడిపికి అనుకూలంగా అంకెలు చెప్తూ ఎవరూ చేసినట్లు లేదు.

ఎందుకీ మౌనం అని ప్రశ్నిస్తూ కొందరు విశ్లేషకులు వీడియోలు చేస్తున్నారు. ఫలితాలు గెస్ చేయడం ఎవరి తరం కాదని తెలంగాణలో కెటియార్ మొన్ననే నిరూపించాడు. ఎగ్జిట్ పోల్స్ వచ్చాక కూడా అవి తప్పయితే వాళ్లకేం శిక్ష వేయాలి అంటూ మాట్లాడాడు. ఫలితాలు వెలువడ్డాక తనే మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక యిబ్బంది పడ్డాడు. క్యాడర్ నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా యివన్నీ చేయవలసిన అగత్యం నాయకులకు ఉంది. సామాన్యులకు లేదు. ఎలా కావాలంటే అలా ఊహించవచ్చు. రైటైతే భుజాలు చరుచుకోవచ్చు. తప్పయితే తేలిగ్గా నాలిక కరుచుకోవచ్చు. Readmore!

నేను ఆంధ్రలో రాజకీయ పరిస్థితి గురించి ఎప్పుడు రాసినా, ఛాలెంజ్‌లు ఎదుర్కోవలసి వస్తుంది. చూడండి యీసారి జగన్‌ ఎంత ఘోరంగా ఓడిపోతాడో, 2019లో టిడిపికి వచ్చినన్ని సీట్లు కూడా రావు, రాసి పెట్టుకోండి అంటూ వ్యాఖ్యల ద్వారా, నా పర్శనల్ యీ మెయిల్‌కి రాయడం ద్వారా సవాళ్లు విసురుతారు. మరి కొంతమంది 2024తో చంద్రబాబు పని ఫినిష్. జగన్ గతంలో కంటె ఎక్కువ సీట్లు తెచ్చుకుంటాడు చూడండి, యీ మెయిల్ భద్రపరచండి. ఫలితాలు వచ్చాక మళ్లీ మెయిల్ పంపుతాను అంటూ రాస్తారు. నేను ఎక్కడా ఏదీ రాసి పెట్టుకోలేదు, మెయిల్స్ భద్రపరచి ఉంచనూ లేదు. ఫలితాలు వచ్చాక అప్పుడే చూద్దాం లెండి అని జవాబిచ్చేసి, మెయిల్స్ డిలీట్ చేసేశాను.

ఫలితాల ప్రిడిక్షన్ అనేది చాలా రిస్కుతో కూడిన వ్యవహారం. అందుకే అది అంత పెద్ద వ్యాపారం అయిపోయింది. సర్వేలు, ఎన్నికల స్ట్రాటజీలు అంటూ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారంటేనే తెలుస్తుంది అది ఎంత క్లిష్టమైన కార్యమో! అయినా కొంతమంది పాఠకులు నాకు సలహాలిచ్చేస్తూ ఉంటారు – మీరు యింట్లోంచి గడప దాటి టీస్టాల్ దగ్గర అరగంట కూర్చుంటే చాలు, జనం నాడి తెలిసిపోతుంది. అలా తెలుసుకుని, యిలా చులాగ్గా రాసేయవచ్చు అని. అది నాకు చేతకాని పని అని చాలా సార్లు చెప్పుకున్నాను. ఎన్నికఎన్నికకు కొత్తకొత్త కోణాలు వచ్చి చేరుతున్నాయి. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిలో పెట్టి, డెలిబరేట్‌గా ప్రజాభిప్రాయాన్ని మోల్డ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలిసినవాడు, తెలియనివాడు అందరూ యూట్యూబుల్లో ఏమేమో చెప్పేస్తున్నారు. క్లిక్స్ కోసం వాటికి వింతవింత థంబ్‌నెయిల్స్ పెడుతున్నారు. మొత్తం మీద మసి పూసి మారేడుకాయ చేస్తున్నారు. అది ఒరిజినల్‌గా ఏ కాయో కనుక్కోవడానికి బ్రహ్మ దిగి రావాలి.

డబ్బు ప్రభావం విపరీతంగా ఉంది. ఫలానా పార్టీ ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టింది కాబట్టి... అని ఓ నిర్ణయానికి రాకూడదు. ఆ నియోజకవర్గంలో, ఆ ఊరిలో పంపిణీ ఎలా జరిగిందో చూడాలి. అభ్యర్థి తన చేతికి వచ్చినదాన్ని ఓటర్లకు పంపాడా లేదా? అభ్యర్థి యిచ్చినది అతని అనుచరులు ఓటర్లకు పంచారా? ఏ మేరకు నొక్కేశారు? డబ్బు ముట్టినా ఓటరు దగా చేశాడా? వంటివి తెలియాలి. ఓటింగు ముందు మూడ్ వేరు. ఓటేసే నాటికి మూడ్ మారవచ్చు. ఇలా అనేక ఫ్యాక్టర్లు లెక్కలోకి తీసుకుంటే తప్ప రిజల్టు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. అయినా కొంతమంది పాఠకులు ఛాలెంజ్‌లు విసిరేస్తూ ఉంటారు. వారు ఎన్ని సీట్లు వస్తాయని చెప్పారో ఎక్కడా రికార్డు ఉండదు కాబట్టి, ఫలితాల తర్వాత ‘మేం చెప్పినట్లే జరిగింది’ అని క్లెయిమ్ చేసే అవకాశం ఉంది. వెనక్కి వెళ్లి చెక్ చేసే వీలు తక్కినవారికి ఉండదు.

అందుకని వారికై యీ స్పేస్ కేటాయిస్తున్నాను. ఈ వ్యాసం కింద కామెంట్స్ బాక్స్‌లలో మీరు గెస్ చేసినది నమోదు చేయండి. ఫలితాలు వచ్చాక మీ గెస్ ఎంతవరకు కరక్టయిందో తక్కిన పాఠకులకూ తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో తిరిగి మీరు ఊహించారో, లేక నాలా పేపర్లు చదివి ఊహించారో తక్కినవారికి అనవసరం. మీది కరక్టయిందా లేదా అనేదే చూస్తారు. ఇప్పుడు పోస్టు చేసి ఫలితాలు వచ్చాక దాన్ని ఎడిట్ చేయడమో, డిలీట్ చేయడమో చేయరని ఆశిస్తాను. ఎడిట్ చేశారంటే పక్కన ఎడిటెడ్ అని వచ్చేస్తుందిగా, ఏదో హేరాఫేరీ జరిగిందని తక్కినవారికి అనుమానం వచ్చేస్తుంది జాగ్రత్త. ఫలితాలకు ముందే ఎడిట్ చేశారా, తర్వాత చేశారా అన్నది తెలియదు. అందువలన ఎడిటింగు అవసరం లేకుండా, ముందే జాగ్రత్తగా ఆలోచించి పోస్టు పెట్టండి.

కామెంట్స్ సెక్షన్‌లో తక్కిన విషయాలేవీ రాయకండి. జస్ట్ యివి చాలు – 1) వైసిపి ఓటు %, 2) వైసిపికి వచ్చే అసెంబ్లీ సీట్లు 3) కూటమికి వచ్చే ఓటు % 4) కూటమికి వచ్చే అసెంబ్లీ సీట్లు (టిడిపికి వచ్చేవి + జనసేనకి వచ్చేవి + బిజెపికి వచ్చేవి) 5) జాతీయ స్థాయిలో బిజెపికి (ఎన్‌డిఏకు కాదు) వచ్చే పార్లమెంటు సీట్ల సంఖ్య. 1), 2), 3) అని వేసి పక్కన మీ అంకెలు యిచ్చేయండి. నా ఊహకు కారణమేమిటంటే అంటూ వివరణలు రాయవద్దు. అనవసరం. ఫలితాలు వచ్చాక వివిధ విశ్లేషణలు, సర్వేలు చదివి, క్రోడీకరించి నేనెలాగూ రాస్తాను - గతజల సేతుబంధనంలా, అయిపోయిన పెళ్లికి బాజాల్లా! అది నాకూ, కొంతమందికీ ముచ్చట, చాలా మందికి సొద.  

ఇంతవరకు రాసి, ఓ జర్నలిస్టు మిత్రుడికి చూపించి ఎలా ఉంది? అని అడిగాను. గెస్ చేయడం ఎంత కష్టమో పైన రాసి, మీరు పాఠకులకు విషమ పరీక్ష పెడితే ఎలా? కూటమి సభ్యులకు విడివిడిగా ఎన్ని వస్తాయో చెప్పమనే బదులు ఒక కన్సాలిడేటెడ్ అంకె చెప్పమనండి చాలు. విడివిడిగా చెప్పాలంటే నియోజకవర్గాల వారీగా లెక్కలు వేయాలి. ఎంతమంది దగ్గర అంత డేటా ఉంటుంది? అన్నాడు. ఏదో ఒక మొద్దు అంకె చెప్పమంటే మహేష్‌బాబు రౌండింగ్ ఆఫ్‌ స్టయిల్లో 100 అనో, అష్టోత్తరం అని 108 అనో, తెలుగువారి ఫేవరేట్ ఫిగర్ అని 116 అనో, గుర్తుంచుకోవడానికి వీలు అని 123 అనో చెప్పవచ్చు. శాస్త్రీయంగా లెక్కలు వేసి చెప్పకపోవచ్చు. ఎంత గెస్సింగ్ అయినా ఒక పద్ధతి ఉండాలి కదా! అన్నాను. అతను భుజాలు ఎగరేశాడు. మీరైతే ఏం చేస్తారు చెప్పండి అని అడిగాను. అతనో సూత్రం చెప్పాడు.

‘రాష్ట్రమంతా ఒకేలా ఉండదు. జిల్లాల ప్రకారం లెక్క వేసుకుంటూ వెళ్లడమన్నా, పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ వెళ్లడమన్నా కష్టమైన పని. అందుకని ప్రాంతాలుగా విడగొట్టి చూసి, అక్కడ ఎవరికి బలముందని మనం అనుకుంటున్నామో చూసుకుని, ఆ ప్రకారం లెక్కలేసుకుంటూ వెళ్లాలి. 1) రాయలసీమ 52 సీట్లు (చిత్తూరు 14, కడప 10, కర్నూలు 14, అనంతపురం 14). దీనిలో కూటమి 2014లో 42%, 2019లో 6% సీట్లు గెలిచింది. ఇప్పుడు బలం పుంజుకుని 20% గెలుస్తుంది అని నా అంచనా. మీది వేరేలా ఉండవచ్చు. 52లో 20% అంటే 10 సీట్లు అక్కడ వస్తాయని నా లెక్క. ఇక 2) దక్షిణ కోస్తా 55 సీట్లు (నెల్లూరు 10, ప్రకాశం 12, గుంటూరు 17, కృష్ణా 16). ఇక్కడ కూటమి 2014లో 54%, 2019లో 15% సీట్లు గెలిచింది. ఇప్పుడు బలం పుంజుకుని 50% గెలుస్తుంది అని నా అంచనా. అంటే 28 సీట్లు.

3) కోస్తా 49 సీట్లు (విశాఖ 15, తూగో 19, పగో 15). ఇక్కడ కూటమి 2014లో 75%, 2019లో 22% సీట్లు గెలిచింది. ఇప్పుడు బలం పుంజుకుని 65% గెలుస్తుంది అని నా అంచనా. అంటే 32 సీట్లు. 4) ఉత్తర కోస్తా 19 సీట్లు (శ్రీకాకుళం 10, విజయనగరం 9). ఇక్కడ కూటమి 2014లో 68%, 2019లో 10% సీట్లు గెలిచింది. ఇప్పుడు బలం పుంజుకుని 30% గెలుస్తుంది అని నా అంచనా. అంటే 6 సీట్లు. మొత్తం మీద చూస్తే 1) 10+2) 28+3) 32+4) 6=76 సీట్లు కూటమికి వస్తాయని నా అంచనా.’ అని చెప్పాడు. మరి పార్టీల ఓట్ల శాతమో అంటే అది కరక్టుగా చెప్పలేం అన్నాడు.

అంచనాలు వేయడానికి ఒక ఫార్ములా దొరికింది కదాని దాన్ని మీకందిస్తున్నాను. ఆ అంకెలు కరక్టని నేనేమీ సర్టిఫై చేయటం లేదు. మీ ఊహ బట్టి మీరు శాతాలు మారుస్తూ ఏదో ఒక అంకె వద్ద తేలవచ్చు. కూటమి పార్టీల సంఖ్య విడివిడిగా యివ్వలేక పోతే మొత్తం అంకె ఐనా యివ్వండి. ఓట్ల శాతం చెప్పలేక పోతే అదీ బ్లాంక్ పెట్టేయండి. దీన్ని ఒక ఆటగానే పరిగణించండి. దీన్ని బట్టి ఎవరూ బెట్టింగులు చేయరు. ఎందుకంటే ప్రొఫెషనల్స్ ఎవరూ దీనిలో పాలు పంచుకోరు. ఫలితాల అనంతరం ఒకరి నొకరు మెచ్చుకోవడానికో, ఎద్దేవా చేయడానికో పనికి వస్తాయంతే! నాకు రెండూ వద్దు కాబట్టి నేను ఏ అంకె చెప్పటం లేదు. వన్స్ బిటెన్ ట్వైస్ షై అనే ఇంగ్లీషు సామెత వినే వుంటారు. తెలంగాణ గెస్ తర్వాత నా పరిస్థితి అదే!

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2024)

mbsprasad@gmail.com

Show comments

Related Stories :