Gangs of Godavari Review: మూవీ రివ్యూ: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

చిత్రం: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
రేటింగ్: 2/5
తారాగణం:
విశ్వక్ సేన్, అంజలి, నేహా సెట్టి, నాజర్, గోపరాజు రమణ, హైపర్ ఆది, ప్రవీణ్, మయాంక్ పారక్, అయేషా ఖాన్ తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా
కెమెరా: అనిత్ 
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: గాంధి నడికుడికర్
యాక్షన్: రామ్‌- లక్ష్మణ్
నిర్మాతలు: నాగ వంశీ, సాయిసౌజన్య
దర్శకత్వం: కృష్ణ చైతన్య
విడుదల: 31 మే, 2024

విశ్వక్ సేన్ ఉన్నంతలో వెరైటీ సినిమాలు చేస్తాడని ఒక అభిప్రాయం. ఈ మధ్యనే "గామి" అనే విభిన్నమైన చిత్రంలో నటించి ఒక వర్గాన్ని మెప్పించాడు. ఇప్పుడు పీరియడ్ బ్యాక్డ్రాపులో గోదావరి నేపథ్యంతో ముందుకొచ్చాడు. 

కథలోకి వెళ్తే ఇది 1990ల నేపథ్యం. లంకల రత్నాకర్ (విశ్వక్ సేన్) చిరుదొంగతనాలు చేసుకుంటూ బతికే ఒక తాడూబొంగరం లేని వ్యక్తి. అతనికి రత్నమాల (అంజ్లి) అనే వేశ్యతో అఫైర్. కానీ బుజ్జి (నేహా శెట్టి)తో ప్రేమలో పడతాడు. ఆమె ఆ ప్రాంతపు పెద్ద మోతుబరి అయిన నానాజి (నాజర్) కూతురు. 

అదే ఊళ్లో దొరస్వామి రాజు (గోపరాజు రమణ) అనే ఎమ్మెల్యే ఉంటాడు. అతనికి, నానాజికి మధ్య డ్రామా నడిపి తానే ఎమ్మెల్యే అయిపోతాడు రత్నాకర్.  Readmore!

ఆ తర్వాత దొరస్వామి రాజు కొడుకు సీన్లోకి ఎంటరయ్యి రత్నాకర్ కి ఎటువంటి ఇబ్బందులు కలుగజేస్తాడు? రత్నాకర్ వాటిని ఎలా ఎదుర్కుంటాడు అనేది కథ. 

ఏ సినిమా అయినా మొదలవడంతోనే ఆసక్తిని రేకిత్తించాలి. కథ మొదలైన వెంటనే ఒక సారి విశ్వక్ సేన్ కనిపిస్తాడు. కానీ అదేంటో ఆ తర్వాత సీన్లో మాస్ హీరో ఇంట్రడక్షన్ సీన్ టైపులో రివీల్ అయినట్టు చూపించారు. ఇక అక్కడి నుంచి సీన్లు కదులుతూ ఉంటాయి తెర మీద. అరగంటైనా గాడిలో పడదు. ఆ తర్వాతైనా పడుతుందేమో అనుకుంటే పడుతూ లేస్తూ ఇంటర్వల్ పడింది. 

ద్వితీయార్థమైనా అర్ధవంతమైన ఎమోషన్ పలికిస్తూ ఈ సినిమాకెందుకొచ్చామా అనే ప్రశ్నకి అర్ధం చెబుతుందనుకుంటే, పావుగంటకొకసారి టైం చూసుకునేలా చేసింది. 

కథనం దాదాపు ప్రెడిక్టబుల్ గా సాగుతుంది. ప్రెడిక్ట్ చేయని చోట అద్భుతమనిపించేలా ఏదీ లేదు. 

నటీనటుల్లో విశ్వక్ సేన్ మొరటు మాస్ హీరో పాత్రలో ఒప్పించాడు తప్ప, మెప్పించలేదు. గోదావరి డిక్షన్ పరంగా మరింత కృషి చేసుంటే కనీసం తన వరకు అయినా మార్కులు పడేవి. 

నేహాశెట్టి పాత్రకి పర్ఫార్మ్ చేసే స్కోప్ ఉన్నా, పర్ఫార్మ్ చేసినట్టు అనిపించినా, కథనంలో పట్టు లేక ఆమె పనితనం గుండెల్ని తాకదు. 

అంజలి ఉన్నంతలో ఆకట్టుకుంది. కానీ ఆమె క్యారెక్టర్ కి కూడా కావాల్సినంత డెప్త్ ఇవ్వలేదు. 

హైపర్ ఆది పంచులు అక్కడక్కడ బాగున్నాయి. అవొక్కటే ఎడారిలాంటి ఈ సినిమాలో నాలుగు చుక్కల ఒయాసిస్సు. 

గోపరాజు రమణ మంచి ట్యాలెంట్ ఉన్న నటుడు. ఆయనైనా గోదావరి యాసని సహజంగా పలుకుతాడనుకుంటే పలకలేదు. అదొక్కటీ మినహాయిస్తే ఈయన బాగా చేసినట్టే. 

నాజర్ జస్ట్ ఓకే. కొత్తగా చేసిందేమీ లేదు. గొదావరి యాస సహజంగా పలకగల శ్రీనివాస్ వడ్లమానిని చిన్న పాత్రతొ సరిపెట్టారు. మిగిలిన వాళ్లంతా యాంబియన్స్ కి సరిపోయారు. 

టెక్నికల్ గా చూసుకుంటే యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తుంది తప్ప పెద్ద గ్రిప్పింగ్ గా లేదు. పాటల్లో "అద్దాల ఓణిలా.." ఒక్కటే బాగుంది. ఐటం సాంగ్ చాలా వీక్ గా ఉంది. మిగిలిన సిచువేషన్ సాంగ్స్ కూడా నీరసంగా ఉన్నాయి తప్ప ఉత్సాహాన్నివ్వలేదు.

కెమెరా వర్క్ బాగుంది. ఎడిటర్ కాస్త పట్టుపట్టైనా ఒకటి రెండు పాటలు లేపేసి ఉంటే బాగుండేది. 

విశ్వక్ సేన్ సినిమాలకంటూ ఇంకా ఒక వేల్యూ ఉంది. దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. తన పైనున్న హీరోల సినిమాల మాదిరిగా ఏదో చేసేయాలనుకోవడం, మాస్ మసలా పేరుతో రొటీన్ రొట్టకొట్టుడు సినిమాలు చేస్తూ కూర్చుంటే మరుగున పడడానికి ఎంతో సమయం పట్టదు. 

కాస్తంత "ఎం ధర్మరాజు ఎమ్మే" ని తెచ్చుకుని, గుప్పెడు "నేనే రాజు నేనే మంత్రి" దానిపై జల్లి, చెంచాడు "రాయలసీమ రామన్న చౌదరి", చిటికెడు "రంగస్థలం", చారెడు "పుష్ప" కలిపి వండేస్తే బాక్సాఫీసు బద్దలేసిపోతుందని రాసుకున్న కథలా అనిపిస్తుందిది. అయినా పర్వాలేదు. నాలుగైదు సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కొత్తగా కథ చెప్పొచ్చు. కానీ చెప్పాల్సింది కళ్లకి, చెవులకి మాత్రమే కాదు... మనసుకి, మెదడుకి కూడా! 

ఈ సినిమాలో కంటి ముందు కథ కదులుతూ ఉంటుంది, చెవులకి మాటలు వినిపిస్తూ ఉంటాయి. కానీ మెదడుని కదిలించదు, మనసుని తాకదు. తెర మీద ఎవడు చస్తున్నా ప్రేక్షకుడికి చలనం ఉండదు, ఎవరు ఏడుస్తున్నా అయ్యో అనిపించదు. గోదావరి నేపథ్యంలో సినిమా అని పేరుకే తప్ప అసలా యాస వినిపించదు. 

"రంగస్థలం" సినిమాలో పాత్రలన్నీ గోదావరి యాసలోనే మాట్లాడతాయి. హీరో నుంచి విలన్ వరకు, క్యారెక్టర్ ఆర్టిష్టుల నుంచి జూనియర్ ఆర్టిష్టుల వరకు అందరూ వర్క్ షాపులో కష్టపడి ఆ యాస మీద పట్టు సాధించి నటించారేమో అనిపిస్తుంది. అందరు నటీనటులకీ గోదావరి నేపథ్యం ఉండదు. కానీ ఆ నేపథ్యంలో నటించినప్పుడు ఆ యాస నేర్చుకోవడం మీద కృషి ఉండాలి. ఇక్కడ అంజలి, వడ్లమాని శ్రీనివాస్ గోదావరి ప్రాంతం వాళ్లు. వాళ్ల డైలాగ్స్ సహజంగా ఉన్నాయి. అసలైన ప్రధాన పాత్రధారి విశ్వక్ సేన్ తెలంగాణ నటుడు అక్కడక్కడ గోదావరి యాసని అనుకరించినట్టు ఉంది కానీ సహజంగా లేదు. 

రామ్ చరణ్ రంగస్థలంలో గోదావరి యాస మాట్లాడినట్టు, అల్లు అర్జున్ పుష్పలో చిత్తూరు యాస పలికినట్టు ఇక్కడ విశ్వక్ సేన్ నేటివిటీని పలికించలేకపోయాడు. నటుడిగా ఈ విషయంలో ఫెయిలయ్యాడు. తనకు వచ్చిందే చేస్తా, కొత్తగా ఏదీ నేర్చుకోను.. అనే తరహా హీరోలకి ఎండ్ కార్డ్ వేయడానికి రెడీగా ఉంటారు ప్రేక్షకులు.. కనుక జాగ్రత్త వహించాలి. 

ఈ సినిమాకి దర్శకత్వమే ప్రధాన లోపం. ప్రేక్షకుల మనసుల్ని కట్టిపారేసే హోం వర్క్ చెయలేదు. దాని ఫలితమే ఎంగేజ్ చేయలేని పరిస్థితి. వెబ్ సిరీస్ కోసం రాసుకున్న టీవీ సీరియల్ లాంటి సుదీర్ఘమైన కథని రెండున్నర గంటలకి కుదించి తీసినట్టుగా అనిపిస్తుంది ఈ చిత్రం. కానీ రెండున్నర గంటలే థియేటర్లో నాలుగు గంటల్లా గడిచాయంటే ఇక వెబ్ సిరీస్ అయితే ఎలా ఉండేదో. ఏది ఏమైనా ట్రైలర్ చూసో, పబ్లిసిటీ గమనించో, నెట్ ఫ్లిక్స్ కొన్న సినిమా అనో ఎక్కువ ఊహించుకుని వెళ్తే నిరాశ మిగులుతుంది. ఏమీ ఊహించుకోకుండా వెళ్లినా నీరసమైతే వస్తుంది.

బాటం లైన్: గోదావరిలో మునిగింది

Show comments

Related Stories :