Raju Yadav Review: మూవీ రివ్యూ: రాజు యాదవ్

చిత్రం: రాజు యాదవ్
రేటింగ్: 1.5/5
తారాగణం:
గెటప్ శ్రీను, అంకిత, ఆర్జె హేమంత్, రాకెట్ రాఘవ, ఆనంద చక్రపాణి తదితరులు
సంగీతం: హర్షవర్ధం రామేశ్వర్
కెమెరా: సాయిరాం ఉదయ్
ఎడిటింగ్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
నిర్మాత: ప్రశాంత్ రెడ్డి
దర్శకత్వం: కృష్ణమాచారి
విడుదల: 24 మే 2024

కామెడీ నటులు హీరోలుగా నటించడం కొత్తేమీ కాదు. ఎవరి అదృష్టాన్ని వాళ్లు పరిశీలించుకుంటూ ఆ ప్రయత్నాలు దశాబ్దాలుగా చేస్తూనే ఉన్నారు. గెటప్ శ్రీను హీరోగా సినిమా అనగానే జబర్దస్త్ చూసే ప్రేక్షకులకి ఆసక్తి కలగడం సహజం. ఆ ఆసక్తిని ఈ చిత్రం ఏ మేరకు నిలబెట్టిందో చూద్దాం.

ఈ కథ 2019లో మహబూబ్ నగర్ నేపథ్యంలో మొదలవుతుంది. రాజు యాదవ్ (గెటప్ శ్రీను) కి క్రికెట్ బాల్ మొహానికి తగిలి ఆపరేషన్ అవుతుంది. కానీ అది ఫెయిల్ అవడంతో అతని మొహం ఎప్పుడూ నవ్వుతున్నట్టే కనిపిస్తుంది. ఒక రోజు స్వీటి (అంకిత ఖారత్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు రాజు. ఆమె తొలుత ఇతని మొహాన్ని చూసి అపార్థం చేసుకుని గొడవపెట్టినా అసలు విషయం తెలిసాక అర్ధం చేసుకుని పరిచయాన్ని కొనసాగిస్తుంది. 

అయితే ఆమెకి హైదరాబాదులో జాబ్ రావడంతో వెళ్లిపోతుంది. రాజు కూడా ఆమెను చూడకుండా ఉండలేక హైదరాబాద్ వెళ్లి క్యాబ్ డ్రైవరవుతాడు. ఆ తర్వాత ఆమె అతనికి కొన్ని షాకులిస్తుంది. ఆ షాకులకి ఇతగాడి స్పందన ఎలా ఉంటుంది అనేదే కథ.  Readmore!

కథగా చెప్పుకోవడానికి ఏమీ కొత్తదనం లేని సినిమా ఇది. కేవలం సినిమా మొత్తం పళ్లికిలిస్తూ కనిపించడమొక్కటే కొత్తదనమనుకుని గెటప్ శ్రీను ఒప్పుకున్నట్టుంది. పైగా దానివల్ల తన నటనా ప్రతిభని కొత్త యాంగిల్లో చూపించొచ్చు అని అనుకుని ఉండొచ్చు. కానీ సినిమా మొత్తం సింగిల్ ఎక్స్ప్రెషన్లో కనిపిస్తే వేరియేషన్స్ చూపించే వీలెక్కడుంటుంది? 

పోనీ బాల్ తగిలి ఫేస్ అలా మారడం వల్ల కామెడీ పుట్టించగలిగితే వేరేగా ఉండేది. కానీ ఇది ఫక్తు ట్రాజెడీ సినిమా. అయితే ఆ ట్రాజెడీ ప్రేక్షకులకంటే నిర్మాతకే ఎక్కువ మిగిలేట్టుంది. ఎందుకంటే ఈ కథనంలో ఎక్కడా హీరో పాత్రతో ఎమోషనల్ కనెక్ట్ అవడానికి లేదు. హీరోయిన్ కరాఖండిగా వెంటపడొద్దని, తనంటే ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా ఇతను ఆమె వెంటే పడుతుంటాడు. పోనీ ఏవైనా అర్హతలున్నాయా అంటే ఏవీ లేవు.. చదువుసంధ్యల్లేవు.. తండ్రంటే గౌరవం లేదు...!

హీరోయిన్ సంగతి సరే...అసలు ప్రేక్షకులైనా అతనిని ఎందుకు ఇష్టపడాలో ఒక్క కారణం లేదు. 

పైగా హీరోయిన్ మోసం చేసినట్టుగా కథ నడుస్తుంది. అసలామె చేసిన తప్పే లేదనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకంటే ఆమె జీవితం పట్ల, చాయిసెస్ పట్ల ఆమెకి క్లారిటీ ఉంది. ఆ క్లారిటీని హీరో ముందు పెట్టినా సరే ఇతనే ఆమెని బ్లేం చేసి తనని తాను విక్టిం గా ప్రొజెక్ట్ చేసుకుని నవ్వు మొహంతో ఏడుస్తూ కూర్చోవడం అనేది చాలా చిరాకుగా ఉంది.  

క్లైమాక్సులో హీరో తండ్రి ఏడుపు చూసి కొంచెం సేపు "అయ్యో!" అనిపిస్తుంది కానీ...హీరో పట్ల బాధ మాత్రం కలగదు ప్రేక్షకులకి. హీరో వీకైతే సినిమా వీకైపోయినట్టే. ఈ ప్రాధమిక సూత్రాన్ని వదిలేసి నడిపించిన చిత్రం చతికిలపడక ఏమౌతుంది?

జబర్దస్త్ లో గెటప్ శ్రీను స్కిట్లు చూసి ఎంత లేదన్నా తన ప్రమేయంతో మంచి పంచు డైలాగులో, కామెడీయో పండుతుందని ఆశించిన జనాలకి అడియాసలే మిగిలాయి. 

ఈ లోపాలకి తోడు అనవసరపు సెక్స్ సీన్లు మరింత రోత పుట్టిస్తాయి. 

ఏ పాత్రకీ బలమైన వ్యక్తిత్వం ఉండదు. ఒక దశలో హీరోయిన్ హీరోకి ఎందుకు కనెక్ట్ అవుతుందో అర్ధం కాదు. కనెక్టయ్యిందని చెప్పడానికి పాట మాత్రం మొదలైపోతుంది. అలాగే మరో చోట అప్పటివరకు "టచ్ మీ నాట్" స్టైల్లో నడిచుకునే హీరోయిన్, హీరో ఒక రింగిచ్చాడని హగ్గిచ్చి లిప్ లాకిచ్చి..ఆ తర్వాత చేయించుకోవాల్సింది కూడా చేయించుకుంటుంది. మళ్లీ మర్నాడు నుంచే టచ్ మీ నాట్ పద్ధతి కొనసాగిస్తుంది. అయినప్పటికీ హీరోయిన్ ని "అదో రకం" అనుకుని వదిలేసేలా ఉంది తప్ప ఆమెకి కనెక్ట్ అయ్యే పరిస్థితి మాత్రం లేదు. 

అన్నప్రాసన రోజే ఆవకాయ అన్నట్టుగా ఇలా హీరోగా తెరంగేట్రం చేసాడో లేదో, ఏదో మాస్ హీరోల పాటల లెవెల్లో గ్రూప్ డ్యాన్సర్లు, స్టెప్పులు.. అవసరమా అనిపిస్తుంది. మళయాళ చిత్రాలు చూసైనా నేల విడిచి గారడీ చేయడం తగ్గించుకుంటారనుకుంటే అస్సలు మారట్లేదు మనవాళ్లు. 

కథా కథనాల పరిస్థితి ఇలా ఉంటే సాంకేతికంగా కూడా చెప్పుకోవడానికి పెద్దేమీ లేవు. చివర్లో చంద్రబోస్ రాసి, పాడిన పాట బాగుంది. కానీ అప్పటికే వెళ్లిపోయే మూడ్ లోకి వచ్చేసిన ప్రేక్షకులు ఆ పాటని సంపూర్ణంగా ఆస్వాదించలేని పరిస్థితి. తల్లిదండ్రుల ప్రేమని కాదని, అర్ధం లేని ప్రేయసి వ్యామోహంలో కొట్టుకుపోవద్దని చెప్పకనే చెప్పే సందేశాత్మక గీతం అది. 

ప్రధమార్ధంలో కథ గాడిలో పడే వరకైనా కాస్త కామెడీ పండించవచ్చు. ఆ ప్రయత్నమేదో చేసామనుకున్నారేమో కానీ ఫలితాన్ని మాత్రం ఇవ్వలేదు. ద్వితీయార్థంలో కాసేపు పర్వాలేదనిపించినా మనసుని పట్టి లాగే భావోద్వేగ సన్నివేశం ఒక్కటీ లేదు. దాని వల్ల రెండు గంటల సినిమా మూడు గంటల సినిమాలా అనిపించి మూడ్ పాడుచేస్తుంది. 

నటీనటుల విషయానికొస్తే గెటప్ శ్రీను తన నవ్వు గెటప్ తోటే సగం పరీక్ష ఫెయిలయ్యాడు. ఎందుకంటే ఆ వెక్కిలి మొహం వల్ల తక్కిన ఎక్స్ప్రెషన్స్ పలికించడానికి వీలు లేకుండా పోయింది ఈ ట్యాలెంటెడ్ నటుడికి. 

హీరోయిన్ అంకిత చూడానికి బానే ఉంది కానీ, పెద్దగా గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ చేసిందైతే లేదు. ఈ తరహా పాత్రలో ఆల్రెడీ ఆరెక్స్ 100 లో పాయల్ రాజ్ పుట్ ఆరేళ్ల క్రితమే ఫుల్ మార్క్స్ కొట్టేసింది. 

హీరో తండ్రిగా చేసిన ఆనంద చక్రపాణి కనిపించినంతసేపూ సహజమైన నటనని కనబరిచాడు. క్లైమాక్సులో రెండు నిమిషాలు మరింత బాగా మెప్పించాడు. 

ఇతర నటీనటులంతా కథనమనే ప్రవాహంలో కొట్టుకుపోయారు. 

టైటిల్ ని చూసి మాస్ సినిమా అనుకుని, హీరోని బట్టి మాస్ కామెడీ ఎంటర్టైనర్ అనుకుని వెళితే మాత్రం షాక్ కి గురికావాల్సి వస్తుంది. ట్రాజెడీ లవర్స్ ని కూడా పెద్దగా మెప్పించలేని సినిమా ఇది. సినిమా మొదట్లో వేసిన బాల్ కి హీరో మొహం పగిలి "నవ్వు మొహం" ఫిక్సైపోతే, సినిమా పూర్తయ్యే సరికి ఆడియన్స్ కి ఏ ఎక్స్ప్రెషన్ లేని మొహం ఫిక్సవుతుంది. ఆ రేంజ్ ఫేస్ బౌలింగ్ ఈ చిత్రం. గెటప్ శ్రీనుని నమ్మి వచ్చిన ఆడియన్స్, సినిమా పూర్తవడానికి ఐదు నిమిషాలకి "గెటప్ అండ్ లీవ్" అంటున్నారు. 

బాటం లైన్: "గెటప్" అండ్ లీవ్

Show comments

Related Stories :