Harom Hara Review: మూవీ రివ్యూ: హరోం హర

చిత్రం: హరోం హర
రేటింగ్: 2.25/5
తారాగణం:
సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్, జెపి, అక్షర గౌడ తదితరులు
సంగీతం: చైతన్ భరద్వాజ్
కెమెరా: అరవింద్ విశ్వనాథన్
ఎడిటర్: రవితేజ 
నిర్మాత: సుమంత్ 
దర్శకత్వం: జ్ఞానసాగర్ ద్వారక
విడుదల: 14 జూన్, 2024

సుధీర్ బాబు హీరోగా వచ్చిన ఈ చిత్రం ట్రైలర్ ఆకట్టుకుంది. చిత్తూరు నేపథ్యం, కథలో ఏదో ఉంది అనే ఉత్సుకత కలిగాయి. చూడ్డానికి కూడా రిచ్ గా కనపడింది. ఆశపడి హాలుకి రావడం సహజం. వచ్చాక పరిస్థితేంటో చూద్దాం. 

ఈ కథ 1980ల నాటి కుప్పంలో జరుగుతుంది. సుబ్రహ్మణ్యం (సుధీర్ బాబు) కుప్పంలో ఒక కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరతాడు. అక్కడ అప్పటికే తమ్మిరెడ్డి వర్గం కబ్జాలు, మానభంగాలు వంటి క్రైములు చేస్తుంటారు. వాళ్లని తట్టుకోలేక కొందరు ఊరొదిలి పారిపోతారు కూడా. ఈ సుబ్రహ్మణ్యం మీద ఆధారపడి బతుకుతుంటాడు అతని తండ్రి (జెపి). కొడుకుకి తండ్రంటే చాలా ఇష్టం.

ఈ సుబ్రహ్మణ్యానికి పళనిస్వామి (సునిల్) అని ఒక ఫ్రెండ్ ఉంటాడు. అతనొక సస్పెండైన కానిస్టేబుల్. అనుకోని సంఘటనలో సుబ్రహ్మణ్యానికి కూడా ఉద్యోగం ఊడుతుంది. ఇద్దరికీ డబ్బు అవసరం. అందుకే ఇల్లీగల్ తుపాకుల తయారీ వ్యాపారం మొదలు పెడతారు. దానికి సుబ్రహ్మణ్యం ప్రియురాలు (మాళవిక శర్మ) కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. అక్కడి నుంచి కథంతా వీళ్లు తుపాకులు సప్లై చేయడం, మరొక సప్లయర్ తో గొడవ, స్థానిక గ్యాంగ్ ఫైట్లు.. అన్నీ ముగిసాక సదరు హీరో గెలవడం.  Readmore!

అసలీ కథలో కాన్- ఫ్లిక్ట్ పాయింటేంటో చెప్పమంటే తలగోక్కోవాలి. ఏదో ఒకటి చెప్పినా అది కాన్-ఫ్లిక్ట్ లా అనిపించదు. అసలు హీరో కష్టమేంటో ప్రేక్షకుల మనసుకి అంటదు. మనిషిని చంపడం చూసినా చలించలేదంటే నువ్వు ఎలాంటోడివో తెలీట్లేదు.. అనే విధంగా సునీల్ ఏదో డయలాగ్ కొడతాడు సుధీర్ ని చూస్తూ. ప్రేక్షకులకి కూడా అర్థం కాకే అతనితో కనెక్ట్ అవ్వరు. 

పోనీ హీరోయిన్ కి అయినా మంచి లక్షణాలున్నాయా అంటే అదీ లేదు... బాగా బతకడానికి ఇల్లీగల్ పనైనా ఓకే అనుకునే రకం ఆమె. 

ఈ పాత్రల నడుమ రొట్టకొట్టుడు విలన్ బ్యాచ్ ఒకటి. మొగుళ్లని చంపేసి పెళ్లాలని రేప్ చేసి ఉంచుకోవడం, ల్యాండ్ కబ్జాలు, పాడుబడ్డ సినిమా హాల్లోకి లాక్కొచ్చి హత్యలు... ఇలాంటివన్నీ అనేకమైన సినిమాల్లో చూసేసినవే. 

అ విలన్లు ఎవర్ని హింసిస్తున్నా ప్రేక్షకుల్లో ఏ బాధా కలగదు. ఎందుకంటే ఆ బాధితులు కూడా మంచివాళ్లలా కనపడరు. బేసిక్ గా తెర మీద ఎవరెవరో కొట్టుకుంటూ చంపుకుంటూ ఉంటారు చిరాకుగా..! 

హీరో కాబట్టి అతను చంపితే హీరోయిజం అంతే.. అలా చంపి శూలం పట్టుకుని సెంటర్లో నిలబడితే కాదంబరి కిరణ్ పాత్ర వచ్చి, "నువ్వు మామూలోడివి కావు. ఆ సుబ్రహ్మణ్య స్వామి అవతారం. వెట్రి వేల్ మురుగునక్కు హరోం హరా" అంటూ ఉద్వేగంతో అరుస్తుంటే చుట్టూ ఉన్న జనం పూనకాలొచ్చినట్టు అరుస్తారు. వెనక మన సంగీత దర్శకుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హోరెత్తిస్తాడు. 

ఇలాంటి సీన్లు చూసే ఓపిక, ధైర్యం, ఆసక్తి ఉంటే అస్సలు ఆలస్యం చేయకుండా హాలుకు పెరుగెట్టిగెళ్లి చూడొచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఆ వర్గం ప్రేక్షకుల కోసం తీసినది మాత్రమే. 

నిర్మాతలు ఎక్కడా వెనకాడకుండా ఖర్చు చేసారు కానీ, కథ- కథనం సరిగ్గా ఉడికాయో లేదో చూసుకోకుండా ప్రేక్షకులకి వడ్డించేసారు. సుధీర్ బాబు సినిమాల్లో ఇది భారీ బడ్జెట్ సినిమా కావొచ్చు. కానీ తన కెరీర్ లో ఏ విధంగానూ హత్తుకోని కథనం కూడా ఇదే. 

సుధీర్ బాబు నటనపరంగా బాగానే చేసాడు. అందులో సందేహం లేదు. ఫిట్నెస్ కూడా చక్కగా మెయింటేన్ చేస్తున్నాడు. అయితే కథలో ఫిట్నెస్ లేకపోతే హీరో గారి ఫిట్నెస్ సినిమాని కాపాడలేదు కదా. 

మళవిక శర్మ చూడ్డానికి బాగుంది కానీ మేకప్ కొట్టినట్టు కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. ఆమె పాత్రకి డెప్త్, ఎమోషన్ లేనే లేవు. 

ఇన్స్పెక్టర్ అక్షరా గౌడ కూడా అంతే.. మేకప్ చాలా ఎబ్బెట్టుగా ఉంది. 

సునీల్ ఉన్నా కూడా పెద్దగా ఒరిగిందేమీ లేదు. చిత్తూరు యాస డైలాగులు చెబుతుంటే పుష్ప గుర్తొచ్చి ప్రేక్షకుల మైండ్ అటు పోయేలా ఉంది. జెపీ క్యారక్టర్ కూడా వృధా అయింది. పండాల్సిన ఫాదర్ ఎమోషన్ పండలేదు. 

టెక్నికల్ గా నేపథ్య సంగీతం ఒక్కటే జనం లేచెళ్లిపోకుండా కూర్చోబెట్టిందనుకోవాలి. పాటలు మాత్రం పరమ వీక్. ఒక్కటంటే ఒక్క పాట కూడా వినసొంపుగా లేదు. ఆరెక్స్ 100 సంగీత దర్శకుడు ఎందుకిలా అయిపోయాడో తెలీదు. 

కెమెరా, ఆర్ట్ వర్క్ బాగున్నాయి. నిర్మాణ విలువలు ఎక్కడా తక్కువగా లేవు. 

అయితే కంటెంట్ పరంగా పుష్ప, కేజీఎఫ్ లాంటి సినిమాల్ని చూసి వాతలు పెట్టుకున్నట్టు ఉంది ఈ చిత్రం. తండ్రీకొడుకుల మధ్యన కానీ, ప్రేయసీ ప్రియుల మధ్య గానీ అస్సలు ఎమోషన్ పండలేదు. తెర మీద వాళ్లు సెంటిమెంటేదో పండించే ప్రయత్నం చేస్తున్నా చూసేవాళ్లకి మాత్రం ఏ రసమూ అందక నీరసమొస్తుంది.  

నాలుగు హిట్ సినిమాలు చూసి అనుకరిస్తూ రాసుకున్న కథ, ఎలా రాసుకోవాలో తెలీక ఏదేదో రాసుకున్న పేలవమైన కథనం ఈ సినిమాకి ప్రధానమైన శత్రువులు. ఇంత బలమైన శత్రువుల ముందు మిగిలినవి పాజిటవ్ గా ఎన్నున్నా ఫలితముండదు. కంటికి తెర మీద దృశ్యం బాగున్నా, మనసులో ముద్రించబడదు. మొదట కాసేపు ఒప్పించినా కథ నడిచే కొద్దీ నొప్పించకుండా వదలదు. ఇంటర్వల్ కొట్టే సరికి పూర్తి సినిమా చూసినంత అలసట, ఫైనల్ బెల్ కొట్టేసరికి నాలుగు సినిమాలు చూసిన బడలిక కలుగుతాయి. అలవోకగా "హరోం హరా" అని నిట్టూర్పు కూడా వస్తుంది. 

బాటం లైన్: హర హరా!!!

Show comments

Related Stories :