కాంగ్రెస్ పార్టీని నిలువునా ముంచడానికి మరెవరో అక్కర్లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్లే చాలు అనేది చాలా పాత నానుడి! ఆ పార్టీ ప్రస్తుత పతనావస్థకు కూడా దేశ ప్రజలెవ్వరూ కారణం కాదు, కాంగ్రెస్ తనను తాను ముంచుకుని మళ్లీ లేవలేక అపసోపాలు పడుతూ ఉంది! మరి ఇప్పుడైనా ఏదైనా మార్పు వచ్చిందా అంటే, అబ్బే అలాంటి మార్పులు వస్తే అది కాంగ్రెస్ ఎందుకవుతుంది అన్నట్టుగా ఉంది పరిస్థితి!
శ్యామ్ పిట్రోడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను గమనించే వారికి ఇది పరిచయం ఉన్న పేరే! యూపీఏ 2 హయాంలోనే ఇతడి పేరు ప్రముఖంగా వినిపించింది. అప్పట్లో కాంగ్రెస్ సలహాదారుల్లో ఈయనా ఒకరు! ప్రత్యేకించి సోనియా, రాహుల్ లకు ఈయన అప్పట్లోనే వివిధ అంశాల్లో సలహాదారుల్లో ఒకరిగా పని చేశారు! ఈ అపరమేధావి అప్పట్లోనే జనసామాన్యానికి ఏ మాత్రం నచ్చని సలహాలు ఇస్తూ వార్తల్లో నిలిచే వారు! అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇలాంటి వారు ఏం మాట్లాడినా చెల్లింది! ఇలాంటి వారిని నమ్ముకుని కాంగ్రెస్ పార్టీని నిండా ముంచారు సోనియా, రాహుల్!
మరి పదేళ్లు గడిచినా.. ఇంకా అలాంటి వారినే తమ సలహాదారులుగా కొనసాగిస్తూ ఉన్నారు! వారేమో వాస్తవాలను ఆమోదించలేని దారుణమైన మనస్తత్వంతో అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు! తలాతోక లేకుండా, అసలు ఇంగితమే లేకుండా వారు మాట్లాడుతూ తమ వంతుగా కాంగ్రెస్ ను దెబ్బేయడానికి అవిశ్రాంతంగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు!
ఈ మధ్యనే ఈ పిట్రోడా తమ కూటమి అధికారంలోకి వస్తే ఏదో బిల్లు తెస్తామంటూ ప్రకటన చేశాడు! ఆ ప్రకటనతో ప్రధాని మోడీ, అమిత్ షాలకు ఆయన పెద్ద అస్త్రం ఒకటి అందించారు. ఆ అస్త్రంతో లోక్ సభ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో తొలివిడతల్లో మోడీ, షా రెచ్చిపోయారు! అబ్బే.. పిట్రోడా చెప్పింది ఆయన వ్యక్తిగతం అని, కాంగ్రెస్ కు అలాంటి ఉద్దేశం లేదంటూ కాంగ్రెస్ నేతలు డ్యామేజీ కంట్రోల్ చేసుకునే ప్రయత్నాలు చేశారు!
అయినా.. ఈయనగారి తీరు మారలేదు! ఈ సారి భారతీయులను ఉద్దేశించి వర్ణవివక్ష వ్యాఖ్యలు చేశాడు. తన పుట్టుకను కూడా మరిచి పేలాడు! ఈశాన్య రాష్ట్రాల ప్రజలు చైనీయుల్లా ఉంటారని, దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఆఫ్రికన్స్ లా ఉంటారంటూ.. కనీస ఇంగితం మరిచి మాట్లాడాడు! ఇంకేముంది.. అసలే ఇలాంటి అవకాశాల కోసం ఎదురుచూసే బీజేపీ వాళ్లు అందిపుచ్చుకున్నారు.
పిట్రోడా అలా పేలడం, దాన్ని మోడీ ఎన్నికల ప్రచారంలో వాడేసుకోవడం చకచకా జరిగిపోయింది. మరి ఇలాంటి వారి సలహాలు విని కాంగ్రెస్ ను ఇక్కడకు తీసుకొచ్చిన సోనియా, రాహుల్ లకు తామేం చేస్తున్నామో ఇప్పటికీ వెలగకపోవచ్చు!
అయితే నష్టనివారణగా పిట్రోడాతో కాంగ్రెస్ కు రాజీనామా చేయించారు, దాన్ని ఆమోదించేసి అతడితో తమ పార్టీకి సంబంధం లేదని తేల్చేశారు! ఎప్పుడో 15 యేళ్ల కిందటే ఇలాంటి పనులు చేయించి ఉంటే ప్రయోజనం ఉండేది, ఇంకా ఇలాంటి తాలు సరుకుకు కాంగ్రెస్ లో లోటు లేదు! వారెప్పుడు రాజీనామాలు చేయాలి, ఎప్పుడు కాంగ్రెస్ కోలుకోవాలి!