మూవీ రివ్యూ: భజే వాయు వేగం

చిత్రం: భజే వాయు వేగం
రేటింగ్: 2.5/5
తారాగణం:
కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవి శంకర్, లోహితాశ్వ తదితరులు 
కెమెరా: ఆర్డి రాజశేఖర్
ఎడిటర్: సత్య జి
సంగీతం: కపిల్ కుమార్
నిర్మాతలు: యూవీ కాన్సెప్ట్స్
దర్సకవ్తం: ప్రశాంత్ రెడ్డి 
విడుదల: 31మే 2024

"ఆరెక్స్ 100" తర్వాత కార్తిక్ గుమ్మకొండకి మరొక పెద్ద హిట్ లేదు. 17 ఏళ్ల క్రితం వచ్చిన "హ్యాపీ డేస్" తర్వాత రాహుల్ టైసన్ కి కూడా హిట్ లేదు. వీళ్లిద్దరూ కలిసి 'భజే వాయువేగం' అంటూ ముందుకొచ్చారు. 

వెంకట్ (కార్తికేయ), రాజు (రాహుల్) ఒక ఊరిలో రైతు (తనికెళ్ల భరణి) కొడుకులు. ఒకడు క్రికెటర్, మరొకడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా హైదరాబాదులో సెటిలైనట్టు చెప్తారు. కానీ వీళ్లిద్దరూ చేసే పని వేరు. ఒకడు డ్రైవర్, మరొకడు క్రికెట్ బెట్టింగులు ఆడడం. వీళ్లు కోరి ఈ పనులు చేయరు. పరిస్థితుల ప్రభావం వల్ల చేస్తుంటారు. 

ఈ నేపథ్యంలో తండ్రి అనారోగ్యాన్ని నయం చేయడానికి వీళ్లకి 20 లక్షల డబ్బు అవసరమౌతుంది. ఆ డబ్బు కోసం వీళ్లు చేసిన ప్రయత్నాల్లో భాగంగా డేవిడ్ (రవి శంకర్) అనే ఒక రాజకీయ నేపథ్యమున్న విలన్ తో గొడవపడాల్సొస్తుంది. అందులో భాగంగా ఆ డేవిడ్ కారుని ఎత్తుకుపోతారు ఈ ఇద్దరూ. ఆ కారులో అనుకోకుండా కోట్ల డబ్బున్న బ్యాగ్, డిక్కిలో ఒక శవం ఉంటాయి. అక్కడి నుంచి కథ ఎటు వెళ్తుందో తెరపై చూడాలి.  Readmore!

పైన చెప్పిన కథ ప్రకారం చక్కగా ఆ కారులో డబ్బు బ్యాగ్ తీసుకుని ఆ ఇద్దరూ చెక్కేయొచ్చు కదా అని మీకు అనిపించొచ్చు. మీకే కాదు, హాల్లో ఉన్న ప్రతి ప్రేక్షకుడికి అలానే అనిపిస్తుంది. ఎందుకంటే అది కామన్ సెన్స్. కానీ ఆ సెన్స్ ని తెర మీద హీరోలు వాడరు. అలాగే విలన్ కి కూడా కామన్ సెన్స్ ఉండదు. అతనికి ఆ కారుతోటి, డిక్కీలో శవంతోటి పెద్ద అవసరం ఉన్నప్పుడు ఆ హీరోలకి అవసరమైన కొన్ని లక్షలు పడేసి వదిలించుకోవచ్చు కదా! ఆ పని చెయ్యడు. పరిస్థితిని ఇంకా కాంప్లికెట్ చేసుకుంటాడు. 

హీరోల అతి మంచితనం, విలన్ల అతి క్రూరత్వం..రెండూ చిరాకు పెట్టిస్తాయి. ఈ చిత్రంలో ప్రధానమైన లోపం అదే. 

నిర్మాణ విలువలు బాగానే ఉన్నా, బేసిక్ ప్లాట్ పాయింట్ ఆసక్తికరంగానే ఉన్నా, స్క్రీన్ ప్లే రాసుకోవడంలో పరిపక్వత, ఇంటిలిజెన్స్ చూపలేకపోయారు మేకర్స్. 

అలాగే అసలీ కథకి ఇద్దరు హీరోలు ఎందుకో అర్ధం కాదు. దానివల్ల ఒనగూరిన పెద్ద ప్రయోజనమేమిటో కూడా తెలీదు. 

అయినా తండ్రికి ఆపరేషన్ అంటే 20 లక్షలు ఖర్చు అంటూ నడిపే డ్రామా ఎంత పాతది? దానికోసం హీరోలిద్దరూ అందర్నీ డబ్బులడుగుతూ నానా కష్టాలు పడుతుంటారు. ఇంతలో, "ఆరోగ్యశ్రీ లేదా?" అంటూ హాల్లో ఒకతను అరిచాడు. మిగిలిన పది మందీ గొల్లుమన్నారు. కథనంలో బిగువు, ఇంటిలిజెన్స్ లేకపోతే ఇలాంటి కౌంటర్లే వేస్తుంటారు ప్రేక్షకులు. 

కథనమనేది ఆడియన్స్ యొక్క యావరేజ్ ఇంటిలిజెన్స్ కి పైన నడవాలి. అప్పుడే వాళ్లని లొంగదీసుకునే వీలుంటుంది. అలా కాకుండా అనుకున్న కథని ఏదో రకంగా సీనార్డర్ వేసేసుకుని తీసేస్తే ఎక్కడా ఉత్కంఠ కలగక నిట్టూరుస్తుంటారు ప్రేక్షకులు. 

ప్రధమార్ధమంతా సినిమా కష్టాలే. ఉద్యోగం రాకపోవడం, ఎవడో డబ్బు తీసుకుని మోసం చేయడం, తండ్రికి అనారోగ్యం, ఆపరేషన్ కి డబ్బు అవసరం కావడం, నమ్ముకున్న హీరోయిన్ ని చూడకూడని చోట చూడాల్సి రావడం...ఎక్కడా గ్యాప్ లేకుండా లైనుకట్టే ఈ కష్టాల్ని చూసి కష్టాలకే కష్టంగా అనిపిస్తుంది. 

పోనీ ఇంటర్వెల్ బ్యాంగులో కష్టాలు తారాస్థాయికి వెళ్లాయి కాబట్టి సెకండాఫులో వాటన్నిటినీ చేదించే హీరోయిజం చూస్తామని ఆశపడితే అది పొరపాటే. ద్వితీయార్ధంలోనూ ఆ కష్టాల పర్వం కొనసాగుతుంది. పైన చెప్పుకున్నట్టు కామన్ సెన్స్ వాడకుండా హీరోలిద్దరూ ఏదేదో చేస్తుంటారు. 

కార్తిక్ గుమ్మకొండ ఎప్పటిలాగే మంచి ఫిజిక్ తో తెరకి నిండుగా ఉన్నాడు. తన పాత్రవరకు న్యాయం చేసాడు. 

రాహుల్ మాత్రం కరుణరసానికి కేరాఫ్ అడ్రస్ అనిపించేలా నటించాడు. విషణ్ణవదనంతో జాలిగా, దయనీయంగా డైలాగులు చెప్పడం..లేకపోతే ఏడవడం..తన పాత్ర మొత్తం అదే. 

ఐశ్వర్య మీనన్ ఒక పాటలో కాసేపు గ్లామరస్ గా కనిపించింది. అంతకు మించి ఆమె పాత్రకు సరైన బరువేమీ లేదు. 

రవిశంకర్ ఎప్పటిలానే లౌడ్ వాయిస్ తో విలనీ పండించాడు. లోహితాశ్వ రొటీన్ గానే ఉన్నాడు. 

టెక్నికల్ గా చూస్తే నేపథ్య సంగీతం కానీ, పాటలు కానీ క్యాచీగా లేవు. ఎక్కడా కొత్తదనం ధ్వనించలేదు. 

సినిమా ఆఖరి 10-15 నిమిషాలు పర్వాలేదనిపిస్తుంది. అలాగని అది కొత్తగా ఉందని కాదు...ఎక్కడో చూసేసినట్టే అనిపిస్తుంటుంది. 

అసలీ కథని పూర్తి కామెడీ జానర్లో రాసుకునుంటే బాగుండేదనిపిస్తుంది. అప్పుడు కథనం ఇంత హెవీగా ఉండేది కాదు. అప్పుడు లాజిక్కులు, కామన్ సెన్సులు వెతకరు ప్రేక్షకులు. ఆద్యంతం హిలారియస్ గా నడిపే అవకాశముండేది. కనీసం యూత్ ఆడియన్స్ ని అయినా ఆకట్టుకునుండేది. ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, ఒక బేసిక్ యాక్షన్ థ్రిల్లర్ ని చూడాలనుకుంటే ఏమో కానీ .. ఏదో ఆశించి వెళ్తే మాత్రం పెదవి విరుపు తప్పదు. 

బాటం లైన్: అంత వేగం లేదు

Show comments

Related Stories :