గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనాలకు అందని విజయాలను సాధించింది. తాము గెలుపును ఊహించని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది. అలాంటి వాటిల్లో తాడిపత్రి ఒకటి. తాడిపత్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి నాయకత్వం విషయంలో అపసోపాలు పడింది.
2014 ఎన్నికల్లో పేరం కుటుంబ బంధు వర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిపింది. వీఆర్ రామిరెడ్డి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో జేసీ బ్రదర్స్ కు ఇక శాశ్వతంగా తిరుగులేదనే అంచనాలు ఏర్పడ్డాయి. పార్టీలతో పని లేకుండా తాడిపత్రి వరకూ వారిదే హవా అనే అభిప్రాయాలు ఏర్పడ్డాయి.
అలాంటి పరిస్థితుల మధ్యన 2019 ఎన్నికలకు కొంత ముందు కేతిరెడ్డి పెద్దారెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర మీదుకు తీసుకొచ్చింది. అప్పటి వరకూ కేతిరెడ్డి సూరీడు తమ్ముడిగా మాత్రమే పెద్దారెడ్డికి గుర్తింపు. సూరీడి వారసత్వాన్ని ఆయన తనయుడు సొంతం చేసుకుంటూ ధర్మవరంలో సెటిలయ్యాడు. పెద్దారెడ్డి ని అప్పటి వరకూ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పరిగణించిన వారు లేరు. అయితే ప్రత్యామ్నాయం లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దారెడ్డిని తాడిపత్రి బరిలో నిలిపింది.
వీరిది తాడిపత్రికి సమీప ప్రాంతమే కానీ, ఆ నియోజకవర్గం కాదెప్పుడూ! కేతిరెడ్డి కుటుంబానికి మంచి పట్టున్న యల్లనూరు, పుట్లూరు మండలాలు ఒకప్పుడు ధర్మవరం నియోజకవర్గంలో భాగంగా ఉండేవి. అప్పుడు సూరీడు ధర్మవరం ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనప్పుడు ఆ రెండు మండలలూ అటు ధర్మవరంలో కాకుండా, ఇటు తాడిపత్రిలో కాకుండా.. ఎక్కడో ఉన్న శింగనమలలోకి వెళ్లిపోయాయి! అది ఎస్సీ రిజర్వ్డ్!
దీంతో అప్పటికే సూరీడికి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే అనే ట్యాగ్ ఉండటంతో ఆయన మరణానంతరం ఆయన తనయుడు ధర్మవరంలో సెటిలయ్యాడు. సూరీడు ఒక దశలో జేసీ బ్రదర్స్ ను ఢీ కొంటూ తాడిపత్రి నుంచి ఒకే ఒక్కసారి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీపడ్డాడు. అదే ఆయన చివరి ఎన్నిక, ఓటమి పాలయ్యారు కూడా!
అలా తాడిపత్రితో ఉన్న సంబంధం తక్కువే అయినా.. యల్లనూరు, పుట్లూరు మండలాలకు తాడిపత్రే ప్రధాన కేంద్రం. ఆ సమయంలో తాడిపత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యాక్యూమ్ పెద్దారెడ్డికి కలిసొచ్చింది. ఇన్ చార్జిగా వెళ్లి పెద్దారెడ్డి జేసీ బ్రదర్స్ చేతిలో ముప్పుతిప్పలు పడ్డారు. తట్టుకుని నిలబడ్డారు. ఎమ్మెల్యేగా సంచలన విజయం సాధించారు.
అదంతా జగన్ గాలి అనుకుంటే.. ఇప్పుడు తాడిపత్రిలో జేసీల విజయం సునాయసం అవ్వాలి. అయితే అదంతా తేలికగా లేదు. జేసీ బ్రదర్స్ కు పెద్దారెడ్డి గట్టి సవాల్ విసురుతున్నాడు. దశాబ్దాల జేసీల హవాకు తట్టుకుని ఈ ఎన్నికల్లో పెద్దారెడ్డి విజయం మీద ధీమాతో కనిపిస్తున్నాడు. అసలు ఆయన తాడిపత్రి ఎంట్రీ ఇచ్చిన రోజులకూ, ప్రస్తుతానికీ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. విజయం కోసం ఇప్పుడు పెద్దారెడ్డి తుదికంట పోరాడుతున్నాడు.
గ్రామాల్లో వర్గాన్ని ప్రోది పరుచుకోవడంలో అయితేనేం.. మరోసారి ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ కు ముచ్చెమటలు పట్టించడంలో అయినా పెద్దారెడ్డి సత్తా చూపిస్తున్నాడు! ఇప్పుడు జేసీ ఫ్యామిలీకి మరో నియోజకవర్గం కూడా ఏదీ లేదు. వాళ్లకు చివరకు మిగిలింది తాడిపత్రే! అయినా వారి శక్తియుక్తులకు పెద్దారెడ్డి ధీటైన పోటీ ఇస్తున్నాడు. విజయంపై పెద్దారెడ్డి వర్గం విశ్వాసంతో కనిపిస్తోంది!