Gam Gam Ganesha Review: మూవీ రివ్యూ: గం గం గణేశా

చిత్రం: గం గం గణేశా
రేటింగ్: 2.25/5
తారాగణం: ఆనంద్ దేవరకొండ, ఇమాన్యువెల్, ప్రగతి శ్రీవాస్తవ్, నయన్ సారిక, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, అర్జున్ రాజ్ తదితరులు 
కెమెరా: ఆదిత్య జవ్వాది 
సంగీతం: చైతన్ భరద్వాజ్ 
ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్ 
నిర్మాత: కేదార్, వంశీ
దర్శకత్వం: ఉదయ్ బొమ్మిశెట్టి 
విడుదల తేదీ: 31 మే 2024

ఆనంద్ దేవరకొండ "బేబీ" తర్వాత ఈ క్రైం కామెడీతో పలకరించాడు. ఎప్పుడూ భగ్నప్రేమికుడిగా కనిపిస్తూ ఆ జానర్ కే ఫిక్స్ అయిపోతాడేమో అనిపించే ఆనంద్ ఈ సారి కాస్త డిఫరెంట్ జానర్ ట్రై చేసాడు. 

గణేశ్ (ఆనంద్) ఒక చిన్నసైజ్ దొంగ. అనాధ కూడా. అతనికి తోడు తన స్నేహితుడే (ఇమ్మాన్యువెల్). ఒక షాపులో పని చేసే అమ్మాయి శ్రుతి (నయన్ సారిక) తో ప్రేమలో పడతాడు గణేశ్. కానీ ఆమె గణేశ్ ని కాకుండా షాప్ ఓనరుతో పెళ్లికి రెడీ అయిపోతుంది. అమ్మాయి మనసు గెలుచుకోవాలంటే డబ్బే ప్రధానమనుకుని గణేశ్ ఒక డైమండ్ దొంగతనం చేసే డీల్ కి సిద్ధపడతాడు.

ఇదిలా ఉంటే కర్నూల్ లో కిషోర్ రెడ్డి (అర్జున్ రాజ్) అనే రాజకీయ నాయకుడుంటాడు. అతనికి ఎన్నికల్లో పంచడానికి 100 కోట్ల రూపాయల నల్లధనాన్ని ముంబాయి నుంచి తీసుకొచ్చే డీల్ ని రుద్ర అనే క్రిమినల్ కి అప్పజెప్తాడు. 
ఇంతకీ 100 కోట్లు కిషోర్ రెడ్డిని చేరతాయా? డైమండ్ ఎవరికి చిక్కుతుంది? ఇదే తక్కిన కథంతా.  Readmore!

ప్రధానమైన రెండు ట్రాకులు మాత్రమే కాకుండా సబ్ ప్లాట్లుగా మరో రెండు మూడు ట్రాకుల్ని నడుపుతూ ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించే ప్రయత్నమైతే జరిగింది. అయితే క్రైం, క్రైం కామెడీ, ఫార్స్ కామెడీ ఇలా మల్టిపుల్ జానర్స్ పెనవేసుకుంటూ నడవడంతో సీరియస్ మూడ్ తో కూర్చున్న ప్రేక్షకులకి నచ్చకపోవచ్చు. 

సినిమా మొదలైన ఇరవై నిమిషాల వరకు ఆసక్తిగా అనిపించదు. తర్వాత కొద్దికొద్దిగా పర్వాలేదనిపిస్తూ, సెకండ్ హాఫ్ కి వచ్చే సరికి చివరికి ఏమౌతుందా అని వేచి చూసేలా ఉంది. 

ఆనంద్ దేవరకొండ ఇందులో మాస్ హీరో టైపులో తన ఇమేజుకి మించిన పాత్ర పోషించకుండా సటిల్ కామెడీ టచ్ తో సగటు యువకుడి పాత్రలో నటించాడు. అదొక ప్లస్ పాయింట్. 

హీరోయిన్లిద్దరూ ఉన్నారు తప్ప పెద్దగా వాళ్ల పాత్రలకి ఇంపార్టెన్స్ అయితే లేదు. 

హీరో సైడ్ కిక్ గా కనిపించిన ఇమాన్యువెల్ అక్కడక్కడ నవ్వించాడు. "ఆర్గాన్ డేవిడ్" గా వెన్నెల కిషోర్ ట్రాక్ లాజికల్ గా చూస్తే అతిగా ఉంది. ఫార్స్ కామెడీ కోణంలో అయితే నవ్విస్తుంది. 
విలన్ గా రాజ్ అర్జున్ రొటీనే. 

మిగిలిన నటులంతా కథక్రమంలో వాళ్ల పని వాళ్లు చేసుకుపోయారు. 

సాంకేతికంగా మ్యూజిక్ వీక్ గా ఉంది. ఆరెక్స్ 100 లో అంత మంచి పాటలు కంపోజ్ చేసిన చైతన్ భరద్వాజ్ ఎందుకో ఆ ఫ్లావర్ మళ్లీ ఇవ్వలేకపోతున్నాడు. నేపథ్య సంగీతం అక్కడక్కడ బాగుందనిపిస్తే, కొన్ని చోట్ల మరీ దయనీయంగా బి-గ్రేడ్ లెవెల్లో వినిపించింది. కెమెరా వర్క్, ఇతర టెక్నికాలిటీస్ అన్నీ ఓకే. 

ఓవరాల్ గా ఈ క్రైం కామెడీ చిత్రం నానా ట్రాకుల సమ్మేళనం. అందులో కొన్ని కొందరికి నచ్చవచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. ఎలా చూసుకున్నా ఇది తీసి పారేసే చిత్రమైతే కాదు. కాలక్షేపానికి బాగానే ఉంటుంది. మనసుకి హత్తుకునే భావోద్వేగాలు, పొయెటిక్ జస్టిస్ లాంటివి బలంగా లేకపోయినా అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అయింది కనుక పాస్ మార్కులు వేసుకోవచ్చు. 

హీరో లవ్ ట్రాక్ గాని, కోటీశ్వరుడు అవ్వాలన్న అతని పట్టుదలకి గల కారణం గానీ, మళ్లీ అతని సెకండ్ లవ్ గానీ ఏదీ హెవీగా సెంటిమెంటుతో కూడి ఉండదు. అంతా లైటర్ వీన్ లోనే సాగుతుంది. "బేబీ" సినిమాలో హెవీ మెలోడ్రామాని పండించిన ఆనంద్ దేవరకొండ ఇందులో లైటర్ వీన్ లో నటించి ప్రేక్షకులని బతికించాడు. 

సెకండాఫులో బాబా ట్రాక్ ఒక్కటీ బలవంతంగా అతికించినట్టు ఉంది. ఆ ట్రాకులో కామెడీ లేకపోవడం వల్ల అప్పటి దాకా ఉన్న ఫ్లోకి కాస్త అడ్డుపడి సైడ్ ట్రాక్ పట్టినట్టు అనిపిస్తుంది. 

మొత్తానికి ఈ రోజు విడుదలైన మూడు సినిమాల్లో కామెడీ అంటూ ఉందంటే అది ఇదొక్కటే. మిగిలిన రెండూ పూర్తిగా సీరియస్ సినిమాలే. 

డబ్బు కోసమో, విలువైన వస్తువు కోసమో సినిమాలోని పాత్రలన్నీ గ్రూపులుగా విడిపోయి పరుగుపెట్టడం అనేది దశాబ్దాల క్రితం నుంచీ వస్తూ ఉన్న సినిమా కథే. డబ్బెవరికి చేదు, అనగనగా ఒక రోజు, స్వామి రారా..ఇలా చాలా ఉన్నాయి. ఆ జానర్లో ఎన్ని వచ్చినా కొన్ని అలరిస్తాయి, కొన్ని విసిగిస్తాయి. ఈ "గం గం గణేశా" విసిగించే చిత్రమైతే కాదు. నాలుగైదు ట్రాకుల్లో కథ నడుస్తూ ఉంటుంది. అందులో రెండు ట్రాకులు నవ్విస్తాయి, రెండు విసిగిస్తాయి. 

ఈ సినిమాకిచ్చిన ట్రీట్మెంట్ ని బట్టి సీరియస్ యాంగిల్లో లాజిక్కులు వెతుకుతూ కాకుండా ఫార్స్ కామెడీని చూస్తున్నట్టుగా చూడొచ్చు. అలా చూసేవాళ్లకి నవ్వులొస్తాయి. చూడలేనివాళ్లకి నిట్టూర్పులొస్తాయి. 

బాటం లైన్: ఫార్స్ కామెడీ

Show comments

Related Stories :