తన పైత్యం కొంత.. అవతలివాడి పైత్యం మరి కొంత అన్నట్లుగా వుంది. లాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారం. టెస్టింగ్ దశలో వుంది ఈ యాక్ట్. దాంట్లో కొంత మంచీ వుండొచ్చు. చెడు వుండొచ్చు. అనుమానాలు వుండొచ్చు.
నిజానికి దీని మీద గత కొంత కాలంగా రగడ జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదు. లాయర్లు ఈ చట్టం గురించే సమ్మె చేసినా పట్టించుకోలేదు. అది వేరే సంగతి. ఇప్పుడు ఇది ఎన్నికల అంశంగా మారింది. వైకాపా అవకాశాలను చాలా గట్టిగా దెబ్బతీసేలా కనిపిస్తోంది. ప్రతిపక్షాల ప్రచారాన్ని బలంగా తిప్పి కొట్డడంలో అధికారపక్షం విఫలమైన మాట వాస్తవం. పైగా అధికారుల అత్యుత్సాహం కావచ్చు, సంబంధింత మంత్రుల ఆదేశాలు కావచ్చు. పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ, హద్దు రాళ్ల మీద జగన్ పేరు ఇవన్నీ ప్రతిపక్ష ప్రచారానికి కలిసి వచ్చాయి.
ప్రతిపక్షాలు చాలా బలంగా ఈ చట్టం మీద వ్యతిరేక ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లాయి. దాదాపు చేతులు కాలినంత పని అయింది ప్రభుత్వానికి. దాంతో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. సిఐడి విచారణకు ఆదేశించారు. దాని వల్ల ఏమవుతుంది అంటే.. ఏమీ కాదు అనే అనుకోవాలి. ఇప్పటికే ఈ అంశం జనాల్లోకి బలంగా వెళ్లిపోయింది. ఇప్పుడు వీలయినంత మంది వైకాపా నేతలు దీనిని ఖండించడం మొదటి మార్గం.
అసలు ఈ చట్టం ఏమిటి? వివరంగా ఫుల్ పేజీ ప్రకటనలు ఇవ్వడం రెండో మార్గం. ఎన్నికల కోసం, ప్రచారం కోసం పార్టీ కోట్లు ఖర్చు చేస్తోంది. అందువల్ల ఖర్చులో ఖర్చు అన్ని దినపత్రికల్లో సవివరంగా ప్రకటనలు ఇవ్వడం అవసరం. ఎందుకంటే ప్రభుత్వం లేదా పార్టీ చెప్పింది ఎల్లో మీడియా ఎలాగూ రాయదు. మరింత నెగిటివ్ చేయడం తప్ప. అందువల్ల పార్టీకి లేదా ప్రభుత్వానికి ఈ చర్య తప్పదు.
అసలు ముందుగానే ఈ పని చేసి వుంటే బాగుండేది. మొత్తం వ్యవహారం ప్రజల్లో డ్యామేజ్ చేస్తుంటే ఇప్పుడు కదిలారు వైకాపా నేతలు. అందువల్ల వారం రోజులు అయినా గట్టిగా కింది స్థాయి నాయకులతో జనాలకు ఈ చట్టం గురించి పూర్తి వివరణ ఇవ్వడం అవసరం. ఎందకుంటే కింది స్థాయిలో ఈ చట్టం మీద ప్రస్తుతం తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.