నేను పవన్ కల్యాణ్ పై పోటీకి సిద్ధం

నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్ మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో గాజువాక నుంచి చిత్తుగా ఓడిపోయిన జనసేన అధినేత, ఈసారి పిఠాపురంను ఎంపిక చేసుకున్నారు. జనసైనికుల చప్పట్ల మధ్య ఈ విషయాన్ని ఆయన ఘనంగా ప్రకటించారు.

పిఠాపురంలో పవన్ సామాజిక వర్గానికి మంచి పట్టు ఉంది. ఆ నమ్మకంతోనే, సర్వేలు చేయించుకొని, లెక్కలు వేసుకొని మరీ పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఈసారి ఎన్నికల్లో నిలబడాలని పవన్ డిసైడ్ అయ్యారు.
గతంలో కూడా ఆయన ఇలానే లెక్కలేసుకున్నారు. సర్వేలు చేయించుకున్నారు. తన సామాజిక వర్గం ఓట్లతో పాటు, అభిమానులు మెండుగా ఉన్న గాజువాక నుంచి పోటీ చేసి భంగపడ్డారు. ఆ సంగతులు పక్కనపెడితే, ఈసారి పవన్ కు ఊహించని పోటీ ఎదురైంది.

పవన్ కల్యాణ్ ను నిత్యం కెలికే అతడి 'అభిమాని' రామ్ గోపాల్ వర్మ, ఈసారి పవన్ పై పోటీకి సిద్ధమంటూ ప్రకటించాడు. పవన్ ఇలా ప్రకటన చేశాడో లేదో, ఆ వెంటనే వర్మ నుంచి కూడా ప్రకటన వచ్చేసింది. ఇప్పటికిప్పుడు సడెన్ గా నిర్ణయం తీసుకున్నానని, పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నానంటూ ట్వీట్ చేశాడు.

ఆర్జీవీ స్టంట్స్ గురించి అందరికీ తెలిసిందే. ప్రచారం కోసం ఆయన ఏదైనా చేస్తాడు. ఈ ట్వీట్ కూడా అలాంటిదే అని అంతా లైట్ తీసుకున్నారు. అయితే మొదటి ట్వీట్ పెట్టిన 2 గంటలకు మరో ట్వీట్ చేశాడాయన. చాలామంది డౌట్ పడుతున్నారని, తను చాలా సీరియస్ గానే నిర్ణయం తీసుకున్నానంటూ మళ్లీ ట్వీట్ చేశాడు.

ఇప్పటికిప్పుడు పోటీ చేస్తానంటే, రామ్ గోపాల్ వర్మకు ఎవ్వరూ టికెట్ ఇవ్వరు. ఆ మాటకొస్తే, అతడు అభిమానించే జగన్ కూడా వర్మకు పిఠాపురం టికెట్ ఇవ్వలేడు. నిజంగా ఆయన ఎన్నికల్లో నిలబడాలంటే రెండే ఆప్షన్లున్నాయి. ఒకటి ఇండిపెండెంట్ గా పవన్ పై పోటీ చేయాలి.. లేదా కేఏ పాల్ పార్టీ నుంచి ఆయన బరిలో నిలబడాలి.

Show comments

Related Stories :