ఓటుకు నోటు పంపకం వేగంగా సాగుతూ ఉంది ఏపీలో. అసెంబ్లీ, లోక్ సభ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో... ఇప్పటికే ప్రచార పర్వాన్ని హోరెత్తించిన ప్రధాన పార్టీలు, ఇప్పుడు ప్రలోభాల పర్వంలో కూడా పోటాపోటీ పడుతూ ఉన్నాయి. ఓటుకు కనిష్టంగా రెండు వేల రూపాయల ధరను నిర్ణయించి, పార్టీలు పంచుతున్నాయి. సగటున ఏపీలో ఓటు ధర ఇది. అయితే కొన్ని ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో ఓటుకు రెట్టింపు ధరను చెల్లించడానికి కూడా పార్టీలు పోటీ పడుతూ ఉన్నాయి.
అయితే.. ఈ పంపకాల్లో చిత్రాచిత్రాలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. కూటమిగా బరిలోకి దిగిన టీడీపీ, బీజేపీ, జనసేనల విషయంలో పంపకాల వద్ద గొడవలు చోటు చేసుకుంటూ ఉండటం గమనార్హం.ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాషాయ పార్టీ పోటీలో ఉన్న ఒక సీట్లో భారీ ఎత్తున పంచుతుందనే అంచనాలున్నాయి.అక్కడ అభ్యర్థి తనకు కేంద్రంలో పెద్దలు తెలుసు, వాళ్లు తెలుసు, కేంద్రమంత్రులు ప్రచారానికి రావడం.. వీటన్నింటి నేపథ్యంలో.. అందునా అభ్యర్థి ప్రచారాన్ని హోరెత్తించిన నేపథ్యంలో ఓటుకు నాలుగు వేలు, ఐదు వేల రూపాయలు కూడా ఇస్తారని జనాలు ఆశలు పెట్టుకున్నారు!
పువ్వు పార్టీ అభ్యర్థి ఆర్థిక శక్తి భారీగా ఉందని, అందుకే నాలుగు ఇస్తారు, ఐదు వేలు ఇస్తారని జనాలు ఆశించారు. ప్రత్యేకించి టీడీపీ క్యాడర్ ఇక్కడ ఉంటుంది. వాళ్లు ఓటుకు నాలుగైదు వేలు గ్యారెంటీ అని భావించారు. అయితే చివరి నిమిషంలో అలాంటి ఊపు కనిపించడం లేదట అక్కడ! నాలుగు వేలు కాస్తా రెండు వేలకే పడిపోయింది ఓటు రేటు! అయితే ఇక్కడ అభ్యర్థి బీజేపీ అయినా, పంపకం పూర్తిగా తమ కనుసన్నల్లో జరగాలని టీడీపీ క్యాడర్ డిమాండ్ చేసిందట, ఆ మేరకు టీడీపీ వాళ్లే దగ్గరుండి పంపకాలు సాగిస్తూ ఉన్నారు!
అయితే రెండు వేల రూపాయల్లో కూడా ఐదొందలు తెలుగుదేశం వాళ్లు కట్ చేసుకుని పంచుతూ ఉంటారట! ఓటుకు రెండు వేలు ధరలో టీడీపీ క్యాడర్ ఐదు వందల రూపాయలను తమ ఖాతాలోకి వేసుకుని 1500 రూపాయలు మాత్రమే పంచుతున్నారనే టాక్ స్థానికుల నుంచి వినిపిస్తూ ఉంది. అభ్యర్థి రెండు వేలు ఇచ్చినా, ఐదొందలు తెలుగు తమ్ముళ్లు తీసేసుకుని ఓటర్లకు అన్యాయం చేస్తున్నారని.. కొందరు వాపోతూ ఉన్నారు. టీడీపీ వాళ్లు ఆయనను గెలిపించడం మాటేమిటో కానీ, ఓటు రేటులో కూడా ఐదొందల రూపాయల కమిషన్ ను వారే సొంతం చేసుకోవడంతో.. బీజేపీ అభ్యర్థికీ ఆందోళన రేగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.