ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం కూటమిలో ఓట్ల బదిలీ కలగానే కనిపిస్తూ ఉంది! తన అవసరం మేరకు పొత్తులు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ బూత్ లెవల్లో మిత్రపక్షాలకు ఝలక్ ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి బీజేపీ అభ్యర్థులకు తెలుగుదేశం మార్కు ట్రీట్ మెంట్ జరిగినట్టుగా బోగట్టా!
మరీ చంద్రబాబు సన్నిహితులు అయిన బీజేపీ అభ్యర్థుల సంగతేమో కానీ, బీజేపీ అభ్యర్థులకు సైకిల్ ఓట్లు పడలేదనే ప్రచారమే జరుగుతూ ఉంది! కొన్ని చోట్ల అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఫర్వాలేదు, బీజేపీ అభ్యర్థులకు ఓటేసేది లేదనే రీతిన క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీకి ఎంపీ అభ్యర్థి ఓటేసి, ఎమ్మెల్యే అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసిన తెలుగు తమ్ముళ్లున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! బీజేపీ అభ్యర్థులు తెరపైకి వచ్చిన చోట అక్కడ అప్పటి వరకూ పని చేసిన తెలుగుదేశం వారికి మండింది! ఒక్కసారి ఇప్పుడు బీజేపీకి అవకాశం వచ్చిందంటే ఆ తర్వాత తమ పరిస్థితి గందరగోళమే అని వారికి క్లారిటీ ఉంది!
ఇప్పుడు బీజేపీ అభ్యర్థిని గెలుపుకోసం పని చేస్తే.. పార్టీ సమీకరణాలు, సామాజికవర్గ సమీకరణాలు.. అన్నీ మారిపోతాయనే క్లారిటీ వారికి ఉంది. ఇప్పుడు తమ పాత ప్రత్యర్థి గెలిచినా ఫర్వాలేదు కొత్త దోస్తు గెలవకూడదు అనేది వ్యూహాలను టీడీపీ వాళ్లు అమలు పెట్టారు!
తమకు విశ్వాసం ఉన్న క్యాడర్ కు అయితే వైఎస్ఆర్సీపీకి లేకపోతే నోటాకు వేసుకోవాలనే సందేశాలను వారు బలంగా పంపించారు! పోలింగ్ సందర్భంగా ఆ సీన్ కనిపించింది. బీజేపీ-జనసేన అభ్యర్థులు ఉన్న చోట తెలివైన టీడీపీ క్యాడర్ క్రాస్ ఓటింగ్ చేసిందని తెలుస్తోంది.
మిత్రపక్షాల అభ్యర్థులకు టీడీపీ సంప్రదాయ ఓటు బ్యాంకు ఓటేయలేదని, మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పీకల్దాకా ఉన్న వాళ్లు మాత్రమే బీజేపీ, జనసేనలకు ఓటేశారని, తెలుగుదేశం ఇన్ చార్జి మనుషులుగా పేరు పొందిన వారు, ఇన్ చార్జిలను నమ్ముకున్న వారు మాత్రం తమ పాత ప్రత్యర్థుల వైపే మొగ్గు చూపారని, కొన్ని చోట్ల అయితే కమ్మ వాళ్లు బీజేపీ- జనసేనలకు ప్రత్యామ్నాయంగా నోటాకు కూడా వేశారని వినికిడి!