జైలు నుంచి విడుదలైన హేమ

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన హేమ, ఎట్టకేలకు జైలు నుంచి బయటకొచ్చారు. హేమ తరఫు న్యాయవాది వినిపించిన వాదనలతో ఏకీభవించిన స్థానిక న్యాయస్థానం, ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల తదుపరి విచారణకు అందుబాటులో ఉండాలని, దేశం విడిచి వెళ్లకూడదంటూ కొన్ని నిబంధనల్ని జతచేసింది.

రేవ్ పార్టీ తర్వాత హేమ నుంచి ఎలాంటి మాదకద్రవ్యాల్ని పోలీసులు స్వాధీనం చేసుకోలేదని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. అంతేకాకుండా, పార్టీ జరిగిన 10 రోజుల తర్వాత వైద్య పరీక్షలు చేశారని చెప్పకొచ్చారు.

డ్రగ్స్ పరీక్షల్లో హేమకు పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని సీసీబీ పోలీసులు కోర్టుకు విన్నవించారు. విచారణకు పిలిచినా సాకులు చెప్పారని, అందుకే అరెస్ట్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. హేమ నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారా అనే ప్రశ్నకు పోలీసుల నుంచి సమాధానం రాలేదు. హేమనే పార్టీని ఆర్గనైజ్ చేశారనే అంశంపై సాక్ష్యాలు ఉన్నాయా అనే ప్రశ్నకు కూడా పోలీసుల నుంచి సమాధానం లేదు.

దీంతో హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని ఈరోజు ఆమె జైలు నుంచి బయటకొచ్చారు. జైలు బయట ఆమె కోసం ఎదురుచూసిన మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. Readmore!

మే 19న బెంగళూరులోని ఓ ఫామ్ హౌజ్ లో రేవ్ పార్టీ జరిగింది. వంద మందికి పైగా ఆ పార్టీకి హాజరయ్యారు. ఆకస్మికంగా దాడులు చేసిన పోలీసులు అందరి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. వీరిలో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు డ్రగ్స్ తీసుకున్నట్టు టెస్టుల్లో వెల్లడైంది. ఇందులో హేమ కూడా ఒకరు.

ఆ టైమ్ లో తను హైదరాబాద్ లోనే తన ఫామ్ హౌజ్ లో ఉన్నానంటూ హేమ ఓ వీడియో రిలీజ్ చేశారు. మరుసటి రోజు వంట చేస్తూ మరో వీడియోను కూడా విడుదల చేసి బుకాయించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు మాత్రం విడిచిపెట్టలేదు. హైదరాబాద్ వచ్చి మరీ హేమను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. 3వ తేదీన అరెస్ట్ అయిన హేమ, ఈరోజు బెయిల్ పై బయటకొచ్చారు.

Show comments

Related Stories :