ఎమ్బీయస్‍: జగన్ని అండరెస్టిమేట్ చేశా!

చంద్రబాబు గారి నోట యిలాటి స్టేటుమెంటు వస్తుందని నేనెన్నడూ అనుకోలేదు. ఆయన తన తప్పు ఒప్పుకోవడం నాకు గుర్తున్నంత వరకు యిదే ప్రథమం. ఆయన ఎప్పుడూ అవతలి వాళ్లదే పొరబాటంటాడు. ఉమ్మడి రాష్ట్రంలో తక్కిన జిల్లాలన్నిటినీ ఎండగట్టి, హైదరాబాదు మాత్రమే డెవలప్ చేశారేం? అని అడిగితే, ‘ఇది పూర్తి చేసి, అవి చేద్దామనుకున్నాను. ఇంతలో ప్రజలు నన్ను ఓడించి, వాటి అభివృద్ధిని చెడగొట్టుకున్నారు’ అంటాడు. 2019లో ఘోరంగా ఓడిన తర్వాత కూడా ‘మాలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుని మళ్లీ మీ ముందుకు వస్తాను’ అనే రొటీన్ రాజకీయ నాయకుడిలా కాకుండా యీయన ‘నన్ను ఓడించి మీరు తప్పు చేశారు, అనుభవిస్తున్నారు’ అని ప్రజల్నే నిందించారు.

ఈ మధ్య మానేశారు కానీ గతంలో ‘నేను మారాను’ అంటూండేవారు. అప్పుడు కూడా నాలో ఫలానా లోపాలు ఉండేవి, వాటిని సవరించు కున్నాను అనే ధోరణిలో చెప్పేవారు కాదు. ‘పదవిలో ఉన్నపుడు ఇరవై నాలుగ్గంటలూ ప్రజా సంక్షేమం గురించి వర్రీ అవుతూ పార్టీని పట్టించుకోలేదు. అందుకే ఓడాం. ఇప్పుడు మారాను. పార్టీ నాయకులను, కార్యకర్తలను తరచుగా కలిసి మార్గదర్శనం చేస్తాను.’ అనేవారు.

‘ప్రజలు నా నుంచి కోరుకున్నది నేను చేయలేకపోయాను, వారిని నిరాశ పరిచాను కాబట్టే ఓడాను.’ అని ఎప్పుడూ అనలేదు. అలాటి మనిషి యిప్పుడు తనంతట తనే ‘జగన్‌ను తక్కువ అంచనా వేశాను.’ అని ఒప్పుకోవడం చాలా వింతగా ఉంది. ఇది బాబు స్వయంగా అన్నారు కాబట్టి సరిపోయింది. ఇదే మాట టిడిపిలో మరో నాయకుడు అని ఉంటే అతని తల ఎగిరిపోయి ఉండేది. బాబు కత్తి చేత పట్టి ఎగరగొట్టేవారని అనటం లేదు. అసలు అక్కడిదాకా రానివ్వరు తెలుగు మీడియా వారు. ఆయన్ని అంతలా మోస్తారు వారు.

ఈ మధ్య కొన్ని సర్వేలు కూటమి గెలుస్తుంది అనడం, తెలుగు మీడియా జగన్ యింటికి వెళ్లడం ఖాయం అని నిరంతరం చెప్తూ ఉండడంపై మీరేమంటారు? అని కొందరు పాఠకులు మెయిల్సు రాస్తున్నారు. నేను ఒకటే చెప్తాను – ‘చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచి ఎన్నికలు వచ్చిన ప్రతి సారి తెలుగు మీడియా టిడిపియే గెలుస్తుంది అంటూ చెప్తూ వచ్చింది. ఒక్కసారి కూడా ఓటమి భయం ఉందని రాయలేదు, చెప్పలేదు. కానీ ఆయన గెలిచింది 1999, 2014 (విభజిత రాష్ట్రం)లలో మాత్రమే. 2004, 2009, 2019లలో ఓడిపోయాడు. Readmore!

నెగ్గిన రెండు సందర్భాల్లో యితర పార్టీలతో జట్టు కట్టి నెగ్గారు. ఓడిన సందర్భాల్లో 2019లో ఘోరాతిఘోరమైన ఓటమి. పార్టీ చరిత్రలో అంతటి పరాజయం ఓ రికార్డు. అయినా తెలుగు మీడియా, సర్వేలు దాన్ని ఊహించలేదు, ఊహించినా మనకు చెప్పలేదు. అందువలన తెలుగు మీడియా, సర్వేలు చెప్పినంత మాత్రాన కూటమి గెలవదు, ఓడదు. ఈ ప్రచారానికీ ఫలితాలకూ సంబంధం ఉండదు.

బాబు యిచ్చిన ప్రస్తుత స్టేటుమెంటు మే 8న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు యిచ్చిన యింటర్వ్యూలో యిచ్చినది. ఆ యింటర్వ్యూలో బాబు ‘జగన్ లాటి వాడు పుట్టి ఉండకూడదు’ అన్నారని టీవీ స్క్రోలింగులో వచ్చింది కానీ మర్నాటి పేపర్లో దాన్ని ఎడిట్ చేశారు. కానీ యీ కామెంటును మాత్రం ఎడిట్ చేయలేదు సరి కదా, సెకండ్ హెడింగ్‌గా ‘గతంలో జగన్‌ను అంచనా వేయలేకపోవడం వైఫల్యమే...’ అని యిచ్చారు. ‘గతంలో’ అని యిలా క్వాలిఫై చేయడం గమనార్హం. పది రోజుల క్రితమే జగన్‌ను బచ్చా అన్నారీయన. ‘నేను బచ్చానైతే ఒంటరిగా ఎందుకు ఎదుర్కోలేక పోతున్నారు?’ అని జగన్ కౌంటరు యిచ్చారు. ‘జగన్ పీడ ఎప్పుడు వదుల్చుకుందామా అని మీరంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.’ అని సభల్లో ప్రజలకు చెప్తూనే కూటమి కట్టడానికి బాబు చాలా విషయాల్లో రాజీ పడ్డారు. రాజీ పడడానికి యిచ్చగించని పార్టీ నాయకులతో ‘ఒంటరిగా వెళితే లాభం లేదు’ అని నచ్చచెప్పి కొన్ని సీట్లు జనసేనకు, బిజెపికి యిప్పించారు.

ఈ యింటర్వ్యూలో రాధాకృష్ణ ‘జగన్ మళ్లీ వస్తాడని మీకు డౌట్ ఉందా?’ అని అడిగినప్పుడు ‘0000.1 శాతం (యిది అచ్చుతప్పో, బాబే అలా చెప్పారో నాకు తెలియదు. ఎందుకంటే పాయింటు తర్వాత ఆ సున్నాలు పెడితే ఎఫెక్టివ్ కానీ పాయింటుకి ముందు ఎన్ని సున్నాలు పెట్టినా ఒకటే!)  మేర కూడా నాకు అంచనా లేదు.’ అని జవాబిచ్చారు బాబు. గతంలో అంటే 2019లో అని అనుకుంటే అది కరక్టే. ఎందుకంటే 2019 ఎన్నికలు అయిపోయి, ఫలితాలకై ఎదురు చూసే టైములో బాబు తమకు 110-130 సీట్లు వస్తాయని చెప్పారు. అది ఆయన ప్రిడిక్టింగ్ కెపాసిటీ! ఆయనను మెప్పించడానికి తెలుగు మీడియా వ్యతిరేకంగా చెప్పదు.

అప్పుడే 'మీరే పెద్దన్న పాత్ర వహించి మోదీ వ్యతిరేక కూటమికి సారథ్యం వహించాలి' అని మాయావతి బాబుని కోరినట్లు, మోదీకి సీట్లు తగ్గడం చేత దిల్లీలో యీయన చక్రం తిప్పబోతున్నట్లు రాసేసింది. ఫలితాల తర్వాత మోదీ ఎక్కడున్నారో, బాబు ఎక్కడికి చేరారో అందరికీ తెలుసు. ఇప్పుడు బాబు మోదీని పొగుడ్తున్న తీరు చూస్తే, మోదీయే సిగ్గుపడి ‘అంతొద్దండి’ అనేట్లా ఉంది.  

ఆంధ్రజ్యోతి యింటర్వ్యూలో రాధాకృష్ణ బాబుని ‘2019కి ముందు జగన్ విషయంలో అవగాహన ఏర్పరచుకోలేక పోయారు. ఆ కారణంగానే కదా మీకు యీ దుస్థితి?’ అని అడిగారు. 2019కి ముందు అంటే ఎంత ముందు? 2014 ఎన్నికలలో మోదీ, పవన్‌ల గ్లామరు తోడైన టిడిపి కూటమికి, వైసిపికి ఓట్ల శాతంలో తేడా 2 కంటె తక్కువ కదా! లక్ష కోట్ల అవినీతి, జైలు పక్షి, తండ్రి శవం పక్కన సంతకాలు సేకరించినవాడు, పాలనానుభవం లేనివాడు.. వగైరా ముద్రలన్నీ ఉన్న జగన్ అప్పుడే అన్ని ఓట్లు తెచ్చుకుంటే, అతను నస్మరంతి గాడని బాబు ఎలా అనుకున్నారో మనకు అర్థం కాదు. 23 మంది ఎమ్మెల్యేలను లాగేశారు సరే, కానీ 40 ప్లస్ జగన్‌తోనే నిలిచారు కదా! అలాటప్పుడు జగన్ పని ఫినిష్ అయిపోయింది అనుకోవడం పొరపాటు కాదూ!

పోలవరం జాతీయ ప్రాజెక్టును తన నెత్తికెత్తుకోవడం, దశాబ్దాలు పట్టే అమరావతి వంటి మహానగర నిర్మాణాన్ని తలపెట్టడం యివన్నీ రిస్కే కదా! ఐదేళ్లలో పూర్తి చేయగల చిన్న ప్రాజెక్టులు చేసి జనాల్ని మెప్పించే బదులు బాబు యింతటి భూరి ప్రాజెక్టులు చేపట్టి, చెప్పుకోవడానికి ఏదీ మిగలని పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? జగన్ యిప్పట్లో రాడు, సమాధి అయిపోయాడు అనే తప్పుడు అంచనా కారణంగానే కదూ! ఆ అంచనా తను అధికారంలోకి వచ్చిన ఏడాదికే వచ్చేసిందనుకోవాలి. ఆయన ధీమా చూసి, ఆయన అభిమానులందరూ అమరావతి మహానగర ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి, చేతులు కాల్చుకున్నారు. సరే, రాధాకృష్ణ వేసిన యీ ప్రశ్నకు బాబు సమాధానమేమిటో తెలుసా? ‘జగన్ గురించి తండ్రి వైయస్సార్‌కు తెలుసు. అందుకే బెంగుళూరు పంపించేశాడు..’ అని.

ఆయన ఉద్దేశమేమిటో నాకు అర్థం కాలేదు. ‘బెంగుళూరు ఏమైనా అండమానా? సైబీరియానా? అక్కడకి పంపించి వేయడం శిక్షా? వైయస్ ఫ్యామిలీకి బెంగుళూరులో పెట్టుబడులు, వ్యాపారాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ‘నేనిక్కడ రిస్కుతో కూడిన రాజకీయాల్లో ఉన్నాను కదా! నువ్వు బెంగుళూరులో వ్యాపారాలు చేస్తూ, మనకు నికరాదాయం వచ్చే మార్గం చూడు.’ అని వైయస్ ఉద్దేశం కావచ్చు. తండ్రీ కొడుకులు ఒకే చోట రాజకీయాలు చేస్తూ ఉంటే ఆల్టర్నేటివ్ సెంటర్ ఆఫ్ పవర్ ఏర్పడుతుందనే ఆలోచన కావచ్చు. అయినా వైయస్ పోయినది 2009లో. జగన్ బాబుతో పోటీ పడి, తన రాజకీయ చతురతతో 38శాతం సీట్లు సంపాదించుకున్నది 2014లో! అది చూసి బాబు శత్రువును సరిగ్గా అంచనా వేయడం నేర్చుకుని ఉండాల్సింది. ఆయన 2019లో జగన్‌నే కాదు, మోదీనీ తక్కువ అంచనా వేశాడు.

బెంగుళూరు విషయం చెప్పాక బాబు ‘మేం తక్కువ అంచనా వేశాం. సరిగా అంచనా వేయలేక పోవడం వైఫల్యమే. కానీ ఊహించలేదు.’ అన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు కదా, ఊహించ లేకపోవడమేం? అని నేను అనను. ఎందరో రాజకీయ భీష్ములను చూశాను. గ్రహప్రభావమో ఏమో కానీ, ఎవరికైనా కొంతకాలమే వెలుగుతారు. తర్వాత చీకటి కమ్ముతుంది. బుద్ధికి గ్రహణం పడుతుంది. బ్రహ్మానంద రెడ్డి అందర్నీ ఆటాడించడం చూశాను. తర్వాత కనుమరుగు కావడం చూశాను. వెంగళరావూ అంతే. కరుణానిధికి జయలలిత అంటే చాలా తేలిక భావం ఉండేది. చివరకు ఆమెను ముఖ్యమంత్రి గద్దె నించి దింపకుండానే చనిపోయాడు. ప్రధానిగా చేసిన దేవగౌడ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అనుభవం ఉంది కదాని చివరిదాకా గొప్ప ఆలోచనలే వస్తాయని లేదు. పొరపాట్లు చేస్తారు. వాటికి ఫలితాలను అనుభవిస్తారు. బాబు జగన్‌ను తక్కువ అంచనా వేశారు. పార్టీని అధఃపాతాళానికి తీసుకెళ్లారు.

2019 మాట సరే, తర్వాతైనా మేల్కొన్నారా? జగన్ సైకో, పాలన తెలియదు, రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం తప్ప మరేమీ రాదు అని మనకు చెప్తున్నారు సరే, ఆయనా నమ్ముతున్నట్లుంది. ఇప్పుడు ఆయన వాగ్దానాలు చూస్తూంటే జగన్ చేసిన ప్రతీదాన్నీ ఆమోదించినట్లు, కొనసాగించ బోతున్నట్లు కనబడుతోంది. వాలంటీర్లను తిట్టిపోశారు, అలాయిలా కాదు, అమ్మాయిలను అక్రమ రవాణా చేస్తున్నారని ఆయన సహచరుడు అన్నారు, యీయన ఖండించలేదు. అలాటిది యిప్పుడు ఆ వ్యవస్థ కొనసాగించడమే కాక జీతం రెట్టింపు చేస్తున్నామంటున్నారు. అంటే రెట్టింపు మంది అమ్మాయిలను రవాణా చేయమని టార్గెట్ పెడతారా?

గ్రామ సచివాలయాలు దండగ అన్నారు. ఇప్పుడు వాటి మాట ఎత్తటం లేదు. ఫ్యామిలీ డాక్టరు స్కీము అనవసరం అన్నారు. దాన్ని డిస్కంటిన్యూ చేస్తామని అనటం లేదు. అంటే అవన్నీ మంచివని యీయన ఒప్పుకున్నట్లే కదా! మాయాబజారులో లక్ష్మణ కుమారుడు తన అనుచరుణ్ని ‘బలరాముడు వస్తున్నాట్ట, ఆయనకు నమస్కారం ఎలా పెట్టాలి?’ అని అడుగుతాడు. దానికి అతను ‘ధర్మరాజుగారు భీష్మద్రోణాదులకు వంగివంగి నమస్కారాలు పెడుతూంటే చూసి మనం నవ్వుకునేవాళ్లంగా, అలాగే మీరూ ఒంగిఒంగి..’ అని చెప్తాడు. అలా ఉంది బాబు వరస. జగన్ పెట్టిన వాటినన్నీ తిట్టిపోసి, యిప్పుడు వాటినే కంటిన్యూ చేస్తాననడం జగన్‌కు కాంప్లిమెంటు యిచ్చినట్లే కదా!

ఇక పథకాల గురించి – జగన్ వచ్చిన దగ్గర్నుంచి సంక్షేమ పథకాలతో సంక్షోభం తెచ్చాడు. అభివృద్ధికి డబ్బు చాలటం లేదు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు అని ఒకటే గోల. ఇప్పుడు వాటిని రెట్టింపు చేస్తానంటున్నాడు. జగన్ సంక్షేమ పథకాలతోనే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని గోల పెట్టినవాడు యిప్పుడు అంతకంటె కిందకు తీసుకుపోతాడా? జగన్ ప్రజల్ని సోమరులుగా చేస్తున్నాడని ప్రవచిస్తూ వచ్చిన మేధావులందరూ టిడిపి మేనిఫెస్టో గురించి, సూపర్ సిక్స్ గురించి కిమ్మనక పోవడం వింతగా లేదూ! టిడిపినీ తప్పు పట్టాలి కదా! మేనిఫెస్టోలో ఆయన హామీల జాబితా చూసి బిజెపియే బెదిరిపోయి, మోదీ ఫోటో వేయవద్దంది. కొందరు నాయకులు అవి మా హామీలు కావని చెప్పేశారు కూడా. కానీ యీ మేధావులు మాత్రం పెదవి విప్పరు.

పథకాలపై జగన్ విపరీతంగా ఖర్చు పెట్టడం చేతనే బిల్లులు పెండింగులో పడ్డాయి, అభివృద్ధి ఆగిపోయింది అన్నది వాస్తవం. ఒక చేత్తో 100 యిచ్చి మరో చేత్తో 1000 లాగుతున్నాడు అనే ఆరోపణ ఉంది. (ఇది చాలా ఫన్నీ. పెన్షన్లు అందుకున్న వాళ్లు, ...కోని వాళ్లు అందరూ పెరిగిన కరంటు బిల్లు కట్టాల్సిందే. పెట్రోలు, డీజిల్ హెచ్చు ధరలకు కొనాల్సిందే. డబ్బు లాగేది అందరి దగ్గరా, పథకాల లబ్ధిదారుల వద్ద మాత్రమే కాదు. అందుచేత ఒక చేత్తో యిచ్చి, మరో చేత్తో తీసుకుని.. అనేది యిక్కడ పొసగదు). మరి బాబు దానికి రెట్టింపు యిస్తే? ఆయన ఒక చేత్తో 100 యిచ్చి మరో చేత్తో 2000 లాగుతాడనాలా? జీవితం మరింత దుర్భరం అయిపోతుంది. అభివృద్ధి మరింత దెబ్బ తింటుందని భయం వేయదూ?

బండోపంత్ ఫస్ట్‌క్లాసు ప్రయాణం అనే కథ ఉంది. అతను ప్రయాణం చేసే ఫస్ట్‌క్లాసు పెట్టెలో ఫ్యాన్లు పని చేయవు. ఒక స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తర్వాతి స్టేషన్లో ఒక మెకానిక్ ఎక్కి, పెద్ద సుత్తితో టపటపా కొట్టి చూస్తాడు. భరించలేనంత చప్పుడు వస్తుంది కానీ ఫ్యాన్లు తిరగవు. ‘పై స్టేషనుకు కబురు పెడతాం.’ అని అతను దిగిపోతాడు. తర్వాతి స్టేషన్లో మరో మెకానిక్ అంతకంటె పెద్ద సుత్తి తెచ్చి దబదబా బాది, వీళ్ల చెవులు చిల్లులు పడేట్లు చేస్తాడు. అయినా ఫ్యాన్లు తిరగవు. ‘పై స్టేషనుకు కబురు పెడతాం’ అని అతను దిగిపోతాడు. పై స్టేషన్లో అంతకంటె పెద్ద సుత్తి.. ఇలా నాలుగు స్టేషన్లు గడిచేసరికి ప్రయాణీకులందరూ ‘ఫ్యాన్లు తిరక్కపోయినా ఫర్వాలేదు కానీ పై స్టేషనుకు మాత్రం ఏమీ చెప్పకు.’ అని బతిమాలతారు. అలా నాయకులు సంక్షేమాలు పెంచుతామన్నపుడల్లా ప్రజలు దణ్ణాలు పెట్టి, ఉన్నదానితో సర్దుకుంటాం, యింక పెంచకండి అని బతిమాలే రోజు వస్తుంది.

అలాటి పరిస్థితి రానివ్వను, సంపద సృష్టించి పథకాలకు నిధులు సమకూరుస్తాను అనే బాబు, ఎలా సృష్టిస్తారో మాత్రం చెప్పరు. పోనీ సృష్టించినా, దానితో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి అభివృద్ధి పనులకు వెచ్చించ వచ్చుగా, కోట్లలో బకాయి పడిన బిల్లులు చెల్లించవచ్చుగా, అప్పులు తీర్చేసి వడ్డీ భారం తగ్గించవచ్చుగా! ఇప్పటికే భారంగా మారిన సంక్షేమ పథకాలపై మరింతగా ఖర్చు పెట్టడం దేనికి? లింగ, వయో, కుల వివక్షత లేకుండా అందర్నీ బద్ధకస్తుల్ని చేయడానికా? బాబు గతంలో సంపద సృష్టించిన దాఖలాలేవీ? ప్రపంచ బ్యాంకు పథకాలకు గాఢాభిమాని అయిన ఆయన వారి షరతుల ప్రకారం సంక్షేమాలు, సబ్సిడీలు తగ్గించి, పన్నులు పెంచి వారి చేత శభాష్ అనిపించుకున్నారు, ప్రజల చేత వద్దులే అనిపించుకున్నారు. 2004లో ఓటమి తర్వాత పంథా మార్చి 2009లో నగదు బదిలీ అన్నారు. 2014లో రైతు ఋణమాఫీ అన్నారు. ఇప్పుడు ఆకాశమే హద్దంటున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అయితే సంపద సృష్టించడానికి హైదరాబాదు వంటి బంగారు బాతు ఉందనుకోవచ్చు. విభజిత ఆంధ్రలో ఏముంది? ఏమ్హీ లేదని బాబు పలుమార్లు చెప్పారు. అమరావతి బంగారు బాతు అయి ఉండేది అన్నారు. బంగారు బాతు తయారు కావడానికి ఐదేళ్లలో డబ్బు తేలేకపోయారు. క్యాచ్ 22 సిచ్యువేషన్. విభజన వలన జరిగిన నష్టాల్ని పూడ్చడానికి కేంద్రం ఏమీ యివ్వలేదని 2018లో ధర్మాగ్రహం వెలిబుచ్చారు. ఆంధ్రకు యిప్పటికీ వనరులు లేవు. బండి నెట్టుకు రావడమే కష్టం. 2014-19 మధ్య బాబు సంపద సృష్టించ లేకపోయారు. పదవి దిగిపోయేటప్పుడు ఖజానాలో 100 కోట్లు, లక్షల కోట్ల అప్పులు మిగిల్చారు. వడ్డీలతో సహా చాలా బకాయిలు పెట్టారు. భవిష్యత్తు ఆదాయం కూడా తాకట్టు పెట్టి బాండ్లు అమ్మారు. జగనూ అదే బాటలో నడిచారు. ఇలాటి ఆంధ్రలో సంపద ఎక్కణ్నుంచి కురుస్తుంది?

పోనీ బాబు మ్యాజిక్ చేసి, కొత్త ట్రిక్కులతో యీసారి సంపద సృష్టిస్తారని అనుకున్నా, దానికి సమయం పడుతుంది కదా! అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలో యింత, రెండో ఏడాదిలో మరి కొంత యిస్తాం అంటూ లెక్కలేసి చెపితే ‘కావచ్చేమో’ అనుకోవచ్చు. అబ్బే, యీయన జూన్‌లో అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్‌తో యిస్తానంటున్నాడు. జగన్ ఖజానాలో జీతాలకే కాదు, పెన్షన్లకు కూడా డబ్బు లేదని ప్రచారం చేస్తూ వచ్చిన టిడిపి, యింత లావు హామీలు యివ్వడంతో ఉద్యోగులకు బెంగ పట్టుకుంది. ఇప్పుడే 15వ తారీకు దాకా జీతాలు రావటం లేదు, ఆయనొస్తే నెలాఖరు దాకా దిక్కుండదేమోనని. మానిఫెస్టోలో హామీల కుంభవృష్టి కురిపించి, కుంజరః అన్నట్లు, కేంద్రం సహాయంతో.. అని అప్పుడప్పుడు చేరుస్తున్నారు. ఆ ముక్క బిజెపి వాళ్లనరు. అయినా సహాయం చేసే రకమా కేంద్రం?

పైగా బిజెపి అధినాయకులు మోదీ, అమిత్ హామీలేమీ యివ్వటం లేదు. 2019లో బాబుపై ఉపయోగించిన వర్ణనలన్నీ యిప్పుడు జగన్‌పై ఉపయోగించి వెళుతున్నారు. ఎన్నికల తర్వాత వాటిపై ఫాలో అప్ యాక్షన్ ఉండకపోవటంతో యివి ఎన్నికల ముచ్చట్లు మాత్రమే అనిపిస్తోంది జనాలకి. మొత్తం మీద చూస్తే అర్థమయ్యేదేమిటంటే పాలకుడిగా కూడా జగన్‌ను బాబు అండర్ ఎస్టిమేట్ చేశారని. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం గురించి నానా గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ఎత్తేస్తామని వాగ్దానం చేయడం లేదేం? దాన్ని వ్యతిరేకించి ‘పేదల ఉన్నత విద్యకు వ్యతిరేకి’ అనే ముద్ర తెచ్చుకున్నామని గ్రహించినట్లే కదా! పేదల పక్షపాతిగా పేరు తెచ్చుకుని, 42-45 శాతం సెక్యూర్డ్ ఓటు బ్యాంకు (ఓటేసే వర్గం, పోలింగు రోజున బద్ధకించే వర్గం కాదు) సంపాదించు కోవడానికి చూస్తున్న జగన్ రాజకీయ చతురతను కూడా అండర్ ఎస్టిమేట్ చేసినట్లే కదా!

చివరిగా బాబు జనాలను కూడా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారనిపిస్తోంది. లాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఆయన చేస్తున్న హడావుడి చూస్తూంటే! నిజానికి అది అవసరమైన సంస్కరణ. మోదీ ప్రభుత్వం అనేక రంగాల్లో స్టాండర్డయిజేషన్‌కు ప్రయత్నాలు చేస్తోంది. విద్యుత్ సంస్కరణల్లో రైతుల మోటర్లకు మీటర్లు బిగించడం అలాటి వాటిల్లో ఒకటి. ఉచిత విద్యుత్తు అంటూ రాష్ట్ర ప్రభుత్వాలు డిస్కమ్‌లకు బకాయిలు పడడాలూ అవీ కంట్రోలు చేస్తోంది. అలాగే భూమి ఓనర్‌షిప్‌ను వివాదరహితం చేయడం అత్యావశ్యకం. సర్వే చేయించడం కూడా శతాబ్దంగా బకాయి పడిన వ్యవహారం. టైటిల్‌లో వచ్చే వివాదాల వలన బాధితులైన కోట్ల మందిలో నేనూ ఒకణ్ని. వాటిని ఒక సరైన పద్ధతిలో పెడితే అంతకంటె కావలసినది ఏముంది? ఈ పని బాబు కనక తలపెట్టి ఉంటే తెలుగు మీడియా ఆకాశానికి ఎత్తేసి ఉండేది.

కేంద్రం ఆదేశాల మేరకు జగన్ యీ చట్టాన్ని ఐదేళ్ల క్రితం ప్రవేశ పెడితే టిడిపితో సహా, తెలుగు మీడియా మెచ్చుకుంది కూడా. జగన్ సర్వేయింగు మొదలు పెట్టి మూడో వంతు పూర్తి చేయించడంతో ఎవరికి చీమ కుట్టిందో ఏమో హఠాత్తుగా ఎన్నికల ముందు దాని గురించి వివాదం రేపారు. కొన్న స్థలాన్ని హెచ్చు ధరకు రీసేల్ చేసుకునే ఉద్దేశంతో లేదా సర్వే నెంబరుపై వివాదాల కారణంగా రిజిస్ట్రేషన్‌ చేయడానికి కుదరని సందర్భాల్లో, అనామత్తుగా డాక్యుమెంటు రాయించుకుని డబ్బు యిచ్చేస్తారు. అమరావతి రైతుల వంటి సందర్భాల్లో భూమి రైతు పేర ఉండవచ్చు కానీ ఓనర్‌షిప్ మరొకరిది అయి వుంటుంది. డెవలప్‌డ్ ప్లాటు తమ చేతికి వచ్చాక రిజిస్టర్ చేస్తామనే ప్రయివేటు ఒప్పందం ఉండవచ్చు. అలాటి వాళ్లకు యీ లాండ్ టైట్లింగ్ యాక్ట్ యిబ్బంది కరంగా మారిందేమో నాకు తెలియదు. అనేక రాష్ట్రాలలో అమలౌతున్న యిలాటి పాలనా సంస్కరణను ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కాక ఏదోదో ఊహిస్తున్నాను. ఎవరైనా వివరిస్తే సంతోషిస్తాను.

ఈ చట్టాన్ని బిజెపి ఆమోదించినా బాబు ఏ కారణం చేతనైనా వ్యతిరేకించ దలిస్తే దలచవచ్చు. నాటకీయంగా ఓ కాగితాన్ని చింపి పారేశారు కూడా. కానీ ‘ఆ చట్టం ద్వారా జగన్ మీ భూముల్ని లాక్కుంటాడు, దానికి నిదర్శనం దానిపై అతని బొమ్మ ఉంది’ అనడం ప్రజల తెలివితేటల్ని అవమానించడం. కరెన్సీ నోటుపై గాంధీ గారి బొమ్మ ఉంటే ఆ నోటు ఆయనదై పోతుందా? రేషన్ కార్డులపై బాబు బొమ్మ ఉంటే ఆ కార్డు ఆయనదా? రేషన్ షాపుల్లో మోదీ గారి బొమ్మ ఉండాలని నిర్మలా సీతారామన్ గారు హుంకరించి వెళ్లారు. అంటే ఆ షాపులన్నీ మోదీ పరమై పోవాలని ఆవిడ ఉద్దేశమా? అంతెందుకు కోవిడ్ వాక్సిన్ సర్టిఫికెట్టుపై మోదీ బొమ్మ ఉందంటే, ఆ వాక్సిన్ ఆయన వేయించుకున్నట్లా? మనం వేయించుకున్నట్లా?

ఓ చోట చదివాను. ఒకతను జర్మనీకి వెళ్లినపుడు అక్కడి కౌంటర్‌లో అమ్మాయి వాక్సిన్ సర్టిఫికెట్టు చూసి దీనిలో బొమ్మకీ, నీకూ పోలిక కుదరలేదందిట. అప్పుడతను ‘అది నాది కాదు, మా ప్రధానిది’ అని చెప్పుకోవలసి వచ్చిందట. ఎనీవే, ‘పాలకుడి బొమ్మ ఉంటే చాలు, ఆస్తి అతనిది అయిపోతుంది, డాక్యుమెంటులో అతన పేరు లేకున్నా, మన పేరు అమ్మానాన్నల పేర్లతో సహా ఉన్నా, డాక్యుమెంట్లపై వేలిముద్రలు మనవే ఉన్నా అవేమీ చెల్లవు’ అని ప్రజలు నమ్మేస్తారు అంటే వాళ్ల కామన్‌సెన్స్‌ని కూడా బాబు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నట్లే! అది సరే కానీ, మధ్యలో అమరావతి మాట వచ్చింది. నాలుగేళ్ల పై చిలుకు పెద్ద ఉద్యమం నడిపి, దాన్ని ఎన్నికల అంశం చేయకుండా వదిలేశారేం బాబు? దాని గురించి మరో వ్యాసంలో మాట్లాడుకుందాం.

ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2024)

 

Show comments

Related Stories :