ఎమ్బీయస్‍: మాల్దీవులతో మరింత దూరం

ఇండియాకు వ్యతిరేకి, చైనాకు ఆత్మీయుడు ఐన మొహమ్మద్ మొయిజ్జు  ‘ఇండియా ఔట్’ నినాదంతో 2023 అక్టోబరులో 54% ఓట్లతో దేశాధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడే మన దేశ ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందని అనుకున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత మాల్దీవుల అధ్యక్షుడు ఇండియాను సందర్శించడం పరిపాటి. కానీ యితను దాన్ని ధిక్కరించి టర్కీ, సౌదీ అరేబియా వెళ్లాడు. తర్వాత చైనాకు వెళ్లి భారత్‌కు వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. అప్పుడైనా ఇండియాకు రాలేదు. మోదీని కలవడం కూడా దుబాయిలో యునైటెడ్ నేషన్స్ సమావేశానికి వెళ్లినప్పుడే. తన గురువు అబ్దుల్లా యమీన్‌ను మించి చైనాకు సన్నిహితమౌతూ వచ్చాడు. అనేక ప్రాజెక్టులు దానికి అప్పగిస్తున్నాడు.

ఈ నెలలో జరిగిన పార్లమెంటు (పీపుల్స్ మజ్లిస్ అంటారు) ఎన్నికలు అతనికి కళ్లెం వేస్తాయేమో, మన దేశానికి అనుకూలంగా ఉంటూ ‘ఇండియా ఫస్ట్’ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లిన మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ (ఎండిపి) నాయకుడు ఇబ్రహీం సోలి గట్టి పోటీ యిస్తాడేమోనని మనవాళ్లు పెట్టుకున్న ఆశలు వమ్మయ్యాయి. మొత్తం 93 స్థానాల్లో మొయిజ్జు పార్టీ ఐన పీపుల్స్ నేషనల్ కాంగ్రెసు (పిఎన్‌సి) 71 స్థానాలు గెలవగా, 2019లో 87 సీట్లలో 65 గెలిచిన ఎండిపికి యిప్పుడు 12 మాత్రమే దక్కాయి. దీంతో మాల్దీవులు చైనాకు మరింత సన్నిహితంగా, మనకు మరింత దూరంగా జరుగుతాయని ధ్రువపడింది.

మాల్దీవులు కూడా మనలాగే బ్రిటన్‌కు వలస దేశంగా ఉండేది 1965లో స్వాతంత్ర్యం తెచ్చుకుంది. అప్పణ్నుంచి భారత్ దానికి అనేక విషయాల్లో చేయూత నిస్తూ వచ్చింది. అందు చేత అక్కడి ప్రజలకు భారత్‌పై అభిమానం ఉంటూ వచ్చింది. 1978 నుంచి 2008 వరకు మాల్దీవులను ఏకధాటిగా నిరంకుశంగా పాలించిన అబ్దుల్ గయూమ్ (86 ఏళ్లు), ఆయన తర్వాత 2012 వరకు ప్రభుత్వాన్ని నడిపిన ఎండిపి అధ్యక్షుడు నషీద్‌లకు భారత్ పట్ల సుహృద్భావం ఉండేది. పిపిఎం (ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్) పార్టీ తరఫున గయూమ్ సవతి తమ్ముడు అబ్దుల్లా యమీన్ 2013 ఎన్నికలలో ‘ఇండియా ఔట్’ నినాదంతో నషీద్‌ను ఓడించి, 2018 వరకు అధ్యక్షుడిగా ఉన్నాడు. అతను భారత్‌తో ఘర్షిస్తూ, చైనాకు సన్నిహితమయ్యాడు. దానితో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం చేసుకున్నాడు. పెద్ద ఎత్తున ఋణాలు తీసుకున్నాడు. తమ దేశంలో భారీ ప్రాజెక్టులను పెట్టడానికి చైనాను ఒప్పించాడు. చైనా వారి బెల్డ్ అండ్ రోడ్ ఇనీషియేటివ్‌లో మాల్దీవులను భాగస్వామిని చేశాడు.

ఈ చర్యలన్నీ మాల్దీవు ప్రజలను భయపెట్టాయి. దేశాన్ని చైనాకు తాకట్టు పెట్టేశాడని భయపడి 2018 ఎన్నికల్లో ఓటర్లు అతన్ని ఓడించి, భారత్‌కు అనుకూలుడైన ఇబ్రహీం సోలీని గెలిపించారు. ఇండియా హమ్మయ్య అనుకుంది. సోలీ ప్రమాణస్వీకారానికి మోదీ హాజరయ్యారు. ఇండియా మాల్దీవులకు ఒకటిన్నర బిలియన్ డాలర్ల ఆర్థికసాయం ప్రకటించింది. 2019 పార్లమెంటు ఎన్నికలలో కూడా సోలీ పార్టీ ఐన ఎండిపియే ఘనవిజయం సాధించింది. సోలీ ప్రభుత్వం యమీన్‌పై అవినీతి ఆరోపణలు మోపి, అతన్ని జైలుకి పంపించింది. అతనికి 11 ఏళ్ల జైలు శిక్ష పడింది. రెండేళ్లు జైల్లో ఉన్నాడు. అతను ఎన్నికలలో పోటీ చేయకూడదన్నారు. Readmore!

కరోనా కారణంగా టూరిజం దెబ్బ తిని, దానిపై ఆధారపడిన మాల్దీవుల ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలమైంది. సోలీ ప్రభుత్వంపై వ్యతిరేకత పుంజుకోసాగింది. దీన్ని గమనించిన యమీన్ శిష్యుడు, కాబినెట్ సహచరుడు ఐన మొయిజ్జు అధ్యక్ష పదవికి పోటీదారుగా ముందుకు వచ్చాడు. జనాభాలో మూడో వంతు మంది నివసించే రాజధాని మాలె మేయరుగా చాలాకాలం పని చేసి, మొయిజ్జు ప్రజల్లో చాలా పాప్యులారిటీని సంపాదించాడు. భారతద్వేషిగా, చైనా మిత్రుడిగా తనను ప్రొజెక్టు చేసుకోవడంతో చైనా అనుకూల పార్టీలలో అనేకమంది అతన్ని అభిమానించ సాగారు. ఆ పార్టీల్లో ఒకటైన పిపిఎం అతన్నే పిపిఎం-పిఎన్‌సి ఉమ్మడి అభ్యర్థిగా 2023 అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయిద్దామంది. గత్యంతరం లేక సరేనన్న యమీన్ ఆ ఎన్నికలలో మొయిజ్జు సోలీని ఓడించి అధికారం చేపట్టడంతో ఒళ్లు మండి, పీపుల్స్ నేషనల్ ఫ్రంట్ అనే కొత్త పార్టీని పెట్టుకున్నాడు.

కానీ పార్లమెంటు ఎన్నికలలో దాని ప్రభావం ఏమీ కనబడలేదు. ఎందుకంటే లక్షద్వీప్ వ్యవహారం తర్వాత ప్రజలకు ఇండియా అంటే వ్యతిరేకత పెరిగిందని గ్రహించిన మొయిజ్జు తన గురువు యమీన్ కంటె ఎక్కువగా ఇండియా ద్వేషిగా తనను తాను చూపుకున్నాడు. దాంతో యమీన్ అనుచరులైన అనేక మంది నాయకులు మొయిజ్జు వైపు వచ్చేశారు.

మొయిజ్జు ఎంత చతురుడంటే చైనాకు తన కంటె యమీన్ అంటేనే ఎక్కువ ప్రేమ అని అతనికి తెలుసు. అందుకని తనకు యిప్పుడు ప్రత్యర్థిగా మారినా, యమీన్‌ను రక్షించి చైనా దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికీ, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికీ తను అధ్యక్షుడైన వెంటనే యమీన్‌ను జైలు నుంచి బయటకు తీసుకుని వచ్చి గృహనిర్బంధంలో ఉండే సౌకర్యం కల్పించాడు. ఈ నెలలో పార్లమెంటు ఎన్నికలలో గెలుపు తర్వాత హైకోర్టు అతని జైలు శిక్ష తీర్పుని తిరగతోడేట్లా ఏర్పాటు చేశాడు. అందువలన యమీన్ అభిమానులు కానీ, చైనా కానీ మొయిజ్జుపై కోపం పెంచుకోవడానికి అవకాశం లేకుండా చేశాడు. విపరీత జాతీయవాదాన్ని వల్లిస్తూ యమీన్ కంటె ఎక్కువగా చైనాకు ప్రాజెక్టులు అప్పగిస్తున్నాడు, ఇండియాను ద్వేషిస్తున్నాడు.

మాల్దీవుల రాజ్యాంగం ప్రకారం దేశాధ్యక్షుడు ఎవరినైనా మంత్రిగా కానీ స్వతంత్ర సంస్థల అధిపతులుగా కానీ నియమించగలడు. చాలా నిర్ణయాలు తీసుకోగలడు. కానీ దానికి పార్లమెంటు ఆమోదం అవసరం. ఏప్రిల్ ఎన్నికలకు ముందు పార్లమెంటులో సోలీ పార్టీకి మెజారిటీ ఉండేది కాబట్టి, పార్లమెంటు మొయిజ్జును నిరోధించడానికి ప్రయత్నించేది. కానీ ఎన్నికల ఫలితంగా పార్లమెంటు కూడా మొయిజ్జు వశమైంది. అంటే లోలకం చైనా వైపు పూర్తిగా వెళ్లిపోయింది. చైనా పట్ల మొగ్గు చూపడానికి గత కొన్ని దశాబ్దాలుగా అనేక పరిణామాలు దోహద పడ్డాయి కానీ ఇటీవలి కాలంలో చెలరేగిన లక్షద్వీప్ వెర్సస్ మాల్దీవ్ వివాదం లోలకాన్ని పూర్తిగా చైనా వైపు తీసుకు పోయిందనాలి. ఈ వివాదం తర్వాత కూడా పిడిపి నాయకుడు సోలీ ‘ఇండియా ఫస్ట్’ అనే నినాదం యివ్వడంతో ప్రజలు అతని పార్టీకి చావుదెబ్బ కొట్టారని  విశ్లేషిస్తున్నారు.

మొయిజ్జు అధ్యక్షుడవుతూనే భారత్‌పై ఆంక్షలు విధించసాగాడు. మాల్దీవులు అనేక చిన్నచిన్న ద్వీపాల సమూహం కాబట్టి, ప్రజలు వేర్వేరు ప్రాంతాల్లోఉంటారు కాబట్టి, ఏదైనా మెడికల్ ఎమర్జన్సీ వస్తే వాళ్లను రాజధానికి తరలించడం కష్టం. దాని కోసం మాల్దీవు ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని హెలికాప్టర్ల కోసం అర్థించటం, మన వాళ్లు ఆ సౌకర్యం అందించడం జరుగుతూ వచ్చింది. ఇకపై అలా అభ్యర్థించ కూడదని, తామే ఒక ఎయిర్ యాంబులెన్స్ సర్వీస్ అందుబాటులోకి తేవాలని మొయిజ్జు నిర్ణయించాడు. దీనికై చైనాపై ఆధారపడతాడనేది ఎవరైనా ఊహించవచ్చు.

మొయిజ్జు తమ దేశంలో ఉన్న భారత మిలటరీ ట్రూప్స్‌ని (అవి డాక్‌యార్డ్ కట్టడానికే ఉన్నాయి తప్ప వేరే ఉద్దేశంతో కాదని సోలీ తన హయాంలో వాదించాడు) వెనక్కి వెళ్లిపొమ్మన్నాడు. వాళ్ల స్థానంలో విమానాలు, హెలికాప్టర్లు ఆపరేట్ చేసే సివిలియన్ టెక్నికల్ స్టాఫ్ మాత్రమే ఉండాలన్నాడు. 2018లో యమీన్ కూడా యిలాగే అన్నాడు కానీ తన మాట చెల్లించుకోలేక పోయాడు. ఇప్పుడు మొయిజ్జు పట్టుబట్టి సాధించాడు. మోదీ నచ్చచెప్పినా లాభం లేకపోయింది. వీళ్లను పంపించి వేసిన వారం తిరక్కుండా మొయిజ్జు ప్రభుత్వం చైనాతో ఒక రక్షణ ఒప్పందం చేసుకుంది.

ఇప్పుడు మొయిజ్జు కనీవిని ఎరుగని రీతిలో రాజధాని మాలెలో ఒక పెద్ద రియల్ ఎస్టేటు ప్రాజెక్టు రూపొందిస్తున్నాడు. దాన్ని ఎలాగూ చైనాకు అప్పగిస్తాడు. అది చైనాకు, మాలెలోని ధనికులకు ఆకర్షణీయంగా ఉంది. దానిలో ప్లాట్లను ఎరగా చూపించి, తక్కిన ఎంపీలను కూడా తన పార్టీలకు ఆకర్షించవచ్చని, ఆ విధంగా తనకు ఎదురు లేకుండా చూసుకుంటాడని అనుకుంటున్నారు. మాల్దీవుల్లో ఫిరాయింపుల నిరోధ చట్టం లేదు. అందువలన నాయకులు యథేచ్ఛగా పార్టీలు మారుతూంటారు. ప్రజల దృష్టిలో మొయిజ్జును బలోపేతం చేసిన లక్షద్వీప్ గొడవేమిటో చూద్దాం.

ఈ ఏడాది జనవరిలో మన దేశంలో భాగమైన లక్షద్వీప్‌ను మోదీ సందర్శించి, అది చక్కటి పర్యాటక ప్రదేశంగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. దాని ఆధారంగా మోదీ భక్తులు మాల్దీవుల పని అయిపోయిందని సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు. అతి చేస్తే గతి చెడుతుందని సామెత. ఈ హంగామాకు ప్రతిగా మొయిజ్జు కాబినెట్‌లో ముగ్గురు సహాయ మంత్రులు భారత్‌కు వ్యతిరేకంగా నోరు పారేసుకున్నారు. భారత ప్రభుత్వం నిరసన తెలపడంతో వాళ్లని అదుపు చేయకపోతే పొరుగు దేశాలతో బంధం చెడుతుందని భయపడి, మొయిజ్జు వారిని సస్పెండ్ చేశాడు. అయినా భారతీయులు కొంతమంది సోషల్ మీడియాలో మొయిజ్జుపై, మాల్దీవులపై పగ బట్టినట్లు వ్యవహరించి దాన్ని బాయ్‌కాట్ చేయమని టూరిస్టులకు పిలుపు నివ్వడంతో మాల్దీవుల పర్యాటకం దెబ్బ తింది.

పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు అయిన మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినడంతో అక్కడి ప్రజలు ఇండియాకు బుద్ధి చెప్దామను కున్నారు. తమ దేశానికి వ్యతిరేకంగా కాంపెయిన్ నడిపిన వారిపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని వారికి కోపం వచ్చింది. వాచాలత చూపిన మంత్రులను తమ ప్రభుత్వం సస్పెండ్ చేసింది కదా, తమకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినవారిని మరి భారతదేశం శిక్షించవద్దా అని వారి వాదన. మాది చిన్నదేశం కదాన్న అలుసా? అనే కినుక వారికి కలిగింది.

టూరిజంలో మాల్దీవులను మన లక్షద్వీప్ అధిగమించ గలదా? అనే విషయాన్ని పైపైన పరిశీలించినా యీ ‘భారత పర్యాటకులూ, మాల్దీవులకు వెళ్లకండి, లక్షద్వీప్‌కే వెళ్లండి’ కాంపెయిన్ ఎంత అర్థరహితమో తెలుస్తుంది. 1192 దీవులు (వాటిలో నివాసయోగ్యమైనవి 187) ఉన్న మాల్దీవుల విస్తీర్ణం 300 చకిమీ. జనాభా 5.20 లక్షలు. లక్షద్వీప్ 35 దీవుల సముదాయం. విస్తీర్ణం 33 చకిమీ. జనాభా 68 వేలే. లక్షద్వీప్‌లో ఆరోగ్య వసతులు లేవు. లక్షద్వీప్ మొత్తానికి ఉన్న పెద్దాసుపత్రి కావరాట్టిలోని ఇందిరా గాంధీ హాస్పటల్ ఒక్కటే. అక్కడ తగినంతమంది సిబ్బంది లేరు. తగినంత ఎక్విప్‌మెంటూ లేదు. ఏదైనా మెడికల్ కాంప్లికేషన్ వస్తే కోచికి హెలికాప్టర్‌లో తీసుకెళ్లాల్సిందే. ఎయిర్ యాంబులెన్స్‌ను హెల్త్ డిపార్టుమెంటు నిర్వహించదు, పోర్ట్ డిపార్టుమెంటు నిర్వహిస్తుంది. సాయంత్రం 6 గంటల తర్వాత దాన్ని ఆపరేట్ చేయనివ్వరు. 68వేల జనాభాకు గాను ఉన్న హెలికాప్టర్లు నాలుగు! దానితో పలుకుబడి ఉన్నవారికే ఆ సౌకర్యం అందుతోంది.

మామూలుగా కూడా లక్షద్వీప్‌కు మెయిన్ లాండ్ (కేరళ)తో కనెక్టివిటీ చాలా తక్కువ. కోచికి 460 కిమీల దూరంలో ఉన్న అగట్టిలోనే ఏకైక విమానాశ్రయం ఉంది. 72 సీట్లున్న విమానం రోజుకి ఒకసారి మాత్రమే కోచి, అగట్టిల మధ్య తిరుగుతుంది. టూరిస్టులూ, ద్వీపవాసులూ, అందరూ దానిలోనే ప్రయాణించాలి. మరి మాల్దీవుల సంగతి చూడబోతే, దాని రాజధాని మాలెకు ప్రపంచంలోని 40 దేశాల రాజధానుల నుంచి డైరక్టు ఫ్లయిట్స్ ఉన్నాయి. మన దేశం నుంచే అనేక నగరాల నుంచి అక్కడకు విమానాలున్నాయి. లక్షద్వీప్ నుంచి కేరళకు నౌకా సౌకర్యం గురించి చెప్పాలంటే 5 షిప్పులున్నాయి. కానీ వాటిలో రెండు ఎప్పుడూ రిపేర్‌లోనే ఉంటాయిని లక్షద్వీప్ ఎంపీయే చెప్తున్నాడు. ‘‘కేరళ నుంచి రౌండ్ ట్రిప్‌కై 3-5 రోజులు పడుతుంది. ఇక మాకు టూరిస్టులు ఎక్కణ్నుంచి వస్తారు?’’ అన్నాడతను.

టూరిస్టుల కోసం లక్షద్వీప్‌లో ఉన్న టూరిస్టు బెడ్స్ (సముద్రతీరంలో టూరిస్టులు విశ్రాంతిగా పడుకునేవి) 100. మరి మాల్దీవుల్లో - 60 వేలు!  పెట్రోలు, డీజిల్ సమస్య కూడా లక్షద్వీప్‌లో విపరీతంగా ఉంది. 35టిలో నాలుగంటే నాలుగు దీవుల్లో మాత్రమే బంకులున్నాయి. తక్కిన వాటిలో పెట్రోలు డీజిలును బారెల్స్‌లో తెచ్చి అమ్ముతారు. పలుకుబడి ఉంటేనే, ఆర్‌సి బుక్ చూపిస్తేనే పెట్రోలు లీటరు 250 రూ.లకు యిస్తారు. ఇలాటి పరిస్థితుల్లో మోదీ జనవరిలో వెళ్లి రూ.1156 కోట్ల డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు ప్రకటించి వచ్చారు. వాటిలో కోచి నుంచి లక్షద్వీప్‌ను కనెక్ట్ చేసే సబ్‌మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడం, కాలేపానీలో ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను బాగు చేయడం, అంగన్‌వాడి సెంటర్లను కట్టడం యిలాటివి ఉన్నాయి.

లక్షద్వీప్‌ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ మంది టూరిస్టులను భరించేందుకు అనువుగా లేదు. పర్యావరణం దెబ్బ తింటుందనే కారణంగానే దాన్ని టూరిస్టు ఎట్రాక్షన్‌గా డెవలప్ చేయలేక పోయింది భారత ప్రభుత్వం. దానికి తోడు స్థానికుల వ్యతిరేకత కూడా బాగా ఉంది. ఇప్పటికిప్పుడు హఠాత్తుగా హోటళ్లు, రిసార్టులు కట్టేసి టూరిస్టులను రప్పించేయాలన్నా అక్కడి ప్రజల సహకారం అత్యవసరం. టూరిజం అభివృద్ధి పేర ప్రభుత్వం తమ భూములు లాక్కుని, యిస్తానన్న నష్టపరిహారం యివ్వదనే భయం వారికుంది. టూరిజం అభివృద్ధి పేర బడా పెట్టుబడిదారులకు యిక్కడి భూమిని కట్టబెట్టి, తమను అణిచేస్తారనే భీతి ఉంది. అందుకని కొందరు కేసులు వేసి న్యాయపరమైన చిక్కులు కల్పిస్తున్నారు. అందువలన యీ ప్రాజెక్టులూ అవీ ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. ఎందుకంటే అక్కడ ఎంపీగా ఉన్న ఫైజల్‌కి కేంద్రం తరఫున అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న ప్రఫుల్ పటేల్‌కు ఏకాభిప్రాయం లేదు.

ఎడ్మినిస్ట్రేటర్‌కి భూమి సేకరణపై ఉన్నంత ఆసక్తి భూసొంతదారులకు పరిహారం యిచ్చే విషయంలో లేదు. పందరం భూములపై హక్కుల గురించిన కేసు విషయంలో కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ ద్వీపవాసులకు వ్యతిరేకంగా యిచ్చిన తీర్పు ఆధారంగా ఎడ్మినిస్ట్రేషన్ భూమి స్వాధీనం చేసుకోసాగింది. దానిపై అవతలివాళ్లు స్టే తెచ్చుకున్నారు. అంతకుముందున్న ఎడ్మినిస్ట్రేటర్లందరూ అధికారులే ఉండేవారు. కానీ ఎన్‌డిఏ ప్రభుత్వం వచ్చాక 2020లో గుజరాత్ బిజెపి నాయకుడైన యితన్ని పట్టుకుని వచ్చి యిక్కడ ఆ పదవిలో నియమించారు. ఇతను దాద్రా నగర్ హవేలి, దమణ్, దీవ్‌లకు కూడా ఎడ్మినిస్ట్రేటరే. అక్కడి ఎంపీ మోహన్‌భాయ్ దేల్కర్ అనే అతను గిరిజన హక్కుల పోరాట కార్యకర్త. 2021 ఫిబ్రవరిలో ముంబయిలో ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్య లేఖలో తనకు అవమానాలకు గురి చేసిన వారిలో పటేల్ కూడా ఉన్నాడని రాశాడు.

లక్షద్వీప్ ప్రజలు డిఎన్‌ఏ భారత్, శ్రీలంక, మాల్దీవు వాసులతో కలుస్తోంది. వేలాది సంవత్సరాలుగా యితర జాతులతో కలవకుండా అలాగే ఉంటున్నారు. వారిలో హిందువులు 2.8% మాత్రమే. 96.6% మంది ముస్లిములు. 0.5% క్రైస్తవులు. అయినా యీ పటేల్ వారి ఆహారపు అలవాట్లు, మనోభావాలు పట్టించుకోకుండా గోవధను నిషేధించాడు. 2020లో తన నియామకం నుంచి అతను తీసుకున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదమయ్యాయి. ఏ వ్యక్తినైనా సరే, అదుపులోకి తీసుకుని ఏడాది వరకు ఏ విచారణా జరపకుండా జైల్లో ఉంచడానికి ఎడ్మినిస్ట్రేటర్‌కు అధికారం యిస్తూ చేసిన చట్టానికి వ్యతిరేకంగా 2021లో చాలా ఆందోళనలు జరిగాయి. ఏ నష్టపరిహారంతో పని లేకుండా భూమిని స్వాధీనం చేసుకోగల హక్కును లక్షద్వీప్ డెవలప్‌మెంట్ అథారిటీకి కట్టబెడుతూ ఎడ్మినిస్ట్రేటర్ చేసిన వివాదాస్పద చట్టం కేంద్ర హోం శాఖ దగ్గర పెండింగులో ఉంది.

ఇటువంటి ఘర్షణ వాతావరణంలో లక్షద్వీప్‌లో ఎప్పటికి టూరిజం వృద్ధి చెందేనో ఎవరికీ తెలియదు.

కానీ సోషల్ మీడియా వారికి అవేమీ పట్టవు. మోదీ వెళ్లి దాన్ని మెచ్చుకున్నారు, అంతే, అది మాల్దీవులకు పోటీగా టూరిస్టు డెస్టినేషన్‌గా మారిపోతుంది అంటూ ఆకాశానికి ఎత్తేస్తూ పోస్టులు పెట్టారు. దానికి ప్రతిగా మాల్దీవు మంత్రులు, అధికారులు కొందరు ‘లక్షద్వీప్ టూరిస్టు ఎట్రాక్షన్‌గా పెరిగితే సంతోషమే కానీ, మాల్దీవులతో పోటీకి వస్తుందని అనడం అర్థరహితం. మా దగ్గరున్న ఆతిథ్యం, అందించే సేవల నాణ్యత, వసతులు అక్కడెక్కడున్నాయి?’ అని ఎద్దేవా చేశారు. వెంటనే ఇండియాలో హాహాకారాలు చెలరేగాయి.

అక్కడేముంది? ఇక్కడేముంది? అనే వివరాలు తెలుసుకోకుండానే చిన్న దేశానికి యింత అహంకారమా? దాన్ని మనం బాయ్‌కాట్ చేస్తే మలమలమాడి ఛస్తారు. ఇప్పణ్నుంచి దాన్ని బహిష్కరించండి. లక్షద్వీప్‌కే వెళ్లండి అని కాంపెయిన్ మొదలెట్టారు. భారతదేశం అధికారికంగా నిరసన తెలపడంతో మాల్దీవు ప్రభుత్వం ఆ మంత్రులపై చర్యలు తీసుకుంది. సస్పెండ్ చేసింది. అయినా మనవాళ్ల కోపం చల్లారలేదు. అక్షయకుమార్, సచిన్ టెండుల్కర్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహాం వంటి ప్రముఖులందరూ కొందరు సూటిగా, కొందరు లక్షద్వీప్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు కనిపించేలా ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ కాంపెయిన్‌లో పాలు పంచుకున్నారు. సెలబ్రిటీలే యిలా ప్రవర్తిస్తే సోషల్ మీడియాలోని రైట్‌వింగర్స్ ఎలా చెలరేగి పోయి ఉంటారో ఊహించండి. 

మాల్దీవులకు వెళ్లకపోవడమే దేశభక్తికి చిహ్నం అనే మానసిక స్థితికి వచ్చిన టూరిస్టులు వసతుల లేమి కారణంగా లక్షద్వీప్ వెళ్లే సాహసం చేయలేదు. మధ్యేమార్గంగా శ్రీలంకకు వెళ్లారు. గత ఏడాది జనవరిలో 14 వేల మంది ఇండియన్ టూరిస్టులు అక్కడకు వెళితే, యీ ఏడాది జనవరిలో 34 వేల మంది వెళ్లారు. మాల్దీవులకు గత జనవరిలో 17 వేల మంది ఇండియన్ టూరిస్టులు వెళితే, యీ ఏడాది 15 వేల మంది మాత్రమే వెళ్లారు. ఈ ప్రభావం యితర దేశాల టూరిస్టులపై కూడా పడి జనవరి నెలలో మాల్దీవులకు 1.92 లక్షల టూరిస్టులు వెళితే శ్రీలంకకు 2.08 లక్షల మంది వెళ్లారు. అంటే గత ఏడాది జనవరి కంటె లక్ష మంది టూరిస్టులు శ్రీలంకకు ఎక్కువగా వెళ్లారన్నమాట. శ్రీలంకలో శాంతిభద్రతలు మెరుగు కావడం కూడా ఒక కారణం కావచ్చు. కానీ టూరిజం ప్రధాన ఆదాయంగా కల మాల్దీవు ప్రజలకు యిది ఎంతెలా కడుపు మండించిందో ఊహించనక్కర లేకుండా ఏప్రిల్ ఎన్నికలలో ఇండియాపై ద్వేషాన్ని కుమ్మరించారు, మొయిజ్జుకు ఓట్లు కురిపించారు.

ఇరుగు పొరుగు దేశాల మధ్య వైషమ్యాలూ ఉంటాయి, వ్యాపార బంధాలూ ఉంటాయి. దేనివకవే! పాకిస్తాన్, చైనా మనకు శత్రు దేశాలే. అయినా వారితో వాణిజ్యం సాగటం లేదా?  సరిహద్దు గురించి నిరంతరం తగాదా పడే చైనా నుంచి గత ఐదేళ్లలో మన దిగుమతులు ఎంతలా పెరిగాయో తెలుసా? 2018-19లో 70 బిలియన్ డాలర్లుంటే 20123-24కి అది 101 అయింది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో సగానికి సగం చైనా నుంచి వచ్చేవే! పొరుగున ఉంటే చాలు, చిన్నాచితకా దేశం కూడా మనకు ముఖ్యమైనదే. అందుకే వాళ్లకు ఆర్థిక సాయం చేస్తూ మనవైపే ఉండేట్లు చూసుకుంటూ ఉంటాం. ఆ దేశం సైజు కాదు ముఖ్యం, భౌగోళికంగా అది ఎంత కీలకంగా ఉందా అనేదే ప్రధానం.

మన శత్రువుతో చేతులు కలిపి అక్కడ వాళ్ల సైనిక స్థావరాన్ని పెట్టుకోవడానికి అనుమతించిందంటే మన కొంప మునిగినట్లే. కాబట్టి  ఏదైనా వివాదం వచ్చినపుడు సున్నితమైన ద్వైపాక్షిక సంబంధాలు చెడకుండా ప్రభుత్వంలోని మంత్రులు, దౌత్యాధికారులు గతంలో అయితే లౌక్యంగా ఒక ప్రకటన చేసేవారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఆవేశపరులదే రాజ్యం అయిపోయింది. చీకట్లో ఉంటూ ఆకాశం నుంచి బాణాలు వేసినట్లు, బాధ్యతారహితంగా ఏవేవో రాసేస్తున్నారు. వాళ్లలో కొంతమంది  యీ దేశంలో ఉండనే ఉండరు. తమ రాతల వల్ల అనర్థం జరిగినా వారికి ఏ నష్టమూ జరగదు. అవతలి దేశస్తులు కూడా వీరికి దీటుగా అల్లరి చేస్తున్నారు.  

గత కొన్ని దశాబ్దాలుగా మాల్దీవు ప్రజల ఆలోచనాధోరణిలో వస్తున్న మార్పుల గురించి ఎఱిక ఉంటే యీ సోషల్ మీడియా యోధులు జాగ్రత్తగా వ్యవహరించేవారేమో. 12వ శతాబ్దంలో ఇస్లాంకు మారిన మాల్దీవుల జనాభాలో 98% ముస్లిములున్నా వారు 1970ల వరకు ఉదారవాద ఇస్లాము అవలంబించే వారు. గల్ఫ్ దేశాలకు పెట్రోలు ఆదాయం వచ్చిపడడంతో అవి యిలాటి దేశాలకు ఆర్థిక సాయం చేస్తూ తమ తరహా ఛాందస ఇస్లాం వైపు మళ్లమని ప్రోత్సహించ సాగాయి. మాల్దీవులను 30 ఏళ్ల పాటు నిరంకుశంగా పాలించిన మహమ్మద్ గయూమ్ 1980, 90లలో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి మతాన్ని వాడుకున్నాడు. అరబ్ దేశాల చమురు తీసుకుంటూ వారి కోరిక మేరకు ఇస్లాంను అధికారిక మతంగా ప్రకటించాడు. షరియాకు అనుగుణంగా చట్టాలను ప్రవేశ పెట్టాడు. ఆఫ్గనిస్తాన్‌పై రష్యా దాడి, అల్ ఖైదా, ట్విన్ టవర్స్‌పై దాడి తర్వాత క్రైస్తవ దేశాల్లో ఇస్లాంపై ద్వేషం.. యివన్నీ మాల్దీవు యువతలో కొందర్ని రాడికలైజ్ చేశాయి. కొందరు అల్ ఖైదాలో చేరి, 2007లో మాలెలో జరిగిన వరుస బాంబు పేలుళ్లకు బాధ్యులుగా తేలారు.

ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక గయూమ్ గద్దె దిగాడు. మాల్దీవుల్లో బహుళ పార్టీ వ్యవస్థ ఏర్పడింది. మతం పట్ల మోజు పెరుగుతున్న విషయం గమనించి కొందరు మత ప్రాతిపదికపై పార్టీలు ఏర్పరచి, షరియా చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని పట్టుబట్ట సాగాయి. బాబ్రీ మసీదు కూల్చివేతతో భారత్‌లో పుంజుకున్న హిందూత్వవాదం మాల్దీవుల్లో భారత వ్యతిరేకతకు పునాది వేసింది. దీన్ని పాకిస్తాన్ వాడుకుంటోంది. దీనికి చైనా తోడయింది. హిందూ మహాసముద్రంలో ఉన్న దేశాలన్నిటిపై ఆధిపత్యం సంపాదించాలని చైనా ఎప్పణ్నుంచో ప్రయత్నిస్తోంది. అమెరికాకు కూడా అదే ఆరాటం. ఈ దేశాలను మంచి చేసుకుని అక్కడ సైనిక స్థావరాలు నెలకొల్పి, యీ ప్రాంతాలను చేతిలోకి తెచ్చుకోవాలని దాని ప్రయత్నం. మన దేశం రెండిటిని నిరోధిస్తూ వచ్చింది. కానీ యిటీవల మన దేశం అమెరికా వైపు మొగ్గు చూపడంతో చైనా, మనకు బుద్ధి చెప్పబూనింది.

2013లో యుపిఏ ప్రభుత్వం ఉన్నపుడు అమెరికా మాల్దీవులతో సైనిక ఒప్పందాలు చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలను భారత్ అడ్డుకుంది. కానీ ఎన్‌డిఏ ప్రభుత్వం వచ్చాక 2020లో అమెరికా-మాల్దీవుల సైనిక ఒప్పందం కుదిరితే ఇండియా హర్షించింది. మాల్దీవులకు 1800 కిమీల దూరంలో ఉన్న డిగో గార్షియాలోని అమెరికా మిలటరీ స్థావరాన్ని ఇండియా ఎప్పణ్నుంచో వ్యతిరేకిస్తూ వచ్చింది. అప్పటి శ్రీలంక ప్రభుత్వం దాన్ని సమర్థిస్తోందనే కారణం చేతనే శ్రీలంకలో తమిళుల పోరాటానికి ఇండియా మద్దతు యిచ్చింది. అలాటిది యిప్పుడు ఇండియా స్వరం మార్చింది. ఇది కూడా చైనాను మండిస్తోంది. మన పొరుగు దేశాల్లో భారత్ వ్యతిరేకతను రెచ్చగొట్టి, భారీ ప్రాజెక్టులు, అప్పులు వంటి తాయిలాలతో వారిని ఆకట్టుకుని, మనకు వ్యతిరేకంగా మారుస్తోంది. ఒప్పుకోవలసిన యింకో విషయమేమిటంటే, చైనా యిలాటి ప్రాజెక్టులను చాలా సమర్థవంతంగా పూర్తి చేసి ప్రజల అభిమానాన్ని చూరగొంటోంది, తమకనుకూలమైన పార్టీలకు సహాయపడుతోంది.

మాల్దీవుల రాజకీయ పరిస్థితి యిలా ఉండగా దాన్ని ఎలా డీల్ చేయాలో మన ప్రభుత్వంలోని నాయకులకు వదిలేయడం మేలు. కానీ సోషల్ మీడియా వీరులు తామేదో వీరులు, శూరులు అనుకుంటూ పరిస్థితిని చెడగొట్టారు. ‘‘జాతిరత్నాలు’’ సినిమాలో రాహుల్ రామకృష్ణ పాత్ర చూడండి, ప్రతీ చోటా గొడవ తెచ్చిపెడతాడు. తక్కిన యిద్దరూ సర్ది చెప్పబోయినా వినడు, నాకు పౌరుషం ఎక్కువ, నేను పడను అంటాడు. అదుపు చేయబోతే నిష్ఠూరాలాడతాడు. అలా ఉంది వీళ్ల పని. ఇప్పుడు వీళ్లు కూడా ‘మాల్దీవులు పోతే పోనీ’ అనవచ్చు. దాని వలన వచ్చే పరిణామాలు వీళ్లకు పట్టవు. రెండు ప్రభుత్వాలు సఖ్యంగా ఉంటే మన పారిశ్రామిక వేత్తలు అక్కడ పెట్టుబడులు పెట్టి మన దేశానికి కూడా మేలు చేయగలుగుతారు. కానీ ఇండియాకు పూర్తి వ్యతిరేకమైన ప్రభుత్వం అక్కడ వస్తే మనవాళ్లను వెళ్లగొడతారు.

2017లో జిఎంఆర్ సంస్థ మాలె ఎయిర్‌పోర్టు విషయంలో నష్టపోయిన విషయం గుర్తు తెచ్చుకోవాలి. సోలీ పాలనకాలంలో ఇండియా ఆ దేశంలో గ్రేటర్ మాలేతో సహా చాలా ప్రాజెక్టులకు భారీ ఆర్థికసాయం అందించింది. వాటి గతి ఏమిటవుతుందో తెలియదు. నాయకుల సంగతి సరే, మాల్దీవు ప్రజలు మనకు వ్యతిరేకంగా మారకుండా చూసుకోవాలి. ‘ఇండియా ఫస్ట్’ అన్న సోలీని యీ స్థాయిలో శిక్షించి, ‘ఇండియా లేకపోతే మనకేం నష్టం? చూడండి చైనా నుంచి ఎంత సాధిస్తానో’ అంటూ చైనాతో 20 ఒప్పందాలు చేసుకుని వచ్చిన మొయిజ్జు పార్టీకి ఘనంగా గెలుపు కట్టబెట్టడం యిస్తున్న సంకేతాలను మనం గ్రహించాలి. చైనా తన పెట్టుబడులతో మాల్దీవులను ఎలాగూ ఆకర్షిస్తోంది. ఇప్పుడు అధ్యక్షుడు, పార్లమెంటు కూడా తనకు అనుకూలంగా మారడంతో ఆ దేశపు పగ్గాలను పరోక్షంగా తన చేతిలోకి తీసుకుంటుందని, మన దేశస్తుల ప్రయోజనాలకు హాని కలిగేలా చేస్తుందని సులభంగా ఊహించవచ్చు. సోషల్ మీడియా వీరులు యిది గ్రహించి కాస్త తమాయించుకుంటే సంతోషం. .(ఫోటో – ఎడమ మొయిజ్జు, కుడి పైన మాల్దీవులు, కింద లక్షద్వీప్) 

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2024)

Show comments

Related Stories :