జగన్ మూడు రాజధానుల ప్రకటన వచ్చిన దగ్గర్నుంచి, అమరావతి అంశం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. 2019 ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అన్న జగన్, తర్వాత మాట మార్చి మూడు రాజధానులుంటాయి, మూడిటిలో ఒకటి మాత్రమే అమరావతిలో ఉంటుంది అనడంతో జనాలు విస్తుపోయారు. అమరావతి మహానగరమై పోతుందని ఆశ పెట్టుకుని, పెట్టుబడులు పెట్టినవారు భగ్గుమన్నారు. మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను మూడు ముక్కలాట పేరుతో వెక్కిరించి, ఉద్యమాలు నడిపారు. అన్నీ ఒకే చోట ఉండాలి తప్ప యిలా విడగొట్టడం తప్పన్నారు. దీనికి ప్రజామోదం లేదన్నారు. వైసిపి వాళ్లు దీన్ని అధికార వికేంద్రీకరణగా పేర్కొన్నారు. 2024 ఎన్నికలు దీనిపై రిఫరెండంగా ఉండవచ్చనే అభిప్రాయం కలిగింది. ఒకే రాజధానా? మూడు రాజధానులా? అనే అంశంపై యీ ఎన్నికలే తీర్పు చెపుతాయి అనే వాదనలు అప్పట్లో వచ్చాయి.
తీరా చూస్తే మూడు రాజధానుల ముచ్చట యిప్పుడు ఎన్నికల అంశమే కాకుండా పోయింది. ఎవరూ దాని గురించి చర్చించటమే లేదు. ‘ఇలా విడగొట్టడం తప్పు కదా! ఆ ఆలోచన చేసినందుకు జగన్‌కు బుద్ధి చెప్పండి’ అని కూటమి, సిపిఐ ఓటర్లను అడగటం లేదు. ‘మేం చేసేదానిలో తప్పు లేదు కదా, మీరే చెప్పండి న్యాయం’ అంటూ వైసిపి అడగటం లేదు. అలా విడగొట్టడానికి న్యాయపరమైన చిక్కులున్నాయి, ఆ బిల్లును విత్‌డ్రా చేసుకున్నారు, వైజాగ్ నుంచి పాలన సాగిస్తానంటూ పెట్టిన గడువులు వాయిదా పడుతూనే ఉన్నాయి, అయినా జగన్ ‘వైజాగే రాజధాని’ అంటూనే ఉన్నారు, అదేదో ఫోర్‌గాన్ కన్‌క్లూజన్‌లా. వైజాగ్‌లోనే ప్రమాణస్వీకారం చేస్తానంటే, అదో పెద్ద విషయం కాదు. ప్రమాణస్వీకారం ఫలానా చోటి నుంచే చేయాలనే రూలు ఎక్కడా లేదు.
వైజాగ్ రాజధానిగా ఎలా అంటాడు? అని కూటమి ప్రజల మధ్య చర్చ పెట్టడం లేదు. దాన్ని ఎన్నికల అంశంగా తేవటం లేదు. అలా చేస్తే ఉత్తరాంధ్రలో ఓట్లు రాలవేమే అనే భయం చేత అనుకోలేము. వైజాగ్ వాసులు తమ ఊరు రాజధాని కావటంపై ఉత్సాహం కనబరచ లేదని అంతా అంటూనే ఉన్నారు. అన్ని రకాల సర్వేలు విశాఖ జిల్లాలో టిడిపి బలంగా ఉందని చూపుతూనే ఉన్నాయి. అలాటప్పుడు వికేంద్రీకరణను వ్యతిరేకించండి అనే నినాదం యివ్వడానికి వాళ్లకు అభ్యంతరం దేనికో నాకు తెలియటం లేదు. జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అనే నేరేటివ్‌లో ‘రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు’ అనేది ఒక అంశంగా మాత్రమే ప్రస్తావిస్తున్నారు. నేను పలుమార్లు రాశాను – రాజధాని లేకుండా.. అని ఎలా అంటారు? ప్రస్తుతానికి అమరావతి రాజధాని. దాన్ని మారుద్దామని జగన్ ప్రయత్నించాడు, కోర్టులు అడ్డుపడడంతో ఆగిపోయాడు – యిదీ వాస్తవం. రికార్డుల్లో అమరావతే రాజధానిగా ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన వార్తలన్నిటినీ మీడియా అక్కణ్నుంచే డేట్‌లైన్ యిచ్చి రాస్తుంది. తన ప్రతిపాదనలో కూడా జగన్ అమరావతిలో మూడో వంతు రాజధాని ఉంటుంది అన్నాడు. ఆ ప్రతిపాదన కార్యరూపం ధరించలేదు కాబట్టి యిప్పటివరకూ అమరావతే రాజధాని.
మూడు రాజధానుల విషయంలో నా వైఖరి గతంలోనే స్పష్టం చేశాను. గుర్తు లేని వారి కోసం క్లుప్తంగా – అసలు మూడు రాజధానులు అనే మాటే తప్పు. హైకోర్టు ఉన్నంత మాత్రాన, దాన్ని న్యాయ రాజధాని అనడం అసంబద్ధం. సెక్రటేరియట్ యిప్పటికే అమరావతిలో ఉంది కాబట్టి పాలన అక్కణ్నుంచే కొనసాగించాలి. ఆ ఉద్యోగులను మళ్లీ వైజాగ్ తరలించడం అవివేకం. ఇక అసెంబ్లీ సెషన్ అంటారా, కావాలంటే ఒకటి ఉత్తరాంధ్ర ప్రజల సంతోషం కోసం వైజాగ్‌లో పెడితే పెట్టవచ్చు. హైకోర్టు రాయలసీమకు యివ్వకపోవడం అన్యాయం. ఒకసారి అమరావతిలో పెట్టిన తర్వాత మార్పుకై సుప్రీం కోర్టు అనుమతిస్తుందో లేదో తెలియదు. ఇదీ నా ఉద్దేశం.
15వేల గ్రామ సచివాలయాలు పెట్టి, వాలంటీరు వ్యవస్థ ద్వారా అనేక సేవలు యింటి దగ్గరే అందిస్తున్నపుడు, అనేక సేవలు ఆన్‌లైన్‌లోనే అందిస్తున్నపుడు రాష్ట్ర సచివాలయం ఎక్కడుంటే ఏముంది? దాని ప్రాముఖ్యతే తగ్గిపోయింది. పని గట్టుకుని దాన్ని వేరే ఊరికి తరలించడం హేతుబద్ధం కాదు. పేద్ద మహానగరం కట్టేద్దామనే ఊహతో బాబు తాము కట్టిన భవనాలకు ‘తాత్కాలిక’ అనే ట్యాగ్ తగిలించారు కానీ అవి అట్టముక్కల భవనాలు, పేక మేడలు కావు కదా! అక్కడ మనుషులు ఉంటూ పనులు చేసుకుంటున్నారు కదా. అక్కడే వాటిని కొనసాగిస్తూ అక్కడకు ప్రజలు రానవసరం చేయడంలోనే ఉంది ప్రజ్ఞ. రాజధాని అనే పదంపై మోజు వదులుకోవాలి.
ఇప్పుడు బాబు కూడా ‘రెండు రాజధానులుంటాయి, వైజాగ్ ఆర్థిక రాజధాని’ అంటున్నారు. ఆ పేరెందుకు? అలా అయితే సాంస్కృతిక రాజధాని, ఆధ్యాత్మిక రాజధాని, క్రీడా రాజధాని.. యిలా ప్రతీ ఊరికి ఒక పేరు తగిలించవచ్చు. ఇదంతా అనవసరం. ఒకటే ప్రిన్సిపుల్ పెట్టుకోవాలి. అన్నీ ఒకే చోట పెట్టకూడదు. హైదరాబాదు అందరికీ గట్టి పాఠం నేర్పింది. బాబు అమరావతిలో అన్నీ పెడదామని చూస్తూంటే, జగన్ అన్నీ వైజాగ్‌లో పెడదామని చూస్తున్నారు. రెండూ తప్పే! అమరావతిలోనే సెక్రటేరియట్ ఉండడం న్యాయం అనుకుంటే మరి హైకోర్టు సంగతేమిటి? అది రాయలసీమకు వెళ్లాలి కదా! బాబు ఆ విషయమై హామీ ఏమీ యివ్వటం లేదు. బెంచ్ యిస్తామని కూడా ఏమీ అనలేదు. అధికారంలోకి తిరిగి వస్తే రాయలసీమలో పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగ పడుతుందనుకుంటే, అప్పుడేమైనా చేస్తారేమో!
గత ఐదేళ్లగా టిడిపి అభిమానుల ఆలోచనలన్నీ అమరావతి చుట్టూనే తిరిగాయన్నది వాస్తవం. అమరావతి ప్రభ జగన్ అధికారంలోకి రావడానికి ముందే తగ్గిపోయింది. ఇంత పెద్ద నగరం కట్టడం బాబుకు చేతకావటం లేదన్న అవగాహన ప్రజల్లో కలిగిన దగ్గర్నుంచి, రేట్లు పడిపోసాగాయి. అయితే జగన్ వచ్చి ఎప్పుడైతే మూడు రాజధానులన్నాడో అప్పణ్నుంచో అమరావతి రేట్లు పడిపోయాయనే పల్లవిని తెలుగు మీడియా అందుకుని ప్రజల్ని నమ్మించడానికి చూస్తోంది. అధికారంలో టిడిపి కొనసాగి ఉంటే బాబు అమరావతి గురించి కాస్తోకూస్తో ఏదో న్యూస్ వదులుతూ, వందల ఎకరాలు కొన్ని సంస్థలకు చౌకగా కట్టబెడుతూ, మార్కెట్ దారుణంగా పడిపోకుండా చూసేవారేమో! జగన్ ఆ పని చేయలేదు. అంతే తేడా!
బాబు అప్పట్లో సింగపూరు ప్రభుత్వం మనకు కట్టిపెట్టేస్తుందని చెప్పినవన్నీ అబద్ధాలన్నీ తేలాయి కదా. ఈశ్వరన్ తాలూకు సింగపూరు కంపెనీలు మాత్రమే భాగస్వామి అని అప్పట్లో చెప్పలేదు. తర్వాతి రోజుల్లో ఈశ్వరన్ ఎటువంటివాడో తెలిసిపోయింది. బాబు యిప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చినా సింగపూరు, జపాన్, కొరియా పేర్లు చెప్పినా ఎవరికీ నమ్మకం చిక్కదు. అందువలన బాబు తన ఎన్నికల హామీల్లో విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చి అమరావతి మహానగరాన్ని కడతాను అని అనటం లేదు. ఇక్కడ ఒక విషయం మనం స్పష్టంగా గమనించాలి. రాజధాని అనేది వేరే, బాబు మనకు గ్రాఫిక్స్‌లో చూపించిన మహానగరం వేరే! రెండిటిని కలగలిపి మాట్లాడడంతో చిక్కు వస్తోంది. రాష్ట్రానికి రాజధాని ఉండాలి. ఐదేళ్లగా అది ఉంది. దానికి యింకా కొన్ని సౌకర్యాలు సమకూర్చాలి. క్రమేపీ సమకూర్చవచ్చు. దానికి యిబ్బంది లేదు.
ఆ మహానగరం (నవనగరాల సమూహం) ఉంది చూశారా, అది ఒక మహా స్వప్నం. దాన్ని సాధించడం యిప్పట్లో ఆంధ్రకు సాధ్యం కాదు. అది వస్తుందని నమ్మించి, భూమి రేట్లు పెంచేసి, రియల్ ఎస్టేటు వ్యాపారం చేయడంతోనే అన్ని రకాల కష్టాలు వచ్చాయి. పెట్టుబడి పెట్టినవారికి అది దుస్వప్నం అయింది. అది బాబుకి కూడా తెలుసు కాబట్టి ఎన్నికల హామీల్లో అమరావతి మహానగరం గురించి చెప్పటం లేదు. అమరావతి రాజధానిని పునర్నిర్మిస్తాను అని మాత్రం అంటున్నారు. రాజధాని అంటే కొన్ని కార్యాలయాల సమూహం. ఓ 15 ఏళ్ల వ్యవధిలో అది కట్టడానికి సాధ్యపడేదే అని నయా రాయపూర్, గాంధీ నగర్, కొత్త భువనేశ్వర్ మనకు చెపుతాయి. తన హయాంలోనే చాలా కట్టేశాను అని బాబే చెప్పారు. విస్తరింప చేస్తాను అంటే అర్థమయ్యేది, పునర్నిర్మాణం చేస్తాను అంటే ఏమిటో! పాతవి పడగొట్టి మళ్లీ కట్టరు కదా! పాత భవనాల వాస్తు బాగా లేకపోవడం చేతనే అధికారం చేజారింది, అందుకని కొత్త వాస్తు సూత్రాలతో మళ్లీ కడతానంటే మాత్రం రాష్ట్రం నడ్డి విరిగినట్లే!
బాబు ‘‘టైమ్స ఆఫ్ ఇండియా’’కు యిచ్చిన యింటర్వ్యూలో ‘‘నేను అమరావతి గురించి సింగపూరు తరహాలో వేసిన పథకాలన్నీ జగన్ వలన నాశనమయ్యాయి.’’ అంటూనే ‘‘ఇప్పుడు అధికారంలోకి వచ్చినా ఒరిజినల్‌గా కన్సీవ్ చేసిన స్థాయిలో దాన్ని కట్టలేము.’’ అని ఒప్పేసుకున్నారు. ‘కానీ కేంద్రం సహాయంతో చేస్తామనే నమ్మకంతో ఉన్నాను.’ అని చెప్పుకున్నారు. కేంద్రం సాయం అనేది ‘ఆయనే ఉంటే..’ సామెతలా ఉంది. ఈయన వేసిన మహానగరం ప్లానుని కేంద్రం ఆమోదించి, సహాయం చేసి ఉంటే బాబు ఐదేళ్లలో ఎంతో కొంత కట్టి ఉండేవారు కదా! మహానగరం బాబు కల, కేంద్రానిది కాదు. ఆ స్థాయిలో ఆంధ్రకి నిధులిస్తే మా మాటేమిటి అంటాయి తక్కిన రాష్ట్రాలు. విభజన బిల్లులో కొత్త రాజధానికై యిన్ని లక్షల (పోనీ వేల..) కోట్లు యిస్తామని కేంద్రం ఏమైనా కమిట్ అయిందా? లేదు కదా! బిజెపి జివిఎల్ నరసింహారావు అన్నట్లు - ఎవరైనా యిల్లు కట్టుకుంటామంటే డబ్బిస్తారు తప్ప, మహల్ కడతానంటే యిస్తారా?
రాజధాని నిర్మాణం అంటే మోదీ చెంబెడు నీళ్లు, గుప్పెడు మట్టి మొహాన కొట్టారు బాబే తిట్టిపోశారు. సఖ్యంగా ఉన్నపుడు గంగాజలం అన్నది, గొడవలు వచ్చాక చెంబెడు నీళ్లయిపోయింది. సఖ్యత మళ్లీ కుదిరింది కాబట్టి ఆ నీళ్లకు అర్జంటుగా పవిత్రత వచ్చి చేకూరుతుందేమో చూడాలి. నీళ్లూ, మట్టీ మాట ఎలా ఉన్నా రాజధాని కంటూ కేంద్రం యిచ్చినది రూ.2500 కోట్లే, దానిలో అమరావతి డ్రైనేజికి యిచ్చిన రూ. 1000 కోట్లు పక్కన పెడితే 1500 కోట్లే అన్నారు. అదంతా 2014-19 మధ్య చరిత్ర. ఇప్పుడు మళ్లీ కూటమి ఏర్పడింది కాబట్టి కేంద్రం నుంచి టిడిపి ఏమైనా హామీలు రాబట్టిందా అంటే ఏమీ కనబడటం లేదు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్.. యిలా వేటి గురించి బిజెపి హామీ యివ్వలేదు. టిడిపి అడగలేదు.
న్యూస్‌లాండ్రీ శ్రీనివాసన్ జైన్ తన యింటర్వ్యూలో బాబుని ‘ప్రత్యేక హోదాపై హామీ పొందారా?’ అని అడిగితే ‘అది యిప్పుడు ఇర్రెలవెంట్. దాని బదులు ప్రత్యేక పాకేజీ యిచ్చారు కదా!’ అన్నారు బాబు. ఔనా!? ఇవ్వలేదని కదా 2018లో ఆగ్రహించారీయన! రెండో విడత యివ్వాలంటే మొదట విడతగా యిచ్చిన దాన్ని ఎలా ఖర్చు పెట్టారో వివరాలు (యుటిలిటీ సర్టిఫికెట్టు) కావాలని అడిగినందుకు నానా యాగీ చేసిందీయనే కదా! ఆంధ్రులు ప్రత్యేక హోదా మాట మర్చిపోవచ్చు. అటూ జగనూ అడగరు, యిటు బాబూ అడగరు. దాన్ని ఒక అంశంగా యింకా మాట్లాడుతున్న దెవరైనా ఉన్నారా అంటే ఆంధ్ర మేధావుల ఫోరం చలసాని శ్రీనివాస్, యీ మధ్య షర్మిల. ఇద్దరూ సాధించ గలిగేదేమీ లేదు.
ప్రత్యేక హోదా సంగతి యిదైతే అమరావతి మహానగర నిర్మాణం గురించి బిజెపి యిప్పుడైనా హామీ యిస్తోందా? అమరావతిని మళ్లీ రాజధానిని చేస్తాం అని మాత్రమే అమిత్ షా చెప్పారు. మళ్లీ రాజధాని చేయడమేమిటి, యిప్పటికే అక్కడ ఉంటే! పూజలో పునఃప్రతిష్టాపయ.. అంటూ దేవుడి విగ్రహాన్ని కాస్త పక్కకు కదిపి, మళ్లీ ఒరిజినల్ స్థానంలోకి పెట్టేస్తారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన దగ్గర్నుంచి, పక్కకు విజయవాడ వరకైనా కదపలేదు. వైసిపి వాళ్లు ఉగాది నుంచి రాజధాని వైజాగే, దసరా నుంచి అక్కడే, దీపావళి నుంచి ముమ్మాటికీ అక్కడే... అంటూ అట్లతద్దితో సహా అన్ని పండగలకూ, వైజాగ్‌కు బదిలీ ముహూర్తాలకు లింకు పెట్టి మాట్లాడారు కానీ రాజధానిని యించి కూడా కదపలేక పోయారు. కోర్టులు ఆ మేరకు జాగ్రత్తలు తీసుకున్నాయి.
మరి అమిత్ షా ప్రకటనకు అర్థమేమిటి? ‘రాజధాని ఎక్కడ పెట్టాలో అనే నిర్ణయం తీసుకోవలసినది రాష్ట్ర ప్రభుత్వమే’ అని కేంద్రం పక్షాన కోర్టులో చెప్పినదానికి కట్టుబడుతూ రాష్ట్రంలో ఎన్‌డిఏ అధికారంలోకి వస్తే నిర్ణయం తీసుకునే అధికారం మాకు వస్తుంది కాబట్టి మేము మూడు రాజధానుల ప్రతిపాదన జోలికి పోము. అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా అంగీకరిస్తాము.’ అని చెప్పడమన్నమాట. మహానగర నిర్మాణానికి నిధులిస్తాం అని కాదు కదా, రాజధాని నిర్మాణం పూర్తి చేయడానికి ఎంతో కొంత డబ్బులు కేంద్రం నుంచి యిస్తాం’ అనైనా ఆయనేమీ కమిట్ కాలేదు. మోదీ అసలు ఆ జోలికే పోలేదు. 2014 తిరుపతి సభలో కూడా మీ రాజధానిని దిల్లీ అంతటి పెద్ద నగరంగా కట్టుకోండి అని సుభాషితాలు పలికాడు తప్ప, దానికి గాను యింతిస్తాం అనే హామీ యివ్వలేదు.
ఇలాటి పరిస్థితుల్లో అమరావతి మహానగరం ఎలా తయారవుతుందనేది నా ఊహకు అందటం లేదు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం బాధ్యత ఐతే, బాబు దాన్ని తన నెత్తిన వేసుకున్నారు. దాన్ని విమర్శించిన జగన్, తను అధికారంలోకి వచ్చాక తిరిగి కేంద్రానికి అప్పగించాడా అంటే అదీ లేదు. నిర్వాసితుల పరిహారం ఖర్చు మాదా, మీదా? అనే గొడవ తేలటం లేదు. నిధులు చాలక ప్రాజెక్టు ఆలస్యమౌతోంది, ఖర్చులు పెరుగుతున్నాయి. దీనికి గాను పవన్‌కు ఒక ఐడియా వచ్చింది. రాష్ట్రంలో ప్రతీ ట్రాన్సాక్షన్‌పై ‘పోలవరం సెస్’ విధించి ఆ డబ్బుతో పూర్తి చేయాలని! ఇప్పుడీ అమరావతి మహానగరం కోసం కూడా ‘అమరావతి సెస్’ విధించాలని బాబు ప్రతిపాదిస్తారేమో!
అదే కనక జరిగితే యూట్యూబర్ చింతా రాజశేఖర్ గారు ఎంతలా విరుచుకు పడతారో నేను ఊహించలేను. ఆయన చాలా ఆదర్శభావాలతో జనసేనలో చేరి, అక్కడి పరిస్థితులతో విసిగి వేసారి, యిప్పుడు పవన్‌కు బద్ధవిరోధిగా మారారు. అమరావతి మహానగరం కాన్సెప్టే పెద్ద స్కామంటారాయన. ఆయన లాజిక్ ఎలా సాగిందో చెప్తాను. సిఆర్‌డిఏ స్కీము ప్రకారం భూమి సొంతదారు (రైతు అనడం సరికాదని నా అభిప్రాయం. రైతు అంటే కౌలు రైతు కూడా వస్తాడు. స్వయంగా వ్యవసాయం చేయకుండా భూమి హక్కులు మాత్రమే కలవాణ్ని రైతు అనలేం కదా. భూస్వామి అనాలి. భూస్వామి అనగానే వందల ఎకరాలుండవలసిన అవసరం లేదు. రెండెకరాలున్నా భూస్వామే) ఎకరం (4840 చ.గ.) భూమి యిస్తే అతనికి ప్రతిఫలంగా 1000 చ.గల రెసిడెన్షియల్, 200 (కొన్ని చోట్ల 300) చ.గ.ల కమ్మర్షియల్ ప్లాటు యిస్తారు. అంటే కనీసం 25% భూమి అతనికి వస్తుంది.
ప్రభుత్వానికి కూడా 25% వస్తుంది. తక్కిన 50% డెవలప్‌మెంట్‌కై (రోడ్లు, పార్కులు, యితర సౌకర్యాలు, పేదలకు యిళ్లు వగైరా) పోతుంది. రైతులు త్యాగం చేశారు వంటి కబుర్లు వట్టిమాట. మనం పాత యింటిని కూల్చి ఫ్లాట్లు కట్టడానికి డెవలప్‌మెంట్‌కై బిల్డర్‌కు ఎలా యిస్తామో, వాళ్లు తమ భూములను అలా డెవలప్‌మెంట్‌కై యిచ్చారు. దీని విలువ ఎంత? అన్నీ పూర్తయితే ప్రభుత్వానికి వచ్చే 25% వాటా విలువ 2 లక్షల కోట్ల రూ.లకు చేరేది అని చంద్రబాబు అన్నారని రాజశేఖర్ గుర్తు చేస్తున్నారు. అంటే భూస్వాములకు వచ్చే 25% వాటా విలువ కూడా 2 లక్షల కోట్ల రూ.లేగా! దీన్ని 29 వేల పైచిలుకు భూస్వాములకు మాత్రమే కట్టబెడదామని చూడడం స్కాము కాదా? అని ఆయన ప్రశ్న. ఎందుకంటే డెవలప్ చేయడానికి అయ్యే ఖర్చు రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజలు భరించాలి. లాభం చేకూరేది ఆ 29 వేల మందికి మాత్రమే! ఇదెక్కడి న్యాయం?
పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా వేల కోట్లు ఖర్చు పెట్టటం లేదా? అంటే గోదావరి అక్కడే ఉంది మరి. ఈ మహానగరం యిక్కడే కట్టాలని ఏమీ లేదు. ఎక్కడైనా కట్టవచ్చు. ఒకే చోట కట్టాలని లేదు. ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటే అక్కడే కడుతూ పోవచ్చు. పోలవరం వలన అనేక జిల్లాలలో ఉన్న వ్యవసాయదారులు బాగుపడతారు. పంటలు పండుతాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుంది. ఎగుమతులు చేసి ఫారిన్ ఎక్స్‌ఛేంజి సంపాదించవచ్చు. మరి ఈ మహానగరం నిర్మాణం వలన బాగు పడేది ఆ 29 వేల మంది మాత్రమే కదా! వారి పట్ల యీ వలపక్షం దేనికి? అదీ ఆయన ప్రశ్న.
ఒకవేళ అక్కడే కట్టి తీరాలని ప్రభుత్వం నిర్ణయించుకుని ఉన్నా, 2013 భూసేకరణ చట్టం ప్రకారం రిజస్టర్ ఆఫీసులో నమోదైన విలువకి 2-3 రెట్లు ఖరీదు చెల్లించి కొనేస్తే పోయేది కదా అని ఆయన సూచించారు. 2014లో రిజిస్టర్ విలువ ఎకరాకు 2-3 లక్షలుందిట. ఆ ప్రకారంగా 4-9 లక్షలివ్వాల్సి ఉండేది. కానీ మార్కెట్ విలువ 8-10 లక్షలుంది కాబట్టి, భూస్వాములు అమ్మడానికి యిష్టపడేవారు కాదేమో. అప్పుడు ఎకరాకు 20 లక్షలిచ్చి కొనేసినా 33 వేల ఎకరాలకు రూ.6600 కోట్లు మాత్రమే అయ్యేది కదా అని ఆయన తర్కం. ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదని అనేవారి వాదన తిప్పికొడుతూ వార్షిక బజెట్ 1.20 లక్షల కోట్లలో యిదెంత? అని అడిగారు. పసుపు కుంకుమ కింద 20 వేల కోట్లను సునాయాసంగా తీయగలిగిన వారికి యిదొక లెక్కా? అని ప్రశ్నించారు.
భూములు కొనేసి ఉంటే మహానగరం ఏర్పడి అక్కడి ఆస్తుల విలువ పెరిగితే ఆ లాభమంతా 5 కోట్ల ప్రజలకే చెందేది కదా! అది చేయకుండా ఏటా కోట్లాది రూ.లు కౌలు చెల్లిస్తూ ప్రజలపై భారం వేయడం దేనికి? ఇదంతా దుర్మార్గపు కుట్ర అంటారు రాజశేఖర్. ఆయన చెప్పినట్లు ఆ 29 వేల భూస్వాములకు రూ.2 లక్షల కోట్ల (బాబు ఆలోచనలెప్పుడూ బాహుబలి స్థాయిలోనే ఉంటాయి) లాభం చేకూర్చడానికి బాబు ప్లాను వేసినా, ఆచరణలో అది చీదేసింది. వాటి విలువ దారుణంగా పడిపోయింది. చాలా కేసుల్లో భూములు చేతులు మారిపోయాయి. హెచ్చు ధరలకు అసలు ఓనర్ల దగ్గర్నుంచి కొనుక్కున్న వాళ్ల లబోదిబో మంటూ అమరావతి ‘ఉద్యమం’ నడపాలని చూశారు. అదెంత బూటకంగా నడిచిందో, భూములిచ్చిన వారి విషయంలో బాబు చేసిన దగా ఏమిటో జడ శ్రవణ్ గారు ఒక వీడియోలో వివరించారు. (https://www.youtube.com/watch?v=_siH2KyK3ck ) మొదటి 20 ని.లు చూస్తే దీని గురించి అంతా తెలుస్తుంది.
అమరావతి పెట్టుబడి దారులందరూ బాబు తిరిగి వస్తాడని, మహానగరం ప్రారంభించి, తన పదవీకాలం (ఎంతకాలం ఉంటే అంతకాలం)లో పూర్తి చేస్తాడని యిప్పుడు ఆశలు పెట్టుకున్నారు. వ్యవహారం చూస్తే గొంగళీ తీరుగా ఉంది. అమరావతి ఎన్నికల అంశమే కాకుండా పోయింది. ఎన్నికలలో ఎవరు నెగ్గుతారో తెలియదు. బాబు నెగ్గినా, జగన్ నెగ్గినా తక్షణమే పరిష్కరించవలసిన సమస్య డెవలప్‌మెంట్‌కై భూమి యిచ్చినవారికి న్యాయం చేయడం. భూమి తీసుకుని డెవలప్ చేయకపోతే ప్రయివేటు వ్యక్తినే మోసగాడంటాం. ఆ పని ప్రభుత్వమే చేయడం ఘోరం. కానీ డెవలప్ చేయడం అసాధ్యమని జగన్ చెప్పేశాడు. ఇప్పుడు బాబు ‘డిఫికల్ట్’ అంటున్నారు. కేంద్రం సహాయం చేస్తుందనుకుంటున్నాం అనేది మభ్య పెట్టడం కిందే వస్తుంది.
నాకు తోచే ఏకైక పరిష్కారం – వాళ్లకి మార్కెట్ రేటు ప్రకారం డబ్బులిచ్చేసి, ప్రభుత్వం భూమి మొత్తాన్ని స్వాధీనం చేసేసుకోవడం! 2014 రేట్ల ప్రకారం లెక్క కట్టి, దానికి వడ్డీ చేర్చి యివ్వడమో, మరోటో ప్రతిపాదించి, అవసరమైతే ఆర్బిట్రేషన్‌కు వెళ్లి, సెటిల్ చేసేసి, ఏటా యిచ్చే కౌలు డబ్బులు ఆదా చేయడం మంచిది. ఒకసారి ప్రభుత్వ భూమి అయిపోయిన తర్వాత దాన్ని పేదలకు యిచ్చుకుంటారో, యోగా సంస్థలకు అప్పగిస్తారో, నేనెప్పుడో సూచించినట్లు సహకార వ్యవసాయ సంఘాలకు లీజుకిస్తారో ప్రభుత్వం యిష్టం. ఈ పాటి ఆలోచన ఎందరికో వచ్చే ఉంటుంది. కానీ భూమి చేతులు మారిన సందర్భాల్లో యిది వర్కవుట్ కాదనే భయం ఉండి ఉంటుంది. అంటే ఒరిజినల్ ఓనర్లకు డబ్బు చెల్లించి కొన్నవారు టైటిల్ తమ పేర మార్పించుకోని సందర్భాల్లో ప్రభుత్వం యిచ్చే కాంపెన్సేషన్ ఎలా పంచుకోవాలన్న దానిపై వారిలో వారికి పేచీలు రావచ్చు.
అది వారూవారూ చూసుకోవాల్సిన వ్యవహారం. ప్రభుత్వానికి సంబంధించినంత వరకు డెవలప్‌మెంట్‌కై భూములిచ్చిన వారిని మోసగించిందనే చెడ్డ పేరు తుడిపేసుకోవడం అత్యవసరం. ఈ విషయమై వైసిపి కానీ, కూటమి కానీ తమ మానిఫెస్టోలో చెప్పకపోవడం, యిది ఎన్నికల అంశమే కాదన్నట్లు ప్రవర్తించడం అన్యాయం. వైసిపి మొదటి నుంచి దీనిపై ఉదాసీనంగా ఉంది. గత నాలుగున్నరేళ్లగా అమరావతి గురించి రోజురోజూ ఊదర గొట్టినా తెలుగు మీడియా కూడా మౌనంగా ఉండడం వింతగా, విచిత్రంగా ఉంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2024)