అల్లుఅర్జున్‌.. అంత హ్యాండ్సమ్‌? ఆ యాడ్‌ ఏంటి!

'జులాయి' సినిమాలో అల్లుఅర్జున్‌ రాజేంద్రప్రసాద్‌ ఇంట్లోకి వెళ్లగానే, రాజేంద్రుడి కూతురు పాత్రధారి అల్లుఅర్జున్‌ వంకచూస్తూ ఉంటుంది, ఫోన్‌ పట్టుకుని వెనక్కు బెండ్‌ అయ్యి మరీ ఆమె ఇంట్లోకి వచ్చిన ఆ కుర్రాడిపై కన్నేస్తుంది. అదంతా త్రివిక్రమ్‌ మార్కు హాస్యం. కూతురు మరీ అంతలా బెండ్‌ అవుతుండే సరికి రాజేంద్రప్రసాద్‌ కలగ చేసుకుని.. అల్లుఅర్జున్‌ని ఆమె వద్దకు తీసుకెళ్లి.. 'ఇతడు రవీంద్ర నారాయణ్‌.. యావరేజ్‌గా ఉన్నాడు..' అని అంటాడు.

అదీ తన సినిమాలో హీరోకి త్రివిక్రమ్‌ ఇచ్చిన ట్యాగ్‌. 'యావరేజ్‌గా ఉన్నాడు..' అని. మరి ఆ సినిమాలో హీరో అల్లుఅర్జునే అయినా.. యావరేజ్‌గా ఉన్నాడనే డైలాగ్‌ను పెట్టాడు ఆ దర్శక రచయిత. మరి ఆ డైలాగ్‌పై అల్లుఅర్జున్‌కు కూడా క్లారిటీ ఉంటుంది. కాబట్టే అది సినిమాలో పెట్టారు.. ఎడిటింగ్‌ లేకుండా ప్రేక్షకుల వద్దకే ఆ డైలాగ్‌ వచ్చింది.

మరి 'యావరేజ్‌' హీరోని హ్యాండ్సమ్‌గా చూపుతూ ఇప్పుడు టీవీలో వస్తున్న ఒక యాడ్‌ విడ్డూరం అనే విమర్శను ఎదుర్కొంటోంది. ఒక ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ యాడ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నాడు అల్లుఅర్జున్‌. ఇటీవలే ఆ ఒప్పందం కుదిరింది. ఆ యాడ్‌ ఇప్పుడు టీవీల్లో వస్తోంది. మరి సినిమాల్లో 'యావరేజ్‌' అనిపించుకున్న హీరోను ఒక్కసారిగా హ్యాండ్సమ్‌గా చూపుతుండటం ఒకింత విచిత్రంగా ఉంది. ఆ హీరో హ్యాండ్సమ్‌ ఎప్పుడయ్యాడబ్బా? అనేది అంతుబట్టని వ్యవహారంగా ఉంది.

యావరేజ్‌ అని సినిమా ముఖంగానే ఒప్పుకున్నందుకు ఆ హీరోని అభినందించాల్సిందే.. ఇప్పుడొచ్చి ఫెయిర్‌ అని హ్యాండ్సమ్‌ అని అంటుంటే అవాక్కవ్వడం ప్రేక్షకుల వంతు అవుతోంది. ఇక యాడ్‌ఫిల్మ్‌లో ఇది వరకూ బాలీవుడ్‌ ప్రముఖ హీరోలు కనిపించారు. షారూక్‌, సూర్య వంటి హీరోలు అందులో అగుపించారు మరి షారూక్‌ ఏమో కానీ సూర్య మాత్రం నిజంగా హ్యాండ్సమ్‌ అనిపించాడు. మరి బుడంకాయ్‌ హీరోలు కూడా ఇలా ఫెయిర్‌గా ఉన్నట్టుగా, హ్యాండ్సమ్‌ అనిపించుకుంటున్నారు.

మరి వారికి క్రేజ్‌ ఉంటే ఉండొచ్చు కానీ.. అంత మాత్రానా వాళ్లే అందగాళ్లు, వాళ్లే హ్యాండ్సమ్‌ అని జనాలపై రుద్దడమే విడ్డూరంగా ఉంటుంది. అసలు అల్లుఅర్జున్‌ తన తొలి సినిమాలో ఎలా ఉంటాడో.. ఇప్పుడెలా మారాడో.. దానివెనుక కిటుకు ఏమిటో ఎవరికీ తెలీదు.

మరి అంత మారినా.. అందం విషయంలో మరీ ఐడల్‌ స్టేటస్‌కు వెళ్లలేడు ఈ హీరో. అల్లుఅర్జున్‌లో వచ్చిన మార్పులు అతడి పర్సనల్‌. కానీ అందగాడని జనాల మీద రుద్ధడమే ఇక్కడ విడ్డూరమైన అంశం. అయితే ఇది కేవలం అల్లుఅర్జున్‌ విషయంలో జరుగుతున్నదే కాదు.. టాలీవుడ్‌లో ఇలాంటి వ్యవహారాలు మరికొన్ని ఉన్నాయి.

చాలా సినీ కుటుంబాల నుంచి హీరోలు వస్తున్నారు.. వారిని బలవంతంగా హీరోలుగా జనం మీద రుద్దుతున్నారు. అలా రుద్దీరుద్దీ వారిని హీరోలు అనిపిస్తున్నారు. వారి విషయంలో ఇండస్ట్రీ నుంచినే భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. ఒకవైపు దగ్గుబాటి రానాను హీరోగా రుద్దుతున్నారా.. అతడి విషయంలో ఇటీవల రాజమౌళినే ఒక కామెంట్‌ చేశాడు. బాహుబలి సినిమా విశేషాలను వివరిస్తూ.. రానా మొహంలో భావాలు పలకవు.. అని రాజమౌళి అన్నాడు.

ఒక టీవీ చానల్‌ ఇంటర్వ్యూలోనే రాజమౌళి ఆ వ్యాఖ్యానాలు చేశాడు. కాబట్టి ఆ మాటలు డాక్యుమెంట్‌ అయినట్టే. రానాను వీరుడు శూరుడు అని ఒకవైపు అభివర్ణిస్తుండగా, మీడియా ఈ పనిలో బిజీగా ఉండగా.. బాహుబలి డైరెక్టర్‌ మాత్రం రానాకు నటన చేతకాదు అని అన్నాడు. మరి నటనే చేతగాని వ్యక్తి హీరో ఎలా అవుతాడో.. మోస్తున్న మీడియాకే తెలియాలి.

ఇక రామ్‌చరణ్‌ దవడల సర్జరీ సంగతి పెద్ద వివాదమే. రామ్‌చరణ్‌కు దవడ సరిగా ఉండదని.. ఆ మధ్య యండమూరి వీరేంద్రనాథ్‌ వ్యాఖ్యానించాడు. దాన్ని మెగా ఫ్యామిలీ వాస్తవంగా తీసుకోలేకపోయింది. మా చెర్రీనే అంటారా? అంటూ యండమూరిపై విరుచుకుపడ్డారు. తను పొట్టిగా ఉంటాను... అని ఆత్మన్యూన్యతతో బాధపడే వాడిని అని యండమూరి తరచూ చెబుతూ ఉంటాడు.

ఏ మనిషిలో అయినా శారీరక లోపం ఉంటుంది.. అది దోషంకాదు అని జనరలైజ్‌ చేయడానికి యండమూరి ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే లెక్కన చరణ్‌ దవడల గురించి ప్రస్తావించాడు. సర్జరీలు జరిగాయని అన్నాడు. బహుశా అన్నీ నిజాలే కావొచ్చు.. కానీ మెగా ఫ్యామిలీ యండమూరి కామెంట్లను భరించలేకపోయింది అదీ మనోళ్ల తీరు.

మరి సినీ కుటుంబాలే కాదు.. ఇప్పుడు పొలిటీషియన్లు కూడా తమ తనయులను అందగాళ్లుగా జనాల మీద రుద్దేయత్నం చేస్తున్నారు. ఈ జాబితాలో గంటా రవితేజను ప్రస్తావించుకోవచ్చు. ఈయన హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ ఏదో రీమేక్‌ సినిమాతో వస్తున్నాడు. హీరోగా పరిచయం అవుతున్నాడు.

మరి హీరోగా వస్తున్న ఆ మంత్రిగారి తనయుడిని సినిమా వాళ్లు పొగుడుతున్న తీరును చూస్తుంటే నివ్వెరపోవడం ప్రేక్షకుల వంతు అవుతోంది. గంటా జయదేవ్‌ చూడచక్కగా ఉన్నాడని, అందంగా ఉన్నాడని అనడమే కాదు.. ప్రభాస్‌తో ఒక పోలిక తెచ్చారు. గంటా రవితేజ కూడా ప్రభాస్‌లా దూసుకుపోతాడట. ప్రభాస్‌లా ఆకట్టుకుంటాడట!

మరి తెలుగు సినీ ప్రేక్షకులు అంటే ఈ సినిమా వాళ్లు, రాజకీయ నేతలకు అంత అలుసైపోయారా? వాళ్ల నలుసులను తెచ్చి జనాల మీద రుద్దుతూనే ఉంటారా? భరిస్తున్నారు కదా.. అని చెప్పి, సహనానికి పరీక్షలు పెడుతూనే ఉంటారా? డబ్బు ఒక్కటీ చేతిలో ఉందని చెప్పి.. ఒకరి తర్వాత మరొకరు జనాల మీద పడిపోతూనే ఉంటారా? వీళ్లను సినిమా హీరోలుగానే కాకుండా, అందగాళ్లుగా ఒప్పుకునేంత వరకూ వదిలేలా లేరు. ఇక నిస్సిగ్గు మీడియాది మరో రకమైన వ్యభిచారం.

ఎవరు ఎవరిని ఎలా పొగిడినా.. దాన్ని భారీ ఎత్తున అచ్చేయడం. అడ్డమైన కితాబులు ఇస్తూ అచ్చేసి వదలడం మీడియాకు ఓ పనైపోయింది. ప్రేక్షకుడికి వాస్తవాలు స్ఫూరణకు వచ్చినా మీడియా సహించలేదు. ప్రేక్షకుల వాస్తవ అభిప్రాయాలను కప్పి పెట్టడానికి తనవంతుగా మీడియా ఏవో ఎత్తులు వేస్తూ ఉంటుంది. మాటలు, విశ్లేషణలు, వర్ణనలతో ప్రేక్షకుల అభిప్రాయాలను మార్చడానికి మీడియా శతథా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇదో సిగ్గులేని తంతు.

కానీ అంతా కలిసి తెలుగు సినిమా స్థాయిని దించేస్తున్నారనేదే బాధ. తెలుగు సినిమాను వారసులే ఎలాలి. వారినే హీరోలుగా ఒప్పుకోవాలి. ఇదే తీరును కొనసాగితే ఆఖరికి తెలుగు సినిమా పరిశ్రమే ఎవరికి పట్టుకుండా పోయే ప్రమాదం ఉంది. అవతల కన్నడ చిత్ర పరిశ్రమ పరిస్థితి అదే. 70, 80, 90లలో ఇద్దరు ముగ్గురు హీరోలే అన్ని పాత్రలే చేయసాగారు.

వేరే వాళ్లను నిలదొక్కుకోనివ్వలేదు, అస్సలు రానివ్వలేదు. తమిళంలో, తెలుగులో, హిందీలో హిట్టైన సినిమాలను తీసుకెళ్లి కన్నడలో చేస్తూ అదే సినిమా అన్నట్టుగా చూపారు. చివరకు ప్రేక్షకులు పక్క భాషల సినిమాలనే డైరెక్టుగా చూడటం మొదలుపెట్టారు. దీంతో కన్నడ చిత్రపరిశ్రమ ఎదగలేకపోయింది. అనువాదాలను నిషేధించేశారు. అయితే తెలుగు, తమిళ, హిందీ భాషల సినిమాలు డైరెక్టుగా విడుదల అవుతున్నాయి. కన్నడ చిత్ర పరిశ్రమకు ప్రమాదకరంగా మారాయి.

దీనికంతటికీ కారణం అక్కడి హీరోల తీరే. ఇండస్ట్రీలో పెద్దలుగా చలామణి అయిన ఆ హీరోలు అంతా తామవ్వాలనే యత్నంలో తమ చిత్ర పరిశ్రమను దారుణంగా దెబ్బతీశారు. వారి దెబ్బకు కన్నడ చిత్రసీమ ఇప్పటికీ కోలుకోలేదు. మరి తెలుగు చిత్రసీమలోని పోకడలను గమనిస్తే... టాలీవుడ్‌ కూడా శాండల్‌ వుడ్‌ స్థితిని ఎదుర్కొనే సమయం మరెంతో దూరంలో లేదని స్పష్టం అవుతోంది.

Show comments