రాజీనామాపై లింకులు పెడుతున్న మేనల్లుడు

రాజకీయ నాయకులు రాజీనామా చేస్తానని చెప్పడం, సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోవడం ఇదంతా మామూలు వ్యవహారమే. నువ్వు ఫలానా పని చేస్తే రాజీనామా చేస్తానని, చేయలేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా అని నాయకులు సవాళ్లు విసురుకుంటారు. ఆస్తులు రాసిస్తానని అంటారు. ముక్కు నేలకు రాస్తా అంటారు. ఇలా.. అనేక రకాలుగా ప్రతిజ్ఞ చేస్తుంటారు. కానీ ఈ పనులేమీ జరగవు.

అక్కడక్కడా కొందరు మినహాయింపుగా ఉంటారు. ఏపీలో ఎన్నికల సమయంలో ఒకప్పుడు కాపు ఉద్యమాన్ని నడిపిన ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ ను ఓడగొడతానని, అలా చేయకుంటే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. అయితే పవన్ గెలవడంతో తన సవాల్ ప్రకారం తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నాడు. ఆయన పేరు మార్చుకున్నంత మాత్రాన కులం మారిపోతుందా? ఆయన వంశం మొత్తం రెడ్లు అయిపోతారా? సరే ...అది వేరే సంగతి.

అసలు విషయానికొస్తే ...రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఆగస్టు 15 లోగా రైతు రుణ మాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఉప ఎన్నికలో కూడా పోటీ చేయనని కేసీఆర్ మేనల్లుడు అండ్ మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరాడు. ఆ తేదీలోగా రుణ మాఫీ చేయకుంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలన్నాడు.

ఈ సవాలును స్వీకరించిన రేవంత్ రెడ్డి చెప్పిన తేదీలోగా రుణ మాఫీ చేసి తీరుతానని, హరీష్ రావు రిజైన్ లెటర్ జేబులో పెట్టుకొని రెడీగా ఉండాలని అన్నాడు. కొన్ని రోజులు ఈ ప్రహసనం నడిచింది. ఇతర గులాబీ పార్టీ నాయకులు కూడా హరీష్ రావుకు వంత పాడారు. కానీ  అనుకున్న తేదీ కంటే ముందే  రుణ మాఫీ ప్రక్రియ మొదలుపెట్టేసరికి కాంగ్రెస్ నాయకులు హరీష్ రావును రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. Readmore!

కానీ హరీష్ రావు వెంటనే మాటకు కట్టుబడి రిజైన్ చేయడు కదా. ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి తప్పించుకోవడానికే చూస్తాడు. అలాగే చేస్తున్నాడు కూడా. ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని రైతులందరికీ (బీఆర్ఎస్ లెక్కలు వేరే) రుణ మాఫీ చేయాలని, ఆరు గ్యారంటీలను (అందులోని పదమూడు హామీలు) పూర్తిగా అమలు చేయాలని, అప్పుడే తాను రాజీనామా చేస్తానని అన్నాడు. చేయలేకపోతే రేవంత్ రెడ్డి రిజైన్ చేస్తాడా అని ప్రశ్నించాడు హరీష్ రావు.

ఆయన డిమాండ్ చేసినట్లు జరిగే అవకాశం లేదు కాబట్టి ఆయన రాజీనామా చేయడు. ఎప్పుడో తెలంగాణా ఉద్యమ విషయాలు ప్రస్తావిస్తూ అప్పుడు నువ్వు రాజీనామా చేయకుండా పారిపోయావని రేవంత్ రెడ్డిని విమర్శించాడు. తనకు పదవులకు రాజీనామా చేయడం కొత్త కాదని, తృణప్రాయంగా వదిలేస్తానని అన్నాడు. సో ...కేసీఆర్ మేనల్లుడు రాజీనామా చేయడని అర్థమైంది.

Show comments