కౌంటింగ్‌లో కూటమికి ఆధిక్యం కనిపించిన మొదలు... రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు మొదలయ్యాయి. వైసీపీ నాయకుల ఆస్తుల విధ్వంసంతో పాటు వారి వ్యాపార సంస్థలను యథేచ్ఛగా లాక్కోవడం మొదలైంది. కొన్ని చోట్ల వైసీపీ కార్యకర్తలు, నాయకుల ప్రాణాల్ని కూడా తీశారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రాణాలు పోవచ్చు కూడా.
అయితే వైసీపీ కార్యకర్తలు, నాయకుల ప్రాణాలు తీస్తూ టీడీపీ ఆనందాన్ని పొందుతూ వుండొచ్చు. ఇక్కడ అధికార పార్టీ నేతలు ప్రధానంగా గ్రహించాల్సింది... వైసీపీకి రాజకీయంగా ప్రాణం పోస్తున్నామని. వైసీపీ 11 అసెంబ్లీ సీట్లకే పరిమితమై వుండొచ్చు. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదని మరీ ముఖ్యంగా టీడీపీ నేతలు గ్రహించకపోవడం ఆశ్చర్యంగా వుంది. ఎందుకంటే 2019లో ఇదే టీడీపీ కేవలం 23 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లకు పరిమితమైన సంగతి తెలిసిందే. నాడు వైసీపీ 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లను గెలుచుకుని, ఇక తమకు తిరుగులేదని విరవీగింది.
ఐదేళ్లు తిరిగే సరికి రాజకీయంగా తలకిందులైంది. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అయిన చందంగా... వైసీపీ దారుణ పరాజయాన్ని మూట కట్టుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్రం కోసం పని చేయడం మానేసి, ప్రతీకారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయాన్ని కలిగించడంలో విజయం సాధించారు. తాజాగా ఏపీలో పరిణామాలు కూటమికి తప్పకుండా చెడ్డపేరు తీసుకొచ్చేవే.
వైసీపీని ఎంతగా వేధిస్తే, టీడీపీకి అంతగా నష్టమని గ్రహించే వరకూ రాష్ట్రంలో అవాంఛనీయ పరిణామాలు కొనసాగేలా ఉన్నాయి. ఎవరెన్ని చెప్పినా ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చేలా కనిపించడం లేదు. నష్టం జరిగితే తప్ప కనువిప్పు కాదేమో!