వైసీపీ కార్యకర్తలు కనీసం కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని తనివితీరా దర్శించుకునే భాగ్యానికి కూడా నోచుకోలేదు. టీటీడీ ఇన్‌చార్జ్ ఈవోగా అధికారాన్ని చెలాయించిన ధర్మారెడ్డి శాడిజానికి మనస్తాపం చెందిన వైసీపీ ప్రజాప్రతినిధుల హృదయాలెన్నో. తాజాగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఏకంగా 300 మంది టీడీపీ కార్యకర్తలకు ఒకే రోజు దర్శనం కలిగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టీడీపీ కోణంలో చూస్తే ఆ పార్టీ కార్యకర్తలు, ద్విశ్రేణి నాయకులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని అర్థం చేసుకోవాల్సి వుంటుంది. అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దగ్గరగా చూసుకోవాలని టీడీపీ కార్యకర్తలు కోరుకోవడం సహజం. కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పులివర్తి నాని శ్రీవారి దర్శన భాగ్యాన్ని కలిగించారు.
గతంలో తిరుమల శ్రీవారిని బ్రేక్, ఆర్జిత సేవల సమయంలో దర్శించుకోవాలని వైసీపీ నాయకులు, కార్యకర్తలు కోరుకున్నారు. అయితే దేవుడు అనుగ్రహిస్తున్నా, పూజారి అడ్డుకున్న చందంగా.. ధర్మారెడ్డి విపరీత పోకడల వల్ల దర్శనానికి నోచుకోలేకపోయారు. తమ కార్యకర్తలకు శ్రీవారి దర్శనాన్ని కోరుకున్న విధంగా కలిగించలేకపోయామని ఆవేదన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు మిగిలింది. కేవలం నలుగురైదుగురు పెద్ద రెడ్లకు మాత్రమే ధర్మారెడ్డి శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు.
దీంతో ధర్మారెడ్డి వైఖరిపై నాటి సీఎం, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ధర్మారెడ్డిపై జగన్‌మోహన్‌రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరికి అధికారాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు మొదలుకుని, చిన్న నాయకులు సైతం తమ వారికి పెద్ద సంఖ్యలో శ్రీవారి దర్శనం కల్పిస్తుంటే, ఏడ్వడం వైసీపీ కార్యకర్తలు, నాయకుల వంతైంది.
పులివర్తిలా తమ కార్యకర్తలను పట్టించుకోని వైసీపీ ముఖ్య నాయకులు సొంత మీడియాలో పలుకుబడి ఉపయోగించి వ్యతిరేక వార్తలు రాయిస్తున్నారు. ఇప్పటికైనా పులివర్తిని స్ఫూర్తిగా తీసుకుని కార్యకర్తలు, నాయకుల్ని పట్టించుకుంటే వైసీపీ నాయకులకు పుట్టగతులుంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.