ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనంలోకి రావాలంటే భయపడేవారని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించేవి. అంతేకాదు, పరదాలు కప్పుకుని జగన్ బయటికి వచ్చే వారని తరచూ ప్రతిపక్ష నాయకులు వెటకరించేవారు. ఈ నేపథ్యంలో ఐదేళ్ల తర్వాత వైఎస్ జగన్ దంపతులు మొదటిసారిగా సామాన్య ప్రజానీకంతో కలిసి విమాన ప్రయాణం చేయడం విశేషం.
వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్‌ను నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్ హుటాహుటిన తాడేపల్లికి బయల్దేరారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సతీమణి భారతితో కలిసి సాధారణ ప్రజానీకంతో కలిసి ప్రయాణించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
జగన్ నుంచి వైసీపీ కార్యకర్తలు కోరుకున్నది కూడా ఇదే. జనంతో వుంటే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. ముఖ్యంగా వైసీపీ పాలనలో లోపాలు, ప్రస్తుతం కూటమి ఏలుబడిలో అరాచకాలు జగన్‌కు తెలుస్తాయని కార్యకర్తలు అంటున్నారు. దీనివల్ల వైసీపీని బలోపేతం చేసుకోడానికి అవకాశం వుంటుందనేది ఆ పార్టీ కార్యకర్తల అభిప్రాయం. సీఎంగా వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన ఇంటికే పరిమితం అయ్యారు.
తాను నియమించుకున్న ఐ ప్యాక్ టీమ్, అలాగే సర్వే బృందాలు ఆయన్ను తప్పుదోవ పట్టించాయని వైసీపీ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయం. ఓటమి ఈ రకంగా జగన్‌కు మంచి చేస్తోందని వారు అంటున్నారు. ఇదే రకంగా నిత్యం జనంలో వుండేందుకు జగన్ ప్రయత్నించాలని వారు కోరుకుంటున్నారు. జనంలో వుండడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయని, సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని వైసీపీ కార్యకర్తల భావన.
ఒకవైపు జగన్‌ను చాలా త్వరగా జనంలోకి రప్పిస్తున్న ఘనత చంద్రబాబు పాలనకే దక్కుతుందనే అభిప్రాయం వెల్లువెత్తుతోంది. ఏదో ఒక కారణంతో జగన్ జనంలో వుంటే, చాలా త్వరగా వైసీపీ బలపడి, మళ్లీ టీడీపీతో ఢీ అంటే ఢీ అని తలపడుతామని ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు చెబుతున్నారు.