హామీలను నెరవేర్చడంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదర్శంగా తీసుకుంటారా? అనే చర్చకు తెరలేచింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన అతిపెద్ద హామీల్లో రూ.2 లక్షల రైతు రుణమాఫీ ప్రధానం. రేవంత్‌రెడ్డి సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి తెలంగాణ రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రైతు రుణమాఫీ హామీ బాగా పని చేసింది. దీంతో రుణమాఫీపై ప్రతిపక్షాల నుంచి కూడా ఒత్తిడి మొదలైంది. ఈ నేపథ్యంలో రుణమాఫీ నిబంధనలపై రకరకాల ప్రచారం జరిగింది. చివరికి పట్టాదారు పాసు పుస్తకం ప్రాతిపదికన రుణమాఫీకి రేవంత్‌రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టడం విశేషం.
ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్‌పై సహజంగానే ఒత్తిడి పెరుగుతోంది. ఒకవైపు బాబు శిష్యుడిగా పిలుచుకునే రేవంత్‌రెడ్డి రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టడంతో, ఏపీలో రైతు భరోసా ఎప్పుడనే చర్చకు తెరలేచింది. నిజానికి రేవంత్‌రెడ్డి సర్కార్‌లా పెనుభారం కూడా ఏమీ లేదు. ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తెలంగాణలో ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీకి రేవంత్‌రెడ్డి ముందుకొచ్చింది. చంద్రబాబు పాలన పూర్తయ్యే సరికి రూ.లక్ష చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి వుంటుంది.
ఎన్నికల హామీ ఇచ్చిన మేరకు రేవంత్‌రెడ్డి సర్కార్ మొదటి విడతలో భాగంగా లక్ష రుణమాఫీ చేసింది. మిగిలిన రుణాన్ని ఆగస్టు 15న చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ హామీని అమలు చేయడానికి రేవంత్‌రెడ్డికి ఆరు నెలల సమయం పట్టింది. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి 40 రోజులవుతోంది. అయితే హామీలపై చంద్రబాబు సర్కార్ ఎలా స్పందిస్తుందనే చర్చ జరుగుతోంది. పింఛన్ల పెంపు ఒక్కటే ఇంత వరకూ చంద్రబాబు సర్కార్ ఆర్థికంగా భారం పడే హామీ నెరవేర్చింది. ఇంకా చాలా నెరవేర్చాల్సినవి ఉన్నాయి.
అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కుదురుకుంటోంది. కావున మరికొంత కాలం పాటు వేచి చూడాలనే భావన అందరిలో వుంది. అయితే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో చంద్రబాబుకు సన్నిహితుడైన సీఎం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని, అధికారం చేపట్టిన వెంటనే అమలు చేశారు. మన రాష్ట్రంలో ఆ హామీపై ఇంకా స్పష్టత రాలేదు. ఏపీలో స్పష్టత రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. తెలంగాణలో రైతు రుణమాఫీ వరకూ రేవంత్‌రెడ్డి సర్కార్ కర్షకుల అభిమానాన్ని చూరగొనేలా వ్యవహరించింది. బాబు సర్కార్ ఏం చేస్తుందో మరి!