తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని భుజంపై తుపాకి పెట్టి తమ పార్టీ కీలక నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పొలిటికల్‌గా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కాల్చారు. వైసీపీ సర్వనాశనం కావడానికి ప్రధానంగా తండ్రీకొడుకులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి కారణమని ఆ పార్టీకి చెందిన మెజార్టీ నాయకుల మధ్య చాలా కాలంగా చర్చ జరుగుతోంది.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మిథున్‌రెడ్డికి రాజకీయ, ఆర్థిక అనుబంధం రీత్యా ఏ ఒక్కరూ ధైర్యం చేసి తండ్రీకొడుకులపై మాట్లాడలేదని దుస్థితి. ఒకవేళ ఎవరైనా తెలిసోతెలియకో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడిపై జగన్‌కు ఫిర్యాదు చేస్తే, ఇక రాజకీయంగా వాళ్ల జీవితం ముగిసినట్టే అనే భయం లేకపోలేదు. దీంతో వైసీపీని కాపాడుకోవాలంటే తండ్రీతనయుల్ని దూరం పెట్టాలనే అభిప్రాయం వైసీపీలో బలంగా వుంది. అయితే పిల్లి మెడలో గంట కట్టేదెవరు? అనేది ప్రశ్న.
ఇంత కాలానికి పిల్లిమెడలో గంటను మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కట్టారని ఆ పార్టీలో చర్చకు తెరలేచింది. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా చెవిరెడ్డి చెప్పుకుంటుంటారు. దీంతో పెద్దిరెడ్డిపై ఏం మాట్లాడినా చెవిరెడ్డికి ఏమీ కాదనే అభిప్రాయం వుంది. ఈ నేపథ్యంలో ఇవాళ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నానిపై విమర్శలు చేస్తూనే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీకి ఎలా ద్రోహం చేశారో చెప్పకనే చెప్పడం విశేషం. చెవిరెడ్డి సమర్థత ఏంటో ఇవాళ్టి ఆయన ప్రెస్‌మీట్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి తాము తప్ప, సొంత పార్టీకి చెందిన అభ్యర్థులందరినీ ఓడించాలని టీడీపీ అభ్యర్థులకు పరోక్షంగా మద్దతు ఇచ్చారనే ప్రచారం విస్తృతంగా సాగింది. అది ఎలా సాగిందో చెవిరెడ్డి మీడియా సమావేశంలో చెప్పిన సంగతులు వింటే అర్థమవుతుంది.
వైసీపీ హయాంలో నాని, ఆయన కుటుంబ సభ్యులపై ఒక్క కేసు అయినా పెట్టారేమో చెప్పాలని చెవిరెడ్డి డిమాండ్ చేశారు. ఒక్క రోజైనా అరెస్ట్ చేసి వుంటే చెప్పాలని చెవిరెడ్డి కోరారు. ఇదే టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు తనపై 88 కేసులు పెట్టారన్నారు. కడప సెంట్రల్ జైల్లో తనను విపరీతంగా కొట్టారని చెవిరెడ్డి ఆవేదనతో చెప్పారు. ఇదే మీరు (నాని) ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యాపార, వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పెద్దిరెడ్డిని, అప్పుడప్పుడు తనను వాడుకోలేదా అని చెవిరెడ్డి నిలదీశారు.
నాని అదృష్టవంతుడన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డితో సన్నిహితంగా మెలిగారన్నారు. వైసీపీ నాయకుడు ఎమ్మార్సీ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయగా, తమ పార్టీలోని చిన్న కార్యకర్త కూడా ప్రెస్‌మీట్ పెట్టలేదన్నారు. కానీ పులివర్తి నాని మాత్రం ప్రెస్‌మీట్ పెట్టాడరన్నారు. ఎమ్మార్సీని సస్పెండ్ చేయడం అన్యాయం, అక్రమం, అధర్మం అని నాని వాపోయాడన్నారు. మీకు, మాకు (వైసీసీ)కి బంధం కాదా? అని చెవిరెడ్డి ప్రశ్నించారు. ఆర్థికంగానో, రాజకీయంగానో సహకారం తీసుకుని వుండొచ్చన్నారు.
అలాగే సీఆర్ రాజన్ అనే వ్యక్తి వైసీపీకి చెందినవాడన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రియశిష్యుడు కూడా అని ఆయన గుర్తు చేయడం గమనార్హం. ఎంత ప్రియ శిష్యుడంటే మంత్రిగా పెద్దిరెడ్డి ఎంత బిజీగా ఉన్నా, సీఆర్ రాజన్ పుట్టిన రోజైతే ఇంటికెళ్లి మరీ శుభాకాంక్షలు చెప్పేంత అని చెవిరెడ్డి పేర్కొన్నారు. 2014 నుంచి 19 వరకు పెద్దిరెడ్డితో కటౌట్లు నింపేసే వ్యక్తి సీఆర్ రాజన్ అని ఆయన అన్నారు.
ఎన్నికలకు సరిగ్గా నెలకు ముందు సీఆర్ రాజన్ టీడీపీలో జాయిన్ అయ్యాడన్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. ఎవరు పంపారు, ఏమైనా కావచ్చని పేర్కొన్నారు. నానిని గెలిపించేందుకు సీఆర్ రాజన్‌ను పెద్దిరెడ్డే టీడీపీలోకి పంపాడనే అర్థం ధ్వనించేలా చెవిరెడ్డి కామెంట్స్ చేయడం విశేషం. టీడీపీలో చేరిన నెలకే చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్ష పదవిని సీఆర్ రాజన్‌కు ఇచ్చాడన్నారు. నాని పట్టుపట్టి మరీ పదవి ఇప్పించాడన్నారు. తమ పెద్దిరెడ్డి గారి ప్రియ శిష్యుడైన సీఆర్ రాజన్‌కు పదవి ఇప్పించడం ద్వారా వైసీపీ పట్ల కృతజ్ఞత ఏపాటిదో అర్థమవుతోందన్నారు.
అలాగే పుంగనూరులో అల్లర్లు జరిగాయని, చాలా మందిపై కేసులు పెట్టారని ఎన్నికలకు ముందునాటి పరిణామాలను చెవిరెడ్డి గుర్తు చేశారు. ఎక్కడో ఉన్న దేవినేని ఉమాపై కేసు పెట్టారని చెప్పుకొచ్చారు. కానీ పులివర్తి నానిపై తమ మంత్రి పెద్దిరెడ్డి కేసు పెట్టలేదని ఆయన అన్నారు. మూడునాలుగు రోజుల తర్వాత జ్ఞానోదయం అయ్యిందన్నారు. తనను అనుమానిస్తున్నారని నాని అన్నట్టు తనతో ఎస్పీ చెప్పారన్నారు. తనను రిక్వెస్ట్ చేస్తున్నాడని, తన పేరు ఎక్కడో ఒకచోట ఇరికించాలని నాని అడిగినట్టు ఎస్పీ తనతో చెప్పడాన్ని చెవిరెడ్డి గుర్తు చేశారు.
తాను చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడినని, కేసులో పేరు లేకపోతే అనుమానిస్తారని ఎస్సీకి నాని మొర పెట్టుకున్నాడన్నారు. తమ జిల్లాలో గొడవలు జరిగితే, తన పేరు లేకపోతే సీటే రాదేమో అని నాని అన్నట్టు ఎస్సీ తనతో చెప్పినట్టు చెవిరెడ్డి తెలిపారు. నానికి సీటు వచ్చేట్టుగా అయితే, కేసులో ఆయన పేరు పెట్టడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఎస్పీకి చెప్పినట్టు చెవిరెడ్డి తెలిపారు. నువ్వు నిఖార్సైన తెలుగుదేశం నాయకుడివా అని నానిని చెవిరెడ్డి ప్రశ్నించారు.
ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నానంటే, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు నాని గురించి తెలియడం కోసమని ఆయన అన్నారు. నానికి స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ చిత్తూరులో వుందన్నారు. కరెంట్ బకాయిలు కూడా సక్రమంగా కట్టలేదన్నారు. విద్యుత్‌శాఖ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినప్పటికీ నీ ఫ్యాక్టరీ ఒక్కరోజైనా మూశారా? అని చెవిరెడ్డి ప్రశ్నించారు. ఎందుకు మూయలేదని ఆయన నిలదీశారు. పెద్దిరెడ్డితో సాన్నిహిత్యం ఏంటని ఆయన ప్రశ్నించారు.
మీ భార్య ద్వారా పెద్దిరెడ్డితో మీకున్న బంధుత్వం ఏంటని ఆయన ప్రశ్నించారు. తన భార్య ద్వారా పెద్దిరెడ్డితో దగ్గరి బంధుత్వం ఉందని మీరే (నాని) చెబుతున్నారన్నారు. పెద్దిరెడ్డి మీకు సహకరించారన్నారు. పెద్దిరెడ్డితో చాలా దగ్గరగా ఉన్నారని నానిపై ఆరోపణలు చేశారు. పెద్దిరెడ్డి ద్వారా తనతో కూడా చెప్పించుకున్నావన్నారు. తాను కూడా గౌరవంగా చూసుకున్నట్టు చెవిరెడ్డి తెలిపారు. మీకు పెద్దిరెడ్డి వెన్నముకలాగా, గాడ్‌ఫాదర్‌లా నిలబడ్డారన్నారు. కాబట్టే మీ క్వారీ మూయలేదన్నారు. అదనంగా నీ బంధువుకు ఐదు హెక్టార్లకు అదనంగా మరో మూడు హెక్టార్ల క్వారీ వైసీపీ ప్రభుత్వంలో వచ్చిందన్నారు. పెద్దిరెడ్డితో మీకు ఎంత సాన్నిహిత్యం వుంటే, ఐదు హెక్టార్ల క్వారీని కొనసాగించడతో పాటు మరో మూడు హెక్టార్లు ఇచ్చారని నానీని చెవిరెడ్డి నిలదీశారు.
నాని టార్గెట్‌గా చెవిరెడ్డి ప్రెస్‌మీట్ పెట్టారని కనిపించినప్పటికీ, అసలు లక్ష్యం మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే. టీడీపీ ఇన్‌చార్జ్‌లను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా, తమను ఓడించడానికి పరోక్షంగా పెద్దిరెడ్డి వెన్నుదన్నుగా నిలిచారని చెప్పడమే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లక్ష్యం అనే చర్చకు తెరలేచింది. పెద్దిరెడ్డి కుటుంబం పోకడలపై వైసీపీ నేతలు రగిలిపోతున్నారు. అయితే ఇంత కాలం ఎవరూ వారికి వ్యతిరేకంగా నోరు మెదపలేదు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాత్రం తెలివిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అధికారాన్ని టీడీపీ నేతల ప్రయోజనాలకు ఎలా తాకట్టు పెట్టారో వివరించడం గమనార్హం.
చెవిరెడ్డికి సొంత పార్టీ నేతల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నట్టు తెలిసింది. వైఎస్ జగన్ శ్రేయోభిలాషిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎలా చేశారో మరింత స్పష్టంగా మాట్లాడాలని ఆయనకు చెబుతున్నారని సమాచారం.
-ఝాన్సీ