ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా పెద్ద హిట్టయింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ ఇదే. ఆల్రెడీ మూవీ వెయ్యి కోట్లు దాటేసింది కూడా. అయినప్పటికీ ఈ వసూళ్లు చాలవంటున్నాడు నిర్మాత బన్నీ వాస్. కల్కి సినిమాకు తను ఊహించిన వసూళ్లు ఇవి కాదంటున్నాడు.
"ఇదే కల్కి మూడేళ్ల కిందటొచ్చినట్టయితే ఇప్పుడొస్తున్న వసూళ్లకు డబుల్ వచ్చి ఉండేవి. ఇప్పటికీ 30 శాతం మంది ప్రేక్షకులు, కల్కి సినిమాను ఓటీటీలో చూద్దామనే ఉద్దేశంతో థియేటర్లకు రాకుండా ఇంట్లోనే కూర్చున్నారు. ఇదివరకు అలా ఉండేది కాదు. కల్కి పెద్ద హిట్టయింది కానీ దానికి రావాల్సిన వసూళ్లు ఇంకా రాలేదనేది నా అభిప్రాయం."
గతంలో మగధీర, బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలకు 3-4 వారాల పాటు థియేటర్లు హౌజ్ ఫుల్స్ నడిచాయని.. ప్రస్తుతం థియేటర్లకు జనం తగ్గుతున్నారని విశ్లేషించాడు వాసు. అందుకే తను ఆశించిన రెవెన్యూ కంటే 30-40 శాతం తక్కువగా కల్కికి వసూళ్లు వస్తున్నాయని అభిప్రాయపడ్డాడు.
కల్కి సినిమా సృష్టించిన రికార్డుల్ని అల్లు అర్జున్ పుష్ప-2 బ్రేక్ చేయాలని కోరుకున్నాడు ఈ నిర్మాత. అలా రికార్డలు బ్రేక్ అయినప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందని... ఒక సినిమాను ఇంకో సినిమా కచ్చితంగా బ్రేక్ చేయాలని అంటున్నాడు.