అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కాస్త శృతి మించి వ్యవహరించడం సహజం. వైసీపీ గాని, తెలుగుదేశం గాని ఎవ్వరు అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ కార్యకర్తల్లో కాస్త దూకుడు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తల వ్యవహార సరళి చరిత్రలో ఎన్నడూ ఎరగని విధంగా ఉంటున్నది. మరీ బరితెగించి ప్రవర్తిస్తున్నారనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.
ఎన్నికల సమయంలో స్థానికంగా ఘర్షణలు ఏమైనా జరిగి ఉంటే, వాటి పర్యవసానమైన చిల్లర తగాదాలు ప్రతి చోటా ఉంటాయి. అయితే ఈ కార్యకర్తల వైఖరి ఎలా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ప్రజా ప్రతినిధులు ఎవరిని కూడా నియోజకవర్గాలలో తిరగనివ్వం అన్నట్లుగా ఉంది.
లోక్ సభ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో అడుగు పెడితేనే నేరం అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు బరితెగించి దాడులు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. పోలీసులు చేష్టలుడిగి బొమ్మల్లాగా ఉండిపోయారంటే అతిశయోక్తి కాదు. పెద్దిరెడ్డి వాహనాన్ని తెలుగుదేశం వారు పూర్తిగా ధ్వంసం చేశారు. ఆయన పోలీసు ఎస్కార్టు మద్య పోలీసు వాహనంలోనే అక్కడినుంచి వెళ్లాల్సి వచ్చింది.
ఒక ప్రజాప్రతినిధి నియోజకవర్గానికి వస్తేనే.. తెలుగుదేశం కార్యకర్తలు తెగబడి ఎందుకంత రెచ్చిపోయి దాడి చేశారో తెలియదు. చూడబోతే.. వైసీపీ ఎమ్మెల్యేలెవ్వరినీ కూడా వదిలపెట్టేది లేదనిపిస్తోంది.
పుంగనూరులో ఇవాళ జరిగిన దాడులు, ఘర్షణలు, దహనాలు ఇవన్నీ ఇవాళే ప్రారంభం అయినవి కాదు. కొన్ని రోజుల కిందట తంబళ్లపల్లె నియోజకవర్గంలో కూడా ఇదే తరహాలో తెదేపా వారు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధ రెడ్డి నియోజకవర్గానికి వస్తే.. ఆయనను ప్రతిఘటించారు. నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.
ఎంతగా అధికారం వారి చేతుల్లో ఉంటే మాత్రం.. ఇదేం దారుణం అని పలువురు విస్తుపోతున్నారు. నియోజకవర్గంలోని మెజారిటీ ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని.. అసలు నియోజకవర్గంలోనే కాలు పెట్టకూడదంటున్నారంటే.. ఇది బరితెగింపు కదా అనుకుంటున్నారు!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్నిచోట్ల కార్యకర్తలు దుడుకుగానే వ్యవహరించారు. అయితే ఈ స్థాయి దుర్మార్గాలు గతంలో లేవు. ఇలాంటి దాడులు, హింసాత్మక ప్రవృత్తితోనే తెదేపావారు చెలరేగుతూ ఉంటే.. ప్రజలు అసహ్యించుకుంటారని వారు తెలుసుకోవాలి.