డ్రగ్స్ : ఆ బ్రదర్స్‌ను ఎంతకాలం కాపాడతారు?

డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్ పోలీసులకు చేజిక్కిన తర్వాత.. అందులో ఉన్న పేర్లన్నీ డ్రగ్స్ వినియోగదారులే అయినట్లుగా పోలీసులు భావించి, ఆ భావనతో విచారణను ప్రారంభించారు. అయితే కెల్విన్ ఫోన్ బుక్ లో సినీ ఇండస్ట్రీ తప్ప మరెవ్వరూ లేరా? అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. ఇతర రంగాల్లో ఉన్న నిందితులకు ఇంత పబ్లిసిటీ రావడం లేదెందుకు? వారిని ఇంకా విచారించడం లేదెందుకు వంటి ప్రశ్నలు వస్తాయి. ఈ లోతైన చర్చను పక్కన పెడితే సినీ రంగంలోనే దాచిపెట్టదలచుకుంటున్న కొన్నిపేర్లు దాగే పరిస్థితి లేదని క్రమక్రమంగా అర్థమవుతోంది. 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికి సుమారు డజను మందికి నోటీసులు వచ్చాయి. ఒక్కొక్కరుగా విచారించడమూ మొదలైంది. అయితే సినీ ఇండస్ట్రీలోనూ కొన్ని పెద్ద కుటుంబాలకు చెందిన వారి పేర్లను దాచి ఉంచారనే విమర్శ ఒకటి ఆదినుంచి వినిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీకే పెద్దదిక్కుగా కీలకంగా ఉండే ఓ అగ్రనిర్మాత కొడుకులు ఇద్దరూ డ్రగ్స్ తీసుకుంటారని కెల్విన్ ఖాతాదారుల్లో వారూ ఉన్నారని తరచూ పుకార్లు వస్తున్నాయి.

పూరీజగన్నాధ్ ఓ టీవీ ఛానల్ తో ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడుతూ వారి పేర్లు కూడా చెప్పి, వారినందరినీ అరెస్టు చేసే దమ్ముందా అని నిలదీసినట్లు కూడా వార్తలొచ్చాయి. ఆ తర్వాత తానెవ్వరి గురించీ మాట్లాడలేదని జగన్నాధ్ ట్వీట్ ద్వారా ఖండించారు. 

అయితే బహిరంగ రహస్యంలాగా.. అందరికీ తెలిసిన కొందరు ప్రముఖుల పేర్లు పోలీసు రికార్డుల్లోకి, విచారణ పరిధిలోకి రావడంలేదనే వాదన మిగిలిపోయింది. అయితే విచారణ సాగుతున్న క్రమంలో ఆ పేర్లు కూడా ‘రికార్డెడ్’గా బయటకు వస్తున్నాయి. మూడోరోజున విచారణకు వచ్చిన నటుడు సుబ్బరాజు సదరు నిర్మాత కొడుకులిద్దరి పేర్లను కూడా పోలీసులకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

సినీ ఇండస్ట్రీలో పెద్దతలకాయలు అయినంత మాత్రాన సదరు నిర్మాత కొడుకులైన బ్రదర్స్ ను పోలీసులు ఎంతకాలం కాపాడగలరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు? వారికి ఎంత ఫేవర్ చేయదలచుకున్నా ఎక్కువకాలం కాపాడడం అసాధ్యం అనీ... పేర్లు విచారణలో బయటకు వచ్చేసిన తర్వాత.. పోలీసులు కూడా తదనుగుణంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు. 

కొందరి విషయంలో విచారణకు ఉత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు, కొందరి విషయంలో ఎందుకంత మౌనంగా ఉంటున్నారో, వల్లమాలిన ప్రేమ కురిపిస్తున్నారో అర్థంకాని సంగతి. విచారణలో సుబ్బరాజు తాజాగా 13 కొత్త పేర్లు చెప్పినట్లు సమాచారం. డ్రగ్స్ దొరికే పబ్‌లు, బార్ల పేరు సుబ్బరాజు చెప్పగానే వారినందరినీ పురమాయించి.. శనివారం విచారణకు పిలిచిన పోలీసు వర్గాలు.. సుబ్బరాజు వెల్లడించిన ఇతర డ్రగ్ అడిక్టెడ్ సినీ సెలబ్రిటీ ల విషయంలో ఎందుకు మిన్నకుంటున్నారు అనే సందేహాలు ప్రజల్లో కలగక ముందే వారు తమ చిత్తశుద్ధి ని నిరూపించుకోవాలి. 

Show comments