'నాయుడు' - నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌

నారా చంద్రబాబునాయుడు, ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ఈ ఇద్దరు 'నాయుడు'లూ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి 'నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌' మంజూరు చేశారు. అంటే, ఇకపై వైఎస్‌ జగన్‌, నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలవొచ్చన్నమాట. ఈ ఇద్దరికీ ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలూ లేవని మనం అర్థం చేసుకోవాలేమో.! 

అయినా, చంద్రబాబు - వెంకయ్య 'నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌' వైఎస్‌ జగన్‌కి ఎందుకు ఇవ్వాలి.? అన్నదే కదా మీ డౌట్‌.! కొన్నాళ్ళ క్రితం, 'మేం విడిపోతే మధ్యలో దూరాలని కొందరు ప్రయత్నిస్తున్నారు..' అంటూ టీడీపీ - బీజేపీ మైత్రీ బంధాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నది వైఎస్సార్సీపీయేనని వెంకయ్యనాయుడే సెలవిచ్చారు. చంద్రబాబు సంగతి సరే సరి.! మొన్నీమధ్యనే అనూహ్యంగా వైఎస్‌ జగన్‌, ప్రధానితో భేటీ అయ్యాక రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. 

'వైఎస్‌ జగన్‌, మోడీని కలవడంలో తప్పేముంది.?' అని ఏపీ బీజేపీ నేతలే కాదు, జాతీయ స్థాయి బీజేపీ నేతలూ టీడీపీ మీద మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌, మోడీని కలవడమేంటి.? ఈ విషయమై బీజేపీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సమాధానం చెప్పాలంటూ టీడీపీ నేతలు గుస్సా అవడమే అందుక్కారణం. 'ఇది అన్యాయం.. అక్రమం.. ఆర్థిక నేరస్తుడు జగన్‌తో, నరేంద్రమోడీ ఎలా భేటీ అవుతారు.?' అంటూ టీడీపీ నేతలు రెచ్చిపోవడం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 

ఎవరు ఎవరికి తలంటు పోశారోగానీ, టీడీపీ నేతలు దార్లోకి వచ్చేశారు. చంద్రబాబు కూడా చివరికి, జగన్‌ - మోడీని కలవడంలో తనకేమీ అభ్యంతరం లేదని తేల్చేశారు. మరి, ఈ వ్యవహారంపై చెవికోసి మేకల్లా నోరు పారేసుకున్న తెలుగు తమ్ముళ్ళ పరిస్థితేంటట.? వాళ్ళందరికీ, కుక్క కాటుకి చెప్పుదెబ్బ తరహాలో చంద్రబాబు వ్యాఖ్యలు గట్టిగా తగిలేస్తాయనుకోవాలేమో.! వాళ్ళందరి సంగతి తర్వాత, జగన్‌ - మోడీని కలవడమంటే అదేదో పెద్ద నేరంగా ఫీలయిపోయే వెంకయ్య, చంద్రబాబు కూడా 'అబ్బే, అది తప్పు కాదు..' అనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించినంతవరకు వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేత. ఆ హోదాలో ఆయన, ప్రధాని నరేంద్రమోడీని కలిసే అవకాశం ఎప్పుడూ వుంటుంది. ఆ మాటకొస్తే, ఏ రాజకీయ నాయకుడు అపాయింట్‌మెంట్‌ కోరినా ప్రధాని స్పందించాలి. ఓ సామాన్యుడు తగిన కారణం చూపితే, ప్రధానిని కలిసే అవకాశముంది. అలాంటిది వైఎస్‌ జగన్‌, మోడీని కలిస్తే రాద్ధాంతమా.?

Show comments