సరిగ్గా బాహుబలి-2 విడుదలైన ఏడాదికి..

ఈ ఏడాది ఏప్రిల్ 28న బాహుబలి – ది కంక్లూజన్ సినిమా విడుదలైంది. ఆ రోజు నుంచి దాదాపు ఏడాదికి, అంటే ఏప్రిల్ 27, 2018కు మరో సినిమా రెడీ అవుతోంది. అదే మణికర్నిక. ఇది కూడా బాహుబలి ప్రాజెక్టులా సమ్ థింగ్ స్పెషల్ మూవీనే. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్ర ఆధారంగా రాబోతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు.

కేవలం రిలీజ్ డేట్ విషయంలోనే కాదు, మరో ఎలిమెంట్ లో కూడా బాహుబలి, మణికర్నికకు మధ్య చిన్నపాటి కనెక్షన్ ఉంది. బాహుబలి సినిమాకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్, మణికర్నిక మూవీకి కూడా కథను అందిస్తున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత క్రిష్ చేస్తున్న మరో హిస్టారికల్ బేస్డ్ మూవీ ఇది.

కంగనా రనౌత్ లీడ్ రోల్ లో రాబోతున్న ఈ సినిమా కాశీలో గ్రాండ్ గా లాంచ్ అయింది. ఝాన్సీ లక్ష్మీబాయ్ వారణాసిలో జన్మించింది. అందుకే ఈ సినిమా ప్రారంభోత్సవానికి కాశీని ఎంచుకున్నారు. తెలుగు-తమిళ-హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కనుంది మణికర్నిక మూవీ. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు అద్భుతమైన డైలాగ్స్ అందించిన బుర్రా సాయిమాధవ్.. మణికర్నిక తెలుగు వెర్షన్ కు కూడా డైలాగ్స్ ఇవ్వబోతున్నాడు.

Show comments