జనవాక్యం...మీడియా ముచ్చట్లు వదిలేసారేం?

కొత్తపలుకు అంటూ ఆర్కే ఈవారం తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించారు. కేసిఆర్ రాజకీయ దురంధతను అద్భుతంగా విశ్లేషించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పాలనా పటిమ, రాజకీయ చతురత, ఉద్యమకారుడిగా వున్నా, ముఖ్యమంత్రిగా వున్నా కూడా రాజకీయ ప్రయోజనాలే మిన్న అనుకునే గుణగణాలు, అన్నింటికి మించి ఆయనలో మూర్తీభవించిన మొండితనం ఇవన్నీ చాలా అద్భుతంగా ప్రస్తావించారు. ఇలా ప్రస్తావించడం లో కూడా అంతర్లీనంగా ప్రస్తుతించినట్లే కనిపించడం అన్నది విశేషం. ఈ విషయంలో కత్తి అంచుమీద సాము మాదిరిగా వాక్యనిర్మాణం చేసుకుంటూ అంత పెద్ద వ్యాసంరాయడం లో ఆర్కేగారి టాలెంట్ ను మెచ్చుకోవాలి. 

తెలంగాణ ప్రజలను, తెలంగాణను కేసిఆర్ మాత్రమే అధ్భుతంగా ఔపాసన పట్టారని, అందువల్లే ఉద్యమాన్ని ఆరిపోకుండా చేసుకుంటూ వచ్చారని, ఆ క్రమంలో చాలా మందిని చేరదీయడం, పక్కన పెట్టడం వంటి కార్యక్రమాలు చేసారని, ఇప్పుడు జెఎసి నాయకుడు కోదండరామ్ ప్రధాన ప్రత్యర్థిగా మారేసరికి ఆఖరికి రెడ్డి అస్త్రం కూడా బయటకు తీసారని బ్రహ్మాండంగా విశ్లేషించారు.

వ్యాసం మొత్తం ఇంత అద్భుతంగా విశ్లేషించిన ఆర్కే..ఎక్కడా కూడా ఇది తప్పు, ఇలా చేయడం అప్రజాస్వామికం, ఇది కరెక్టు కాదు అని మాత్రం పొరపాటున అనలేదు. కోదండరామ్ పై రెడ్డి ముద్ర వేయడం బిలోదీబెల్ట్ కొట్టడం తప్ప వేరు కాదు అన్న కామెంట్ అన్నా చేయలేదు. కేసిఆర్ చేస్తున్న పనులు అన్నీ, ఆయన ఫక్తు రాజకీయ నాయుకుడు, రాజకీయప్రయోజనాలే ఆయనకు మిన్న అనే దానికింద దాచేసారు ఆర్కే.

కేసిఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత వివిధ పార్టీలను, ప్రత్యర్థులను ఎలా నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారో? ఎలా అధికార యంత్రాంగాన్ని తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నారో? ప్రస్తుతం భాజపా, కాంగ్రెస్,తేదేపా ఎలా నీరుగారిపోయాయో, ఇలా స్టెప్ పై స్టెప్ వివరించుకుంటూ వచ్చిన ఆర్కే..కేసిఆర్ కు మీడియాకు జరిగిన పోరును కానీ, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9లపై అప్రకటిత నిషేధాలను కానీ పొరపాటున ప్రస్తావించలేదు. ఆ కార్యక్రమం తరువాత తెలంగాణలో ఏ మీడియా కూడా కేసిఆర్ కు ఎదురు నిలిచే పనికి దిగలేదన్న సత్యాన్ని కూడా విస్మరించారు. (ఆంధ్రలో కనీసం సాక్షి అయినా వుంది. తెలంగాణలో ఆ సాక్షి కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే వుంది). ఉద్యమకాలంలో చేపట్టిన ప్రతి కార్యక్రమానికి పత్రికలు తెలంగాణ ఎడిషన్ల  మేరకు అయినా ఏ విధంగా సహకరించాయో, ఇప్పుడు ఎలా సైలంట్ అయ్యాయో, తెలుగు రాష్ట్రాల్లో మీడియా మద్దతు లేకుండా ఉద్యమాలు రన్ చేయడం ఎంత కష్టమో తెలిసిందే. కీలకమైన తెలంగాణ-కెసిఆర్-ఆంధ్రమీడియా అన్న ఎపిసోడ్ ను ఆర్కే ఉద్దేశపూర్వకంగానే విస్మరించినట్లు కనిపిస్తోంది.

మొత్తం  మీద కొత్తపలుకులో మీడియా అధ్యాయం కూడా చేర్చి వుంటే కేసిఆర్ వ్యవహారశైలి విశ్లేషణ మరింత అద్భుతంగా వుండేదన్నది వాస్తవం.

Show comments