బాబోయ్‌ సూపర్‌ స్టార్‌.. మళ్ళీ మొదలెట్టేశారు

సినిమా ప్రమోషన్‌ కోసం దర్శక నిర్మాతలు ఏమైనా చేస్తారు. అదో పబ్లిసిటీ స్ట్రాటజీ. అయినాసరే, ఆ పేరు చెప్పి జనాన్ని మోసం చేయడం ఎంతవరకు సబబు.? అంటూ ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. కారణం, ఎన్నో అంచనాలతో రూపొందిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడుతుండడమే. రజనీకాంత్‌ ఈ విషయంలో మరీ ఎక్కువగా వివాదాలు ఎదుర్కొంటున్నాడు. నిర్మాతల సంగతెలా వున్నా, ప్రతిసారీ రజనీకాంత్‌ వివాదాల్లోకెక్కుతుండడం విశేషమే మరి. 

'కబాలి' సినిమాకి క్రియేట్‌ చేసిన హైప్‌.. బహుశా భారత సినీ పరిశ్రమలో ఇంకే సినిమాకీ క్రియేట్‌ కాలేదేమో.! ఆ సినిమా ఫలితం ఏంటో అందరికీ తెల్సిందే. మళ్ళీ ఇప్పుడు 'రోబో 2.0' సినిమా కోసం హైప్‌ మొదలు పెట్టారు. ఫస్ట్‌ లుక్‌ని, సరికొత్త టెక్నాలజీతో విడుదల చేస్తున్నారట. అత్యంత భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కిందట. ఇండియన్‌ సినిమా రంగంలోనే గత రికార్డులన్నిటినీ 'రోబో 2.0' తుడిచిపెట్టడం ఖాయమన్నది నిర్మాతల ఉవాచ. 

కానీ, ఇక్కడే ఓ చిక్కు వచ్చిపడింది. పెద్ద నోట్ల రద్దుపై రజనీకాంత్‌ సానుకూలంగా స్పందించడంతో, ఓ దర్శకుడు, 'మీరు తీసుకునే రెమ్యునరేషన్‌ ఎంత.? అందు బ్లాక్‌, వైట్‌ సంగతేంటి.?' అంటూ ప్రశ్నించేశాడు. 'కబాలి' పేరుతో జనాన్ని నిలువునా మోసం చేసేశారంటూ రజనీకాంత్‌పై విరుచుకుపడ్డాడు ఆ దర్శకుడు. కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు.. అని సరిపెట్టుకోవాలో, సినీ రంగంలో 'బ్లాక్‌ అండ్‌ వైట్‌' బాగోతంపై సరిగ్గా సదరు దర్శకుడు స్పందించాడనుకోవాలో అర్థం కాని పరిస్థితి. 

తన సినిమాకి అవసరానికి మించి హైప్‌ క్రియేట్‌ అవుతున్నా రజనీకాంత్‌ పెదవి విప్పకపోవడానికి కారణం, ఆయనకు అందే అత్యధిక పారితోషికమే. మరి, ఇప్పుడు రజనీకాంత్‌ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తాడో.! 'రోబో 2.0'పై పెరుగుతున్న హైప్‌ విషయంలో రజనీ స్పందన ఎలా వుంటుందో.!

Show comments