ఆఫ్ ద రికార్డ్: కేసీఆర్ పర్యటనల మతలబు?

కేసిఆర్ చక్కర్లు… 

గతంలో ఢిల్లీ అంటే మొహం మొత్తినట్లు వ్యవహరించిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఇప్పుడు నెలకు కనీసం రెండుసార్లైన ఢిల్లీకి వచ్చి మోడీని ప్రసన్నంచేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత ఢిల్లీకి వచ్చి మోడీని కలిసి వెళ్లిన చంద్రశేఖర్ రావు పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపు మళ్లీ ఢిల్లీకి వచ్చారు. నిజానికి సీఎం మాటిమాటికీ ఢిల్లీ రానవసరంలేదు. ఆయన మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, కడియం శ్రీహరి వరుసగా వచ్చిపోతునే ఊన్నారు. కాని కేసీఆర్ రావడం వెనుక ఒక మతలబు ఉండి ఉంటుంది.

వీహెచ్ ఢిల్లీలోనే…
రాజ్యసభ పదవీకాలం ముగిసినా ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చినా వి.హనుమంతరావు ఢిల్లీలోనే ఉంటున్నారు. గల్లీలో ఆయనను ఎవరూ పట్టించుకోపోవడంతో ఢిల్లీ వచ్చి పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పార్టీ పనులు ఏమైనా చెప్పకపోతారా అని ఆశిస్తున్నారు. సెంట్రల్ హాలులో ఉండి హస్కు కొడుతున్నారు. గతంలో విహెచ్ రాజ్యసభ సభ్యుడుగా ఉన్నప్పుడు విలేకరులు ఆయన చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు విలేకరుల చుట్టూ ఆయన తిరగాల్సి వస్తోంది.

వెంకయ్య అభ్యర్థికి నిరాశ…
అన్నాడిఎంకెకు చెందిన లోక్‌సభ్యుడు తంబిదురై ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశించారు. జయలలిత మరణించిన తర్వాత ఆయన ఆ పదవి చేపట్టాలని ఆశించి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చుట్టూ తిరిగారు. వెంకయ్య కూడా ఆయనకోసం చాలా ప్రయత్నాలు చేశారు. కాని మోడీ మాత్రం పన్నీర్ సెల్వం వైపే మొగ్గు చూపించారు. పన్నీర్ సెల్వం శక్తివంతమైన నేతకాదు. కాని కేంద్రం నుంచి అధికారం చలాయించడానికి పన్నీర్ సెల్వం లాంటి మెతక వ్యక్తి అవసరం. సరైన సమయంలో శశికళను కూడా మోడీ ముఖ్యమంత్రి చేసే అవకాశాలున్నాయి.

Show comments