బాబు పాలనలో మగాళ్లు వంటింటి కుందేళ్లేనా?

చంద్రబాబునాయుడు గారు జనం మీద వేస్తున్న సెటైర్లు చూస్తోంటే ఈ రాష్ట్రంలో మగాళ్ల బతుకు అంతేనేమో అని అనిపిస్తోంది. ఇదివరకటి రోజుల్లో అయితే ఆడవాళ్లు బయటికి వెళ్లి ఉద్యోగాలు , పనులు చేసేది తక్కువ కాబట్టి.. వంటింటి కుందేళ్లు అని వ్యవహరించేవారు. కానీ రోజులు మారాయి. ఇప్పుడు ఆడాళ్లు మగాళ్లతో సమానంగా ఉద్యోగాలు, పనులు చేస్తున్నారు. వంటింటి బాద్యతలను కూడా చాలా కుటుంబాల్లో దంపతులు సమంగా పంచుకుంటున్నారు. 

అయితే చంద్రబాబునాయుడు తాజాగా చంద్రన్న బీమాను ప్రారంభించిన సభలో జనాన్ని ఉద్దేశించి కొన్ని జోకులు పేల్చారు. ఈ బీమా రాష్ట్రంలోని అసంఘటిత రంగ కార్మికులకు ఉపయోగపడుతుందని అంటూనే.. భవిష్యత్తులో రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు తమ పనులు చక్కబెట్టుకోవడానికి, వ్యాపారాలు నిర్వహించడానికి బయటకు వెళితే మగాళ్లు చక్కగా ఇంట్లోనే కూర్చుని కాఫీలు పెట్టుకుని తాగొచ్చునని, కావలిస్తే బిర్యానీలు కూడా చేసుకుని తినవచ్చునని చంద్రబాబునాయుడు జోకులేశారు. 

ఈ జోకులకు ఆయన తైనాతీల హర్షధ్వానాలు బాగానే ఉన్నాయి గానీ, జనానికి కొత్త సందేహాలు పుడుతున్నాయి. చంద్రబాబు పాలనలో డ్వాక్రా మహిళలు వ్యాపారాలు చేసుకోవాల్సిందే తప్ప.. మగాళ్లకు ఉద్యోగాలు దక్కే అవకాశమే అసలు లేదా అని జనం అనుకుంటున్నారు. చూడబోతే చంద్రబాబు పాలనలో సగటు గ్రామీణ కుటుంబాలకు డ్వాక్రా తప్ప బతుకు తెరువుకు మరో దిక్కూ మొక్కూ , ఉపాధీ, ఉద్యోగం ఏదీ లేకుండా పోయేలా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఇప్పటిదాకా ఒక్కరికీ వచ్చింది లేదు. ఇప్పుడు చంద్రబాబు వేస్తున్న జోకులు చూస్తోంటే.. మగాళ్లకు ఉన్న ఉద్యోగాలు కూడా ఊడుతాయనిపిస్తోందని జనం అనుకుంటున్నారు. ఉపాధులు అన్నీ మంటగలిసే పరిస్థితి ఉన్నదని, ఒకవైపు పంటపొలాలను పరిశ్రమలకు ధారాదత్తం చేస్తూ వ్యవసాయం కూలీలను బిచ్చగాళ్లుగా మారుస్తున్న చంద్రబాబు... ఉద్యోగాలకోసం నిరీక్షించే మగాళ్లను మొత్తంగా వంటింటి కుందేళ్లు చేస్తారేమోనని అనుకుంటున్నారు.

Show comments