కాపు నాయకులు.. కులం కార్డులు

ప్రతి మగవాడి విజయం వెనుక ఓ మహిళ వుంటారన్నది నానుడి. తెలుగునాట పాలిటిక్స్ లో సూపర్ క్లిక్ అయిన కాపుల వెనుక కూడా మహిళలే వున్నారట. కాపుకులం మహిళలను కాకుండా, వేరే కులాల మహిళలను పెళ్లిచేసుకున్న కాపు నాయకులు ఇటు వ్యాపారంలోనూ, అటు రాజకీయంలోనూ పైకి వచ్చారట. ఈ విజయరహస్యాన్ని వెల్లడించారు ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణ. ఇన్నాళ్లు చాలా మంది కి తెలియని వ్యవహారం ఇది. 

గంటా శ్రీనివాసరావును బాబు దగ్గరకు తీసి, వెంటనే మంత్రిని ఎందుకు చేసారా అంటే.. ఆయన కమ్మ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే అని ఇప్పుడు అర్థం అవుతోంది.  అలాగే ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావుకు తెలుగుదేశంలో ఎందుకు అంతటి ప్రాధాన్యత లభిస్తోంది అంటే ఆయన కూడా కమ్మ మహిళను పెళ్లి చేసుకోవడమే కారణం అని అర్థం అవుతోంది.  ఇంతకీ రాధాకృష్ణ ఏమన్నారంటే... '....ముద్రగడ పద్మనాభానికి అనుకూలంగా, వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొంతమంది కాపు నాయకులపై సామాజిక మాధ్యమాలలో విపరీత వ్యాఖ్యలు చోటుచేసుకుంటున్నాయి. 

మంత్రులు గంటా శ్రీనివాసరావు కమ్మ మహిళను పెళ్లి చేసుకోగా, రెడ్డి మహిళను నారాయణ పెళ్లాడారనీ, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కూడా కమ్మ మహిళనే పెళ్లి చేసుకున్నారనీ, వీరంతా తమ భార్యల సామాజికవర్గాల కోసం తపనపడతారు తప్ప కాపులకోసం కాదని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో ముద్రగడకు మద్దతు ప్రకటించిన దాసరి నారాయణరావు కూడా కమ్మ మహిళను వివాహం చేసుకున్నారని, చిరంజీవి, అల్లు అరవింద్‌లు రెడ్డి సామాజికవర్గంతో వియ్యం అందుకున్నారని కూడా ప్రచారం చేస్తున్నారు. 

కాపుల రిజర్వేషన్‌ వ్యవహారం పుణ్యమా అని వ్యక్తిగత వ్యవహారాలు కూడా బహిరంగ అంశాలుగా మారాయి....' అంటే దీని అర్థం ఏమిటి? భార్యలు ఎవరైతే ఆ సామాజిక వర్గం వైపే భర్తలు వుంటారనా? ఆ లెక్కన గంటా, బోండా, దాసరి కమ్మవారి వైపు, చిరు, నారాయణ, అరవింద్ రెడ్ల వైపు వుంటారనా?

గుట్టుతెలిసింది?

ఏది ఏమైనా సెలబ్రిటీ ల గుట్టును భాహాటంగా చెప్పినందుకు రాధాకృష్ణను అభినందించాలి. వీళ్లంతా కులాంతర వివాహాలు చేసుకుని కూడా కుల నాయకుల్లా చలామణీ కావడం, రాజకీయంగా, వ్యాపార పరంగా ఎదగడానికి ఇటు అటు కులాలను వాడుకోవడం జనాలకు తెలియాలి. మా కులపోడు మా కులపోడు అని కిందా మీదా అయిపోవడం అప్పుడన్నా తగ్గుతుందేమో? కాంగ్రెస్ వస్తే రెడ్డి కార్డు, తెలుగుదేశం వస్తే కమ్మ కార్డు, ఓట్ల కోసం కాపు కార్డు, ఇలా ఎక్కడ ఏ కార్డు కావాలంటే దాన్ని బయటకు తీయడం చూసి, కులం పిచ్చితో వీళ్లను అభిమానించి, వీళ్ల వెంట నడవాలనుకునే వారు మారుతారేమో ఇప్పుడైనా?

Show comments