'నమో' పైశాచికానందం

'ఒకటి, రెండు రోజులు మాత్రమే సమస్య.. ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది..' 

- 500, 1000 నోట్ల రద్దు ప్రకటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలివి. 

'నోట్ల మార్పిడి చాలా పెద్ద ప్రక్రియ.. ఏటీఎంలలో సాఫ్ట్‌వేర్‌ మార్చితేగానీ కొత్త 2000 రూపాయల నోట్లు ఏటీఎం సెంటర్ల నుంచి తీసుకోవడానికి వీల్లేదు..' 

తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వ్యాఖ్యలివి. 

'ఇబ్బందులు సామాన్యులకు కానే కాదు.. లెక్కలు చూపించినవారికే కష్టాలు..' 

- ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాజాగా నేడు చేసిన వ్యాఖ్యలివి. 

అది హైద్రాబాద్‌లోని ఓ బ్యాంకు. పొద్దునే ఆరు గంటల నుంచే అక్కడ జనం బారులు తీరారు నోట్ల మార్పిడి కోసం. నోట్ల మార్పిడి తర్వాతి రోజు కాదు, మూడో రోజున ఈ ఘటన జరిగింది. 10 గంటల సమయానికి బ్యాంక్‌ తెరవగానే, 300 టోకెన్లను మంజూరు చేసింది ఆ బ్యాంకు. మధ్యాహ్నం 2.30 నిమిషాల సమయం. అక్కడ నడుస్తున్న టోకెన్‌ నెంబర్‌ 150. ఇంకో రెండు గంటల్లో బ్యాంక్‌ మూసేస్తారు. అంటే, అప్పటికి పుణ్యకాలం పూర్తయిపోయినట్లే. 

ఏటీఎంల పరిస్థితి మరీ దారుణం. రెండ్రోజులు ఏటీఎంలు కూడా బంద్‌. మూడో రోజు సాయంత్రానికి ఏటీఎంలు కాస్సేపు తెరుచుకున్నాయి. కార్డు పెడితే వచ్చేది రెండు వేల రూపాయలు మాత్రమే. క్షణాల్లో ఏటీఎంలు ఖాళీ అయిపోయాయి. మళ్ళీ మరుసటిరోజు ఆ ఏటీఎంలో క్యాష్‌ నింపితే ఒట్టు. 

డబ్బుల్లేకపోతే మార్కెట్‌లో లావాదేవీలు ఎలా నడుస్తాయి.? అందుకే, ఉల్లిపాయల కొనుగోళ్ళు నిలిచిపోయాయి. కూరగాయల పరిస్థితీ దాదాపు ఇంతే. గాలి వార్తల పుణ్యమా అని, రోజూ పది రూపాయలకే దొరికే కిలో ఉప్పు 300 రూపాయల నుంచి 500 రూపాయల దాకా పలికింది. నాన్సెన్స్‌.. అని పెదవి విరిచినవారూ వున్నారు, ఏమో.. మోడీ పుణ్యమా అని వెయ్యి రూపాయలైపోతుందేమోనని కొనుక్కున్నవారూ వున్నారు. ఉల్లిపాయల పరిస్థితీ కాస్త అటూ ఇటూగా అలాగే వుంది. 

ఏటీఎంలలో సాఫ్ట్‌వేర్‌ ఎప్పుడు మారుతుందో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పలేదు. ఇంతవరకు మార్కెట్‌లోకి కొత్తగా 500 రూపాయల నోటు రాలేదు. కొత్తగా 2000 రూపాయల నోటు వచ్చినా, దానికి ఛేంజ్‌ ఇచ్చే నాథుడు లేడు. వెరసి, మూడంటే మూడు రోజుల్లోనే నరేంద్రమోడీ ప్రభుత్వం దేశాన్ని సర్వనాశనం చేసేసింది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. 

మొదట్లో మేధావులంతా.. అబ్బో, ఇదేదో అద్భుతమైన ప్రక్రియ అనుకున్నారు. ఎవరన్నా అనుమానం వ్యక్తం చేస్తే చాలు.. మోడీ వ్యతిరేకులనీ.. అభివృద్ది వ్యతిరేకులనీ దుష్ప్రచారం ప్రారంభించారు. రోజులు గడిచేసరికిగానీ బయటపడలేదు, నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రదర్శించిన మూర్ఖత్వం. దేశంలో డబ్బుకి కొరత ఏర్పడింది. ఈ కొరత సృష్టించడం ద్వారా ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటున్నట్లు.? సమాధానం సింపుల్‌.. సామాన్యుల్ని ఏడిపించడం. అలా చేస్తే ప్రభుత్వానికి ఏమొస్తుందట.? అదో పైశాచిక ఆనందం.. అంతే.!

Show comments