ఒక్క సీరిస్.. ఇండియా మార్చేసిన రికార్డులెన్నో!

ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సీరిస్ లో ఆఖరి మ్యాచ్ లో కూడా విజయం సాధించడం ద్వారా భారత్ సీరిస్ ను 4-0 తో సొంతం చేసుకుంది. తొలి టెస్టులో టీమిండియాకు ఇంగ్లండ్ అంతో ఇంతో పోటీని ఇచ్చింది. ఆ తర్వాత భారత్ తిరుగులేకుండా జైత్రయాత్రను కొనసాగించింది. డ్రా అయ్యే అవకాశాలున్నాయని అనిపించిన ఐదో టెస్టును కూడా భారత్ గెలుచుకోవడంతో.. ఇంగ్లండ్ నిస్పృహలో కూరుకుపోయింది.

మరి ఈ సీరిస్ గెలుపు సంగతలా ఉంటే.. ఈ ఐదు మ్యాచ్ లతో భారత్ ఎన్నో రికార్డులను చెరిపేసింది. మరెన్నో రికార్డులను సృష్టించింది. ఇటు టీమ్ రికార్డు, అటు ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులు బద్దలైపోయాయి! ఇందులో ముఖ్యమైనవి ఏమనగా…

-వరసగా 18 టెస్టుల్లో టీమిండియా ఓటమిని ఎరగకుండా విజయయాత్రను సాగించింది. ఈ మ్యాచ్ లలో కొన్ని డ్రాలు ఉన్నాయి తప్ప ఓటములు లేవు. 13 టెస్టుల్లో ఇండియా గెలవగా, ఐదు టెస్టులు డ్రా అయ్యాయి.

-టీమిండియా దశాబ్దాల టెస్టు చరిత్రలో ఇంతటి విజయ పరంపర లేదు. ఇది వరకూ వరసగా 17 టెస్టుల్లో ఇండియా ఓటములు ఎరగకుండా విజయ యాత్ర సాగించింది. అది 20 యేళ్ల కిందటి రికార్డు. కానీ నాటి విజయాలు నాలుగు మాత్రమే.

-కెప్టెన్ గా విరాట్ వరసగా 18 వ మ్యాచ్ ను ఓటమి లేకుండా ముగించాడు. ఇది కూడా సరికొత్త రికార్డే. ఇందులో 14 విజయాలు, నాలుగు డ్రాలున్నాయి. గవాస్కర్ కెప్టెన్సీలోనూ 18 టెస్టులు ఓటమి లేకుండా ఆడారు. అయితే అందులో విజయాలు ఆరు, డ్రాలు 12.

-ఒక ఏడాదిలో విజయాల శాతంతో ఇండియా సరికొత్త రికార్డు లిఖించుకుంది. 11 టెస్టులు ఆడి అందులో ఎనిమిది మ్యాచులలో విజయం సాధించింది. ఒక ఏడాదిలో 72 శాతం విజయాలు ఇదే తొలి సారి.

-ఒక సీరిస్ లో ఆరుగురు భారత బ్యాట్స్ మన్లు సెంచరీలు చేయడం ఇది నాలుగో సారి మాత్రమే. గతంలో కొన్ని దశాబ్దాల కిందట ఈ ఫీట్  నమోదైంది. ప్రస్తుత సీరిస్ లో కొహ్లీ, మురళీ విజయ్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ , పూజారా, జయంత్ లు సెంచరీలు సాధించారు.

-ఇక ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 759 పరుగులు చేయడం ద్వారా టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు విషయంలో కొత్త ఫీట్ సాధించింది. ఇది వరకటి రికార్డును సవరించి.. తన అత్యధిక స్కోరును మెరుగుపరుచుకుంది.

-కరుణ్ నాయర్ బద్దలు కొట్టిన రికార్డులు చాలానే ఉన్నాయి. టెస్టుల్లో చేసిన తొలి సెంచరీనే త్రిబుల్ హండ్రెడ్ గా మార్చడం మొదలుపెడితే.. జాతీయ, అంతర్జాతీయ టెస్టు రికార్డుల పుస్తకాల్లో కొత్త పేజీలు లిఖించుకున్నాడితను.

-బౌలింగ్ విషయంలో.. అశ్విన్ చాలా రికార్డులనే సరి చేశాడు. ఇండియాకు బౌలింగ్ విభాగంలో లెజెండరీ ప్లేయర్ల రికార్డుల్లో ఒక్కొక్కదాన్నీ అశ్విన్ చెరుపుకుంటూ వచ్చాడు. 

-ఒక సీరిస్ 250 పరుగులకు పైగా చేసి, 25 వికెట్లు తీసిన అరుదైన ఫీట్ ను సాధించాడు అశ్విన్. 37 యేళ్ల కిందట పాకిస్తాన్ తో జరిగిన సీరిస్ లో కపిల్ దేవ్ 32 వికెట్లు తీసి,278 పరుగులు చేశాడు. ఈ సీరిస్ లో అశ్విన్ 306 పరుగులు చేసి, 28 వికెట్లు తీశాడు.
ఇలా చెప్పుకొంటూ పోతే.. స్వదేశంలో జరిగిన ఈ సీరిస్ లో టీమిండియా రికార్డు బ్రేకులు చాలానే ఉన్నాయి

Show comments