చంద్రబాబూ.. ఆదుకోవడమంటే.!

'భూమా నాగిరెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం..' అంటూ టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉద్వేగంగా ప్రసంగించేశారు. నిన్న గుండెపోటుతో మరణించిన భూమా నాగిరెడ్డికి ఈ రోజు చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ ఓ కుటుంబ సభ్యుడ్ని కోల్పోయిందంటూ వ్యాఖ్యానించారాయన. 

'అన్ని విధాలా ఆదుకుంటాం..' అనే మాట పరిపాటిగా రాజకీయాల్లో విన్పించేదే. ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు, 'బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటాం..' అని రాజకీయ పార్టీలు చెప్పడం, ఆ తర్వాత మర్చిపోవడం మామూలే. భూమా నాగిరెడ్డి, 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచినా, ఆయనిప్పుడు టీడీపీ నేత. గతంలోనూ ఆయన టీడీపీ తరఫున పనిచేశారు. భూమా నాగిరెడ్డి, ఆయన సతీమణి శోభా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన నేతలుగా ఓ వెలుగు వెలిగారొకప్పుడు. 

ఇక, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా 2014లో నంద్యాల నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి, టీడీపీలో చేరేదాకా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. అదీ తెలుగుదేశం పార్టీ నుంచే. ఓ సందర్భంలో ఆయన పోలీసులతో గొడవ పడ్డం, కేసులు నమోదవడం, ఆ తర్వాత అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరడం తెల్సిన విషయాలే. టీడీపీలో చేరాక మాత్రం అంతా కామప్‌. చంద్రబాబుకి, భూమా అత్యంత సన్నిహితుడైపోయారు. రాజకీయాలన్నాక అంతే మరి. 

మంత్రి పదవి విషయంలో ఇప్పుడు తాజాగా, భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియకు అధిష్టానం నుంచి హామీ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఆ మంత్రి పదవి విషయంలోనే భూమా నాగిరెడ్డి తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారన్నది ఓపెన్‌ సీక్రెట్‌. భూమా నాగిరెడ్డి ఇప్పుడు జీవించి లేరు గనుక, అఖిల ప్రియకు ప్రాధాన్యత లేని మంత్రి పదవి ఏదో ఒకటి కట్టబెట్టేసి చంద్రబాబు చేతులు దులిపేసుకున్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

మరోపక్క, భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు ఇంకా ముగియకముందే, జిల్లాకి చెందిన ముఖ్య నేతలతో అధిష్టానం సంప్రదింపులు జరుపుతోందట.. నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవర్ని నిలబెట్టాలన్న విషయమై. ఇదే మరి, శవరాజకీయమంటే. ఇలాంటోళ్ళు, భూమా నాగిరెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటారట.? నమ్మేది ఎలా.!

Show comments