కొమ్మినేని: ఎన్‌.టి.ఆర్‌.పోయి అప్పుడే ఇరవై ఏళ్లయిందా

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత సినీ తార ఎన్‌.టి.రామారావు మరణించి అప్పుడే ఇరవై ఏళ్లు అయిపోయిందా అనిపిస్తుంది. ఆయన మరణించిన నాటి పరిస్థితులు, అప్పుడు జరిగిన ఘట్టాలు చూసిన వారిలో నేను  కూడా ఒకడిని తెలుగుదేశం పార్టీని అత్యున్నత శిఖరాలకు తీసుకు వెళ్లిన ఎన్‌.టి.ఆర్‌. స్వయంగా తన అల్లుళ్లు, కుమారుల చేతిలోనే ఘోరంగా అవమానానికి గురై  మానసిక క్షోభ పడడాన్ని ప్రత్యక్షంగా చూసినవారిలో నేనూ ఉన్నాను. పదవీచ్యుతుడు అయ్యాక  ఒక మీడియా సమావేశంలో ఎన్‌.టి.ఆర్‌.స్వయంగా కంట తడిపెట్టుకున్న సన్నివేశం గుర్తుకు చేసుకుంటే ఆ సమావేశంలో ఉన్నవారిలో ఒకరిగా బాధ అనిపిస్తుంది. 

రాజకీయం ఎంత క్రూరంగా ఉంటుంది? రాజకీయం ఎంత నీచంగా మారిపోతుంది? రక్త బంధాలను కూడా మరచిపోయేలా రాజకీయం చేస్తుందన్నది ఎన్‌.టి.ఆర్‌.జీవితంలో కనిపించిన ప్రత్యక్ష అనుభవం. తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకోవడం ఒక ఎత్తు అయితే  ఆ తర్వాత ఆయనను సొంత కుటుంబీకులే బాధపెట్టిన తీరు మరొక ఎత్తు. ఎన్‌.టి.ఆర్‌.ఒక రకంగా బోళా శంకరుడు అని అంటారు. తన వెనుక జరుగుతున్న కుట్రల గురించి తెలియని అమాయకుడు. ఆయన చంద్రబాబుకు 1994లో రెవెన్యూ, ఆర్ధిక శాఖలను అప్పగించి తన మంత్రివర్గంలో చేర్చుకుని చాలా గౌరవించారు. కాని ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఎన్‌.టి.ఆర్‌.రెండో భార్య లక్ష్మీపార్వతిని బూచిగా చూపెట్టి ఎమ్మెల్యేలను, చివరికి తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారులు హరిష్ణ, బాలకష్ణ వంటివారిని తనవైపు తిప్పుకుని మొత్తం రాజకీయంగా, కుటుంబపరంగా ఎన్‌.టి.ఆర్‌.ను ఒంటరివాడిని చేసి ఆయన కుమిలిపోయేలా చేయడంలో విజయవంతం అయ్యారు. అయినా ఎన్‌.టి.ఆర్‌.సింహంలా గర్జించాలని అనుకున్నారు.

కాని విధి బలీయమైనదని అంటారు. తన అల్లుడే ఇంత పనిచేస్తాడా అని ఆవేదన చెందిన ఆయన చంద్రబాబును ఉద్దేశించి దుర్మార్గుడు, మేకవన్నె పులి, గాడ్జెని మించినవాడు.. అంటూ అనేక పరుష పదాలతో తీవ్రంగా విమర్శిస్తూ మాట్లాడిన ఆడియో ఇప్పటికీ ప్రచారంలోనే ఉంది. ఎన్‌.టి.ఆర్‌.కు రాజకీయ ఎత్తుగడలు తెలియవు. తెలిసి ఉంటే 1995 ఆగస్టులో టీడీపీిలో సంక్షోభం వస్తోందని వార్తలు వస్తున్న సమయంలో మూడు రోజుల ముందు చంద్రబాబును, మరో ముగ్గురిని క్యాబినెట్‌ నుంచి తొలగించి ఇతర నేతలకు అవకాశం ఇచ్చి ఉంటే చరిత్ర మరో రకంగా ఉండేది. ఎన్‌.టి.ఆర్‌. ప్రజలలో పుట్టిన మనిషి. ప్రజలలో పెరిగిన మనిషి. ప్రజలతోనే ఉన్న మనిషి . తాను ఎమ్మెల్యేలను కాదు..ప్రజలను నమ్ముకుంటానని అనుకున్నారు. కాని చంద్రబాబు జిత్తుల ముందు ఎన్‌.టి.ఆర్‌.చిత్తు అయిపోయారు.

చివరికి ఆయన గుండెపోటుకు గురై స్వర్గస్థులయ్యారు. అంతకుముందు సినిమా వారి రాజకీయాలు చెల్లవన్న చంద్రబాబు తన సహజ దోరణిలో మాట మార్చారు. రాజకీయ వ్యూహాలు పన్నారు. ఎన్‌.టి.ఆర్‌.బొమ్మ లేకుండా తెలుగుదేశం పార్టీని నడపాలని చూశారు కాని, అది సాధ్యం కాదని అర్ధం అయ్యాక అసలు ఎన్‌.టి.ఆర్‌.వారసులం తామేనని ప్రచారం చేసుకోగలిగారు. ఇరవై ఏళ్ల తర్వాత ఎన్‌.టి.ఆర్‌ పేరు  వాడకుండా ఉండలేని పరిస్థితి టిడిపికి, చంద్రబాబుకు ఉందంటేనే వారి బలహీనత అర్ధం చేసుకోవచ్చు. ఆయన వారసులుగా చెప్పుకుంటున్నవారు ఆయన సిద్ధ్దాంతాలు, ఆయన ఆచరించిన విధానాలు అమలు చేస్తారా అంటే అదేమీ లేదు. అందుకు ముఖ్యమైన ఉదాహరణ ఫిరాయింపుల రాజకీయాలే. ఎన్‌.టి.ఆర్‌.ఎట్టి పరిస్థితిలోను అనైతిక ఫిరాయింపులను ప్రోత్సహించరాదని భావిస్తే, ఇప్పుడు అచ్చంగా నీతిలేకుండా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ పైగా డబాయింపులకు పాల్పడుతున్నారు. ఎన్‌.టి.ఆర్‌.కు అసత్యాలు చెప్పడం పెద్దగా అలవాటు లేని వ్యవహారం అయితే ఇప్పుడు అచ్చంగా అబద్ధ్దాలతో బతికే తెలుగుదేశం పార్టీ తయారు కావడం బాదాకరం. వాగ్దానం అంటే వాగ్దానమేనని నమ్మిన వ్యక్తి ఎన్‌.టి.ఆర్‌. ఇచ్చిన మాటకోసం మడమ తిప్పకూడదని భావించే  నేత ఎన్‌.టి.ఆర్‌. అయితే ఇప్పుడు వాగ్దానాలు 

వంద చేయి ప్రజలను  ఆ తర్వాత మోసం చేయి అనే విధానంలో  చంద్రబాబు పార్టీని నడుపుతున్నారు. అయినా విజయం సాధించారు కదా అని అనుకోవచ్చు. అందువల్లే  టీడీపీి అధికారంలో ఉంది కాని గౌరవం తెచ్చుకోలేకపోతోంది. చంద్రబాబు అధికారం అనుభవిస్తుండవచ్చు. కాని నైతిక విలువలు గలిగిన నేతగా ఎన్నటికీ పేరు తెచ్చుకోలేరు.  

Show comments