ఓ పక్క సభలో హోదాపై నానా హడావుడి జరిగిపోతుంటే, ఎపీ మీడియా దారి మీడియాది. అందునా బాబు అండ్ వెంకయ్య అనుకూల మీడియా సమస్య దానిది. ఎలా తమ నాయుళ్లు ఇద్దరిని ఈ సమస్యలో వెనకేసుకురావాలన్నది దాని ప్రయత్నంగా వుంది. అందుకే వెంకయ్య నాయుడు ఏకంగా తన మంత్రి వర్గ సహచరుడు జైట్లీనే నిలదీసినట్లు కథనాలు అల్లుతున్నారు.
అసలు హోదా ఎందుకు ఇవ్వరు, సమస్య ఏమిటి? అని వెంకయ్య నేరుగా జైట్లీనే నిలదీసారని తెలిసింది అంటూ ఆ కథనాలు జనాల కళ్లకు కొత్త గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నాయి. భలేగా వుందిగా? ఒక కేంద్ర మంత్రిగా వుంటూ, అధికార పార్టీలో కీలక నేతగా వుంటూ, అక్కడ ఏం జరుగుతోందో? ఎందుకు హోదా ప్రకటించడం లేదో? ఇవ్వడం లేదో? తెలియనంత చీకటిలో వున్నారా మంత్రి వెంకయ్య నాయుడు. జనాలకు చెప్పకపోవచ్చు, బయటకు చెప్పకపోవచ్చు కానీ, ఆయనకు భాజపా పెద్దలు, మోడీ, ఇతర మంత్రుల మధ్య జరుగుతున్నది ఏమిటొ తెలియదని అనుకోవాలా?
అంటే, మరోసారి వెంకయ్యను హీరో చేసే ప్రయత్నం తప్ప ఇది వేరు కాదేమో అన్న అనుమానం సహజంగానే కలుగుతుంది? ఇదే కనుక వెంకయ్య, తాను డిమాండ్ చేసి, సభలో ప్రధాని నోటి వెంట సాధించిన ప్రకటనను, తన పార్టీయే కాదంటున్నందుకు నిరసనగా మంత్రి పదవికి రాజీనామా చేస్తే? అప్పుడు నిజంగా హీరోనే? అంతవరకు ఇలాంటి కథనాలు ఎన్ని వండి వార్చినా జనం నమ్ముతారు అనుకుంటే అనుమానమే.