బాబు చెప్పలేనివి చెప్పాలంటే ఎలా?

ఎవర్నియినా ప్రశ్నలు అడిగేటపుడు వాళ్లు వాటికి సమాధానం చెప్పడానికి ఇష్టపడతారా? లేదా అన్నది ఆలోచించాలి. లేదూ అంటే సమాధానాలు రావు సరికదా? అనవసరపు ప్రశ్నలు వేస్తున్నారంటూ, పెద్ద రాద్దాంతమే చేస్తారు. చంద్రబాబు వ్యవహారం ఇలాగే మారేలా వుంది.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే? అమరావతి అంటూ ఆంధ్ర నవ్య రాజధాని నిర్మాణానికి ఏకంగా ముఫై వేలకు పైగా ఎకరాలు సమీకరించారు. అదీ చాలదన్నట్లు 13,272 ఎకరాలు అటవీ భూమి పై కూడా కన్నేసారు. దీన్ని డీ నోటిఫై చేస్తే రాజధానికి వాడేసుకుంటామని కేంద్రానికి విన్నవించారు. సంబంధిత శాఖ టెంటటివ్ గా ఒకె అంది. ఇప్పుడు ఫైనల్ అనుమతుల కోసం ఫైల్ పంపారు. అదిగో అప్పుడు వచ్చింది సమస్య.

అసలు ఈ 13వేల ఎకరాలు ఏం చేస్తారు? ఏయే భవనాలు కడతారు? ఏ ప్రాజెక్టులు చేపడతారు? అంతకు మించి ఈ అటవీ భూములకు బదులుగా కొత్త అడవులు ఎక్కడ ఎలా పెంచుతారు? ఇలాంటి  ప్రశ్నలు అన్నీ కేంద్ర శాఖలు సంధించాయి.

అబ్బే..అసలు ఇంకా రాజధాని విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ లేదు. అవన్నీ వచ్చాక, మీరు అడిగిన వివరాలు అందిస్తాం, ప్రస్తుతానికైతే మీరు మేం అడిగిన అనుమతులు అన్నీ ఇచ్చేయండి అంటూ రాష్ట్రం జవాబిచ్చింది.

అబ్బ..ఆశ..దోశ..అలా ఎలా ఇస్తాం? మీరు వాటిని ఏం చేస్తారో చెబితేనే అనుమతులు అంటూ ఫైల్ వెనక్కు పంపేసింది కేంద్ర అటవీ అనుమతులు శాఖ. మరి ఇప్పుడు బాబు ఏం చేస్తారో?

అయినా రాజధాని భవనాలు అంటే మహా అయితే వెయ్య రెండువేల ఎకరాలు చాలు. కానీ బాబుగారి మైండ్ లో అంతకు మించి ఏదో వుంది. అందుకే 33 వేల ఎకరాలు సమీకరించారు. విదేశీ కంపెనీలకు కట్టబెడుతున్నారు. ఇక ఈ 13వేల ఎకరాల అటవీ భూమిని కూడా ఏదో చేయాలని అనుకునే వుంటారు. కానీ ఆయన చెప్పరంతే. అలాంటివి అడగడం కేంద్ర శాఖల తప్పు.

Show comments