మోహన్‌లాల్‌ 'టార్గెట్‌' ఎందుకయ్యాడు.?

టాలీవుడ్‌లో ఓ ప్రముఖ హీరో ఇంట్లో 25 కోట్ల రూపాయల నల్లధనం వుంది.. మరో హీరో పది కోట్ల నల్లధనాన్ని తెల్లగా మార్చేసుకున్నాడు.. ఓ బాలీవుడ్‌ హీరో తనకున్న పరిచయాలతో పెద్ద నోట్ల రద్దు వ్యవహారం నుంచి తేలిగ్గా తప్పించుకున్నాడు.. ఓ తమిళ హీరో కూడా ముందుగానే జాగ్రత్తపడ్డాడు.. ఇలా దేశంలోని పలువురు సినీ నటుల గురించి రకరకాల ఊహాగానాలు విన్పించాయి.. విన్పిస్తూనే వున్నాయి. ఈ కోవలో కొందరు హీరోయిన్ల పేర్లూ తెరపైకొచ్చాయిగానీ.. అవన్నీ గాసిప్స్‌ రూపంలోనే కావడం గమనార్హం. 

కానీ, మోహన్‌లాల్‌ విషయంలోనే తేడా కొట్టేసింది. బాహాటంగానే ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా మోహన్‌లాల్‌పై పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఒకటా.? రెండా.? ఏకంగా మూడు వేల కోట్ల రూపాయల నల్లధనం మోహన్‌లాల్‌ దగ్గర వుందట. అందుకే, ముందు జాగ్రత్తగా నరేంద్రమోడీని ప్రశంసించి, జాగ్రత్తపడ్డాడంటూ సోషల్‌ మీడియాలో ఆయనపై గాసిప్స్‌ గుప్పుమంటున్నాయి. 

నరేంద్రమోడీని పొగడ్తలతో ముంచెత్తేస్తున్న మోహన్‌లాల్‌, నల్లధనంపై చిత్తశుద్ధి వుంటే తన దగ్గరున్న నల్లధనం వివరాలు బయటపెట్టాలంటున్నారు. మామూలుగా అయితే మోహన్‌లాల్‌ చుట్టూ ఇంత వివాదం వుందనిగానీ, ఆయన వివాదాస్పదమైన వ్యక్తి అనిగానీ ఎవరూ అనుకోరు. చూడగానే, మోహన్‌లాల్‌ చాలా సౌమ్యుడిగా కన్పిస్తాడు. పైగా మంచి నటుడు, స్టార్‌ హీరో.. మలయాళ సూపర్‌ స్టార్‌. 

నిజానికి మోహన్‌లాల్‌కి చాలా వ్యాపకాలున్నాయి.. వ్యాపారాలు కూడా వున్నాయి. దుబాయ్‌లో ఓ 'ఫుడ్‌ ఛెయిన్‌'ని నడుపుతున్నాడాయన. సినిమా వ్యాపారాలూ వున్నాయనుకోండి.. అది వేరే విషయం. అయినాసరే, 3 వేల కోట్లు.. అంటే చిన్న విషయం కాదు. అంతమొత్తంలో ఆస్తులు వుండడం వేరు, అదంతా బ్లాక్‌ మనీ అనేయడం వేరు. 

మోహన్‌లాల్‌తో పోల్చితే, ఆయనకన్నా ఆర్జన విషయంలో 'సూపర్‌ స్టార్స్‌' ఇండియాలో కోకొల్లలుగా వున్నారు. బాలీవుడ్‌ హీరోల్లో చాలామంది వందల వేల కోట్ల రూపాయలకు అధిపతులే. తమిళంలోనూ, తెలుగులోనూ, కన్నడలోనూ వున్నారు మరి ఆ స్థాయి వ్యాపారాలు వున్నోళ్ళు. అయినా, ఎవరి మీదా ఈ స్థాయిలో విమర్శలు రాలేదు. తన మీద వచ్చిన విమర్శలపై మోహన్‌లాల్‌ ఇప్పటిదాకా పెదవి విప్పకపోయినా, ఆయన సన్నిహితులు మాత్రం, 'గిట్టనివారు చేస్తోన్న కుట్ర..' అంటూ కొట్టి పారేస్తున్నారు. 

కాగా, ఈ మధ్యకాలంలో మోహన్‌లాల్‌ తన వ్యాపారాల్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారనీ, ఈ క్రమంలోనే పెద్దయెత్తున ఆయన నిధుల్ని సమీకరిస్తున్నారనీ, సరిగ్గా ఈ టైమ్‌లోనే పెద్ద నోట్ల రద్దు అంశం తెరపైకి రావడం, దానికి మద్దతుగా మోహన్‌లాల్‌ మాట్లాడటంతోనే ఆయన తేలిగ్గా 'కార్నర్‌' అయ్యారన్నది సినీ, రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా విన్పిస్తోన్న వాదన. నిజమేనా మరి.!

Show comments