భూమాకు విషమ పరీక్ష.. సహకరించేది ఎవరు..?

మొత్తానికి నంద్యాల బరిలోకి భూమా కుటుంబం దిగడం ఖరారయినట్టే. తెలుగుదేశం పార్టీ తరపున భూమా బ్రహ్మానంద రెడ్డి పోటీ చేయనున్నారు. చివరి నిమిషంలో మలుపులు ఉండవచ్చని అనుకున్నా.. ప్రస్తుతానికి సానుభూతి అస్త్రం మీదే చంద్రబాబు ఆధారపడినట్టుగా ఉన్నాడు.

ఎస్పీవై రెడ్డి సొంతల్లుడు, సీనియర్ నేత ఫరూక్ లు చివరి వరకూ ప్రయత్నించినా వారికి ఫలితం దక్కలేదు. శిల్పా మోహన్ రెడ్డి కూడా వైకాపా వైపు వెళ్లిపోవడంతో ఫరూక్, ఎస్పీవై వర్గాల్లో ఆశలు రేకెత్తాయి. అయితే బాబు మాత్రం భూమా కుటుంబాన్నే ఫిక్స్ చేశారు.

మరి ఇప్పుడు అఖిలప్రియ ఆధ్వర్యంలో భూమా ఫ్యామిలీ విషమ పరీక్షను ఎదుర్కొనబోతోంది. చేతిలో మంత్రి పదవి, పార్టీ చేతిలో అధికారం.. అదనంగా సానుభూతి. ఇవే వారికి ఉన్న ఆయుధాలు.

అయితే.. వీరి వయసు, అనుభవాలను బట్టి చూస్తే మాత్రం ఉన్న ఆయుధాలతో నెట్టుకురావడం కూడా కష్టమే అనిపిస్తోంది. వారు జనాలను ఏ మేరకు ఆకట్టుకోగలరు అనే విషయాన్ని పక్కన పెడితే.. తెలుగుదేశంలోని మిగతా వర్గాలు భూమా బ్రహ్మానందరెడ్డి విజయానికి ఎంత వరకూ సహకరిస్తారు? అనేది సందేహమే.

ఇప్పుడు గనుక బ్రహ్మానంద రెడ్డి గెలిస్తే నంద్యాలలో పాగా వేస్తాడు.. భవిష్యత్తులో కూడా తమ అవకాశాలకు అడ్డుగా మారతాడు.. అనే రీతిన తెలుగుదేశంలోని నేతలు ఆలోచించే అవకాశం ఉంది.

అటు ఎంపీ ఎస్పీవై రెడ్డి, ఇటు ఫరూక్.. ఈ రెండు వర్గాలూ నంద్యాలపై ఆధిపత్యాన్ని ఆశిస్తున్నవే. ఇప్పుడు టికెట్ బ్రహ్మానంద రెడ్డికి వెళ్లింది. ఈ సారి అతడు ఓడిపోతే.. సెకెండ్ ఛాన్స్ కల్ల.

సార్వత్రిక ఎన్నికల్లో అవకాశం ఎస్పీవై వర్గానికి గానీ, ఫరూక్ గానీ దక్కుతుంది. కాబట్టి ఈ వర్గాలు ఏ మేరకు సహకరిస్తాయి? అనేది పెద్ద ప్రశ్న. మరి ఎస్పీవై రెడ్డి, ఫరూక్ ల స్థాయి ఎంత అనొచ్చు. మరీ తక్కువ అయితే కాదు!

ఎస్పీవై రెడ్డి కి మంచోడని పేరు. ఫిరాయింపు చేస్తే చేసి ఉండొచ్చు.. కానీ ముసలాయన మీద మరీ అంత చెడు అభిప్రాయం లేదు. పాత పరిచయాలు, బంధుత్వాలు, మంచోడని అభిమానించే వాళ్లు.. ఈ నేపథ్యంలో అంతో ఇంతో ప్రభావాన్ని చూపే శక్తి ఉంది ఈ ఎంపీకి. ఆ ఓట్లు కూడా కీలకమైనవే. వాటిని కచ్చితంగా టీడీపీ అభ్యర్థి వేయించడం, వేయించకపోవడం స్పై రెడ్డి చేతిలో ఉంది.

ఇక ఫరూక్ .. మైనారిటీ. ఇక్కడ మైనారిటీల ఓట్లు దండిగా ఉన్నాయి. అందరూ కాకపోయినా.. కొంతమంది అయినా ఫరూక్ మాటను బట్టి పోయే అవకాశం ఉంది. 

భవిష్యత్తులో తన రాజకీయ మనుగడను కోరుకుంటే.. ఫరూక్ ఇప్పుడేం చేస్తాడో చెప్పడం కష్టం కాదు. సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిణామాల మధ్య భూమా బ్రహ్మానంద రెడ్డి పరిస్థితి ఏమిటో!

Show comments